Vijayawada streets
x
Vijayawada Gandhi Nagr

రాంబాబూ, బెజవాడ "గాంధీనగర్ రెండో వీధి" కథ తెలుసా!

'శంకరాభరణం' వంద రోజులు ఎట్లా ఆడిందంటే..


"మీ బెజవాడోళ్ల రూటే వేరండి, మందులోకి మంచింగ్ అంటే బజ్జీలు, పునుగులు పట్టుకొస్తారు, సినీమాలకైతే గాంధీనగర్ వెళ్లమంటారు.. అయినా గాంధీకి సినిమాలకు ఏంటండీ సంబంధం?" అని మీరు అనేక సార్లు వినే ఉంటారు కదూ.. ఇప్పుడా కథేంటో చెబుతా వినండి.
40 ఏళ్ల కిందట ముచ్చటండి. అప్పుడింకా పోరంకి జనాన్ని ఎక్కడికెళ్తున్నావురా బెజవాడకి అనే రోజులు. అయితే బెజవాడలో వీధికో కథ ఉంది. అలాంటిదే గాంధీనగర్. మహాత్మాగాంధీ వచ్చినందుకు గుర్తుగా ఓ వీధికి ఆయన పేరు పెట్టారు. కానీ చిత్రంగా అది సినీ బజార్ అయింది.
అక్కడ ఎటుచూసినా పెద్ద పెద్ద కటౌట్లు, పోస్టర్లతో ఆ వీధి వీదంతా నిండిఉండేది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఎదురు సందు పాత ఎక్సిమో హోటల్ దాటిన తరువాత, పరిసర ప్రాంతాలలో ప్రముఖ సినిమా డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పదుల సంఖ్యలో ఉండేవి. అక్కడ వారి సంస్థల నుంచి రిలీజైన, రిలీజు కాబోయే సినిమా పోస్టర్లు, బ్యానర్లు ఆకర్షణీయంగా డిస్టిబ్యూషన్ ఆఫీసుల ముందు పెట్టేవారు. సినిమా షూటింగ్ లు మద్రాసు తదితర ప్రాంతాల్లో జరిగినా.. ఆంధ్రాకి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మాత్రం విజయవాడలోనే ఉండేవి.
నటీ నటీమణులు, నిర్మాతలు, దర్శకులు, సినిమా నిర్మాణ సిబ్బంది ఆ రోజుల్లో మద్రాసులోనే ఉండేవారు. సినిమా కంట్రోలింగు అంతా డిస్ట్రిబ్యూషన్ సంస్థల ఆధీనంలోనే ఉండేది. సినీ నిర్మాతలకు, వారి సంస్థల క్రేజ్ ని బట్టి పెట్టుబడులు పెట్టి.. డిస్ట్రిబ్యూషన్ హక్కులు కోనేసుకునేవారు. సినిమా అమ్మేసి నిర్మాత సేఫ్ అయిపోయేవాడు. లాభం వచ్చినా.. నష్టం వచ్చినా డిస్ట్రిబ్యూటర్ భరించేవాడు. సినిమాలకు డిస్ట్రిబ్యూషన్స్ సంస్థలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కాంతారావు తదితరుల సినిమాల పెద్ద పెద్ద కటౌట్లు వారి సంస్థల ముందు అందంగా, అలంకారంగా పెట్టేవారు.
లక్ష్మీ ఫిలింస్, పూర్ణా పిక్చర్స్, నవయుగ ఫిలింస్, శ్రీ ఫిలింస్, లక్ష్మి చిత్ర, మయూరి డిస్ట్రిబ్యూటర్స్, సురేష్ డిస్ట్రిబ్యూటర్స్ ఆరోజుల్లో ప్రముఖమైనవి.
లక్ష్మీఫిలింస్ ను మాజీఎంపీ, ఆంధ్రజ్యోతి పత్రిక ఫౌండర్ కేఎల్ ఎన్ ప్రసాద్ స్థాపించారు. లక్ష్మీ ఫిలింస్ నుంచి ఎన్టీఆర్ నటించిన వేటగాడు, అడవిరాముడు, గజదొంగ, సోమయాజులు, చంద్రమోహన్ నటించిన "శంకరాభరణం", ప్రదీప్, పూర్ణిమ నటించిన ముద్దమందారం, మురళీమోహన్, సరిత నటించిన "రామదండు" తదితర అనేక బాక్స్ ఆఫీస్ హిట్ చిత్రాలు కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా విడుదలయ్యాయి. లక్షీ ఫిలింస్ సినిమాలు ఎక్కువగా అప్సరా ధియేటర్ లో రిలీజ్ అయ్యేవి. వేటగాడు, అడవిరాముడు 175 రోజులు ఈ ధియేటర్ లోనే ఆడాయి.
కళాతపస్వి విశ్వనాధ్ దర్శకత్వంలో "శంకరాభరణం" 100 రోజులు ఆడింది. ఇక్కడ శంకరాభరణం గూర్చి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. మొదటి వారం కలెక్షన్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేవు. దాంతో ఈప్రాంతం సినిమా హక్కులు కొన్నవారు నిరాశకు గురై.. సినిమాని ప్రమోట్ చెయ్యడానికి ఒక చక్కని పథకాన్ని లక్ష్మీఫిలింస్స్ ని నిర్వహించే లింగమూర్తి, కొన్ని ప్రాంతాలకు హక్కుదారుడైన సుబ్బారావులు తెలివైన ఆలోచన చేసి,
అప్సర ధియేటర్ ముందు టెంట్ వేయించారు. స్థానిక మహిళా సంగీత కళాశాల ప్రిన్సిపాల్ ను అభ్యర్ధించి కొంతమంది వీణ వాయించే విద్యార్థినులను రప్పించారు. ప్రతిరోజూ సాయంత్రం వారితో వారం రోజుల పాటు వీణానాద కచేరీ చేయించేవారు. రాను రాను చిన్న క్యాస్టింగ్ సినిమా అయినా.. సంగీత పరంగా బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది అనే టాక్ రావడం..సినిమాలో పాటలన్నీ అత్యద్భుతంగా ఉండి సినీ వీక్షకులను ఎంతగానో ఆకర్షింపజేసి, పెద్ద పెద్ద సినిమాలకు దీటుగా నిలబడి.. కలెక్షన్ల వరవడిని సృష్టించింది. తరువాత ఆ సినిమాకు టిక్కెట్లు చాలా రోజులవరకు దొరకడం కష్టసాధ్యం అయ్యింది. ఆ చిత్రంలో నటించిన సినీ నటుడు చంద్రమోహన్ని తమిళనాడు హక్కులను రూ.75,000 లకు కొనుక్కోమని చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కోరినప్పటికి ఒప్పుకోకపోవడం వలన.. తమిళ నటి మనోరమ కొనుక్కుని.. రూ.4,5 కోట్లు ఆర్జించిందని అప్పట్లో చెప్పుకోవడం వినిపించింది.
అలాగే పూర్ణా పిక్చర్స్ యజమాని తమిళనాడుకు చెందిన కామరాజు నాడార్. రంభ, ఊర్వశీ. మేనక ధియేటర్లు కూడా వారివే. ఈసంస్థ నుంచి ఎక్కువగా కౌబాయ్, డిటెక్టివ్ సినిమాలు రిలీజు అయ్యాయి. వాటిలో హీరో కృష్ణ ఎక్కువగా నటించడం జరిగింది. నవయుగ ఫిలింస్ నుంచి అనేకమైన అక్కినేని నాగేశ్వరరావు హిట్ చిత్రాలు, అన్నపూర్ణ సంస్థ వారు తీసిన దాదాపు అన్ని చిత్రాలు.. ఈ సంస్థ ద్వారానే విడుదల అవ్వడం జరిగింది. ఇవి ఎక్కువగా అలంకార్ ధియేటర్ లోనే ఆడేవి. "లక్ష్మీచిత్ర" జింఖానా గ్రౌండ్ సమీపంలో ఉండేది. దీనిలో శోభన్ బాబు పార్టనర్. ఈ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నుండి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన "మండేగుండేలు" మంచి ఆర్ధిక లాభాలను తెచ్చిపెట్టింది.

రామోజీరావు స్థాపించిన "మయూరి డిస్ట్రిబ్యూటర్స్" 'మయూరి' సినిమాతో ప్రారంభమైంది. నిర్మాత రామానాయుడి 'సురేష్ ప్రొడక్షన్స్' ద్వారా కూడా అనేక సినిమాలు రిలీజైనాయి.
సి.అశ్వనీదత్ కు చెందిన 'వైజయంతీ మూవీస్"ను సీనియర్ ఎన్టీఆర్ ప్రారంభించారు."యుగపురుషుడు,"జగదేకవీరుడు..అతిలోక సుందరి" ఈసంస్థ నుంచే రిలీజయ్యాయి. ఎన్టీఆర్ సినిమాల్లో 'బెల్ బాటమ్' పాంట్, పెద్ద కాలర్ చొక్కాలు.. విజయవాడ బీసెంట్ రోడ్డు సమీపంలోని "యాక్స్ ట్రైలర్స్" తో తయారు చేయించారు.అవే తరువాత యువతకు ఫ్యాషన్ గా మారాయి. ప్రముఖంగా గీతా ఆర్ట్స్, బాచి ఆర్ట్స్ తదితరాలు సినిమాలకు సంబంధించి పత్రిక, పేపర్స్ కు అతి సుందరంగా ప్రకటనల డిజైన్స్ తయారు చేసేవారు. ఈ సినిమాలకు సంబంధించి విజయవాడ లోని నేషనల్ లితో ప్రింటర్స్, పద్మనాభ లితో ప్రింటర్స్ వాళ్ళు పోస్టర్లు ప్రింట్ చేసేవారు. అలాగే అనేకమంది అర్టిస్టులు కటౌట్స్, బ్యానర్ ల రూపకల్పనలో సహకరించేవారు. వారు తమ కళానైపుణ్యం చూపించి.. ఉపాధి పొందేవారు. నటీ నటుల చిత్రాలను అచ్చు గుద్దినట్లు చిత్రీకరించేవారు.
అసలు డిస్ట్రిబ్యూషన్ అంటే ముందు తెలుసుకోవాలి. సినిమా నిర్మాణంలో డిస్ట్రిబ్యూషన్ సంస్థ నిర్మాతకు ఉన్న పూర్వపు సత్సంబంధాలవల్ల కలిసి పెట్టుబడి పెట్టేది. సినిమా పూర్తి అయిన తరువాత ఏరియా వారీగా నిర్మాత అమ్మేవారు. అలా తెలంగాణ ప్రాంతాన్ని నైజాం, రాయలసీమ ను సీడెడ్ ,కోస్తా ను ఆంధ్ర అని పిలిచేవారు.ఆ అమ్మకాలు డిస్ట్రిబ్యూషన్ సంస్థ నుంచే జరిగేవి. దాంతో లాభ నష్టాలు నిర్మాతకు సంబంధం ఉండేది కాదు. డిస్ట్రిబ్యూషన్ సంస్థ ధియేటర్ వాళ్లతో ఒప్పందం చేసుకునేవారు.సినిమా సక్సెస్ అయి 50, 75, 100 రోజులు దాటి ఆడితే అమ్మినప్పుడు పెట్టుకున్న నిబంధనలు మేరకు నిర్మాతకు రాయల్టీ చెల్లించేవారు. సినిమా పూర్తి అయిన తరువాత ప్రాంతాల వారీగా అమ్మిన ప్పటినుంచి రీలీజు చెయ్యడం, డబ్బులు కలెక్ట్ చేసుకోవడం వంటి పనులు ఈ సంస్థల నుంచే జరిగేవి.100 రోజులు పండుగ కూడా వీరి ఆధ్వర్యంలో చేసేవారు. సినిమాకు నటులు, నిర్మాత, దర్శకులు గుండెకాయ అయితే నడిపించే మెదడు డిస్ట్రిబ్యూషన్ సంస్థది. ఈ సంస్థలకు ,ఫిలింఛాంబర్ కు నటీనటులు తరుచూ విజయవాడ వచ్చేవారు .ఆరోజుల్లో వారి అల్పాహారం,ఆహారం బాబాయి హోటల్ (అప్పట్లోఅదే మంచి ఫేమస్) నుంచే వచ్చేవి. పూరిపాకలో హోటల్ ఉన్నా రుచులలో ఫైవ్ స్టార్ స్థాయిలో ఉండేవి. నటులు బాబాయి హోటల్ పదార్ధాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. సినిమాకు డిస్ట్రిబ్యూషన్ తో పాటు ముఖ్యంగా పబ్లిసిటీకే ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. లక్ష్మీ పబ్లిసిటీస్ ఈడ్పుగంటి లక్ష్మణరావు ( సినీ బాబాయి) పర్యవేక్షణలో జరిగేది. సినిమా ఫంక్షన్లకు అలంకార్ ధియేటర్ సమీపంలోని బాంబే స్టూడియో వాళ్ళు స్టిల్స్ తీసేవారు. అన్నీ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు బాంబే స్టూడియో వాళ్ళు బాగా ఫోటోలు తీస్తారని వారికే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. లక్ష్మీ ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో లింగమూర్తి, సుబ్బారావు లతో కలిసి అక్కడ పనిచేసిన బొడ్డపాటి మురళీధరరావు కూడా కార్యకలాపాల పర్యవేక్షణలో ప్రధానంగా పాల్గొనేవాడు. నేడు ఆ సంస్థలు కనుమరుగైనప్పటికీ.. గాంధీనగర్ లో నాటి ఆనవాళ్లు గుర్తు చేస్తూనే ఉంటాయి.
యం.వి.రామారావు, సీనియర్ జర్నలిస్టు, విజయవాడ
Read More
Next Story