వంద రకాల డిజైన్లతో డబుల్ ఇక్కత్ చీర,తెలంగాణ చేనేత కార్మికుడి ప్రతిభ
వంద రకాల డిజైన్లు...పర్యావరణహిత రంగులతో డబుల్ ఇక్కత్ నూలు చీరను నేసిన తెలంగాణ యువ చేనేత కార్మికుడు కర్నాటి ముఖేష్‌కు జాతీయ చేనేత పురస్కారం లభించింది.
హైదరాబాద్ నగరానికి 59 కిలోమీటర్ల దూరంలోని చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన యువ చేనేత కార్మికుడు కర్నాటి ముఖేష్ నేత కళా నైపుణ్యాన్ని కేంద్ర చేనేత, జౌళి శాఖ గుర్తించింది. కేంద్రం ముఖేష్ ను జాతీయ చేనేత పురస్కారానికి ఎంపిక చేసింది. మగువల మనసులను దోచే వంద డిజైన్ల పర్యావరణహిత డబుల్ ఇక్కత్ చేనేత చీరను నేసి జాతీయ స్థాయి గుర్తింపు పొందిన కర్నాటి ముఖేష్ చేనేత జర్నీ గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రండి.
బీటెక్ చదివినా చేనేత రంగంపైనే ఆసక్తి
‘‘నేను బీటెక్ చదివినా, ఐటీ ఉద్యోగాన్ని కాదని నా తండ్రి, తాతల నుంచి వారసత్వంగా వచ్ఛిన చేనేత వృత్తిని చేపట్టాను.నేను పదో తరగతి నుంచి ఒక వైపు చదువుకుంటూనే మరో వైపు నా తల్లిదండ్రులు కర్నాటి నారాయణ,పారిజాతల వద్ద చేనేత పనిని నేర్చుకున్నాను.నా తండ్రి నారాయణ వినూత్నంగా కొత్త డిజైన్ చీరలు నేసినా, వాటిని ఇతరులకు విక్రయించేవారు. మా కుటుంబానికంటూ చేనేత బ్రాండ్ సృష్టించేలా వినూత్నంగా నేతల నేత చీరలను నేయడంపై దృష్టి సారించాను. రాధాకృష్ణ హ్యాండ్ లూమ్స్ పేరిట మేం నేసిన చీరలను విక్రయిస్తున్నాను. గడచిన 15 ఏళ్లుగా చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాను. చేనేత రంగం సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో క్రియేటివిటీతో వినూత్నంగా చేనేత చీరలు నేస్తే నెగ్గుకు రావచ్చని భావించి నేను చేనేత వృత్తిని స్వీకరించాను.’’
కరోనా సమయంలో 100 డిజైన్ల నాచురల్ డై డబుల్ ఇక్కత్ నూలు చీర
‘‘కరోనా మహమ్మారి సమయంలో నూలు కొరత ఏర్పడింది. దీంతో నేను వంద డిజైన్లతో పర్యావరణ హిత రంగులతో డబుల్ ఇక్కత చీర నేసేందుకు గ్రాఫింగ్ చేశాను. గ్రాఫింగ్, కలరింగ్ కు మూడునెలల సమయం పట్టింది.పూలు, పండ్లు, ఆటబొమ్మలు,చదరంగం ఇలా వంద రకాల డిజైన్లతో డబుల్ ఇక్కత్ చీరను నేశాను. నా తల్లిదండ్రులు నారాయణ, పారిజాత సహకారంతో ఏడాది పాటు నేసిన వినూత్న చీరను జాతీయ చేనేత పోటీలకు ఎంట్రీగా పంపించాను. ’’
పర్యావరణహిత రంగులు
‘‘నాణ్యమైన పత్తితో తయారైన సన్నటి నూలు దారంతో చీరను నేశాను. ఈ నూలుకు పర్యావరణ హిత రంగులు అద్దాను.ప్రకృతిలో లభించే చెట్ల నుంచి పర్యావరణహిత రంగులు తయారు చేసి ఈ చీర తయారీలో వాడాను. ఇండిగో చెట్లతో నీలం రంగు, బంతి పూలు, దానిమ్మ పొట్టు నుంచి, ఉల్లిగడ్డల నుంచి ఎల్లో కలర్,బెల్లం, ఇనుము తుక్కు నుంచి నలుపురంగు, మేడల్ వేర్ల నుంచి ఎర్రరంగులను తయారు చేసి నూలుకు అద్దాను. మగ్గంపై పడుగు, పేక ఒక్కో పోగును అల్లుతూ రెండేళ్ల పాటు శ్రమించి 46 అంగుళాల వెడల్పు, ఏడు మీటర్ల పొడవుతో 600 గ్రాముల బరువున్న నేత చీరను నేశాను. ఈ చీరకు పర్యావరణహిత రంగులను అద్దిన చీరను కుంకుడు కాయ రసంతో శుభ్రం చేశాను.’’
జాతీయ చేనేత పురస్కారం
‘‘నేను నేసిన సరికొత్త పర్యావరణహిత, వంద డిజైన్ల డబుల్ ఇక్కత్ చీరను అవార్డుల పోటీ కోసం ఎంట్రీగా ఢిల్లీకి పంపించాను.దేశవ్యాప్తంగా 500 కు పైగా చేనేత కార్మికుల నుంచి ఎంట్రీలు వచ్చాయి. అందులో తెలంగాణ నుంచి 17 ఎంట్రీలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అయిదు రౌండ్లలో సాగిన ఎంపికలో నేను నేసిన చేనేత చీరకు జాతీయ స్థాయి చేనేత పురస్కారం లభించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. ఏడాది పాటు నేను పడిన కష్టానికి ప్రతిఫలం లభించింది.నేను నేసిన చీరకు 2023జాతీయ అవార్డు లభించడంతో నా తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు.ఆగస్టు 7వతేదీన ఢిల్లీలో జరగనున్న ప్రత్యేక సమావేశంలో జాతీయ చేనేత పురస్కారాన్ని నాకు అందించనున్నారు.’’
25 డిజైన్ల ఇక్కత్ చీరకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం
‘‘గతంలో నేను 25 డిజైన్లతో చేసిన ఇక్కత్ చేనేత చీరను నేయగా, దీనికి రాష్ట్ర చేనేత శాఖ గుర్తించి 2022 కొండా లక్ష్మణ్ చేనేత పురస్కారం లభించింది. రాష్ట్ర అవార్డు స్ఫూర్తితో వంద డిజైన్లతో ప్రకృతిలో లభించే రంగులతో నేసిన చేనేత చీరను నేశాను.’’
ఎగ్జిబిషన్లలో చేనేత చీరల విక్రయం
నూలుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంతోపాటు ముద్రా పథకం కింద తీసుకున్న రుణంతో పలు చేనేత చీరలతో పాటు దుపట్టాలు.బెడ్ షీట్లు నేశాను. ఇలా మా కుటుంబం నేసిన నేత వస్త్రాలను దేశంలోని ఢిల్లీ, ముంబయి, కోల్ కతా,బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాల్లో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్లలో విక్రయశాల ఫెట్టి చేనేత చీరల ప్రత్యేకత గురించి చెప్పి విక్రయిస్తున్నాను. నేను చేనేత చీరలను నేయడం ద్వారా నాకు ఉపాధి లభిస్తుంది. రొటీన్ కు భిన్నంగా కొత్త డిజైన్లతో వినూత్న చీరలను నేస్తే మార్కెట్ లో మంచి ఆదరణ లభిస్తుంది’’అని జాతీయ చేనేత అవార్డు గ్రహీత కర్నాటి ముఖేష్ వివరించారు.
Next Story