
‘ఎక్కువ మంది పిల్లల్ని కనండి, తెలుగు జాతిని కాపాడుకోండి’
తెలుగు రాష్ట్రాలకు ఎదురవుతున్న ‘జనాభా సమస్య’ మీద ప్రఖ్యాత ఆర్థిక వేత్త ప్రొఫెసర్ కెఎస్ చలం వివరణ
గత వారంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ (MK Stalin) ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొంటూ వధూవరులను, అక్కడ ఉన్న ప్రజలనుద్దేశించి, మీరు వెంటనే పిల్లల్ని కనండి అని సందేశమిచ్చారు. అది పెరియార్ రామసామి (Erode Venkatappa Ramasamy ‘Periyar’) 1930 నుంచి ప్రచారం చేస్తున్న కుటుంబ నియంత్రణకు అనుకూలంగా చేపట్టిన ఉద్యమానికి వ్యతిరేకమైనది. నిజానికి పెరియార్ మహిళా విముక్తి, వెట్టి చాకిరీ నుంచి స్త్రీలను దూరం చేయాలంటే కాన్ను కాన్పుకు వారు పడ్డ కష్టం నుంచి బయటపడే ఒక మార్గం కుటుంబ నియంత్రణ అని ప్రచారం చేసి దేశంలో తమిళనాడు జనాభా నియంత్రణలో ముందు ఉండటానికి కారణమయ్యారు. ఆ రాష్ట్రం ఆర్థిక అభివృద్ధిలోనే కాకుండా మానవాభివృద్ధిలో కూడా ముందుంది. నాటి మద్రాసు రాష్ట్రంలో ఉండే నాటి ఆంధ్ర ప్రాంతం, తరువాత చేరిన ఆంధ్రతో కలసిన తెలంగాణ ప్రాంతం కూడా ఈ వారసత్వ మూలంగా జానాభా నియంత్రణ (Population Control) లో దేశంలో ముందున్నాయి. మరి ఇప్పుడు ఎందుకు ఈ రాష్ట్రాలకు కష్టాలు రాబోతున్నాయి. ఎందుకో తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కూడా అటువంటి ఆ మధ్య సందేశమే ఇచ్చారు. స్టాలిన్, చంద్రబాబు ఒకే వయసు వారు. వారితో బాటు మా వయసు తరం వాళ్లంతా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనలేదు. వారి పిల్లలు కూడా. ఒకరిద్దరి కంటే ఎక్కువ పిల్లలను జన్మనిచ్చిన దాఖలాలు లేవు. ఇది దక్షిణాది అన్ని రాష్ట్రాలు ఖచ్చితంగా పాటించి ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పే డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ (Demographic Transition), జనాభా పరివర్తన దశ దాటేందుకు కృషి చేశారు. అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో జనాభా పరివర్తన జరిగి, జనాభా పెరుగుదల అదుపులో ఉండి వారి జాతీయాదాయం పెరిగి మానవాభ్యుదయం (Human Development0 సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరివర్తనలో మూడు దశలుంటాయి. మొదటి దశలో జననాల రేటు, మరణాల రేటు ఎక్కువగా ఉండి జనాభా పెరుగుదల తక్కువగా ఉంటుంది. ఇది వారి శ్రామిక విప్లవానికి ముందు దశ, రెండవ దశలో అభివృద్ధి ఆరోగ్యంపై శ్రద్ధతో మరణాల రేటు తగ్గి, జననాల రేటు పెరిగి జనాభా వృద్ధి బాగా జరుగుతుంది. ఇక మూడవ దశలో మరణాల రేటు, జననాల రేటు రెండూ తగ్గి జనాభా పెరుగుదల మందగిస్తుంది. దీనికి జనాభా నియంత్రణ, ఆరోగ్యం చేసే ప్రభుత్వ ఖర్చు, ఆర్థిక అభివృద్ధి దోహదం చేస్తాయి.
ముఖ్యంగా చిన్న కుటుంబాలలో ఉండే పిల్లల విద్య, ఆరోగ్యంపై శ్రద్ధ, ఖర్చు పెరిగ,' ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజం వృద్ధి చెందుతుంది. 2002 లో నేను ‘ద్రవిడియన్ మార్వెల్’ ( Human Development in South India: The Dravidian Marvel) అనే పుస్తకం పాతికేళ్ల క్రితం ప్రచురించి అది మానవాభివృద్ధికి ఎలా దోహదం చేసిందో చర్చ చేశాను.
ప్రొఫసర్ కెఎస్ చలం
భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలన్నీ ఇప్పుడు ఆర్ధికంగా, సామాజికంగా ఒక విధంగా రాజకీయంగా భిన్నంగా ఉన్నాయంటే శాస్త్రీయ అవగాహన పెంపొందించి, సాంకేతిక విద్యకు ప్రాముఖ్యం ఇచ్చి అభివృద్ధి చేసి కంప్యూటర్ యుగంలో సేవారంగంలో ముందుండటమే. దాని మూలంగా ఇక్కడి ప్రజలు తమ పిల్లలకు శ్రద్ధగా చదువులు నేర్పించటం, ప్రభుత్వం కూడా దానికి దోహదం చేయటంతో మానవ వనరులు అమెరికా, ఇంగ్లాండ్ దేశాలకు ఎగుమతి జరిగి, అంటే వలసల మూలంగా విదేశీ మారకంలో దేశానికి, కుటుంబానికి చాలా వెసులుబాటు కల్పిస్తూ వస్తున్నాయి.
ఇది ఇప్పుడు రాజకీయ క్రీడలో ఉత్తరాది (North India) వారి అలసత్వానికి బలై పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పార్లమెంటు సభ్యుల సంఖ్యను రాజ్యాంగ నిబంధన 83(1) రాజ్యాంగ 31 వ సవరణ ప్రకారం 530 మందికి పరిమితం చేశారు. గతంలో 494 ఉండేవి. అంతేకాదు 81(2) ఎ ప్రకారం ప్రతి రాష్ట్రానికి వేటాయించే సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాలలో జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి. వీలున్నంత వరకు అది అన్ని రాష్ట్రాల్లో ఒకే నిష్పత్తిపై ఆధారపడి ఉండాలి. అంటే ఆంధ్రప్రదేశ్ లో 7 లక్షలకు ఒక ఎంపీ స్థానం అనుకుంటే ఉత్తరప్రదేశ్లో కూడా అదే నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించవలసి వస్తుంది.
ఇది 1971 జనాభా లెక్కల ప్రకారం ఉండాలని గతంలో అనుకున్నది. 2001 లో నేటి ఎన్.డి.ఎ (NDA) ప్రభుత్వం అరుణ్ జైట్లీ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 జనాభా లెక్కల వరకు పొడిగించారు. అంటే 2026 నాటి జనాభా లెక్కలు వచ్చిన తరువాత రాష్ట్రాల ఎంపీల సంఖ్య మారిపోతుంది. దీనికి జనాభా లెక్కలు తప్ప వారు ఏ విధంగా జనాభా నియంత్రణ పాటించి విజయవంతమయ్యారనే విషయం పరిగణనలోనికి రాదు.
కేంద్ర ప్రభుత్వమే చెప్పిన కుటుంబ నియంత్రణ పరిధిలోనే జనాభా తగ్గించుకొని మాననాభివృద్ధి, ఆర్థిక వృద్ధి సాధించినా పార్లమెంటు సభ్యుల సంఖ్య నిర్ణయంచటంలో ఈ రాష్ట్రాలకు ఏ విధంగానూ రాయితీలు ఇవ్వరు ఈ విధంగా దక్షిణాది 5 రాష్ట్రాలు నష్టపోతాయి. అంటే విజయం సాధించినందుకు శిక్షిస్తారన్నమాట.
దీనికి వ్యతిరేకంగా మిగతా రాష్ట్రాల కంటే చైతన్యంవతమైన తమిళనాడు నోరు విప్పింది.తొలి కోడై కూసింది. ఇతర దక్షిణాది రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
రాజకీయంగా ఎన్ని పార్లమెంటు సీట్లు కోల్పోతున్నామో తెలుసుకునే ముందు ఆర్థికంగా దక్షిణాది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో తెలుసుకోవాలి.
గత పది, పదిహేనేళ్ల కాలంలో రాజ్యాంగ సవరణలు చాలా జరిగాయి. గతంలో రాజ్యాంగ మౌలిక స్వరూపం అన్న కోర్టులు నోరు తెరవక పోవటంతో భారత సర్వసత్తాక ఫెరడల్ వ్యవస్థ కుప్ప కూలింది. ప్రతి రాష్ట్రం చేసినదీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినవి. కేంద్ర నిరంకుశాధికారం పెత్తనంలోకి ఇప్పుడు వెళ్లిపోయాయి. ఫెడరల్ వ్యవస్థ (Federal System) కు పట్టుకొమ్మగా ఉన్న రాజ్యాంగం(Constitution of India) లోని విత్త విధానానికి చెందిన 12 వ భాగాన్ని పూర్తిగా మార్చి కేంద్రం అధీనంలో పనిచేసే జి.ఎస్.టి. (GST) కౌన్సిల్ కు బదిలీ చేశారు. ఆ బదిలీ జరిగిన క్రమంలో రాష్ట్రాలకు దఖలు పర్చిన రాజ్యాంగ హక్కుగా రావలసిన వాటా ఒకప్పుడు 269 అధికరణ (Article 269 of the Indian Constitution deals with taxes levied and collected by the Union but assigned to the States, specifically focusing on taxes on the sale or purchase of goods and taxes on the consignment of goods in the course of inter-State trade or commerce) లో ఉండేది. దానిని సవరించారు. దీనితో రాష్ట్రాలు ఆర్థిక వెసులుబాటును కోల్పోయి కేంద్రంపై ఆధారపడవలసి వస్తోంది. నిజానికి దేశంలోని నిజాంతో సహా సుమారు 600 సంస్థానాలు కొన్ని షరతులలో అగ్రిమెంటు ప్రకారం భారత్ యూనియన్లో చేరాయి. ఆర్థికంగా ఆయా రాష్ట్రాల్లో భాగస్వాములుగా, ఉన్నా, ఇప్పుడు వారి రాజ్యాంగ హక్కు కత్తిరించేశారు. అది వేరే పెద్ద చర్చ. దానికోసం మాట్లాడే వారుగాని, కోర్టులు రాజ్యాంగ నిపుణులు తగ్గిపోయారు. ఉన్నా వారిని పట్టించుకొనే మీడియా లేదు. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే పన్ను వగైరా నినాదాలతో దేశం నడుస్తోంది.
ఈ సందర్భంలో రాజ్యాంగ నిర్మితాలు, ముఖ్యంగా డా. అంబేద్కర్, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇస్తూనే, కేంద్రం బలంగా ఉండేందుకకు ప్రధానమైన ఆర్థిక వనరుల పంపిణీ విషయమై చర్చించి, 1937 చట్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని కొన్ని నిబంధనలు రూపొందించారు. అందులో ముఖ్యమైనది ఫైనాన్స్ కమిషన్ (Finance Commission). రాజ్యాంగం 280 ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు కేంద్ర రాష్ట్ర పన్నుల వాటా, నిధుల వాటా ఏమిటో నిర్ణయించటానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయవలసి ఉంది. ఇప్పటి వరకు 15 కమిషన్లు తమ రిపోర్టులు ఇచ్చాయి. 16 వ సంఘం ఇప్పుడు నడుస్తోంది. 14 వ ఫైనాన్స్ కమిషన్ సందర్భంలోనే మన రాష్ట్రం (Bifurcation of Andhra Pradesh విడిపోయింది. తరువాత పన్నుల వాటాయే కాదు, రాజ్యాంగబద్ధంగా అడిగే హక్కు కోల్పోయి, కేంద్రం నిర్మించిన జి.ఎస్.టి. కౌన్సిల్ a సభ్యులుగా చేరాయి. ఇన్కంటాక్స్, దానిపై సర్ఛార్జి ఉన్నా దాని నుంచి వచ్చే వాటాలపై ఫైనాన్స్ కమిషన్ నిర్ణయించి రిపోర్ట్ ఇస్తుంది. కాబట్టి అదీ కేంద్రం పెత్తనానికి లోబడే ఉంటుంది.
15 వ ఫైనాన్స్ కమిషన్ వాటా ప్రకారం 2015-16 లో అన్ని రాష్ట్రాలకు రు. 84,379 కోట్లు ఇచ్చారు. కేంద్రం రు. 3,699 కోట్లు ఉంటే వాటిని కేంద్రం తనకు ఇష్టం వచ్చిన రీతిలో పంపిణీ చేస్తూ, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాలకు ఎలా నిధులు కేటాయించి, తమిళనాడుకు రావలసిన నిధులు ఇవ్వలేదు. సర్వ శిక్ష అభియాన్ కింద వేల కోట్ల నిధులను హిందీ భాష వివాదంతో కేంద్రం ఇవ్వకుండా అడ్డుకున్న సందర్భం ఉంది.
జనాభా ప్రాతిపదికగా గతంలో ఫైనాన్స్ కమీషన్ నిధులు పంపిణీ జరిగినా 1957-62లో 23.3 శాతం వాటా వుంటే 2022-23 నాటికి 15.8 శాతానికి దక్షిణాదికి రావాల్సిన వాటా తగ్గిపోయింది. అయితే ఈ విషయాన్ని గమనించిన 15వ సంఘం నిదుల కేటాయింపులో రాష్ట్రాల జనాభా నియంత్రణ చేస్తే వాటికి ప్రత్యేకంగా 12.5 శాతం వెయిటేజ్ యిచ్చి కొంతవరకు ఉపశమనం కలిగించటానికి ప్రయత్నించింది. ఫైనాన్స్ కమిషన్ గ్రాంటులో రాష్ట్రాల వాటా 41 శాతానికి కుదించటం వల్ల కేంద్రం వద్ద మొత్తం ఆర్ధిక వనరులు 59 శాతం దాకా పోగుపడటం జరుగుతోంది. ప్రధానంగా ప్రణాళికా సంఘం లేకపోవటం అభివృద్ధి నిధులకు ఒక ప్రాతిపదిక కొరవడటం, సెంట్రల్ ప్రత్యేక కార్యక్రమాలకు ఇచ్చే స్కీముల నిధుల పంపిణీ కేంద్రం పెత్తందారీ ఆధిపత్యం ఆధారంగానే జరుగుతున్నపుడు దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు వారి దయా దక్షిణ్యాలపై ఆధారపడుతూ ఢిల్లీ చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. దాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు కేంద్రం వాడుకుంటుంది. ఇప్పుడు ఇంకో ఉపద్రవం వచ్చింది. అదే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ (Delimitation) అమలుచేస్తున్నారు. 2021లో చేసిన రాజ్యాంగ సవరణలో ఎస్సీ, ఎస్టీలకు 1991 జనాభా లెక్కల ఆధారంగా సీట్లు కేటాయించారు.
2026 ఆ తరువాత ఏమి జరుగ బోతోంది?
ఇప్పడు దక్షిణాది వారు భయపడుతున్నది, ఆందోళన వ్యక్తం చేస్తున్నది ఈ సంఖ్య విషయంలోనే. 2026 నాటికి విభజన ఎలా వుండబోతున్నదో అధికారికంగా అంచనా వేశారు. వాటి ఆధారంగా లభిస్తున్న సీట్ల వివరాలు భయాందోళన లకు గురిచేస్తున్నాయి. దీని ప్రకారం ప్రస్తుతం తమిళనాడులో 39 ఎంపీ స్తనాలు, ఉమ్మడి ఆంధ్రలో 42, కేరళ 20, కర్నాటక 28 ఉన్నాయి.
2026లో జనాభా అంచనాల ప్రకారం అయితే ఆ సంఖ్య తమిళనాడుకు 31 సీట్లు, ఉమ్మడి ఆంధ్రకు 34 సీట్లు, కేరళలకు 12 సీట్లు కర్నాటకకు 26 సీట్లకు పరిమితం అవుతాయి. వారు భయపడుతున్నది ఉత్తర ప్రదేశ్ 91 సీట్లు, బీహార్ 50, రాజస్థాన్ 31, మధ్య ప్రదేశ్ 33 అంటే హిందీ బెల్ట్ గా పిలువబడే గతంలోని ఈ ‘బీమారు’ రాష్ట్రాలు రాష్ట్ర దక్షినాదితో సంబంధం లేకుండా ప్రధాన మంత్రిని, మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. హిందీ యే రాజభాష, రాజ్యాంగ భాష అవుతుంది. దక్షిణాది తమిళం, తెలుగు, కన్నడ, మళయాళం తో పాటు మరాఠి, గుజరాత్ కూడా అవసరం ఉండదు. వారు రహస్యంగా ఆశించినట్లే జరగ బోతుండటంతో జనాభాను పెంచుకుని, భాషను, రాష్ట్రాన్ని, తమ ఉనికిని కాపాడుకోవడం కోసం తమిళులు ముందు నోరు తెరిచారు. దేశానికి ముగ్గురు అధ్యక్షులను ఒక ప్రధాన మంత్రిని ఇచ్చిన తెలుగు జాతి రాష్ట్రేతర భారత్ లో కోట్లాది ఉన్న రాష్ట్రంలో జనాభా పెరగాలి. తెలుగు మాటను కాపాడుకోవాలి. అలా జరగాలంటే ఎక్కువ మంది పిల్లలను కని తెలుగు దశదిశలా పెరిగేలా చూడటం ఒక మార్గం.