
శుభవార్త 'షుగరున్న' వారికి
మీ కోసం ప్రత్యేకం బియ్యం వచ్చేస్తున్నాయ్
షుగర్ వ్యాధిగ్రస్తులకు ఒక శుభవార్త. తక్కువ కార్బోహైడ్రేట్ల(గ్లైసిమిక్ ఇండెక్స్)తో పాటు ఎక్కువ ప్రొటీన్ ఉండే వరివంగడం 2026 నాటికి అందుబాటులోకి రానుంది. శాస్త్రవేత్త నెసే శ్రీనివాసులు ఆధ్వర్యంలోని ఫిలిపీన్స్ బృందం ఈ వరివంగడాన్ని అభి వృద్ది చేసింది.
షుగర్ సమస్యను విపరీతంగా ఎదుర్కొంటున్న దక్షిణ భారతీయులకు ఫిలిపీన్స్ లోని మనీలా లో ఉండే ఇంటర్నేషనల్ రైస్ రిసెర్చి ఇన్స్టిట్యూట్ (IRRI) ఒక శుభవార్త చెపుతోంది. వరి అన్నం తింటే షుగర్ పెరుగుతుందని ఇక భయడాల్సిన పనిలేదు. వాళ్లందరికి భరోసా ఇచ్చే వరి రకాన్నీ ఈరీ రూపందించింది. ఈ మధ్య జరిగినసర్వేల్లో భారతదేశంలో 101 మిలియన్ల మంది షుగర్ తో బాధపడుతున్నారని, మరో 136 మిలియన్ల మంది కాబోయే షుగర్ వ్యాధిగ్రస్తులని తేలింది. షుగర్ వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి ఈ పరిశోధనా సంస్థలోని శాస్త్రవేత్తలు తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ గైసీమిక్ ఇండెక్స్ (Low GI) ఎక్కువ ప్రొటీన్లు ఉండే సరికొత్త వరివంగడాన్ని అభివృద్ధి చేశారు. ఈ సరికొత్త వరివంగడం అతితక్కువ కాలంలో పంట చేతికివ్వడమే కాదు, ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. పెద్ద సంఖ్యలో షుగర్ వ్యాది పడుతున్న దక్షిణ భారతీయకుల ఆహార భరోసా ఇచ్చే ఈవరి వంగడం సృష్టించిన శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించింది కూడా దక్షిణ భారతీయుడే. ఆయన పేరు డా. నేసె శ్రీనివాసులు (Nese Srinivasulu). డాక్టర్ శ్రీనివాసులు ఇంటర్నేషన్ రైస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో ప్రిన్సిపల్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన అక్కడ గ్రెయిన్ క్వాలిటి, న్యూట్రిషన్ విభాగానికి అధిపతి. నేసె శ్రీనివాసులు అనంతపురం పట్టణంలో పుట్టారు. తర్వాత బెంగుళూరులో స్థిరపడ్డారు.
డాక్టర్ నేసె శ్రీనివాసులు
డా. శ్రీనివాసులు నాయకత్వంలో 50 మంది శాస్త్రవేత్తల బృందం పదేళ్ళు శ్రమించి ఈ కొత్త వంగడాన్ని అభివృద్ధి చేసింది. ఈ నూతన వరివంగడం 2026 నాటికి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గత ముప్ఫై ఏళ్ళుగా దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల్లో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. షుగర్ వ్యాధి పట్టణ ప్రాంత జనాభాలో 20 శాతానికి గ్రామీణ ప్రాంత జనాభాలో పది శాతానికి పెరిగిపోయింది. దేశంలో షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్న అయిదు రాష్ట్రాల్లో నాలుగు దక్షిణాది రాష్ట్రాలే ఉన్నాయని 2024 డిసెంబర్ లో లోక్ సభకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. జీవన శైలి వ్యాధులు (నాన్ కమ్యునికల్ డిసీజస్, ఎన్ సీ డీ) క్లినిక్స్ సేకరించిన జాబితా ప్రకారం 47 లక్షల మంది రోగులతో కేరళ మొదటి స్థానంలో ఉండగా, 40 లక్షల మంది రోగులతో మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంది. కర్ణాటక 28 లక్షల మంది రోగులతో మూడవ స్థానంలో, 24.5 లక్షల మంది రోగులతో తెలంగాణా నాల్గవ స్థానంలో ఉంది. తమిళనాడులో 43 లక్షల మంది రోగులు ఉన్నారని ఐసీఎం ఆర్-ఇండియాబి చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అన్నం ఎక్కువగా తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ పెరుగుతోందని పన్నెండు అధ్యయనాలు వెల్లడించాయి.
ఇతర ఆసియా దేశాల్లో ఇలాంటి హెచ్చరికలు తక్కువగా ఏమీ లేవని డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రపంచంలోని షుగర్ వ్యాధిగ్రస్తుల్లో 60 శాతం మంది ఆసియాలోనే ఉన్నారు. తేలికగా అరిగిపోయే పిండిపదార్థాలున్న పాలిష్ పట్టిన బియ్యం ఆసియాలోనే 90 శాతం ఉత్పత్తి జరుగుతుంది. అలాగే వీటిలో తొంభై శాతం ఆసియాలోనే వినియోగిస్తారు. ‘‘పిండిపదార్థాలు ఉన్న అన్నిరకాల బియ్యం గ్లూకోజ్ ను ఎక్కువ పెంచుతాయి(గ్లైసిమిక్ ఇండెక్స్). అత్యధిక పిండి పదార్థాలున్న అన్ని రకాల ప్రాసెసింగ్ ఉత్పత్తుల ఆహార వినియోగం పెరగడం టైప్ 2 డయాబెటిస్ తో పాటు జీవన శైలి వ్యాధులు పెరగడానికి దారితీస్తోంది’’ అని ఆయన చెప్పారు. పిండి పదార్థాల వినియోగం (గ్లైసిమిక్ ఇండెక్స్) కొలవడం వల్ల ఒకరి రక్తంలో షుగర్ పరిమాణం ఎలా వేగంగా పెరుగుతోందో పిండి పదార్థాల వినియోగం (గ్లైసిమిక్ ఇండెక్స్) నుంచి తెలుసుకోవచ్చు.
అత్యల్ప ఆదాయం, మధ్యరకం ఆదాయం కల దేశాల్లో 75 శాతం మందికి పైగా డయాబెటిస్ రోగులున్నారు. తక్కువ కార్బొహైడ్రేట్లుండి, ఎక్కువ ప్రొటీన్ ఉన్నవరి వంగడాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఐఆర్ఆర్ఐ అనే ఈ అంతర్జాతీయ సంస్థ ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొంది.
‘‘షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేయాల్సిన అవసరం ఏర్పడడంతో, ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న షుగర్ వ్యాధిని అరికట్టాలంటే ఆరోగ్యకరమైన వరివంగడాలే మార్గమని భావించాం. దీని కోసం ఐఆర్ఆర్ఐ బయలుదేరడంతో అది అభి వృద్ది చేసిన కొత్త వరివంగడం ఐఆర్ఆర్ఐ-147ను ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రైస్ రిసెర్చి ప్రయోగాత్మకంగా చేపట్టిన పరిశీలనలో 55 శాతం తక్కువ కార్బొహైడ్రేట్లతో, 22 పిపిఎంల జింక్ పరిమాణంతో, హెక్టార్కు 5.5 లన్నుల నుంచి 9 టన్నుల దిగుబడి సాధించింది.’’ అని ఆయన చెప్పారు.
సహజంగా తెల్లటి బియ్యంలో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా (70నుంచి 94 శాతం) ఉంటాయని, మేం అభివృద్ధి చేసిన వరిలో కార్బొహైడ్రేట్లు తక్కువగా, రుచికరంగా, కంటికి ఇంపుగా, అధికదిగుబడితో ఉంటాయని డాక్టర్ శ్రీనివాసులు వివరించారు. ‘‘అత్యాధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించడం ద్వారా అంటే, మార్కర్ అసిస్టెడ్ బ్రీడింగ్, జెనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీస్ ద్వారా తక్కువ కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్ లు ఉండే వరి వంగడాన్నిసాధించగలిగాం.’’ అని చెప్పారు.
ఈ పరిశోధన 2013లో ప్రారంభమైంది. తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న జీన్స్ ను, గ్లూకోజ్ పరమాణువుల గొలుసును, వాటి క్రోమోజోము2ను, అధిక దిగుబడిని కనుగొనే సరికి నాలుగేళ్ళు పట్టింది. ఈ మొత్తం పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి, కొత్త వరివంగడాన్ని కనుగొనే సరికి పదేళ్ళు పట్టింది. సాంబా మసూరి, ఐఆర్ 36 లు రెండింటితో అనుసంధానించి కొత్త వరివంగడాన్ని తయారుచేశారు.
‘‘కొత్త వరివంగడంలో 15.9 శాతం ప్రొటీన్ ఉంటుంది. ఇది మామూలుగా మనం వాడే మిల్లు బియ్యంతో పోల్చుకుంటే 500 శాతం ప్రొటీన్ అధికం. ఈ కొత్త వంగడంలో ఎస్సెన్సియల్ ఎమినో యాసిడ్స్ (ఈఏఏ) అత్యధికంగా ఉంటాయి.’’ అని ఆయన చెప్పారు.
డాక్టర్ శ్రీనివాస్ ‘ద ఫెడరల్’ తో మాట్లాడుతూ, ఇతర చిరుధాన్యాలను గమనించినట్టయితే, వాటిలో కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండి, పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎకరాకు కేవలం ఒకటిన్నర మెట్రిక్ టన్నులు మాత్రమే తక్కువ దిగుబడి రాగా, కొత్త వరివంగడం ఎకరాకు 5 నుంచి 6 మెట్రిక్ టన్నులతో అత్యధిక దిగుబడినిస్తుందని వివరించారు. ‘‘డెల్టా వంటి కొన్ని వ్యవసాయ ప్రాంతాల్లో వరి తప్ప వేరే పంట వేస్తే నిలదొక్కుకోదు. వరి పండించే ప్రాంతాల్లో అన్నం ప్రధానమైన ఆహారం కావడంతో వరి ప్రాధాన్యతను ఇది ఎత్తి చూపిస్తోంది.’’ అని ఆయన కొనసాగించారు.
‘‘శతబ్దాలుగా ప్రజలు వరి అన్నం తింటున్నారు. ఇప్పుడు చేస్తున్న ఉత్పత్తి ప్రకారం ప్రపంచ వ్యాపితంగా ప్రజలు తింటున్న వరి ధాన్యానికి బదులు చిరు ధాన్యాలు ప్రత్యామ్నాయం కాజాలవు. కాబట్టి, ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, ధాన్యం ప్రమాణాలను, వ్యవసాయ దిగుబడిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న వరి రకమే ఆచరణీయమైన ఎంపిక’’ అని అంటారు.
ఈ నూతన వరి వంగడానికి పెద్ద ఎత్తున ఎగుమతి అవకాశాలున్నాయి. ప్రపపంచ మార్కెట్ లో సాధారణ బియ్యం మెట్రిక్ టన్నుకు 350 డాలర్లు లభిస్తుండగా, ఈ నూతన వంగడానికి 1600 డాలర్ల వరకు సంపాదించచ్చు.
భారతదేశంలో ఈ నూతన వరి వంగడానికి ప్రాధాన్యతను తెచ్చిపెట్టడానికి ఒడిషా ప్రభుత్వంతో కలిసి భువనేశ్వర్ లో ప్రాసెసింగ్ ప్లాంట్ ను పెట్టాలని ఇప్పుడు ఐఆర్ఆర్ఐ ఆలోచిస్తోంది. ‘‘మహిళలు పాల్గొనే విధంగా మహిళా స్వయం పోషక సంఘాల (డబ్లుయ ఎస్ హెచ్ జీ లు) వారు వీటిని ఉత్పత్తి చేసి, ప్రాసెస్ చేసి, మార్కెట్ చేసే విధంగా ఒడిషా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాము. ఈ తక్కువ కార్బొహైడ్రేట్లు ఉండే బియ్యంతో చెక్కలు, ఉప్మాలా కలుపుకునేవిగా, ఇతర వంటకాలను వీరితో తయారు చేయించవచ్చు. తక్కువ కార్బొహైడ్రేట్లు ఉండే బియ్యంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, ఆరోగ్యం పైన కేంద్రీకరించే విధంగా బియ్యం ఉత్పత్తి చేయడం వల్ల రైతులకు ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి.’’ అని వివరించారు.
(అనువాదం : రాఘవ)