పేదల కళాశాలల్ని గద్దల్లా తన్నుకుపోతున్న కార్పొరేట్లు!
x

పేదల కళాశాలల్ని గద్దల్లా తన్నుకుపోతున్న కార్పొరేట్లు!

మాసిపోతున్న బందరు విద్యా వైభవం!


(ఎం.వి.రామారావు)

విద్య, వైద్యంపై ప్రభుత్వాలు పూర్తి అలసత్వం చూపిస్తున్నాయి. ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అవకాశాలు ధారాదత్తం చేస్తున్నాయి. ఉన్నత విద్య విషయం లో ప్రభుత్వాలు మరీ అన్యాయంగా విధానాలు ప్రకటిస్తున్నాయి. ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజీ, యూనివర్సిటీ ఏర్పాటు చేయడంలో ను రాజకీయం చోప్పిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు నాయకులు చుట్టూ తిరుగుతున్నారేగాని సామాన్యులను పట్టించుకోవడంలేదు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా సామాన్యుడికి జరిగేది ఏమి ఉండదు. రాజకీయ లబ్ధిదారులు మారతారే తప్ప ప్రజలకు జరిగే మేలు ఏమీ ఉండదు. ఉదాహరణకు బందరు(మచిలీపట్నం) గత కాలంలో( బ్రిటీష్) ఎంతో ప్రసిద్ధి చెందిన రేవు పట్టణం.మచిలీపట్టణం అనే పేరు చేప కన్ను ముఖద్వారం గా ఉన్న పట్టణంలోని అర్ధం. దాన్ని విదేశీయులు తరలించారని నానుడి.

ఆంధ్రాబ్యాంక్ పట్టాభి సీతారామయ్య ఆధ్వర్యంలో పురుడు పోసుకున్న గడ్డ ఇది. నేడు ప్రభుత్వ అనాలోచిత,ప్రజా నాయకుల చేతకానితనంతో ఆ పేరును విలీనం లో కోల్పోయాం. అలాగే బీమాకంపెనీ (ఎల్ఐసి)కి బందరులోనే పునాదులు పడ్డాయి. కృష్ణాజిల్లా పురాతన రాజధానిగా వెలసిల్లింది. ఇక్కడి ఆంధ్ర జాతీయ కళాశాల (నేషనల్ కాలేజి) దేశ స్వాతంత్ర్యం ముందు నుంచి ఎంతోమంది సమర యోధులు ఇక్కడికి వచ్చి వృత్తి పనులు నేర్చుకున్నారు. ఉపాధ్యాయులుగా పనిచేసారు. స్వయంగా మహాత్ముడు ఈ కళాశాల సందర్శించారు. అంత చరిత్ర ఉన్న కళాశాల నేడు శ్మశానం గా మారుతోంది.
ఒకప్పుడు కృష్ణా యూనివర్సిటీ ఇక్కడే ప్రారంభమైంది. కాని కొన్నిరోజుల తరువాత దాన్ని ఖాలేఖాన్ పేట సమీపంలోని శివగంగ వద్దకు మార్చారు. దాన్ని ఎందుకు మార్చారో తెలియదు.

దాన్ని నేషనల్ కాలేజీలో ఉంచితే కాలేజిలో పాటు యూనివర్సిటీ కి మంచి పేరు వచ్చేది. విద్యార్ధులకు అందుబాటులో ఉండేది. ఈ విశ్వ విద్యాలయానికి పెడన నుంచి వచ్చి చదువుకునే వారికి రోజుకు వంద నుంచి 150 రూపాయలు వరకూ ఖర్చు అవుతాయి. ఈ యూనివర్సిటీ లో చదివే విద్యార్థులు బడుగు, బలహీన వర్గాల వారే కావడం గమనార్హం. వ్యవసాయ పనుల కాలంలో హాజరు శాతం ఆవిషయం తేటతెల్లం చేస్తుంది. గతంలో కాలేజీల్లో ఈ వర్గాల విద్యార్ధులు ఉన్నా గైరుహజరు ఇంత ఘోరంగా ఉండేదికాదు.
అదే నేషనల్ కాలేజీలోనే యూనివర్సిటీ పెట్టిఉంటే కాలేజీ గత వైభవం కాపాడినట్లయ్యేది. మంచి సెంటర్ లో యూనివర్సిటీ విద్యార్ధులకు అందుబాటులో ఉండేది. అలాగే విద్యార్థులు సంఖ్య గణనీయంగా పెరిగేది. అలాగే ప్రభుత్వం మెడికల్ కళాశాల ఊరికి దూరంగా" కరిమీద" అనే చోట పెట్టారు. సౌకర్యాలు కరువైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసారు.
మెడికల్ సీట్లు నీట్ పరిక్ష ఆధారంగా కేటాయిస్తారు. విద్యార్ధులు అన్ని ప్రాంతాల నుంచి వస్తారు.ఎక్కడ స్థాపించినా వస్తారు.కరిమీద మెడికల్ కాలేజీ పెట్టడం వల్ల వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నాయకులు చెప్పే కబుర్లు ఎన్ని సంవత్సరాలకు ఫలితం ఇస్తుందో ప్రజలే నిర్ణయించాలి.ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ఎన్నికల హామీగా ఇచ్చింది.ఈ పధకంలో ప్రభుత్వ కళాశాల మగ విద్యార్థులకు కూడా వర్తింపజేస్తే హాజరు శాతం పెరిగేఅవకాశం ఉంటుంది.
అలాగే బందరులో చరిత్ర సృష్టించిన మరో కళాశాల హిందూ కళాశాల. ఒకప్పుడు 1వతరగతినుంచి పీజీ వరకూ చదువు అందుబాటులో ఉండేది. మహిళాకళాశాల కూడా ఉండేది. ప్రభుత్వం ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ఎయిడ్ ఇచ్చేది. కొంతకాలంగా కార్పొరేట్ విద్యా సంస్థలకు అండగా ప్రభుత్వాలు ఎయిడెడ్ విద్యా సంస్థలకు రద్దు చేస్తున్నాయి. దాంతో అవి నామమాత్రంగా మారుతున్నాయి. ఫాకల్టీ కూడా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఇచ్చే వేతనాలతో ప్రభుత్వ లేక ప్రైవేట్ కళాశాలలు పోటీ పడలేక పోతున్నాయి. దాంతో బోధనా ప్రమాణాలు పడిపోతున్నాయి. దానికి కారణం ఎవరు అనేది అర్ధంకాని బ్రహ్మ పదార్ధం కాదు. ప్రభుత్వాలు కొన్ని సంవత్సరాలుగా విద్యను నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల పరం చేస్తున్నాయి.
అన్ని పట్టణాలు, నగరాల్లో ఒకప్పుడు వెలుగు వెలిగి ఎందరో మహానుభావులను తీర్చిదిద్దిన కళాశాలలు,పాఠశాలలు ఈ కార్పొరేటు కబంధ హస్తాల్లో చిక్కుకుని చరిత్ర గర్భంలోకలిసిపోతున్నాయి.ఇప్పటికే ప్రభుత్వ విద్యాసంస్థలు అస్థిపంజరాలు లాగా తయారయ్యాయి. ఇక యూనివర్సిటీ లను నిర్వీర్యం చేసే వంతు వచ్చింది. ఇప్పటికే డీమ్డ్ యూనివర్సిటీలు పుట్టగొడుగుల్లా వస్తున్నాయి.
ఇక ప్రభుత్వ యూనివర్సిటీలపైనే వాటి చూపు. ఇప్పటికే విద్య సామాన్యుడికి భారంగా మారింది. విద్యతో పాటు వైద్యం కూడా దాదాపు ప్రభుత్వం చేతుల నుంచి జారిపోతున్నది. దీనికి కర్త, కర్మ, క్రియ ఎవరనే సమాధానం మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రజలు తమకున్న ప్రాధమిక హక్కు ను పనికిరాని హామీలకు తాకట్టు పెడుతున్నారు. వారు అత్యధిక శాతం విద్య,వైద్యం ప్రభుత్వమే నిర్వహించేలా రాజకీయ పార్టీలను డిమాండ్ చేయాలి.అదే ఎన్నికల హామీ గా ఉండాలి. అప్పుడే పాత విద్యా సంస్థలకు పూర్వ వైభవం వస్తుంది. కాని నేటి కాలంలో అది అంత సులభం కాదు. కాని ప్రారంభం ఎక్కడో మొదలవ్వాలికదా...


రచయిత- సీనియర్ జర్నలిస్టు, కాలమిస్ట్
Read More
Next Story