
ఇరుసుమండలో ఇంకా ఆరని మంట
ఇరుసుమండ... మండుతున్న మంట...
32 ఏళ్లలో జరిగిన Big Blowouts తెలుసా..
ఆకు పచ్చటి దుప్పటి పరుచుకున్నట్లు కనిపించే కోనసీమ గుండెలపై అంటుకున్న మంటలు రగులుతూనే ఉన్నాయి. 1993లో తొలిసారి రగిలిన బ్లో అవుట్ పరంపర నేటికి కొనసాగుతూనే ఉంది. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ వద్ద మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది ఆధ్వర్యంలో నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. పెద్ద పైప్‌లైన్ ద్వారా ఓ గొడుగు రూపంలో నీటిని లోపలికి పంప్ చేస్తున్నారు. నిన్నటితో పోల్చితే జనవరి 6 నాటికి అంటే నేటికి మంటల తీవ్రత కాస్త తగ్గింది. మంటలు అదుపులోకి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఇరుసుమండ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు.
గడచిన 32 ఏళ్లలో పెద్దాచిన్న కలిపి పదికిపైగా బ్లో అవుట్లు నమోదు కాగా.. గ్యాస్ లీకేజీ ఘటనలు ఏటా ఏదో మూల జరుగుతూనే ఉన్నాయి. భూగర్భంలో ఉండే విపరీతమైన గ్యాస్ ఒత్తిడిని నియంత్రించలేకపోవడం. పైప్‌లైన్ల నిర్వహణలో లోపాలు లేదా తుప్పు పట్టడం. ఈ ప్రమాదాల వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న కొబ్బరి తోటలు, పంట పొలాలు కాలిపోయి పర్యావరణం దెబ్బతింటోంది.
32 ఏళ్లలో జరిగిన ప్రధాన ఘటనలు...
పాశర్లపూడి_బ్లోఅవుట్ (1995)..
ఇది భారతదేశ చమురు చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదాలలో ఒకటి. బ్లో అవుట్ అనగానే మూడు దశాబ్దాల నాటి ప్రమాదం గుర్తుకొస్తుంది. జనవరి 8, 1995న మామిడికుదురు మండలం పాశర్లపూడిలో ONGC బావి నుండి గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఈ మంటలు సుమారు 65 రోజుల పాటు ఆరకుండా ఎగిసిపడ్డాయి. విదేశీ నిపుణుల సాయంతో దీనిని అదుపులోకి తెచ్చారు. ఇంకో రెండు రోజులు గడిస్తే ఆనాటి పాశర్లపూడి బ్లో అవుట్ కు 31 ఏళ్ళు నిండుతాయి.
బ్లో అవుట్ అన్నదే కోనసీమ ప్రజలకు ఒక కొత్త అనుభవం. అంతకు ముందెన్నడూ కనీవినీ ఎరగరు. చూస్తూ ఉండగానే ఆ మంట తాకిడికి కొబ్బరి చెట్లు అంటుకొని క్షణాల్లో మాడి మసై పోతున్నాయి. చుట్టుపక్కల జనం ఇళ్ళు వదిలి పారిపోయారు. ఊళ్ళకు ఊళ్ళు తరలించాల్సి వచ్చింది. రాత్రి పూట కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్ళకు కూడా ఆ అగ్ని కీలలు కనబడుతూ భయపెట్టేవి. ఓఎన్జీసీ నిపుణులు ఈ బ్లో అవుట్ ను ఆర్పటానికి శతవిధాలా ప్రయత్నించి చేతులెత్తేశారు. ఇక లాభం లేదని విదేశాల నుంచి నిపుణులను రప్పించారు. అలా 65 రోజుల తరువాత గాని బ్లో అవుట్ను పూర్తిగా ఆర్పలేకపోయారు. అంటే మార్చి 15 కు గాని పరిస్థితి అదుపులోకి రాలేదు.
కోనసీమ గుండెల మీద చెరిగిపోని చేదు జ్ఞాపకంగా ఇప్పటికీ పాశర్లపూడి బ్లో అవుట్ గురించి చెప్పుకుంటూనే ఉన్నారు. అది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్లో అవుట్ గా రికార్డులకెక్కింది. ఎవరూ చనిపోలేదు.
దేవరపల్లి_బ్లో_అవుట్ (2005)...
జూలై 2005లో మామిడికుదురు మండలం దేవరపల్లి వద్ద మరో భారీ బ్లో అవుట్ జరిగింది. గ్యాస్ ఒత్తిడి పెరిగి మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
నగరం గ్యాస్ పైప్‌లైన్ పేలుడు (2014)...
ఇది అత్యంత విషాదకరమైనది. 27 జూన్ 2014న జరిగింది. 22 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఇది ఆయిల్ వెల్ (Well) దగ్గర జరిగిన బ్లోఔట్ కాదు, GAIL గ్యాస్ పైప్‌లైన్ లీక్ అయి పేలడం వల్ల జరిగిన ప్రమాదం. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటన కోనసీమ చరిత్రలోనే అత్యధిక ప్రాణనష్టం కలిగించిన చమురు సంబంధిత ప్రమాదం.
తాండవపల్లి బ్లోఔట్ (2005-2006)లో జరిగింది. ఎవరూ చనిపోలేదు. అమలాపురం రూరల్ మండలం తాండవపల్లిలో 2005, 2006లో బ్లో అవుట్లు సంభవించాయి. ఇక్కడ కూడా ఆస్తి నష్టం, యంత్రాల నష్టం జరిగింది తప్ప ప్రాణనష్టం జరగలేదు.
తాజా_బ్లోఅవుట్ (జనవరి 5, 2026)...
కోనసీమ జిల్లాలోని ఇరుసుమండ గ్రామంలో ONGCకి చెందిన మోరి-5 (Mori-5) బావి వద్ద మరమ్మత్తు పనులు (Workover operations) జరుగుతుండగా ఒక్కసారిగా గ్యాస్ ఎగజిమ్మి మంటలు చెలరేగాయి. మంటలు సుమారు 100 అడుగుల ఎత్తుకు ఎగిసిపడటంతో చుట్టుపక్కల 3 గ్రామాల నుండి దాదాపు 600 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
కోనసీమలో మండుతున్న గుండెలు...
తరచుగా సంభవిస్తున్న ఈ బ్లోఅవుట్లు, గ్యాస్ లీకేజీలు కేవలం సాంకేతిక వైఫల్యాలు మాత్రమే కాదు, స్థానిక ప్రజల భద్రతపై విసురుతున్న సవాళ్లు అనేకం ఉన్నాయి.
అభివృద్ధి పేరుతో వెలికితీస్తున్న సహజ వాయువు దేశానికి వెలుగునివ్వవచ్చు కానీ, ఆ వెలుగును ఇస్తున్న కోనసీమ బిడ్డలకు మాత్రం అభద్రత మిగులుతోంది.
కేవలం ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం, పరిహారంతో చేతులు దులుపుకోవడం కాకుండా, శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించాలి.
దశాబ్దాల నాటి తుప్పుపట్టిన పైప్‌లైన్లను యుద్ధ ప్రాతిపదికన మార్చాలి.
ప్రతి బావి వద్ద అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలను పాటించాలి.
ప్రమాదం సంభవిస్తే తక్షణమే స్పందించే వ్యవస్థలను గ్రామాల స్థాయిలో బలోపేతం చేయాలి.
ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా బ్రతకాల్సిన కోనసీమ గుండెల్లో నిరంతరం బ్లోఅవుట్ సెగలు రగులుతూనే ఉంటే, ఆ పచ్చదనం వెనుక ఉన్న విషాదాన్ని తుడిచే వారెవరు? లాభాల వేటలో ప్రాణాలు, పర్యావరణం బలికాకూడదని ఆశిద్దాం.
Next Story

