కార్పొరేట్ జాబ్ అంటే మొగుడు పెళ్లాలు ఎక్కువ సేపు సంసారం చేయరాదా?
చిచ్చు పెట్టిన L&T బాస్ సుబ్రహ్మణ్యన్ ‘మెుగుడు-పెళ్లాం’ వ్యాఖ్య
భారతదేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ ఎల్ అండ్ టి కి (L &T)చైర్మన్ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ ఉద్యోగుల పని గంటల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఆయన ఉద్యోగులను ఉద్దేశిస్తూ ‘ మీరు వారానికి 90 గంటలు పని చేయాలి. మీతో ఆదివారాలు పని చేయించలేకపోవడం నాకు బాధగా ఉంది. నేను ఆదివారాలు కూడా పని చేస్తున్నాను. ఇళ్ళల్లో ఉండి ఏం మీరు చేస్తారు? మీ భార్య ముఖం మీరు, మీ ముఖం మీ భార్య చూస్తే ఏమొస్తుంది?’ అన్నారు.
యాంత్రిక జీవితం-ఒక కండిషనింగ్ :
ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలో ఉద్యోగుల వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా హరించే దోపిడీ సూత్రం అంతర్లీనంగా కనిపిస్తుంది. ఎక్కువ గంటలు పని చేయడానికి,విజయానికి మధ్య ఒక లంకెను బలంగా నిర్మించి, దాన్ని సమాజం ఆమోదించేలా చేయడానికి తమ వ్యక్తిగత ఉదాహరణలు ఇవ్వడం ఒక కార్పోరేట్ సక్సెస్ సూత్రంగా మారింది.
ఇంతకుముందు ఇన్ఫోసిస్ (Infosys)నారాయణమూర్తి, ‘నేను వారానికి 75-90 గంటలు పని చేస్తున్నాను’,అంటే; ఓలా (Ola)సియివో భావిష్ అగర్వాల్ కూడా, ‘నేను రోజుకి ఇరవై గంటలు పని చేస్తుంటే, ఉద్యోగులు చేయడానికి ఏమైంది?’అన్నారు. ఈ వ్యక్తిగత ఉదాహరణలను ఈ యాజమాన్య స్థాయిలో ఉన్న అధికారులు బయట పెట్టడం అన్నది కేవలం ఉద్యోగులను బలవంతంగా ఒప్పించి ఎక్కువ గంటలు పని చేయడానికి చేసే ఒక జిమ్మిక్కు అనే అనుకోవచ్చు.
దీన్ని ఇంకో కోణంలో ఆలోచిస్తే ఉద్యోగుల జీవితంలో వారు పని చేసే కంపెనీ తప్ప ఇంకే ఇతర అంశం లేకుండా, దాని కోసమే వారి శ్రమను ధారపోసే ఒక మైండ్ ట్యూనింగ్ గా కూడా దీన్ని చూడొచ్చు.
మెరుగైన పని ఓవర్ టైం తో సాధ్యమేనా?
ఎక్కువ పని గంటల వల్ల నాణ్యమైన పని తీరు ఉద్యోగుల్లో లోపిస్తుందని ఇప్పటికే అనేక పరిశోధనలు తేల్చాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వంపై కార్పోరేట్ దిగ్గజాలు ఉద్యోగుల పని గంటలు పెంచమని ఒత్తిడి తీసుకువచ్చినా, ఐటి ఉద్యోగులు బలంగా నిరసన ప్రకటించడడంతో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది.
ఈ కార్పోరేట్ పని ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఉద్యోగుల వ్యథలు కూడా ఈ మధ్యకాలంలో బయటకు వస్తున్నాయి. గత సంవత్సరంలో సెప్టెంబర్ లో 15 ఏళ్ల నుండి ఐటి రంగంలో పని చేస్తున్న చెన్నైకి చెందిన కార్తికేయన్ పని ఒత్తిడికి తట్టుకోలేక డిప్రెషన్ బారిన పడి ఆత్మహత్య చేసుకున్నారు.26 ఏళ్ల అన్నా సెబాస్టిన్ కూడా ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి ఘటనలు ఎన్నో భారతదేశమంతటా చోటు చేసుకోవడానికి కారణాలు, పరిష్కారాల వైపు ఆలోచించే దిశలో ఈ కార్పోరేట్ దిగ్గజాలు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు.
తమ కంపెనీలలోని ఉద్యోగుల ప్రాణాలకు విలువ కట్టలేని ఈ సంస్థలు వారి పనితో తమ లాభాలు గణించుకొవడానికి కొత్త కొత్త ప్రతిపాదనలు తీసుకురావడం మాత్రం చర్చించాల్సిన విషయమే.
ఇదే సందర్భంలో ప్రపంచంలో హ్యపినెస్ ఇండెక్స్ అంటే ప్రజలు సంతోషంగా ఉన్న దేశాల్లో మొదటి పది దేశాలైన ఫిన్ ల్యాండ్, డెన్మార్క్,ఐలాండ్, స్వీడన్ ,ఇజ్రాయిల్, నెదర్లాండ్స్ ,నార్వే, లగ్జెంబర్గ్ ,స్విట్జర్లాండ్ ,ఆస్ట్రేలియా దేశాల్లో ఎక్కడా ఇన్ని గంటలు పని చేసే సంస్కృతి లేదు. అక్కడ యాజమాన్యాలకు పని గంటలు పెంచడం వల్ల అభివృద్ధి,సంతోషం కలుగుతాయన్న నమ్మిక కూడా లేదు. అలాగే పారిశ్రామికంగా అభివృద్ధి చెందినా దేశాలైన చైనా,జపాన్ లలో కూడా 40 గంటలకు మించి వారాంతర పని గంటలు లేవు.అలాగే అగ్రరాజ్యంగా చెప్పబడే అమెరికాలో కూడా వారానికి సగటున 38 గంటలే సగటున ఉద్యోగులు పని చేస్తారు. మెరుగైన తలసరి ఆదాయం ఉన్న దేశాల్లో కూడా పని గంటలు గరిష్టంగా లేవు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే పనిగంటల పెంపుకి, సంతోషానికి,అభివృద్ధికి ప్రత్యక్ష సంబంధం అనేదే లేదని.
ఉద్యోగుల వ్యక్తిగత జీవితానికి విలువ లేదా?
మనిషికి ఉద్యోగం చేయాలన్న ప్రేరణ ప్రాథమికంగా కుటుంబం వల్లనే కలుగుతుంది. తన కుటుంబ సభ్యులను బాగా చూసుకోవాలన్న బాధ్యత వల్లే ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఉద్యోగంలో నిలదొక్కుకోవడానికే ఉద్యోగులు ప్రయత్నం చేస్తారు. మరి ఈ సందర్భంలో తన కుటుంబానికి వ్యక్తిగా తానూ పక్కనే ఉన్నానన్న భరోసా కలిగించలేనంత దూరం ఉద్యోగం వల్ల ఏర్పడితే, ఆ ఉద్యోగ భవిష్యత్తు వల్ల ప్రయోజనాలను ఆ ఉద్యోగి ఎలా అనుభవించగలుగుతాడు?
జీవితంలో కుటుంబం ఒక భాగమైతే, ఉద్యోగం ఇంకో భాగం. దేని ప్రాముఖ్యత నిర్లక్ష్యపరిచే సౌలభ్యం వ్యక్తికీ ఉండదు. ఈ క్రమంలో పనిగంటల పెంపు ఉద్యోగి వ్యక్తిగత జీవితానికి పెను భారంగానే మారుతుంది.
కార్పోరేట్ జాబ్ అంటే మొగుడు పెళ్ళాలు ఎక్కువసేపు సంసారం చేయరాదా?
భార్యాభర్తలుగా మారడం అంటే కేవలం ఒకరు డబ్బు సంపాదిస్తే ఇంకొకరు ఇంటి బాధ్యత నిర్వహించడమో లేక; ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉండటం మాత్రమేనా? కాదుగా! ఆ రిలేషన్ కోసం కొంత సమయాన్ని రోజు కేటాయించాలి. ఆ బంధం నుండి బలపడే కుటుంబానికి తల్లిదండ్రులుగా కూడా ఉండాలి. దీని కోసం కేటాయించే నాణ్యమైన సమయానికి లెక్కలు కార్పోరేట్ వ్యాపారానికి అందకపోయినంతమాత్రాన దాని విలువ తగ్గిపోదు.
మన భారతీయ సమాజంలో వివాహం అంటే ఏదో పరిచయస్తులలాగా ‘హాయ్ ,బై’ లు చెప్పుకోవడానికి ఒకరి ముఖం ఒకరు చూసుకునే బంధం కాదు. దానిని కార్పోరేట్ కోణంలో చూస్తే దానికి డబ్బు లెక్కలు కనిపించవు. సంసారమంటే కేవలం భార్యాభర్తల మధ్య లైంగిక జీవితమనే వెకిలి వ్యాఖ్యలకు మించిన జీవితం ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోలేని వ్యాపారవేత్తలకు ఈ కుటుంబతత్త్వం అర్థం కాకపోవచ్చు. ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ వాఖ్యలు కుటుంబ వ్యవస్థలో ఉండే ఎమోషనల్ కాన్వాస్ ని కుచించుకుపోయేలా చేసే కార్పోరేట్ వ్యాపార సూత్రానికి నాంది పలుకుతున్నాయి. మొగుడు పెళ్ళాలు ఎక్కువసేపు సంసారం చేయకూడదన్న పరోక్ష ఉద్యోగ షరతును ప్రతిపాదిస్తున్న ఈ కార్పోరేట్ కొత్త పోకడలు ఇంకెటు దారి తీస్తాయో!
ప్రముఖుల అభిప్రాయాలు:
ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmaniyan)వ్యాఖ్యల మీద ప్రముఖులు కింది విధంగా స్పందించారు:
‘అసలు సమస్య 70 గంటలు, 90 గంటలు పని వేళలు కాదు. ఎంత సమయం పని చేశామన్నది ముఖ్యం కాదు. ఎంత క్వాలిటీగా పని చేశామన్నది ముఖ్యం. నేను పనిలో నాణ్యతనే చూస్తాను, పని వేళలను కాదు.’
-ఆనంద్ మహీంద్ర, పారిశ్రామికవేత్త
‘సాధారణ ఉద్యోగుల కుటుంబాలకి కార్పోరేట్ల కుటుంబాలకి మధ్య బాధ్యతల విషయంలో అనేక రెట్లు తేడాలు ఉంటాయి. అది గ్రహింపుకి లేనపుడు మాత్రమే డెభ్బై, తొంభై పనిగంటల ప్రతిపాదనలు- పెద్ద వ్యాపారులకి చిన్న విషయంలా తోస్తుంది. ఎనిమిది గంటలు ఉద్యోగం చేసి ఇంటికొచ్చాక భార్యాభర్తలు ఒకరి మొహం మరొకరు చూసుకుంటూ కూర్చోగలిగే సంపన్నత వారికి ఉండదు. పిల్లల్ని కని పెంచడం, పెద్దల బాధ్యత, ఇంటి పనులు ఎన్నో ఉంటాయి.’
-కె.ఎన్.మల్లీశ్వరి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి
‘కార్పోరేట్ రంగంలో ఉండే మహిళా ఉద్యోగులకు పని ఒత్తిడి వల్ల సరైన నిద్ర, తిండి లేకపోవడం అన్నది వారి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే అది మానవజాతి పునరుత్పత్తే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదంగా పరిణమిస్తుంది.’
-డాక్టర్ సంధ్య ,సివిల్ సర్జన్ ,ఎనస్టిషియా డిపార్ట్మెంట్,ఈఎస్ ఐ హాస్పటల్ ,నాచారం
‘దేశప్రగతి లేదా సంస్థ ప్రగతి పేరుతో పని గంటలు పెంచడం అర్తరహితమైనది. పరిశోధనల ప్రకారం ఓ స్థాయి దాటి ఎక్కువగంటలు పని చేస్తే ఉద్యోగుల పని నాణ్యత గణనీయంగా తగ్గిపోతుంది.’
-దేవ్నా మెహ్రా, మార్కెట్ ఎనలిస్ట్
‘ ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ‘
-దీపికా పదుకుణే, సినీ నటి
కుటుంబ విచ్చిన్నానికి, వైవాహిక /ప్రేమ జీవితాలకు,సాంఘిక ఆసరాలకు ఉద్యోగులను దూరం చేస్తూ; సంస్థల స్వలాభాల కోసం సమాజంలో ఇటువంటి ప్రతిపాదనలు తీసుకువచ్చే కార్పోరేట్ యాజమాన్య వ్యాపార దాహాన్ని గట్టిగా నిరసిస్తూ, వారి ప్రతిపాదనలను కర్నాటకలో ఐటి ఉద్యోగులు తిప్పి కొట్టినంత బలంగా సమాధానం ఎప్పటికప్పుడు ఇస్తేనే ఉద్యోగులకు కూసంతైనా బతకాలన్న కోరిక మిగులుతుంది.
* * *