ఇకపై యుద్ధాలు సైన్యాలు కాకుండా ఫోన్లు, పేజర్లే చేస్తాయా?
x

ఇకపై యుద్ధాలు సైన్యాలు కాకుండా ఫోన్లు, పేజర్లే చేస్తాయా?

మనం వాడే ఫోన్లో, విడిభాగాలే అణు బాంబులుగా మారతాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది లెబనాన్ లో జరిగిన పేజర్ల పేలుళ్ల తీరు చూస్తుంటే. ..


మున్ముందు యుద్ధం చేయాలంటే సైనికుల అవసరం ఉండదా? సైబర్ టెక్నాలజీని ఉపయోగించి ప్రత్యర్థుల్ని మట్టుపెట్టవచ్చా?? ఇంటెలిజెన్స్ సాయంతో శత్రుశిబిరాలను ధ్వంసం చేయవచ్చా? మనం వాడే ఫోన్లో, విడిభాగాలే అణు బాంబులుగా మారతాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది లెబనాన్ లో జరిగిన పేజర్ల పేలుళ్ల తీరు చూస్తుంటే. ఈ యుగధర్మం యుద్ధానిది కాదని దేశాధినేతలు చెబుతున్నా అందుకు విరుద్ధంగా విధ్వంసం జరుగుతూనే ఉంది.

రెండు రోజుల కిందట లెబనాన్‌, సిరియాలో ఉగ్రవాద గ్రూపు హిజ్బుల్లా సభ్యులకు తైవాన్ నుంచి పంపిన దాదాపు 3000 పేజర్లు పేలాయి. 9మంది చనిపోయారు. మరి కొన్ని వేల మంది గాయపడ్డారు. ఈ వ్యూహాత్మక దాడి వెనుక ఎవరున్నారన్నది తేలనప్పటికీ ఇజ్రాయిల్ కి చెందిన గూఢచారి సంస్థ ఉన్నట్టు హిజ్బుల్లా సంస్థ ఆరోపించింది. దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరించింది. ఇజ్రాయిల్ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇజ్రాయెల్ గనుక తానే ఈ పని చేశానని ప్రకటిస్తే వహిస్తే అది హిజ్బుల్లా సంస్థకు, దాని నాయకత్వానికి సవాల్ విసిరినట్టే. అయితే ఈ సైబర్ వార్ ఏ రెండు దేశాలకో, మరే రెండు సంస్థలకో పరిమితం కాకపోవచ్చునని, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మిగతా ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
గత ఏడాది అక్టోబర్ 7 నుంచి హిజ్బూల్లా గ్రూపుకి ఇజ్రాయిల్ కి మధ్య ప్రచ్ఛన్న, ప్రత్యక్ష యుద్ధం నడుస్తోంది. పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. చంపుకుంటున్నారు. ఆధునాతన పరికరాలతో దాడులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థలు మరో అడుగు ముందుకు వేసింది. ఉగ్రవాదులు వాడే పేజర్లలోని బ్యాటరీలు పేలేలా చేసి వాళ్లను మట్టుబెట్టవచ్చునని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థలు నిరూపించాయి. ఇప్పుడీ తరహా టెక్నాలజీపై ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
అసలేం జరిగింది...
లెబనాన్ లో పేజర్లు పేలి వేలాది మంది గాయపడడంపై రక్షణ రంగ నిపుణులే ఆశ్చర్యపోయారు. పేజర్ల బ్యాటరీలు ఓవర్‌హీట్ అయ్యేలా హ్యాకింగ్ చేసి ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటారని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పేలుళ్లు ఇంతకుముందు జరగకపోవడంతో దీన్ని ఎలా చేసి ఉంటారనే దానిపై ప్రస్తుతం శోధన సాగుతోంది. పేజర్లు తయారుచేసినప్పుడు కానీ, తయారీ తరువాత వాటిని ఎక్కడికైనా పంపేటపుడు కాని అటకాయించి వాటిల్లో ఈ పేలుడు టెక్నాలజీని పెట్టి ఉండవచ్చునని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం నడుస్తున్నది సైబర్ ప్రపంచం. ఫోన్లు, ల్యాప్ టాప్ లు, వాకీటాకీలు లేనిదే క్షణం గడిచే పరిస్థితి లేదు. ఈ తరహా కమ్యూనికేషన్ టెక్నాలజీ పెరిగినా సైబర్ సెక్యూరిటీ అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఫోన్లనూ, మరే ఇతర అనుబంధ పరికరాలనో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా తెప్పించుకుంటుంటే వాటిలో పేలుడు టెక్నాలజీని పెడితే ఈ ప్రపంచం ఏమై పోతుందన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది. సరకు సరఫరా చేసే ‘సప్లయ్ చైన్’ను ఉపయోగించి దాడులకు దిగితే పరిస్థితి ఏమిటన్న దానిపై భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. టెక్ ఉత్పత్తుల తయారీ సమయంలో కానీ ఆ తరువాత సరఫరా అయ్యే సమయంలో గానీ మరేదైనా దశల్లో గాని హ్యాకర్లు రంగంలోకి దిగి వాటిని పేలుడు పదార్ధాలుగా మారిస్తే మానవాళి భవిష్యత్ ఏమిటన్నది చర్చనీయాంశంగా ఉంది.
ఇంతవరకు సాఫ్ట్‌వేర్ సంబంధిత దాడుల్ని చూశాం. ఇప్పుడు హార్డ్‌వేర్ సప్లయ్ చైన్ దాడుల్ని చూస్తున్నాం. ఇది సప్లయ్ చైన్ అటాక్ అయితే దీనికోసం భారీ కసరత్తే జరిగిఉంటుందని అంచనా. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఒక ఎలక్ట్రానిక్ పరికరంలో 20 గ్రాముల వరకు శక్తిమంతమైన పేలుడు పదార్థాలను నింపవచ్చు. అలా ముందే అమర్చిన పేజర్లకు ఒకేసారి ఆల్ఫాన్యూమరిక్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా సిగ్నల్ పంపించి పేలుళ్లకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడితో హిజ్బుల్లా కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్‌లోకి ఇజ్రాయెల్ చొరబడిందని చెప్పవచ్చు.
ఫోన్లుండగా పేజర్లను ఎందుకు వాడారు?

మనం ఇప్పుడు వాడుతున్న ఫోన్లు రాకముందు పేజర్లు ఉండేవి. వాటి ద్వారా మేసేజీలు పంపవచ్చు. ఇప్పుడు ఏదేశం కూడా వాటిని వాడుతున్న దాఖలాలు లేవు. ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక పరికరాలతో పోల్చిస్తే అవి చాలా పాతవి. అటువంటి పేజర్లను హిజ్బుల్లా గ్రూపు సభ్యులు వాడుతున్నారు. ఇజ్రాయెల్ నిఘాసంస్థలు తమ లొకేషన్ ట్రాక్ చేయకుండా తప్పించుకోవడానికి హిజ్బుల్లా ఈ పరికరాలను ఉపయోగిస్తోంది. పేజర్ అనేది అక్షరాలు, అంకెలతో కూడిన (ఆల్ఫాన్యూమరిక్) మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు పంపించుకోవడానికి వీలున్న వైర్‌లెస్ టెలి కమ్యూనికేషన్స్ పరికరం. ఇందులో మెసేజ్ ను చదువుకోవచ్చు. వాయిస్ అయితే వినవచ్చు.
ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పేజర్లు...
ఈ పేజర్లు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారనే దానిపై తర్జనభర్జన జరుగుతోంది. వీటిని తైవాన్ లోని ఓ సంస్థ తయారు చేసిందని కొందరంటుంటే హంగరీలో తయారయ్యారని కొందరు చెబుతున్నారు. పేజర్లను కొన్ని నెలల కిందటే దేశంలోకి వచ్చాయని లెబనాన్ భద్రతా అధికారులు చెబుతున్నారు. అయితే అవి ఇప్పుడెందుకు పేలాయన్నది చర్చ. నిజానికి పేజర్లను ఇప్పుడు పేల్చాలన్న ప్లాన్ లేకపోయినా హిజ్బుల్లా నేతలకు తమ ప్లాన్ ఎక్కడ తెలిసిపోతుందోనని ఇజ్రాయిల్ వాటిని పేల్చి ఉండవచ్చునన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఫోన్లు వాడుతుంటే శత్రు శిబిరాలు తమ సమాచారం తేలిగ్గా తెలిసిపోతోందని హిజ్బుల్లా వాటి స్థానంలో పేజర్లను ఉపయోగిస్తోంది. ఈ పేజర్లను తైవాన్ కంపెనీ గోల్డ్ అపోలో కంపెనీ తయారు చేసినట్టు వార్తలు వచ్చినా ఆ కంపెనీ ఖండించింది. పేజర్ల తయారీలో తమ పాత్ర లేదని, హంగరీ సంస్థ వాటిని తయారు చేసిందని పేర్కొంది.
ఇప్పటి వరకు ఇజ్రాయిల్ హిజ్బుల్లా వంటి సంస్థలపై దాడులకు రకరకాల పరికరాలు వాడినా పేజర్ పేలుళ్ల జరపడం ఇదే మొదటిసారి. ఈ పేజర్ దాడులతో ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా మరింత ముందుకుపోయిందన్నది యుద్ధరంగ నిపుణుల అభిప్రాయం.
ఇజ్రాయెల్ హిజ్బుల్లా కమ్యూనికేషన్ నెట్‌వర్క్ లోకి చొరబడి, దానికి ఎక్కడి నుంచి ఆయుధాలు సరఫరా అవుతున్నాయో గుర్తించి దాన్లోకి చొరబడి ఉంటారని అంచనా. హిజ్బుల్లాహ్‌కు అందే సప్లై చైన్ ను అడ్డగించగలమని, ఆ సంస్థ అంచాలను తాము విచ్ఛిన్నం చేయగలమని ఇజ్రాయిల్ నిరూపించింది.
భారతీయ సైనిక వ్యూహకర్త ప్రవీణ్ సాహ్నీ తన ఇటీవలి పుస్తకం ది లాస్ట్ వార్‌లో చెప్పినట్టుగా మున్ముందు ముప్పు చిన్న చిన్న డ్రోన్లతో రావొచ్చునన్నారు గాన ఇప్పుడు ఏకంగా సెల్ ఫోన్లే మారణాయుధాలుగా మారనున్నాయి. కార్లు, ఫోన్‌లు, కంప్యూటర్‌లు, టాబ్లెట్‌లు, ఇతర వ్యక్తిగత వస్తువులతో సహా ఇతర ముఖ్యమైన తయారీ వస్తువులను, విడిభాగాలను దిగుమతి చేసుకునే దేశాలకు ఈ రకమైన దాడుల ముప్పు ఎక్కువగా ఉన్నట్టు ఈ సంఘటనతో రుజువైంది. సరకు ఫ్యాక్టరీ నుంచి గిడ్డంగికి చేరే లోగా ఏ దశలోనైనా సరుకును అడ్డుకుని వాటిలో పేలుడు పదార్థాలు పెట్టడం పెద్ద కష్టం కాదు.
పేలుడు పదార్థాలను వినియోగ వస్తువులలో చొప్పించాల్సిన అవసరం లేకుండానే లెబనాన్ పేజర్లు పేలాయి. బ్యాటరీలు వేడెక్కడానికి లేదా ఎలక్ట్రిక్ కార్లు చెడిపోయేలా చేయడానికి అవసరమైన సాఫ్ట్ వేర్ ను కూడా రూపొందించవచ్చు.
రాబోయే రోజుల్లో లెబనాన్‌లో పేజర్ దాడుల గురించి మరిన్ని విషయాలు బయటకురావొచ్చు. ఈ పరికరాల్లో కొన్ని డిజైన్ చేసినట్లుగా పని చేయలేదంటున్నారు. పేలని పేజర్లను, వాటి డిజైన్‌ను పరిశీలిస్తున్నారు. హిజ్బుల్లా, దాని మిత్రబృందాలు కూడా ఈ పేజర్ల డిజైన్ ను కాపీ చేసి పరిశీలిస్తున్నాయి. లెబనాన్‌ తాజా దాడులు సైబర్ వార్ కి కొనసాగింపు. రానున్న చీకటి రోజులకు ఇది ప్రారంభ సూచనైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
Read More
Next Story