సండే లేదా మండే.. రోజూ తినండి గుడ్డు.. కానీ ఎందుకు!!
x

'సండే లేదా మండే.. రోజూ తినండి గుడ్డు'.. కానీ ఎందుకు!!

ముప్పై సెకండ్ల యాడ్ లో గుడ్డు ఎంత గుడ్డో పూర్తిగా చెప్పడం కష్టం. ఇప్పుడు ఆ వివరాలన్నీ మనం తెలుసుకుందాం.


అసలైన క్యాప్టెన్ నేను.. నా క్యాప్టెన్సీలోనే పాకిస్తాన్ ని ఇండియాలో మొదటిసారి ఓడించాను అని గ్రౌండ్ లో కూర్చున్న క్రికెట్ కోచింగ్ స్టూడెంట్స్ కి చెబుతుంటాడు సునీల్ గవాస్కర్. ఇంతలో నేను ఇంగ్లాండ్ ని ఓడించాను, ఇంగ్లాండ్ లోనే అనుకుంటూ వస్తాడు రాహుల్ ద్రావిడ్. అసలు ఫస్ట్ వరల్డ్ కప్ ఎవరు గెలిపించారు అనుకుంటూ వస్తాడు కపిల్ దేవ్ నేనే కదా అని గుర్తు చేస్తున్నట్టు. ఈ ముగ్గురు క్రికెట్ దిగ్గజాలు ఆర్గ్యూ చేసుకుంటుండగా అప్పుడే బాక్స్ లో ఉన్న ఉడకబెట్టిన గుడ్డు తిని ఒక చిన్నారి పైకి లేచి టైమ్ అప్ అంటుంది. క్యాప్టెన్ ఎవరంటే టఫ్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండేవారే అని చెబుతుంది. కరెక్ట్ అని ముగ్గురూ తల ఊపుతారు.

వెంటనే మరి టఫ్ గా స్ట్రాంగ్ గా ఉండేది ఎవరు అని ఆ ముగ్గురిని ప్రశ్నిస్తుంది. దానికి సమాధానంగా సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, రాహుల్ ద్రావిడ్ లు ఒకేసారి గుడ్డు అంటారు. మళ్ళీ ఆ చిన్నారి మరైతే క్యాప్టెన్ ఎవరు అడుగుతుంది. దీనికి మళ్ళీ మన ముగ్గురు మాజీ క్రికెటర్లు గుడ్డు అని చెప్తారు. ఇక అందరూ కలిసి సండే లేదా మండే రోజూ తినండి గుడ్డు అంటారు. అక్కడితో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఎగ్ ప్రమోషనల్ యాడ్ కంప్లీట్ అవుతుంది. హిందీ లో కూడా ఈ ఎగ్ క్యాంపెయిన్ స్లోగన్ బాగా ఆకట్టుకుంది. 'సండే హో యా మండే హో రోజ్ ఖావో అండే'.

వారంలోని రోజుతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా గుడ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేసే పాపులర్ టీవీ యాడ్ ఇది. గుడ్డు వినియోగాన్ని ఎక్కువగా ప్రోత్సహించడానికి నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ప్రకటనల ప్రచారంలో ఉపయోగించిన ఈ మార్కెటింగ్ నినాదం ప్రతి ఒక్కరిని ఆకర్షించి యాడ్స్ లోనే ప్రభంజనం సృష్టించింది.

ఈ యాడ్ సారాంశం ఏంటంటే.. గుడ్లు మంచి పౌష్టికాహారం. వీటిని నిర్దిష్ట రోజులలో మాత్రమే కాకుండా రోజువారీ ఆహారంలో వాటిని కేవలం వారాంతపు లేదా ప్రత్యేక సందర్భ ఆహారంగా చూడకుండా, వాటిని భోజనంలో సాధారణ భాగంగా చేర్చాలనే ఆలోచనను పుట్టించడం. ఆహార వినియోగ అలవాట్లలో మార్పులను తీసుకురావడానికి, కొన్ని ఆహారాల పోషక విలువల గురించి ప్రజారోగ్య అవగాహనను పెంపొందించడానికి ఒక సాధారణ, సులువుగా గుర్తుంచుకోగలిగే స్లోగన్ ఎలా సహాయపడుతుంది అనేదానికి ఇది చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు.

అయితే ఈ యాడ్ లో గుడ్డు మంచి పోషక ఆహరం, రోజూ తినండి అని చెప్పారు. కానీ ప్రతిరోజూ ఉడకబెట్టిన గుడ్డు తినడం వలన కలిగే అనేక రకాలా ప్రయోజనాలను డెప్త్ గా చెప్పలేదు. ముప్పై సెకండ్ల యాడ్ లో గుడ్డు ఎంత గుడ్డో పూర్తిగా చెప్పడం కష్టం. ఇప్పుడు ఆ వివరాలన్నీ మనం తెలుసుకుందాం.

ఉడికించిన గుడ్డు ప్రయోజనాలు:

పాలతో పాటు గుడ్లు అత్యధిక జీవ విలువ ఉన్న ప్రోటీన్లను కలిగి ఉంటాయి. ఒక గుడ్డు కేవలం 77 కేలరీలు మాత్రమే కలిగి ఉంటుంది. అయితే ఒక గుడ్డులో 6 గ్రాముల అధిక-నాణ్యత ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు, 1.6 గ్రాముల సంతృప్త కొవ్వు, ఐరన్, విటమిన్లు, ఖనిజాలు, కెరోటినాయిడ్స్ ఉన్నాయి. గుడ్డు కూడా లూటీన్, జియాక్సంతిన్ వంటి వ్యాధి-పోరాట పోషకాల పవర్‌హౌస్ అని రుజువైంది. వృద్ధులలో అంధత్వానికి ప్రధాన కారణం వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత... గుడ్డులో ఉండే కెరోటినాయిడ్స్ దానిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బరువు తగ్గడానికి...

లీన్ ప్రోటీన్ పొందడానికి బాగా ఉడికించిన గుడ్లు మంచి మూలం. వాటిని తినడం ద్వారా బరువు తగ్గవచ్చు ఎందుకంటే అవి ఎక్కువ కేలరీలు అందించకుండా ఆకలిని తీరుస్తాయి.

గర్భస్థ శిశువుకి...

విటమిన్ డితో పాటు, గట్టిగా ఉడికించిన గుడ్లలోని ప్రోటీన్ గర్భిణీ స్త్రీలలో పిండం పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ మూలకాలు గర్భస్థ శిశువు దంతాలు, ఎముకలు, గర్భధారణ అంతటా సాధారణ పెరుగుదలకు తోడ్పడతాయి.

పోషకమైన చిరుతిండి..

ఉడికించిన గుడ్లు పోషకమైన స్నాక్ అని చెప్పొచ్చు. ఒక పెద్ద, గట్టిగా ఉడికించిన గుడ్డు శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది.

ఒక గుడ్డులోని పోషకాలు:

6.3 గ్రాముల ప్రోటీన్ - పెద్దవారు ప్రతిరోజూ 50-175 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉండాలి.

25 మిల్లీగ్రాముల కాల్షియం - పెద్దవారు రోజుకు 1,000-1,200 మిల్లీగ్రాములు కలిగి ఉండాలి.

0.595 మిల్లీగ్రాముల ఇనుము - పెద్దవారు రోజుకు 8-18 మిల్లీగ్రాములు కలిగి ఉండాలి.

63 మిల్లీగ్రాముల పొటాషియం - పెద్దవారు రోజుకు 2,600-3,400 మిల్లీగ్రాములు కలిగి ఉండాలి.

కోలిన్ సోర్స్:

గుడ్డు కోలిన్ ని కలిగి ఉంటుంది. ఇది బి విటమిన్ల మాదిరిగానే ఒక పోషకం. జ్ఞాపకశక్తిని, మెదడు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.సెల్యులార్ పెరుగుదల, నిర్వహణ కోసం శరీరంలో కోలిన్ ఎంతగానో అవసరం. అమెరికన్ ఆహారంలో 'కోలిన్' అతిపెద్ద ఆహార వనరుగా గట్టిగా ఉడికించిన గుడ్లను తింటారు.

కంటి రక్షణ:

ఉడకబెట్టిన గుడ్లలో ఉండే లుటిన్, జియాక్సంతిన్... యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.

మానసిక శక్తి పెంచుతుంది...

ఉడికించిన గుడ్లలో ప్రోటీన్, కోలిన్ వంటి ఆరోగ్యకరమైన మూలకాల కలయిక మెదడును ఉత్తేజపరిచేందుకు సహాయపడుతుంది. అది కూడా బ్రేక్ ఫాస్ట్ తర్వాత బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే మెదడు చురుగ్గా ఉంటుంది.

ఒక ఉడికించిన గుడ్డులో ఉండే పోషకాలు...

కేలరీలు: 77

మొత్తం కొవ్వు: 5.3 గ్రాములు

సంతృప్త కొవ్వు: 1.6 గ్రాములు

కొలెస్ట్రాల్: 186 మిల్లీగ్రాములు

సోడియం: 62 మిల్లీగ్రాములు

కార్బోహైడ్రేట్లు: 0.56 గ్రాములు

చక్కెర: 0.56 గ్రా

ప్రోటీన్: 6.3 గ్రాములు

గట్టిగా ఉడికించిన గుడ్డులో కూడా విటమిన్ ఎ, డి ఉంటాయి.

గమనించవలసిన విషయాలు:

గుడ్లు, ఎలా వండినా సంతృప్త కొవ్వుల మూలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. అయితే కొన్ని ఇతర ఆహారాల వలె కాదు. గుడ్లు ఎంత పోషకమైనవి అనే విషయంలో ఆహార తయారీ కూడా పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు, చాలా మంది తమ ఉడికించిన గుడ్లలో ఉప్పు కలుపుతారు. ఇది మీరు తినే సోడియం మొత్తాన్ని పెంచుతుంది. గుడ్లను వండుకునే ఇతర పద్ధతులు వాటి పోషణను కూడా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, మీరు గుడ్లను వేయించినట్లయితే, సంతృప్త కొవ్వును అదనంగా యాడ్ చేసినట్టే. ఉడకబెట్టిన గుడ్లు చాలా పోషక ప్రయోజనాలను సంరక్షిస్తాయి. గుడ్లు ఎంతసేపు ఉడకబెట్టినా వాటిలో పోషకాలు అలానే ఉంటాయి. అయితే సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియాను నివారించాలంటే గట్టిగా ఉడికించాల్సిందే. అంటే లోపల ఉండే పచ్చ సొన కూడా గట్టిపడేవరకు.

అందరూ రోజూ ఉడకబెట్టిన గుడ్డు తినొచ్చా?

గుండె జబ్బులు, శరీరంలో అధిక కొలెస్ట్రాల్ లేని ఆరోగ్యకరమైన వ్యక్తులు రోజుకు ఒక గుడ్డు మొత్తం తినవచ్చు. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్నవారు వారానికి మూడు లేదా నాలుగు కంటే ఎక్కువసార్లు గుడ్డు తినకూడదు.

గుడ్లు తినడం వల్ల కలిగే ఐదు ప్రయోజనాలు..

1."మంచి" కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇది స్ట్రోక్స్, గుండె జబ్బులకు దారితీసే "చెడు" కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

2.కంటి చూపును కాపాడుకోవడానికి సహాయం చేస్తుంది.

3. పలు రకాల B విటమిన్లు, అలాగే విటమిన్లు A, D, E, K వంటి వివిధ విటమిన్‌లను అందిస్తుంది.

4.కేలరీలు తక్కువగా ఉంటాయి.

5.తింటే కడుపు నిండిపోయిన ఫీలింగ్ ఉంటుంది.

ఉడికించిన గుడ్లను సూపర్‌ఫుడ్‌ అనొచ్చా?

ఉడికించిన గుడ్లు సూపర్ ఫుడ్ అని పిలవబడకపోవచ్చు. "సూపర్ ఫుడ్స్" అనేది నిపుణులతో స్పష్టంగా నిర్వచించబడలేదు. కానీ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడే పోషకాలు అధికంగా ఉండే ఆహారంగా వీటిని భావించవచ్చు. గుడ్లు ఇప్పటికీ ఒక చిన్న ప్యాకేజీలో వచ్చే పోషకమైన ఆహారం. మీ ఆరోగ్యాన్ని బట్టి, అవి మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

రోజూ ఎన్ని ఉడికించిన గుడ్లు తినాలి?

రోజుకు ఒక ఉడికించిన గుడ్డు మాత్రమే తినాలి. గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ఉంటే ప్రతిరోజూ గుడ్డు తినకూడదు.

Read More
Next Story