
నమూనా న్యూక్లియర్ ప్లాంట్ (సోర్స్:scientificamerican)
‘అనకాపల్లి న్యూక్లియార్ పవర్ ప్లాంట్ ముప్పు తెస్తుంది’
కేంద్రప్రభత్వ మాజీ విద్యుత్ సెక్రెటరీ డా. ఇఎఎస్ శర్మ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాసిన లేఖ
కేంద్ర ప్రభుత్వ సంస్థ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) వారు అనకాపల్లిలో, 2,800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు నిర్మించే ఉద్దేశంతో, ఆ ప్రాంతంలో 2,000 ఎకరాల భూమి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి
ఇంకొక కేంద్ర ప్రభుత్వ సంస్థ, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) వారు, సుమారు పదేళ్ల కింద, శ్రీకాకుళం జిల్లాలో 6,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు కోసం, సుమారు 2,000 ఎకరాల సస్యశ్యామలమైన వ్యవసాయ భూమిని, రాష్ట్రప్రభుత్వం సహాయంతో సేకరించి, రెండువేల కుటుంబాలను, ముఖ్యంగా సాంప్రదాయ మత్స్యకారులను, నిర్వాసితులు చేసి, వారి జీవితాలను బీభత్సం చేయడం, ఆ ప్రాజెక్టు పనులు ఈరోజు వరకు ప్రారంభం కాకపోవడం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాను.
రెండింతలకు పైగా సామర్థ్యం ఉన్న కొవ్వాడ ప్రాజెక్టు తో పోల్చి చూస్తే, అనకాపల్లి న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు కోసం, NTPC వారు, 2,000 ఎకరాల భూమి కావాలని అనడం సబబుగా లేదు. పైగా, అటువంటి ప్రాజెక్ట్ కోసం, రోజుకు 3 బిలియన్ల గాలనుల నీరు కావాలని అనడం కూడా సమంజసం కాదు. పోలవరం ప్రాజెక్టు నుండి లభ్యమయ్యే నీరు వచ్చిన తర్వాత కూడా, విశాఖ అనకాపల్లి ప్రాంతంలో నీటి కొరత ఉండగలదు. ఆ విషయం దృష్టిలో పెట్టుకుని, NTPC వారు తీర ప్రాంతంలో, సముద్రం నీటిని శుద్ధి పరిచే సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి.
న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు (Nuclear Power Project) ఎంత ప్రమాదకరమో, జపాన్ లో ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు (Fukushima nuclear accident) లో, 2011 లో జరిగిన అతి ఘోరమైన ప్రమాదం తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్పష్టంగా అవగాహన వచ్చింది.
ఆ ప్రమాదం కారణంగా, చాలా మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, లక్ష మంది ప్రజలు నిర్వాసితులు అయ్యారు. ప్రమాదానికి గురి అయిన న్యూక్లియర్ రియాక్టర్ల నుంచి రోజూ వస్తున్న వేల టన్నుల అణుధార్మిక జలాలను, ఈ రోజు వరకు జపాన్ ప్రభుత్వ సంస్థలు శుద్ధి చేయలేక పోతున్నారు. అప్పుడే అణుధార్మిక కాలుష్యానికి గురి అయిన 5 లక్షల టన్నుల జలాలు, పసిఫిక్ మహా సముద్రంలో కలిసాయి. ఈ రోజు అంచనాల ప్రకారం, 2011 లో ప్రమాదం జరిగిన రియాక్టర్లను పూర్తిగా శుద్ధి చేయాలంటే, 2050 సంవత్సరం వరకు సాధ్యం కాదు. అందుకు 180 బిలియన్ల డాలర్లు ఖర్చు అవ్వగలదని జపాన్ ప్రభుత్వం అంచనా వేసింది. కాని నిపుణుల అంచనాల ప్రకారం, రియాక్టర్ల శుద్ధి ఇంకొక 30-40 సంవత్సరాలు పడుతుంది. ఖర్చు అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
అంటే, ఒకవేళ అటువంటి ప్రమాదం జరిగితే, అందువలన కావాల్సిన ఖర్చు భరించడం ప్రభుత్వానికి సాధ్యం కాదు.
ఫుకుషిమా వంటి ప్రమాదం, కొవ్వాడ, అనకాపల్లి న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ల లో, ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని గుర్తించాలి.
ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రపంచవ్యాప్తంగా, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ల చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదం ప్రభావం ఉండగలదని గుర్తించారు. అందుకు సంబంధించిన నిబంధనలను, మనదేశంలో న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ లను నియంత్రణ చేసే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (AERB) వారు కూడా స్వీకరించడం జరిగింది.
ఆ నిబంధన ల ను అనుసరించి, ప్రాజెక్టు చుట్టూ,1 కిలోమీటర్ పరిధిలో, అంటే "నిషేధిత ప్రాంతం" (Exclusion Zone) లో, ప్రజలు నివసించకూడదు.
ప్రాజెక్టు చుట్టూ 5 కిలోమీటర్ల పరిధి ("Natural Growth Zone") లో, జనాభా ను నియంత్రించే దిశలో, అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టకూడదు
ప్రాజెక్టు చుట్టూ 16 కిలోమీటర్ల పరిధి ("Emergency Planning Zone") లో, ప్రమాదం జరిగి అత్యవసర పరిస్థితి ఏర్పడే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, అక్కడి ప్రజలను తరలించి పునరావాసం కలిగించడానికి నిరంతరం తయారుగా ఉండాలి.
ప్రాజెక్టు చుట్టూ, 30 కిలోమీటర్ల పరిధి ("Radiological Surveillance Zone") లో, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు వలన కలిగే అణుధార్మిక ప్రభావాన్ని నిరంతరం మోనిటర్ చేయాలి
అమెరికా లో న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ లను నియంత్రణ చేసే USNRC వారు నియంత్రణ పరిధిని 80 కిలో మీటర్లవరకు పెరిగించారు.
న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ లను నియంత్రణ చేసే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (AERB) కు, నియంత్రణ చేయగలిగిన స్వాతంత్రం లేదని, అందుకు కావలసిన అధికారాలు ఇచ్చే చట్టాన్ని తత్ క్షణం పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని, అందుకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీ వారు 2012 లోనే సిఫార్స్ చేసినా, అప్పటి UPA కేంద్ర ప్రభుత్వం కాని, ఇప్పడున్న NDA ప్రభుత్వం కాని, ఈ రోజు వరకు చర్యలు తీసుకోలేదు. అంటే, కొవ్వాడ, అనకాపల్లి న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ లను నిష్పాక్షికంగా నియంత్రణ చేయగలిగిన అధికారం AERB కి లేదు. ఆ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా ఉంది.
బహుశా, NTPC నిర్మిస్తున్న న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ రియాక్టర్లను, అందుకు కావాల్సిన యురేనియం ఇంధనాన్ని, విదేశాల నుంచి, డాలర్ ధరలకు గుమతి చేయవలసి ఉంది. ఆ కారణంగా ఆ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రిసిటీ ధరలు సామాన్య ప్రజల పరిధిలో ఉండవు. పైగా,మన దేశం, ఆ కారణంగా విదేశీ ప్రభుత్వాల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడవలసి వస్తుంది. అమెరికా వంటి దేశాలు, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ రియాక్టర్ల లో ప్రమాదం జరిగితే, వారి వారి కంపెనీల మీద బాధ్యత చాలా తక్కువగా పరిమతించాలని, మన ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారు. అటువంటి ఒప్పందం జరిగితే, ప్రమాదం కారణంగా కలిగే ఆర్థిక భారం కేంద్రమే భరించాల్సి వస్తుంది. అదే కాకుండా, రియాక్టర్ లను తయారు చేసి, అమ్మే విదేశీ కంపెనీలు రియాక్టర్ డిజైన్ లో, నిర్లక్ష్యం చూపించగలరు. ఆ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఇంకా పెరుగుతాయి.
కొవ్వాడ, అనకాపల్లి న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ల లో కలిగే ఉద్యోగ అవకాశాలు తక్కువ గా ఉంటాయి. స్థానిక ప్రజలకు కలిగే ఉద్యోగావకాశాలు ఇంకా తక్కువగా ఉంటాయి. ఆ ప్రాజెక్టులను తయారుచేసే సంస్థలు విదేశాల్లో ఉండటం వలన, ఆయా దేశాల్లో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయి.
అంత ప్రమాదకరమైన న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ నుంచి సామాన్య ప్రజలకు అందుబాటులో లేని ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసే బదులు, ప్రతి గ్రామంలో, ఒక మెగావాట్ కు కావాల్సిన రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను, అలాగే సోలార్ ఇరిగేషన్ పంప్ సెట్లను ప్రజలకు అందచేస్తే, వారి అవసరాలకు కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసుకుంటూ, డిస్కాములకు మిగులు ఎలక్ట్రిసిటీ ని అమ్మి, అదనంగా ఆదాయం ఆర్జించే అవకాశం కలుగుతుంది. అదే కాకుండా, కేంద్రీకృతమైన న్యూక్లియర్ పవర్, సోలార్ ప్లాంట్ ల కారణంగా, ట్రాన్స్మిషన్ వైర్ల లో వ్యర్థం అయ్యే ఎలెక్ట్రిసిటీని పొదుపు చేసుకోవచ్చు.
పైన సూచించిన విషయాలను దృష్టిలో పెట్టుకుని, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టులు, కేంద్రీకృతమైన సోలార్ ప్లాంట్ ల బదులు, సోలార్ రూఫ్ టాప్, సోలార్ ఇరిగేషన్ పంపుసెట్లు ప్రజలకు సులభంగా అందచేసి, వారు ఉత్పత్తి చేసే మిగులు ఎలక్ట్రిసిటీ ని గిట్టుబాటు ధరకు డిస్కామ్ లకు అమ్మే పథకాన్ని చేపడితే, అందువలన లక్షలాది మంది ప్రజలు లాభపడతారు. అటువంటి పథకాన్ని ఆలస్యం చేయకుండా చేపట్టాలని, అనకాపల్లి లో నిర్మిస్తామని ముందుకు వచ్చిన NTPC ప్రతిపాదిక ఆమోదించకూడదని నా విజ్ఞప్తి.
(దీని ప్రతిని తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి కూడా పంపారు)
Next Story