
కలుపు మొక్కలతో కమ్మని పోషకాహారం..!
అడవి తల్లి ఇచ్చే ఆకుకూరల ముందు మాంసం కూడా దిగదుడుపే.
చినుకులు పడుతున్నాయి. జహీరాబాద్ సమీపంలోని పస్తాపూర్
పొలాల సమీపంలో మహిళా రైతులంతా కొన్నిరకాల ఆకుకూరల కుప్పలుగా పోసి వాటి చుట్టూ కూర్చున్నారు.
‘ ఇది తడక దొబ్బుడు ఆకులు. పచ్చడి చేసుకొని తింటాం. అదేమో జొన్నచెంచలి... పప్పులో కలిపి వండుకుంటాం. ఇది తెల్ల గర్జల కూర . కుసుమ నూనెలో వేపుడు చేసుకొని తింటాం. ఇవన్నీ వానాకాలంలో పొలం గట్లమీద కలుపులాగా పెరుగుతాయి. అన్ని ప్రాంతాల్లో ఉంటాయి, కొందరు పట్టించుకోరు మేం వాటిని ఆకుకూరల్లాగా తింటాం, పాలకూర తోటకూరకు తీసిపోవు... కమ్మగా ఉంటాయి. సాగు చేయని ఆకుకూరలు... ’
అని, వివరించారు. పస్తాపూర్ కి చెందిన రైతు రత్నమ్మ.

సాగు చేయని ఆకుకూరలను పరిచయం చేస్తున్న రత్నమ్మ
అడవి అంటే అమ్మ ,అడవి అంటే ప్రాణవాయువు. అడవి అంటే జీవ వైవిధ్యం! సకల జీవులకు నీడ, ఆహారం ఇస్తుంది! లోకమంతా కరవు కాటేసినా అడివి చేరదీస్తుంది. తిండి పెట్టి ఆదుకుంటుంది. సాగు చేయకుండానే వందల రకాల పంటలను ఇస్తుంది. ప్రజలకు ఆహార భద్రత ఇస్తుంది. రసాయన ఎరువుల వాడకం, ప్రస్తుతం అటవీ విస్తీర్ణం తగ్గిపోతుండటంతో అరుదైన పాత పంటలు కనుమరుగవుతున్నాయి. కనీసం ఇపుడు మిగిలిన వాటిని కాపాడుకునే ప్రయత్నం మొదలు పెట్టారు కొందరు రైతులు, ఆదివాసీలు. వారికి మద్దతుగా కొన్ని స్వచ్ఛంద సంస్ధలు ఆ పంటలను గుర్తించి అడవి నుండి మైదాన ప్రాంతాలకు సాగును విస్తరింప చేస్తున్నారు.

60 రకాల కలుపు మొక్కల్లోని పోషకాలను వివరిస్తున్న పస్తాపూర్ మహిళా రైతులు
మాంసంలో కంటే ఎక్కువ ప్రోటీన్స్ !
‘ ఇవి మార్కెట్‌లో దొరకని ఆకుకూరలు. బలమైన ఆకుకూరలు. పెంట ఎరువులేస్తే బాగా వస్తాయి. సర్కారీ ఎరువులేస్తే రావు. రోజుకో రకం తింటాం. ఇసువంటి కూరలే మాకు రోజూ దొరికే మాంసం.’ అంటారు సంగారెడ్డి జిల్లా , పస్తాపూర్ మహిళలు .

అడవి సోయ, దూసరి,గోరుమాడి, తగరించ, తడక దొబ్బుడు, ఎల్క చెవుల కూర, నల్లకాశ,తెల్లకాశ, తదితర 30 రకాల ఆకుకూరులు సంగారెడ్డి జిల్లా మారు మూల ప్రాంతంలో సాగుచేయకుండానే పండుతున్నాయి. చాలా మంది రైతులు పంటలు సాగు చేస్తున్నపుడు కలుపు మొక్కలని కొన్నింటిని తొలగించి వేస్తుంటారు. ప్రధాన పంటల దిగుబడుల మీద వీటిప్రభావం ఉంటుందని అవి పెరగ కుండా చూస్తారు. దాని కోసం విచ్చల విడిగా రసాయన మందులు వాడుతుంటారు. దీని వల్ల మనుషులకు మేలుచేసే కొన్ని రకాల మొక్కలు అంతరించిపోతున్నాయి.
రసాయన ఎరువులు చల్ల కుండా పంటలతో పాటు గట్ల మీద సహజంగా పెరిగే ఆకు కూరలను ఆహారంగా తీసుకుంటారు. తొలకరి జీజన్‌లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. వీటి వల్ల మనం సాధారణంగా తినే పాలకూర,తోటకూర,గోంగూర ల్లాంటి వాటికంటే ఎక్కువ పోషకాలు శరీరానికి అందుతున్నాయంటున్నారు.
కరువును జయించే పంటలు..
‘‘ మెదక్ మెట్ట భూముల్లో వాటంతట అవే మొలిచి పెరిగే ఆకుకూర పంటలు 40 రకాల కు పైగా ఉంటాయని మేం అధ్యయనం చేసినప్పుడు తెలిసింది. డబ్బు రూపకంగా విలువ కట్టలేని పంటలివి. కరువును జయించడంలో ఈ ‘అన్‌కల్టివేటెడ్ క్రాప్స్’ కీలకపాత్ర పోషిస్తాయి.’’ అంటారు డిడిఎస్ ప్రతినిది గిరిధర్.

కొత్త రకం ఆకుకూరలతో చేసి వంటకాలతో డిడిఎస్ నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్
‘‘ ఇలాంటి ఆకు కూరలను గుర్తించి పోషకవిలువలను, వాటితో వంటల తయారీలో వీరికున్న నైపుణ్యాన్ని అవగాహనను ఇతరులతో పంచుకోవడానికి ఏడాదికోసారి సాగుచేయని పంటల పండుగను డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ సంస్ధ నిర్వహిస్తోంది. పొలాల దగ్గర పెరుగుతాయి. దాదాపు నలభై రకాలను ఇటీవల సేకరించాం.
ఈ ఆకుకూరలు తినడం వల్ల దృష్టిదోషాలు కూడా తక్కువ. కళ్ల జోళ్లు పెట్టుకున్న వారు చాలా అరుదుగా ఉంటారు. మనం పనిగట్టుకొని పండిరచుకొని తింటున్న పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో కన్నా ఈ సాగు చేయని ఆకుకూరల్లో అనేక పోషకాలు ఎన్నో రెట్లు ఎక్కువ పాళ్లలో ఉన్నాయి. ’’ అంటారు జహీరాబాద్ కృషి విజ్ణాన కేంద్రం, పోషకాహార నిపుణురాలు హేమలత.

మాంసాహారం కంటే ఎక్కువ పోషకాలున్న సాగు చేయని ఆకుకూరల వంటలు
ఆకు కూరల రెస్టారెంట్
అరుదైన పంటలతో ప్రత్యేకంగా జహీరాబాద్ బస్‌స్టాండ్ సమీపంలో ‘గ్రీన్ కెఫే’ రెస్టారెంట్‌ని కొందరు మహిళా రైతులే నిర్వహిస్తున్నారు. అడవుల్లో, పొలాల గట్ల మీద పెరిగే దాదాపు 30 నుండి 50 రకాల ఆకుకూరలను సేకరించి, వాటితో రోటి పచ్చళ్లు, రొట్టెలు చేస్తున్నారు. అలా దొరికిన ఆకు కూరల తో జొన్న రొట్టెలు, పుల్కాలు ఇక్కడ ప్రత్యేంగా దొరుకుతాయి.

చెన్నంగి కూర,
‘‘ ఉత్తరేణి, చిత్రమూలం, ఎల్క చెవుల కూర తో వడ్డించే సజ్జ, జొన్న రొట్టెలకు డిమాండ్ ఉంది. కరోనా అనంతరం ఆరోగ్యవంతమైప ఆహారపు ఆలవాట్ల పై అవగాహన పెరిగింది. వారానికి కొన్ని సార్లయినా ఇలాంటి వంటలు తినడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.’’ అంటారు హోటల్ నిర్వహిస్తున్నా అనురాధ. ఆకు కూరల వంటలతో పాటు, కొర్రల బిర్యాని, రాగి దోసెలు, జొన్న ఇడ్లీలు, సజ్జ వడలు ఇక్కడి స్పెషల్ మెను.

డగ్గలి కూర
ఒకపుడు నిర్లక్ష్యం చేసిన పంటలే
‘‘ వందలాది రకాల ఆకుకూరలు, వరి వంగడాలు పూర్వం నుండి ఉన్నవే. వాటిలో ఎక్కువ దిగుబడి వచ్యేవి, రుచికరమైన , త్వరగా ఉడికి, తేలిగ్గా జీర్ణమయ్యే రకాలనే ఎంపిక చేసుకొని పండించడం మొదలు పెట్టాక క్రమంగా ఆ పంటలు తగ్గిపోతూ వస్తున్నాయి. చిరుధాన్యాల గింజలు చిన్నగా ఉండి ప్రాసెస్ చేయడం కష్టంగా కావడం వల్ల వాటి వాడకం తగ్గింది. మేం తెలంగాణా లో మిల్లెట్స్ మీద స్టడీ చేసినపుడు కొందరు సంపన్నులు తమ సామాజిక హోదాను చూపించుకోవడానికి శుభకార్యాలకు సన్నబియ్యం బిర్యాని వడ్డించడం చూసి, అప్పటి వరకు పజ్జలు , ఎర్రబియ్యం వంటి ఆరోగ్యవంతమైన ఆహారం తినే సామాన్యులు కూడా సన్న బియ్కం తినడం అలవాటు చేసుకున్నారు. అలా పాత పంటలు కనుమరుగవడం మొదలయింది.

పిట్టకూర
ఇటీవల ఆరోగ్య చైతన్యం పెరగడం వల్ల పాత పంటలు తిరిగి జీవం పోసుకున్నాయి. మెదక్‌లో అరవై రకాల ఆకు కూరలు సాగు చేయయకుండానే పెరుగుతుండ డాన్ని అక్కడి రైతులు గుర్తించారు. మనం నిత్యం వాడే తోటకూర,పాల కూరల్లో లాగే సాగుచేయని ఆకు కూరల్లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటి విత్తనాలను సేకరించి, సాగుబడిలో అవగాహన కలిగిస్తే ఆహార కొరతను తగ్గించ వచ్చు.’’ అంటారు న్యూట్రీషియన్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యురాలు జానకీ శ్రీనాధ్.

ఆకుకూరల్లో పోషకాలను వివరించిన పోషకాహార నిపుణురాలు జానకి శ్రీనాధ్
పొలాల్లోనే కాదు ఖాళీ ప్రదేశాల్లో, బంజర్లలో, పెరటి తోటల్లోనూ ‘సాగు చేయని ఆకుకూర మొక్కలు’ ఉంటాయి. వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా.. పీకి పారెయ్యడమో.. కలుపుమందులు చల్లి నాశనం చేయడమో అవివేకమైన పని.

తుమ్మికూర
కళ్ల ముందున్న సమృద్ధి పోషకాహారాన్ని తినకుండా.. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నాం. ఇకనైనా ఈ నిర్లక్ష్యాన్ని వదిలేద్దాం. ప్రకృతి ప్రసాదించిన ఈ ఆకుకూరలను కాపాడుకుందాం.
ఆకుకూరల సమాచారం కొరకు...
అరుదైన 160 రకాల సాగు చేయని ఆకుకూరలన్నీ సంగారెడ్డి జిల్లా ,జహీరాబాద్‌లో డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ సేకరించింది. మరిన్ని వివరాలకు ఈ నెంబర్లలో సంప్రదించండి ( ల్యాండ్ లైన్...040-27764577 ,వాట్సాప్ నెంబర్ 91 8978560409 )