
వడ్లమూడి తిరునాళ్లకు వచ్చిన సుద్దపల్లి కరెంటు ప్రభ
'అలగా' జనమే కళలకు అమ్మా అయ్యా!
కోరీ తిర్నాల పెబల ఎలుగుల్లో ఆటా పాటా మాటా కోలాహలం!
'ఏమండీ నాకు తెలియకడుగుతా.. హైదరాబాద్ పోతే పల్లెటూరి వాసనలు, 'ముతక' మూలాలు మర్చిపోవాల్నా..! రండీ.. రేపు రాత్రికి బయల్దేరి... (అని దీర్ఘాలు తీస్తూ..) కోరీ తిర్నాలకు పోయొద్దామంటూ' మా తెనాలి మిత్రుడు కాటూరి వెంకటేశ్వరరావు ఫోను..
ఈ శివరాత్రికి ఎట్టైనా కోటప్పకొండ పోదామని నేనూ, మా మామ రఘురామిరెడ్డి వేసుకున్న ప్లాన్ బెడిసింది. దీంతో ఇదే సందనుకుని.. నేను నా విజయవాడ మిత్రులకు ఫోన్లు చేస్తే ఒక్క జీపీ వెంకటేశ్వర్లు తప్ప మూలిగినోళ్లు లేరు. మీరింత 'ముసలోళ్లయ్యారా' అని ముక్కున వేలేసుకుని నేను బెజవాడ బాట పట్టి జీపీ దగ్గరకు వెళ్తే.. 'రాత్రి జోరుగా, హుషారుగా షికార్ చేద్దామని, చెరుకుగడలు, పంచదార చిలకలని చెప్పినోడు' ఇప్పుడు 'ఆఁ ఊఁ' అంటున్నాడు.
ఇదేదో తిరకాసు ఎవ్వారంలా ఉందనుకుని ఆయన్ని లేపి కూర్చోబెట్టి బారులాగు, దాపుడు చొక్కా తగిలించి బయలెల్లేపాటికి బెజవాడలోనే పైటేల దాటింది. 'తెలుగునాట భక్తిరసం కుప్పలు తెప్పలుగా' పారుతుండడంతో బస్సు బ్యారేజీ దాటేపాటికి గంట.. ఈలోపు 'బెజవాడ నుంచి తెనాలికి ఎంతసేపొస్తారండీ, ఇక్కడ మేం తిండి తినాలా వద్దా' అంటూ 'తీన్ఆలీ' నుంచి కాటూరి ఫోన్ల మీద ఫోన్లు.. ఎట్టకేలకు 'ఆంధ్రా ప్యారిస్' చేరి శివరాత్రి వింధు చేసి లాడ్జీకి చేరేపాటికి మాపిటేళ 6 దాటింది.
గుర్తుకొస్తున్నాయ్...
తిర్నాలకు పోయి కొన్నేళ్లయింది. చూడాలన్న కోర్కె మిగిలే ఉంది. అట్టాంటి టైంలో ఇట్టాంటి ఫోన్.. పేణం లేచొచ్చింది. కరెంటు పెబను (మా అమ్మ పిలుపిది) కళ్లారా చూడాలన్న కుతి. కార్లో వడ్లమూడి బయల్దేరాం. అనుకున్నట్టే మా రఘురామయ్య ముఖం చాటేశాడు. ఇంకో వెంకటేశ్వర్లు కారెక్కాడు.
కోటప్పకొండ తరువాత చెప్పుకోదగింది వడ్లమూడి క్వారీలోని శ్రీబాలకోటేశ్వరస్వామి తిరునాళ్లే. 80 ఏళ్లుగా ఇక్కడ తిర్నాల జరుగుతోందట. ఎవరో చీమకుర్తి యలమందయ్య ఈ తిర్నాలకు శ్రీకారం చుట్టారట. మా కారు జనాన్ని తప్పించుకుని కోరీ (క్వారీ)కి పోయే పాటికి రాత్రి 9 దాటింది.
కార్లోంచి కాలు కింద పెట్టి క్వారీ ప్రాంతంలోనే కట్టిన మూడునాలుగు ప్రభలు చిమ్మచీకట్లో మిణుగుర్లాగా, దగద్దాయమానంగా మిలమిలా మెరిసిపోతున్నాయి.
చిన్నతనం గుర్తుకొచ్చింది... 'చంఘిజ్ ఖాన్' నవల్లో మంగోలియా తండాల మంటల నుంచి రేగుతున్న పొగల మాదిరి క్వారీలో ఎర్ర దుమ్మురేగుతోంది. మా మూతులకు గుడ్డలు బిగిసాయి. తప్పిపోకుండా తాళ్లు కట్టుకోలేదు గాని ఒకరి భుజం మీద మరొకరం చేయేసి రైలుబండిలా ముందుకు సాగాం.
ప్రభ కట్టడం పెద్ద ఆర్ట్
రాజకీయాలకే కాదు దేవుళ్లకీ, ప్రభలకీ కులాల కుళ్లు అంటి చాలా కాలమైంది. ఇది 'పలానా ఊరి' ప్రభ అనే దగ్గర్నుంచి ఇది 'పలానా కులం' లేదా 'పలానా పార్టీ' ప్రభ అనే దాకా వచ్చింది కదా.. అందువల్ల మేము ముందు చూసిన ప్రభ దగ్గర జిగేల్ జిగేల్ మంటున్న 'కులం' పేరు చూసి ఆశ్చర్యపోలేదు.
తలపైకెత్తి చూస్తే తప్ప ప్రభ ఆసాంతం కనపడనంత గొప్పగా కట్టారు. దీని కోసం ఎంత కష్టపడతారో నాకు సూచ్చంగా తెలుసు. 'అబ్బ.. ఏం కట్టార్రా' అని నేనెవర్తోనో అంటే ఇదేం చూశారు ఆ సుద్దపల్లి పెబను చూడండన్నాడు పక్కాయన. అప్పటికే కుర్రకారు నాగిని డాన్స్ తో మెల్దిరిగిపోతోంది. మోతక్కించే సాంగ్స్ హోరెత్తుతున్నాయి.
ఇట్టాంటపుడే మనకు రకరకాల మనుషులు కనిపిస్తారు. మైకుల్లో తన గొంతు విన్పించాలనే మోజున్న 'అనధికార ప్రతినిధులు' వీళ్లు. 'అరేయ్, ఆ పగ్గాలు జాగ్రత్త, పట్టుకుని ఊపొద్దని' ఒకరు, 'పలానా ఆయన ఎక్కడున్నా స్టేజీ మీదికి రావాలా'ని ఇంకొకరు, 'ఏమమ్మా, ఆ పాట పాడు, కుర్రాళ్లు పక్క ప్రభ దగ్గరికి పోతున్నారు' అని మరొకరు కూత పెడుతున్నారు.
ఓ పావుగంటా 20 నిమిషాల సేపు ఆ ప్రభను ఎంజాయ్ చేసి రెండో ప్రభ దగ్గరకు పోదుం కదా.. అక్కడ గుండెలే కాదు ఒళ్లంతా దడపుట్టించేలా డీజేలు మోతమోగుతున్నాయి. ఓ వందానూటయాబై మైకు సెట్లు వరసగా పెట్టి గుండెల్లో దడపుట్టిస్తున్నారు. చెవులు చిల్లలు పడి ఎక్కడ గుండాగిపోతుందననే భయంతో గబగబా కాస్త దూరం పోయి నిలబడ్డాం. ఈలోపు 'హరహరో' అంటూ మత్తెక్కిన కుర్రకారు ఒక్కసారిగా పీకలు ఊదుకుంటూ మాపైన పడడంతో తలా ఓవైపు చెల్లాచెదరైనా.. మొత్తం మీద మా రైలుబండి మళ్లీ అతుక్కుంది.
ఇది సుద్దపల్లి పలానా కులం వారి ప్రభ అని వీళ్లు పైన్నే పెట్టారు గనుక మేము ఎవర్నీ అడగాల్సిన పని తప్పింది. ప్రభను భలే బాగా కట్టారు. రంగుల అమరిక ఒద్దికగా ఉంది. పగ్గాలకు లైట్లు పెట్టి సోలుపుగా కట్టిన తీరు బాగుంది. ప్రభ చుట్టూ కంచేసినట్టు మైకులు ఉన్నాయి. వినుకొండ డాన్స్ పార్టీ వాళ్లు ఓ చోట నిలబడకుండా స్టేజీ అంతా కదం తొక్కుతున్నారు.
సీనియర్ శివకుమారి గుర్తుకొచ్చింది!
వీళ్లను చూసినప్పుడు అప్పుడెప్పుడో 'ఆంధ్రప్రభ' విజయవాడ ఎడిషన్ కోసం మా మిత్రుడు, జర్నలిస్టు వేదాంతం అంజనీ కుమార్ తో కలిసి- నరసరావుపేట సీనియర్ శివకుమారిని చేసిన ఇంటర్వ్యూ గుర్తుకొచ్చింది. ఆరోజుల్లో ఈమె టాప్. ఎన్ని అనుభవాలు చెప్పిందో.. ఎన్నెన్ని పొట్టకూటి పాట్లు ఏకరవు పెట్టిందో.. తన ట్రూపును కాపాడుకునేందుకు అప్పులు చేసి మరీ పోషించిన రోజులున్నాయట.
ఓసారి స్టేజీ మీదకు ఎక్కిన తర్వాత కనీసం 7,8 గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఫర్మార్మెన్స్ ఇవ్వాలి. కింద నుంచి జనం ఈల కొట్టి - ఏమి పాడమంటే అది పాడాలి. పోకిరిగాళ్లు పోరంబోకు పనులు చేయకుండా చూసుకోవాలి.. దీని వెనుక ఎంత కసరత్తు ఉంటుందో కదా..
ఎవరెవరు ఎన్నెన్ని పాటలు పాడాలో, ఏ పాటకి ఎవరు డాన్స్ చేయాలో, గ్రూపు సాంగ్స్, చెల్లియో చెలకో వంటి పౌరాణిక పద్యాలు, మిమిక్రీ, చింతామణి, సుబ్బిశెట్టి లాంటి పాత్రల మాటలు, పాటలు, చేష్టలు వంటివి ఎన్నెన్నో ప్లాన్ చేయాలి. చేతిలో కలం కాగితం లేకుండా అలవోకగా చెప్పగలగాలి. తప్పు దొర్లినా దిద్దుకోగలిగిన సత్తా ఉండాలి. అన్నింటికీ మించి ప్రేక్షకుల్ని కదలకుండా ఉంచాలి. నాలుగు ముక్కలు యాంకరింగ్ చేయడానికి ఆపసోపాలు పడే మేటి యాంకర్లను మించిన వాళ్లు వీళ్లే కదా అన్పించింది.
చెరుకు గడలు, బొరుగు ముద్దలు..
ఇలా, అక్కడున్న ప్రభలన్నీ చూడడానికి ముందే మావాళ్లు నీరసపడడం మొదలైంది. అప్పుడు కాసేపు బ్రేక్ అనుకుని చెరుకులమ్మే వైపు మళ్లాం. ఓచోట సెటిలై.. ఏది మర్చిపోయినా ఫోన్లు చూసుకోవడం మరువలేని కాలం కదా, వాటిని తీసి చూస్తే నెట్ వర్క్ లేదని వచ్చింది గనుక బతికిపోయాం. తలా ఒక చెరుకు గడను నమిలేపాటికి నాలుక కొట్టుకుపోయింది. అప్పుడు లేచి నీళ్లు తాగి ప్రభల వైపు నడిచాం. అప్పటికి అర్థరాత్రి దాటిపోయింది.
కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి. ఎక్కడ చూసినా నాన్ వెజ్లే తప్ప ఇంకోటి కనిపించలా.. ఎక్కడైనా మన 'కోవాబన్ వలీ' కనిపిస్తాడేమోనని వెతికా.. పోన్లే బతికిపోయాడనుకుని బొరుగు ముద్దలు, చెగోడీలు, మిక్చర్ పొట్లాలు కట్టించుకుని పార్కింగ్ దగ్గరికొచ్చే పాటికి నిజంగానే చుక్కలు కనిపించాయి మబ్బుల్లో..
నేరుగా జాగర్లమూడి వచ్చి రోడ్డుపక్కనున్న ఓ చోట ఇడ్లీ తింటుంటే ఓ పెద్దకార్లో దిగిన ఓ నడమంత్రపు సిరి మనిషి.. 'ఈడ గలీజుగా ఉందే, అలగా వాళ్లు ఎక్కువగా ఉండ్లా' అని మళ్లీ కారెక్కారు. నడిరేత్రి 2 గంటలు దాటిన తర్వాత ఆకలిమంట తీరుస్తున్న తీరును మెచ్చుకోవాల్సింది పోయి మనసు కష్టపెట్టడమంటే ఇదేగా మరి.
అప్పుడు చూసుకున్నాం మా మొహాలు.. కోరీ దుమ్ముకి జట్టు ఎర్రబారింది. కనురెప్పల వెంట్రుకలు ఎర్రడాలుగా మిలమిలమంటున్నాయి తెల్లచొక్కాలు రంగు మారాయి. ప్యాంట్లపై వేలెడు మందాన దుమ్ము పెరుకుపోయింది. బూట్లు చార్లీ చాప్లిన్ బూట్లలా మారాయి. మొత్తంగా 'ఆవారా' సినిమాలో భుజానికి సంచితగిలించుకుని రైల్వే స్టేషన్ లో దిగిన రాజకపూర్ లా ఉన్నాం.
అవును కదా, కళలు అలగా జనం నుంచే పుడతాయి. అలగా జనాలే సృష్టించారు. ఆటా, పాటా, మాటా, కర్ర, కత్తి, డప్పు, మరేదైనా కానీవండి. వాటికి సృష్టికర్తలు వీళ్ళే. కళకూ ఆద్యులు అలగా జనమే. అందుకే తిర్నాల చూశాం.
Next Story

