సెనిక్కాయలు కొనాలా? ఎంత కష్టం...ఎంత కష్టం
x

సెనిక్కాయలు కొనాలా? ఎంత కష్టం...ఎంత కష్టం

ఆ రోజుల్లో ఏంచిన శెనిగిత్తనాలు, బెల్లం కలిపి తెగ తినేవాళ్ళం. సాయంత్రం వాముల దగ్గర కెళ్ళి శనికట్టె తీసుకపొయి సెనిక్కాయలు కాల్చి తినేవాళ్ళం.ఇపుడది ఒక జ్ఞాపకమే...


పచ్చిసెనక్కాయలు తినాలనిపించింది నేరుగా సెనక్కాయలమ్మే బండి దగ్గరకు పోయి యాభై రూపాయలు ఇచ్చి ఓ చిన్న డబ్బా కాయలు తీసుకొని ఇంటి దారిపట్టాను. మనస్సు చివుక్కుమంది. సెనక్కాయలు తినాలనే చిన్న కోరికె ఆవేదనలో పడేసింది. గతం తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసింది. గుండెను పిండేసింది. మనం చేసుకొన్న కర్మఫలం అని మనసుకు నచ్చజెప్పుకొన్నా. పూలమ్మినచోట కట్టెలమ్మిన సామెత గుర్తుకొచ్చింది.


మా పల్లెల్లో ఎవరింట్లో చూసినా మూటలు మూటలు శనక్కాయలు ఉండేవి .గాదెల నిండా ఉండేవి .కలాల్లో రాసులు పోసేవాళ్ళం .చాలామందికి శనక్కాయ మూటలు ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు కో కొల్లలుగా ఉన్నాయి. నా చిన్నప్పుడు టీచర్లు పల్లె లోనే కాపురం ఉండేవారు. పిల్లల తల్లిదండ్రులు శెనక్కాయలు , కూరగాయలు బ్యాగ్గుల్లో వేసి పిల్లలతో అయ్యవార్లకు ఫ్రీగా పంపించేవారు . పాలు , పెరుగు ఇచ్చిపంపేవారు. కొండకాయలొల్లకు,దాసప్పలకు శెనక్కాయలు కల్లాల్లో ఉన్నప్పుడే ఫ్రీ గా ఇచ్చేటోల్లం. అలా నేను చాలా సార్లు ఫ్రీ గా ఇచ్చాను.అలాంటిది పల్లె వదిలి పట్టణంలో కాపురం ఉండడం వల్ల సెనక్కాయలు కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. సిద్ధరాంపురంలో నా బాల్యంలో గడిపిన వైభవోపేతమైన రోజులు ఆనందంగా గడిపిన క్షణాలు నా మదిలో కదిలాయి. ఆ జ్ఞాపకాలను అక్షరరూపం లో అందిస్తున్నాను.

అక్టోబర్, నవంబర్ నెలలో ఎక్కువ వేరుశనగ పంట కనిపిస్తుంది. ఏ రైతు చేన్లో చూసిన పంట ఉండేది. దారెంబడి పోతా శెనిగిచెట్లు పీక్కొని శెనిక్కాయలు తినుకుంటా పోయేవాళ్ళం. పంట పీకితే ఎవరింట్లో చూసినా పచ్చిశెనక్కాయలు, ఉడకేసిన శెనక్కాయలు గంపలకు ఉండేవి. స్కూల్ కు సెలవు రోజు వస్తే కొండలకు ఎద్దులు, పశువులును మేత కోసం తోలుకొని పోయేవాళ్ళం. శెనిక్కాయలు కాళ్ల్చుకొని తినేవాళ్ళం. ఇక ఎండాకాలంలో స్కూల్ ఉండేది కాదు. వేసవి సెలవులు. అరుగుల మీద, ఇండ్ల ముందు వసారాలో విత్తన శెనిక్కాయలు వలిచేవారు. రోజు ఈతకు పోయి వస్తా ఎవరింటిదగ్గరైనా సరే పిడికెడు శెనక్కాయలు తీసుకొని తినుకుంటా ఇంటికి పోయేది. విత్తన కాయలు వొలిచి సెరిగి విత్తనాలు జల్లెడ పట్టి మంచి ఇత్తనాలు సంచికి పోసి నెట్టుకట్టి చీమలు , పురుగులు పట్టకుండ గమేక్షన్ చెల్లేవారు.


నాసు ఇత్తనాలు కొంతమంది అమ్మెటోళ్లు కొంతమంది గూనిపల్లికి కానీ బుక్కపట్నం కు కానీ తీసుకపొయ్యి శెనిక్కాయనూనె ఆడించేవారు. నూనె తీసాక మిగిలిన చెక్క తెచ్చి పశువుల కు నీళ్లలో నానబెట్టి పెట్టేవారు. శెనిగిత్తనాలతో పాకంపొప్పు చేసేవారు. ఎండాకాలంలో చేన్లకు చెరువు మట్టి తోలేవాళ్లం. సేద్దిగాళ్లకు మధ్యాహ్నం శెనక్కాయలు, బెల్లం చిరు తిండి గా ఇచ్చేటోళ్లు. ఏంచిన శెనిగిత్తనాలు, బెల్లం కలిపి తినేవాళ్ళం.ఎండాకాలంలో సాయంత్రం వాముల దగ్గర కెళ్ళి శనికట్టె తీసుకపొయి కాల్చుకొని కాల్చిన చెనిక్కాయలు తినేవాళ్ళం. మల్ల పొద్దున్నే పోయి గెలుకోని మిగిలిన చెనిక్కాయలు తినేవాళ్ళము.

జూన్, జులైలో కురిసే వర్షాలకు సేన్లల్లో సెనిగిత్తనాలు ఇత్తుతారు.ఒకొక సంవత్సరం వర్షాలు కురవకుండా కరవు పరిస్థితి నెలకొనేది. ఇలాంటప్పుడు కొన్ని సామెతలు చెప్పేవారు.ఉత్తరచూసి ఎత్తరగంప అంటే ఉండు అష్టమి చూసి అందరూ పొదాం అనేవారు.పదును వాన పడితే చాలు గొర్రు ,సెనిగిత్తనాలు, సూపర్ ఫాస్ఫెట్, టైర్ బండిపై ఏసుకొని ఎద్దులు కట్టుకొని పోయేవాళ్ళం. ముందర సూపర్ ఫాస్ఫెట్ చల్లుతాపోయేవారు వేనక ఒకకాడికి గొర్రు పొమ్ము కొని నాలుగు బొంగులు జడిగంకు బిగించి కోటేరేసి సక్కంగా గొర్రుతొలుతుంటే ఒకరు వడి కట్టుకొని సెనిగిత్తనాలు ఒడిలో పోసుకొని జడ్డిగంలో పిడికెడు తో పోసుకుంటాపోయేవారు.


వెనుకనే వాటిని పూడ్చడానికి ఇంకో కాడ్డెద్దులకు గుంటక కట్టి తొలుకుంటూ వచ్చేవాళ్ళు. 16సాల్లుకు ఒక వరుస కందులు, అలసందలు, పెసలు వేసేవారు. మళ్లీ నెలరోజులు కు కలుపు తీసేందుకు దంతులు పట్టేవారు. దంతులు పట్టేటప్పుడు శెనిగిచెట్లు తినకుండా ఎద్దుల మూతులకు సిక్యాలు కట్టేవారు. దీపావళి పండుగ కు సేన్లల్లో పొల్లు ఏసేవారు. పొల్లు అంటే పచ్చని పంట పొలాల్లో మేకపోతు, పొట్టేలు, కోళ్ళు ఏదోఒకటి కోసి రక్తం పంటపై చల్లడాన్ని పొల్లు అంటారు.


దీపావళి తర్వాత వర్షం పడుతూనే శెనిగిచెట్లు పీకేవాళ్లం. తీగ కాయలు ఉన్నప్పుడు గుంటకపాసేవాళ్లం. కూలీలు శనిగికట్టె ఎదిరేసి సాల్లుకేసేవారు. తీగ కాయలు తగ్గి పొయ్యి హైబ్రిడ్ రకాలు వచ్చాక గుంటకపాసేది తగ్గిపోయింది . వారంరోజులు ఎండకు ఎండినాక బండ్లు కట్టుకొని పొయ్యి బండ్లు కేసుకొని మోకులుతో కట్టుకొని కలాల్లోకి తోలేవాళ్లం. ఒకేరోజు పది బండ్లు పైనే కట్టుకొని పొయ్యి వరుసగా బండ్లు తోలుకొని పోయేవాళ్ళం. కలాల్లో మరుసటి రోజు వాము ఏసి పైన బోదకప్పి వర్షాలకు తడవకుండా జాగ్రత్తలు తీసుకొనే వాళ్లు. వాము చుట్టూ గెమ్యాక్షన్ చల్లేవారు. తీగ కాయలు ఉన్నప్పుడు చేన్లల్లో సెనిగిచెట్లు పీకినంకా భూమి లో మిగిలిపోయిన కాయలు కోసం చేన్లు గెదిరెవాళ్లు. నవంబర్ లో వేసిన వాములు జనవరి, ఫిబ్రవరి లో ఒపెన్ చేసి చెనిక్కాయలు ఇడిపించేవారు. కూలీలు ఇడిపించిన కాయలు పెద్ద డబ్బా లతో కొలుచుకొని డబ్బాకింతని రేటు కట్టి కూలీ డబ్బులు ఇచ్చేవారు. ఇది శెనకాయ్యలపంట పండించే రైతుల జీవనశైలి. ఒకొక్క రైతు వందల బస్తాలు వేరుశనగ పంట పండించిన కాలమది. అలాంటి రైతు కుటుంబాల నుంచి వచ్చిన చాలా మంది నేడు టౌన్ లో తినడానికి కూడా కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది.


పంటలు పెడితే ఏం లాభం లేదప్పా పెట్టుబడి కూడా వెనక్కి రాదు అందుకే పల్లెలో చేన్లు బీడు పడిపోయినాయని టౌన్ లో ఉన్న చాలా మంది రైతుకుటుంబాలవాళ్లు నేడు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే తరాలకు పంటలు పండించే వారు కరవై పోతారు. భవిష్యత్తులో సెనక్కాయలే కాదు తిండి గింజలు కూడా కరవై పోతాయి . దేవుడా గ్రామాల్లో వందలమంది కి ఉపాధి చూపించే వ్యవసాయ రంగానికి తిరిగి మంచి రోజులు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

Read More
Next Story