బాబిలోనియా ఎంకిడు, రామాయణ ఋష్యశృంగుడు
x

Pic: Cover page of Gilgamesh Eipic by Alexander Heidel

బాబిలోనియా ఎంకిడు, రామాయణ ఋష్యశృంగుడు

రామాయణంలో నిరుత్తరకాండ-7: ఋష్యశృంగుడు బాబిలోనియా ఇతిహాసంలోని ఎంకిడు మధ్య చాలా పోలికలున్నాయి. ఎక్కడి రామాయణం, ఎక్కడి బాబిలోనియా? ఈ పోలికలేమిటి?


‘రాముడికి సీత ఏమవుతుంది’ అనే ఆరుద్ర రచన ప్రసిద్ధం. అది శ్రీలంక, చైనా, టిబెట్, ఖోటాన్(చైనాలో భాగం), మంగోలియా, జపాన్, సైబీరియా, లావోస్, కంబోడియా, థాయిలాండ్, ఇండొనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, బర్మా(నేటి మయన్మార్)లలో రామాయణకథ వ్యాపించిన సంగతి చెప్పి వాటిలోని విశేషాలను పరిచయం చేస్తుంది. వాటిలో అనేకం, మనకు తెలిసిన రామాయణకథకు, పాత్రలకు, పాత్రల మధ్య సంబంధాలకు భిన్నంగా ఉంటాయి. ఈ వ్యాసపరంపర ముందుకు వెళ్ళే క్రమంలో వాటిలోని కొన్ని విశేషాలను తప్పక ప్రస్తావించుకోవలసిరావచ్చు.

ప్రస్తుతం చర్చిస్తున్న ఋష్యశృంగుడి విషయానికి వస్తే, ఆ పాత్ర థాయిలాండ్ రామాయణంలోనూ కనిపిస్తుంది. అందులో అతని పేరు కలైకోట్. తమిళరామాయణంలో కూడా అతని పేరు అదే. వాల్మీకి రామాయణంలో రోమపాదుడు అతణ్ణి తన రాజ్యానికి రప్పించుకోడానికి గణిక(వేశ్య)లను పంపిస్తే; థాయిలాండ్ రామాయణంలో తన కూతురినే పంపిస్తాడు. కలైకోట్ కూడా దశరథుడితో పుత్రకామేష్టే చేయిస్తాడు కానీ వివరాల్లో తేడాలున్నాయి.

ఋష్యశృంగుని సందర్భంలోనే, ఒక బాబిలోనియా ఇతిహాసం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. దాని పేరు: ‘గిల్గమేశ ఇతిహాసం’(The Epic of Gilgames). నైరుతి ఆసియాలో టైగ్రిస్-యూఫ్రటిస్ నదుల మధ్య ప్రాంతం దీనికి రంగస్థలం. గ్రీకులు ఈ ప్రాంతాన్ని ‘మెసపొటేమియా’ అన్నారు. రెండు నదుల మధ్యనున్న ప్రాంతమనే ఆ మాటకు అర్థం. లంక లాంటిదన్నమాట. నేటి ఇరాక్ తోపాటు, ఇరాన్, టర్కీ, సిరియా, కువైట్ లలోని కొన్ని భాగాలు ఇందులోకి వస్తాయి. కొత్తరాతి యుగంలో, అంటే క్రీ.పూ. 10,000 ప్రాంతంలో మానవాళి చరిత్రను మలుపు తిప్పిన మహత్తరపరిణామాలు ఇక్కడే జరిగాయని చరిత్రకారులు తేల్చారు. చక్రాన్ని, రాతను కనిపెట్టడం; తొలిసారి తృణధాన్యాల సాగుతో సహా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం వాటిలో కొన్ని. క్రీ.పూ. 3100నుంచి, అంటే ఇప్పటికి దాదాపు 5500 సంవత్సరాల వెనకటినుంచీ ఈ ప్రాంతానికి చెందిన లిఖితచరిత్ర లభ్యమవుతోంది. ప్రపంచంలోని తొలి నాగరికతల పుట్టిళ్లలో ఈ ప్రాంతం ఒకటి. సింధు నాగరికతకు ఇది సమకాలికం.

పశ్చిమాసియా నుంచి మెసపొటేమియాకు వలస వచ్చినట్లు చెబుతున్న సుమేరియన్లు, అక్కాడియన్లు తొలినుంచి ఆ ప్రాంతంపై ఆధిపత్యం చాటుకున్నారు. సుమేరియన్ కు భిన్నంగా, అక్కాడియన్ సెమెటిక్ భాష. దానికి అనేక మాండలికాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి పురాతన అక్కాడియన్, బాబిలోనియన్, అసీరియన్ అనేవి. అరబిక్, హిబ్రూలు కూడా అక్కాడియన్ తో సంబంధమున్నవే. అక్కాడియన్ ప్రాబల్యానికి సుమేరియన్ దారి ఇచ్చేసినా; మన దగ్గర సంస్కృతంలానే మతవిధులకు, పూజాదికాలకు, వాఙ్మయానికి, శాస్త్రవిజ్ఞానవిషయాలకు సంబంధించిన భాషగా ఉనికి నిలుపుకుంది. అక్కాడియన్ పాలకుడు సారగాన్ అంతవరకూ అక్కడున్న నగరరాజ్యాలను ఏకం చేసి క్రీ.పూ. 2350 ప్రాంతంలో ఇక్కడ తొలి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత అసీరియన్లు ఉత్తరప్రాంతాన్ని, బాబిలోనియన్లు దక్షణమధ్యప్రాంతాన్ని శాసించారు. అసీరియన్ రాజులలో సారగాన్-2, అసుర్బనిపాల్; బాబిలోనియన్ రాజులలో హమ్మురాబి ప్రసిద్ధికెక్కారు. ఆ తర్వాత మెసపొటేమియా క్రీ.పూ. 539లో పర్షియన్ల పాలనలోకి, క్రీ.పూ.332లో అలెగ్జాండర్ పాలనలోకి వెళ్లిపోయింది.

గిల్గమేశ ఇతిహాసం గురించి చెప్పుకోడానికి ఈ మాత్రం చరిత్ర తడమడం అనివార్యమైంది. మన రామాయణ, మహాభారతాల్లానే మొదట్లో విడివిడి కథలుగా ప్రచారంలో ఉన్నవన్నీ ఒకచోట కూడి గిల్గమేశ ఇతిహాసమయ్యాయి. ఈ కథల్లో కొన్ని క్రీ.పూ. 2100 నాటికే వ్యాప్తిలో ఉన్నాయి. క్రీ.పూ.18వ శతాబ్దినాటికి పాత బాబిలోనియా పాఠమూ, క్రీ.పూ.13-10 శతాబ్దాల మధ్య, దానికే చెందిన ప్రామాణిక పాఠమూ రూపొందాయి. అక్కడినుంచి క్రీ.శ. 19వ శతాబ్దికి వద్దాం. అసీరియన్ల రాజధాని నినవేలో తవ్వకాలు జరిపినప్పుడు క్రీ.పూ. 7వశతాబ్దికి చెందిన అసుర్బనిపాల్ రాజప్రాసాదానికీ; నబూ(బైబిల్ ఈయనను నెబోగా పేర్కొంది) అనే దేవుడి ఆలయానికీ చెందిన గ్రంథాలయాల శిథిలాల్లో గిల్గమేశ ఇతిహాసాన్ని మేకు ఆకారం(క్యూనిఫామ్)లోని లిపిలో లిఖించిన 12 మట్టిపిడకలు(టాబ్లెట్స్) బయటపడ్డాయి.

ఈ నబూ అనే దేవుడు, మన దగ్గర సరస్వతిలా విద్యకు, జ్ఞానానికి, వాఙ్మయానికి సంబంధించిన దేవుడు. మనం బుధగ్రహంగా చెప్పుకునే మెర్క్యూరితో అసీరియన్లు ఈయనను ముడిపెట్టుకున్నారు. బుధుడనే మాటకు పండితుడనే అర్థం!

సుమేరు, అక్కాడియన్ భాషల్లోనే కాక; పశ్చిమాసియాకు చెందిన హిట్టైట్, హురియన్ భాషల్లో కూడా గిల్గమేశ ఇతిహాస భాగాలను లిఖించిన చిన్నా, పెద్దా మట్టిపిడకలు బయటపడ్డాయి. అంటే, రామాయణకథల్లానే ఆరోజుల్లో గిల్గమేశ ఇతిహాసకథలు కూడా వేరువేరు భాషల్లోకీ దూరదూరప్రాంతాలకీ విస్తరించేంతగా ప్రజాదరణను, ప్రసిద్ధిని తెచ్చుకున్నాయన్నమాట. క్రీస్తుపూర్వం అనేక శతాబ్దాల క్రితమే లిఖితసంప్రదాయం ఏర్పడడం; రాజభవనాలు, దేవాలయాలు సైతం గ్రంథాలయాలు కావడం ప్రత్యేకించి ఆసక్తి గొలిపే విషయాలే.

ఆధునికకాలంలో గిల్గమేశ ఇతిహాసానికి అనేక పరిష్కృత పాఠాలు వెలువడ్డాయి. వాటిలో అలెగ్జాండర్ హైదే(Alexander Heidel) అనువాదంతో; బాబిలోనియా, అసీరియా పాఠాల అన్వయంతో, ది యూనివర్సిటీ ఆఫ్ చికాగో ప్రెస్ ప్రచురించిన దొకటి. ఇటీవలి కాలంలో విలియం ఇర్విన్ థామ్సన్(William Irwin Thompson) తన The Time Falling Bodies Take To Light -Mythology, Sexuality & the Origins of Culture అనే రచనలో మానవనాగరికత, తాత్త్వికత, మాతృస్వామ్య, పితృస్వామ్యాల స్పర్థ వంటి వివిధ కోణాలనుంచి గిల్గమేశ ఇతిహాసాన్ని పరిశీలించి అద్భుతమైన అన్వయాన్ని కూర్చాడు. అలెగ్జాండర్ హైదే మాటల్లో చెప్పాలంటే, సుదీర్ఘమూ, సుందరమూ అయిన గిల్గమేశ ఇతిహాసం మానవాళికి చెందిన అనర్ఘసాహిత్యరత్నాలలో ఒకటి. ఆయా మతాల తులనాత్మక అధ్యయనానికి తోడ్పడే పౌరాణికవిషయపుష్టితోపాటు మానవజీవితంతో గాఢంగా అల్లుకుని ఆసక్తి రేపే ఘట్టాలు ఇందులో ఉన్నాయి. దేవతల ప్రస్తావనలు ఉన్నప్పటికీ మనిషినే ప్రధాన ఇతివృత్తంగా చేసుకోవడం దీని ప్రత్యేకత. సంక్లిష్టమైన మనిషి భావప్రపంచాన్ని, అందులోని అంతర్మథనాన్ని ఇది పరిచయం చేస్తుంది. మృత్యువును తలచుకుని అతడు పడిన దుఃఖాన్నీ, దానిని జయించడానికి చేసిన విఫలయత్నాన్నీ చెబుతుంది. చివరికి మృత్యువుతో సమాధానపడి ఇహలోకాన్నే వాసయోగ్యంగా మలచుకునే దిశగా నడిపిస్తుంది. ఆవిధంగా తాత్త్వికమైన లోతూ, గాంభీర్యాలతో సార్వకాలికతను తెచ్చుకుని ఎప్పటికప్పుడు సమకాలీనం అనిపిస్తుంది.

ఈ ఇతిహాస కథలు వ్యాప్తి చెందేనాటికి మనదేశంలోకి ఇండో-యూరోపియన్ జనాల వలస మొదలు కాలేదు. అంతటి పురాతనకాలంలోనే మనిషి బహిరంతర్ జీవనఘర్షణకు అక్షరరూపమిచ్చిన గిల్గమేశ ఇతిహాసంతో మన రామాయణ, భారతకథలను, పురాణకథలను పోల్చి చూడడం ఇతరత్రా కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. ప్రస్తుతం ఋష్యశృంగుని సందర్భానికి పరిమితమవుదాం.

***

ఈ ఇతిహాసంలో ప్రధానపాత్ర అయిన గిల్గమేశ్ బలిష్ఠుడూ, యువకుడూ అయిన ఒక రాజు. సుమేరు రాజుల జాబితా ప్రకారం, ఉరుక్ అనే నగరాన్ని ఏలిన తొలి రాజవంశానికి చెందినవాడు. 126 సంవత్సరాలు రాజ్యం చేశాడు. ఇతని తల్లి నిన్సున్ అనే దేవత. ఆ దేవత భర్త, లుగల్బండ అనే దేవుడు. అయితే, గిల్గమేశ్ పుట్టింది మాత్రం, ఉరుక్ లోని కులాబ్ అనే చోట ప్రధానపూజారిగా ఉన్న ఒక మానవుడికి. అందువల్ల అతనిలో దేవతాంశ, మానవాంశ-రెండూ ఉన్నాయి. దేవతాంశ కారణంగా సాధారణమానవునికి లేనంత లైంగికశక్తి అతనికి వచ్చింది. రాజు కనుక తన రాజ్యంలో ‘తొలి రేయి హక్కు’ను అమలుచేసేవాడు.

వివాహమైన తర్వాత రాజ్యంలోని ప్రతి ఒక్క వధువునూ మొదటి రాత్రి రాజు లేదా ప్రభువు అనుభవించడమే ఈ హక్కు. లాటిన్ లో దీనిని jus primer noctis(right of the first night) అంటారు. ఫ్రెంచిలో దీనిని droit du seigneur అంటారు. ‘ప్రభువు చలాయించే హక్కు’ (right of the lord) అని దీని అర్థం. యూరప్ లో మధ్యయుగాల వరకూ ఈ హక్కు అమలులో ఉండేదని చరిత్ర. ఒకప్పుడు ఆంధ్రులలో కూడా ఈ ‘తొలి రేయి హక్కు’ ఉండేదని రాంభట్ల కృష్ణమూర్తి గారు తన ‘వేదభూమి’లో అంటూ, వాత్స్యాయనకామసూత్రాలలో కన్యాసంప్రయుక్తాధికరణంలోని 42వ సూత్రాన్ని ఉటంకించారు: ‘ప్రత్తా జనపదకన్యాం దశమేహని కించి దౌపాయనకం గృహీత్వా ప్రవివేశా అంతఃపురం ఉపభోజ్యా విసృజ్యా ఇత్యాన్ధ్రాణామ్’: జనపదకన్య, అంటే పల్లెటూరి అమ్మాయి పెళ్ళైన పదిరోజుల్లోపల ఏదైనా బహుమతి పుచ్చుకొని దొరగారి అంతఃపురానికి వెళ్ళి ఆయన భోగించిన తర్వాత బయటపడుతుంది. ఈ ఆచారం ఆంధ్రుల్లో ఉం’దని ఈ సూత్రానికి అర్థం.

దీనికి తోడు గిల్గమేశ్ యువకులను నగరప్రాకారనిర్మాణానికి, దేవత గుడి కట్టడానికి నియోగించి వారిచేత విపరీతమైన శ్రమ చేయించేవాడు. అతని అంతులేని కామదాహాన్ని, చండశాసనాన్ని భరించలేకపోయిన ప్రజలు అతనికి సమవుజ్జీని సృష్టించి తమను ఆదుకోమని దేవతలను ప్రార్థించారు. గిల్గమేశ్ దృష్టి అతనివైపు మళ్లి, అతని దుర్మార్గాలనుంచి తమకు విముక్తి లభిస్తుందని వారి ఆశ.

‘అరురు’ అనే దేవత వారి మొర ఆలకించి తననుంచి ‘అను’ అనే దేవుడి ప్రతిరూపాన్ని సృష్టించాలనుకుంది. మట్టిముద్దనుంచి ఓ ముక్క గిల్లి గడ్డిభూమి(steppe) మీద వేసింది. దానినుంచి ఓ అడవి మనిషి పుట్టాడు. అతని పేరు, ఎంకిడు. మన పురాణాల్లో పార్వతి అభ్యంగనస్నానం చేయబోతూ నలుగుపిండినుంచి గణపతిని సృష్టించి కాపలా ఉంచిన ఉదంతం ఇక్కడ గుర్తుకొస్తుంది. ఎంకిడుకి ఆడవాళ్లలా పొడవాటి జుట్టు ఉంటుంది. అతని ముంగురులు మొలుచుకొస్తున్న ధాన్యపు గింజల్లా ఉంటాయి. అతనికి ఆ గడ్డిభూమిలోని జంతువులతోనే సావాసం. వాటిలో కొమ్ములున్న చిన్న మగజింకలుంటాయి. జంతువుల్లానే అతనికి గడ్డే ఆహారం. అవి తాగినట్టే నీటిగుంటల్లోని నీళ్ళు తాగేవాడు. గిల్గమేశ్ దేవతాంశ కలిగినవాడుగా స్వర్గం నుంచి దిగివస్తే, ఎంకిడు ప్రకృతికి చెందిన అడవిమనిషిగా భూమినుంచి పుట్టుకొచ్చాడని దీనికి విలియం ఇర్విన్ థామ్సన్ అన్వయం.

అలా ఉండగా, వలపన్ని జంతువుల్ని పట్టుకునే ఓ వ్యక్తి ఎంకిడుని చూసి ఆశ్చర్యపోయాడు; అంతకుమించి ఆందోళనకు గురయ్యాడు. ఎందుకంటే, అతని వలకు చిక్కిన జంతువుల్ని ఎంకిడు విడిపించేస్తున్నాడు. ఆ వ్యక్తి వెళ్ళి ఈ సంగతి తండ్రికి చెప్పాడు. ఎంకిడుని వలేసి పట్టుకోవడమే దీనికి పరిష్కారమని ఇద్దరూ అనుకున్నారు. గిల్గమేశ్ ను కలిసి ఈ విషయం చెప్పమనీ, ఎంకిడుకి వల వేయడానికి ఓ దేవదాసి(harlot from the temple)ని పంపించమని అడగమనీ తండ్రి కొడుకుతో అన్నాడు. అడవిమనిషిని లొంగదీసుకునే చాకచక్యం స్త్రీకే ఉంటుందన్నాడు.

కొడుకు ఉరక్ పట్టణానికి వెళ్ళి గిల్గమేశ్ కు తను చూసిన అడవిమనిషి గురించి చెప్పి, అతను చెప్పిన మీదట దేవదాసిని వెంటబెట్టుకుని తిరిగి గడ్డిభూమికి వచ్చాడు. ఇద్దరూ నీటిగుంట దగ్గరికి వెళ్ళి ఎంకిడు రాక కోసం ఎదురుచూశారు. దూరం నుంచి ఎంకిడు వస్తూ కనిపించాడు. దుస్తులు విప్పేసి పూర్తి నగ్నంగా ఎంకిడుకి కనిపించమని- జంతువులకు వలపన్నే వ్యక్తి దేవదాసితో అన్నాడు. ఆమె అలాగే చేసింది.

ఎంకిడు ఆమెను చూశాడు. ఆరు పగళ్లూ, ఏడు రాత్రులూ ఆమెతో భోగించాడు. తృప్తి చెందాక తిరిగి తన జంతు నేస్తాల దగ్గరకు వెళ్లబోయాడు. కానీ, అంతవరకు అతనికి దగ్గరగా మసలిన జంతువులు, ముఖ్యంగా మగజింకలు అతనికి దూరంగా పారిపోయాయి. స్త్రీతో లైంగికసంపర్కం అడవిమనిషిలోని అమాయకత్వాన్ని హరించిందనీ, ప్రకృతిలోని ఇతర జంతువులతో కలసిమెలసి తిరిగే లక్షణం అతనిలో అంతరించిందనీ, ఆవిధంగా ఎంకిడు లైంగికసంపర్కం కారణంగా పతనమయ్యాడనీ దీనికి విలియం ఇర్విన్ థామ్సన్ అన్వయం. దీనిని కుండలినీయోగంతో కూడా ముడిపెట్టి థామ్సన్ మరింత ఆసక్తికరమైన విశ్లేషణ చేస్తాడు.

తన జంతునేస్తాలు దూరమైనందుకు ఎంకిడు విచారంలో మునిగిపోయాడు. దేవదాసి అతణ్ణి ఓదార్చి, తనతో ఉరుక్ కు తీసుకెడతానని చెప్పింది. స్నేహం కోసం తపిస్తున్న ఎంకిడు సరే నన్నాడు. దేవదాసి తన దుస్తుల్లోని లోదుస్తు తను ధరించి, పై దుస్తు అతనికిచ్చింది. ఆవిధంగా ఎంకిడు ప్రకృతి నుంచి సంస్కృతి(culture)వైపు అడుగువేశాడని థామ్సన్ అంటాడు. అయితే, ఎంకిడు నేరుగా పట్టణంలోకి వెళ్లకుండా శివార్లలో ఉన్న ఒక గొర్రెల దొడ్డి(sheepfold) దగ్గర ఆగాడు. అక్కడ కొంతమంది గొర్రెల కాపరులున్నారు. సుమేరు భాషలో sheepfold అనే మాటకు స్త్రీ జననాంగం అనే అర్థం కూడా ఉంది కనుక, ఎంకిడు గొర్రెల దొడ్డి దగ్గర ఆగడం అతడు తిరిగి పుట్టడాన్ని సంకేతిస్తుందని థామ్సన్ అంటాడు. అతను అడవి జంతువులనుంచి నేరుగా నాగరికప్రపంచంలోకి వెళ్లలేడు కనుక, పెంపుడు జంతువుల దగ్గర ఆగాలని ఆయన వివరణ.

అక్కడ ఉన్నప్పుడే నాగరికుడయ్యే క్రమంలో అతను మరో ముందడుగు వేశాడు. అది, మనుషులు తాగే మద్యాన్ని, తినే ఆహారాన్ని మొదటిసారి రుచి చూడడం! వంట చేయడం అనేది ముడి ప్రకృతినుంచి సంస్కృతికి జరిగే పరివర్తనను సంకేతిస్తుందన్న ప్రసిద్ధ పౌరాణిక విషయాల విశ్లేషకుడు లెవిస్ స్ట్రాస్(Levi-Straus) అధ్యయనాన్ని ఈ సందర్భంలో థామ్సన్ ఉటంకిస్తాడు. ఆ తర్వాత ఎంకిడు ఉరుక్ పట్టణానికి వెళ్ళడం, అక్కడ గిల్గమేశ్ ను కలవడం, వారిద్దరిమధ్య యుద్ధం జరగడం, చివరికి ఇద్దరూ ప్రాణమిత్రులు కావడం-ప్రస్తుత మనం మాట్లాడుకుంటున్న విషయానికి అవసరం లేని అనంతర కథ,

ఇంతవరకు చెప్పుకున్న కథలో ఋష్యశృంగుడికీ, ఎంకిడుకీ ఉన్న పోలికలు స్పష్టమే. ఎంకిడులానే ఋష్యశృంగుడు కూడా అడవిమనిషే. నెత్తిమీద మగజింక కొమ్ముల్లాంటి కొమ్ము ఉండడంవల్ల అతనికి ఋష్యశృంగుడనే పేరు రావడం; ఎంకిడు నేస్తాల్లో మగజింకలు ఉండడం గమనార్హం. ఋష్యశృంగుని తీసుకువెళ్లడానికి గణికలు వెడితే, ఎంకిడుని తీసుకు వెళ్లడానికి దేవదాసి వెడుతుంది. ఎంకిడు మొదటిసారి మనుషులు తినే ఆహారాన్ని రుచి చూసినట్టే, ఋష్యశృంగుడు మొదటిసారి గణికలు ఇచ్చిన భక్ష్యాలు తింటాడు. కాకపోతే, ప్రకృతికి దగ్గరగా ఉన్న అడవిమనిషిగా ఎంకిడు పాత్ర పండినట్టుగా ఋష్యశృంగుని పాత్ర పండలేదు. బ్రహ్మచర్యం, జితేంద్రియత్వం వంటి కృత్రిమ ఆపాదనలు ఋష్యశృంగునిపై ఉన్నట్టుగా ఎంకిడుపై లేవు. ప్రకృతినుంచి సంస్కృతిలోకి చెందే పరివర్తనను ఎంకిడులో చూపినట్టుగా ఋష్యశృంగునిలో చూపలేదు. ఎంకిడు పాత్ర కల్పనలో ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది, ఋష్యశృంగుని పాత్రకల్పనలో లేదు. దీనిని బట్టి ఎంకిడు అనే మూలరూపానికి ఋష్యశృంగుడు పేలవమైన ప్రతిబింబమని అనిపిస్తుంది.

దశరథునితో ఋష్యశృంగుడు జరిపించిన పుత్రకామేష్టి గురించి తర్వాత...




Read More
Next Story