
కోటప్పకొండ జింకల పార్కులో మచ్చల జింకకు మేత పెడుతున్న పవన్ కల్యాణ్ (పోటో కర్టసీ ఎక్స్)
కోటప్పకొండ జింకల పార్కుకు ఎప్పుడైనా వెళ్లారా?
పవన్ కల్యాణ్ చూసొచ్చి ఎన్ని సంగతులు చెప్పారో తెలుసా..
ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ పక్కనే జింకల పార్కు ఉందని మీకు తెలుసా? తెలిస్తే ఎప్పుడైనా పోయి వచ్చారా? ఎప్పుడూ వెళ్లకపోతే ఇప్పుడు పోయిరండి.. నిన్ననే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెళ్లి చూసివచ్చారు. అంతేకాదు చాలా విషయాలు కూడా చెప్పారు. పవన్ కల్యాణ్ ప్రకృతి ప్రేమికుడే కాదు ఆయన జంతు ప్రేమికుడని కూడా నిరూపించుకున్నారు.
నిన్న ఆయన బాపట్ల జిల్లా కోటప్పకొండకు వెళ్లారు. సందడి చేశారు. కొండ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మంగళగిరి వెళుతూ కోటప్పకొండ ఘాట్ రోడ్డులో ఉన్న వన విహారి జింకల పార్కుకు వెళ్లారు. చాలా సేపు అక్కడ గడిపారు. ప్రకృతిని చూసి పరవశించారు. వన విహారి జింకల పార్కులోకి వెళ్లి జింకలకు ఆహారం అందించారు. ఇక్కడ మచ్చల జింకల్ని గోముగా నిమిరి అక్కున చేర్చుకున్నారు. ఈ జింకల సంరక్షణకు ఇబ్బందులు కలగకుండా పర్యాటకుల సందర్శనకు అనుమతిస్తున్నామని ఎఫ్ఆర్వో మాధవరావు వివరించారు. వివిధ రకాల పక్షి జాతులు, వృక్షాలు, వాటివల్ల కలుగుతున్న ప్రయోజనాల్ని డీఎఫ్‌వో తెలియజేశారు.
చిత్రమేమిటంటే ఈ పార్కులో సందర్శకుల కోసం ఓ రైలు ఉందని కూడా చాలామందికి తెలియదు. పవన్ కల్యాణ్ వెళ్లినపుడు గాని రైలు ఉందన్న సంగతి బయటికి రాలేదని కట్టుబడిపాలెం గ్రామానికి చెందిన సందర్శకుడు జి.గోపీచంద్ తెలిపారు.
పార్కు సందర్శన నిమిత్తం నడుపుతున్న రైలును పరిశీలించిన పవన్ కల్యాణ్ దాని నిర్వహణ వివరాలను సిబ్బందిని అడిగి పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు.
వనవిహారి పార్కుకు అనుసంధానంగా ఉన్న అటవీ భూ భాగాన్ని, పార్కులో ఉన్న వివిధ రకాల పక్షులు, వృక్ష జాతుల వివరాలు, వాటి వల్ల కలిగే ఉపయోగాలను అటవీశాఖ అధికారులను పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. పార్కు సందర్శన నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రైన్‌ను పరిశీలించారు. కోటప్పకొండ – కొత్తపాలెం గ్రామాల మధ్య పంచాయతీరాజ్ శాఖ నిధులతో నిర్మించిన రహదారిని ప్రారంభించారు. రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా గోనేపూడి పాఠశాల విద్యార్ధులు పవన్ కల్యాణ్‌ని కలిసి తమ కోసం రహదారి సౌకర్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ పార్కుకు ఎలా వెళ్లాలంటే...
ఈ పార్కుకు గుంటూరు నుంచి, నరసరావుపేట, చిలకలూరి పేట నుంచి వెళ్లవచ్చు.
గుంటూరు నుంచి వస్తే.. గుంటూరు నుంచి చిలకలూరిపేట వచ్చి అక్కడి నుంచి కోటప్పకొండకు బస్సులు, ఆటోలు వెళుతుంటాయి. సొంతంగా కారు ఉంటే నేరుగా ఘాట్ రోడ్డులోకి వెళ్లి పార్కులోకి వెళ్లవచ్చు.
నరసరావుపేట నుంచి... నరసరావుపేట నుంచి నేరుగా కోటప్పకొండకు బస్సులు ఉంటాయి. జీపులు కూడా తిరుగుతాయి. కోటప్పకొండకు వెళ్లి అక్కడ దర్శనం చేసుకుని నేరుగా పార్కు వద్దకు చేరుకోవచ్చు. ఇప్పుడు అన్ని చోట్లా సర్వీసు ఆటోలు ఉన్నాయి.
చిలకలూరి పేట నుంచి బస్సులు, ఆటోలు, టాక్సీలలో ఈ పార్కుకు చేరుకోవడం సులువు.
వినుకొండ నుంచి వచ్చే వారయితే సంతమాగులూరు దాటిన తర్వాత పెట్లూరిపాలెం వద్ద కోటప్పకొండకు దారి అని ఉంటుంది. అక్కడ రోడ్డు దిగి నేరుగా కోటప్పకొండ ఘాట్ లోని వన విహారి జింకల పార్కుకు చేరుకోవచ్చు.
పిల్లలకు ఈసారి సెలవులు ఇచ్చినపుడు మన పక్కనే ఉన్న ఈ జింకల పార్కుకు ఓసారి వెళ్లి సరదాగా గడిపిరండి.
Next Story

