రామాయణంలోని కౌసల్య తండ్రి పేరేమిటి? అతడే దేశపు రాజు?
రామాయణంలో నిరుత్తరకాండ-13: కొన్ని రామాయణాలను చూస్తే కౌసల్యా, దశరథుల కథ ఎన్నో చిత్రవిచిత్రమైన మలుపులతో ఉండి, ఒక జానపదసినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
దశరథుని అశ్వమేధానికి, అతని మూడవ భార్య అయిన కైక తండ్రినీ, సోదరునీ పిలిచారు తప్ప; కౌసల్యా, సుమిత్రల తండ్రినీ, సోదరులనూ పిలవలేదనీ, వారి గురించిన కనీసమైన సమాచారం కూడా వాల్మీకి రామాయణంలో లేదనీ ప్రారంభంలో అనుకున్నాం. ఆ సమాచారం కొన్ని ఇతర రామాయణాలలో కనబడుతుంది. అందులోకి వెళ్లబోయేముందు, ఆరుద్ర ‘రాముడికి సీత ఏమవుతుంది?’ అనే తన ప్రసిద్ధరచనలో అనేక రామాయణకథనాల గురించీ, వాల్మీకి రామాయణంలో లేనివి వాటిలో ఉండడం గురించీ ఏం చెప్పారో చూద్దాం:
ఆయన ప్రకారం, నారదుడు చెప్పిన రామకథనే పురాణంగానో, ఇతిహాసంగానో కాకుండా, వాల్మీకి కావ్యంగా మలిచాడు కనుక; కాళిదాసు శకుంతల కథలో మార్పులు చేసినట్టుగా వాల్మీకి కూడా రామకథలో మార్పులుచేసి ఉండవచ్చు. వాల్మీకి లానే మరికొందరు ప్రాచీనులు కూడా రామకథను కావ్యాలుగా రాశారు. ‘అద్భుతరామాయణం’, ‘ఆధ్యాత్మరామాయణం’, ‘ఆనందరామాయణం’ మొదలైనవి వాటిలో ప్రసిద్ధాలు. వీటిలో వాల్మీకి రామాయణంలో లేని కథనాలు ఎన్నో ఉన్నాయి. అలాగే, రామాయణకథాంశంతో భాసుడు రాసిన ‘ప్రతిమానాటకం’లోనూ, కాళిదాసు ‘రఘువంశం’లోనూ, భట్టి ‘రావణవధ’లోనూ, భవభూతి ‘ఉత్తరరామచరితం’లోనూ, దిజ్ఞాగుడి ‘కుందమాల’లోనూ వాల్మీకి రామాయణంలో లేని కల్పనలు ఉన్నాయి. ఇతిహాసమైన మహాభారతంలో, పురాణమైన భాగవతంలో కూడా రామోపాఖ్యానాలు ఉన్నాయి. అగ్ని, కూర్మ, బ్రహ్మవైవర్త, బ్రహ్మాండ, మార్కండేయ, శివపురాణాలు; దేవీభాగవతం కూడా అంతో ఇంతో రామకథను పొందుపరిచాయి. పద్మపురాణమైతే మూడు ఖండాలలో రామకథను విపులంగా చెప్పింది. వాల్మీకంలో లేని ఎన్నో విషయాలు వీటిలో ఉన్నాయి. అంతేకాదు, తెలుగులో వచ్చిన భాస్కర, రంగనాథరామాయణాల్లోనూ, బెంగాలీ రామాయణంలోనూ కూడా వాల్మీకంలో లేనివి ఉన్నాయి..
ఇంతకీ వాల్మీకికి నారదుడు చెప్పిన కథకు మూలం ఏది, అదెక్కడినుంచి వచ్చిందన్న ప్రశ్నలను కూడా ఆరుద్ర ముందుకు తెచ్చి, అంతకుముందునుంచే జనంలో ప్రచారంలో ఉన్న రామకథనే నారదుడు వాల్మీకి చెప్పి ఉంటాడంటారు. అలా తరతరాలుగా సంప్రదాయసిద్ధంగా జాతివారసత్వంలో భాగమైన రామకథకు వైదికధర్మాన్ని అనుసరించేవారేకాక, బౌద్ధులూ, జైనులూ కూడా వారసులేననీ, ఈ మూడు మతాల పూర్వీకులు ఒక్క కుదురులోంచి వచ్చినవారేననీ అంటారు. కనుక, బౌద్ధులు, జైనులు కూడా వాల్మీకికి భిన్నమైన కథనాలతో రామకథను చెప్పుకున్నారంటూ, వాటిలోని విశేషాలను కూడా విస్తృతంగా ఇచ్చారు.
అలాగే, చైనా, జపాన్, మంగోలియా లాంటి తూర్పు ఆసియా దేశాల్లోనూ; లావోస్, కంబోడియా, మలేసియా, ఫిలిప్పీన్స్ లాంటి ఆగ్నేయాసియా దేశాల్లోనూ కూడా రామాయణం భిన్నభిన్న కథనాలతో వ్యాప్తిలో ఉన్నట్టు చెప్పి, వాటిలోని విశేషాలను ఆరుద్ర పరిచయం చేశారు. ఇలా దేశవిదేశాలలో వచ్చిన అనేక రామాయణాలను, వాటిలోని వాల్మీకానికి భిన్నమైన అనేక ఆసక్తికరమైన కథనాలను దండగుచ్చిన ఆరుద్ర రచన నిస్సందేహంగా తెలుగులో వచ్చిన ఒక విలువైన పరిశోధనాత్మక రచన.
మొత్తంమీద ఆరుద్ర తేల్చిచెప్పినదేమిటంటే, వాల్మీకి రామాయణమే కానీ, అందులో లేని విషయాలను పొందుపరచిన ఇతర రామాయణాలూ, పురాణాలే కానీ, రామాయణకథాంశాలనే తీసుకుని రచించిన కావ్య, నాటకాలే కానీ అంతకు చాలాముందునుంచీ జనంలో వ్యాప్తిలో ఉన్న కథలనే తీసుకున్నాయని! స్వార్థపరులు స్వలాభాల కోసం పురాణ, ఇతిహాసాలలో ప్రక్షిప్తాలను చేర్చడం మధ్యలో జరిగింది కానీ; తొలి రోజుల్లో పురాణాలూ, ఇతిహాసాలూ జనశ్రుతిలో ఉన్న కథల్ని ఏమీ మార్చలేదని ఆయన అంటారు. అప్పుడు, జనశ్రుతిలో ఉన్న కథలే ప్రమాణం అవుతాయి తప్ప, వాల్మీకి రామాయణంతో సహా ఏ ఒక్క రామాయణమో ప్రమాణం కాబోవు. ఏ రామాయణం ప్రామాణికమన్న ప్రశ్నకు ఇది అర్థవంతమూ, హేతుబద్ధమైన సమాధానంగానే కనిపిస్తుంది.
అదే సమయంలో, వాల్మీకంలో లేని విషయాలను చేర్చి రామకథను వివిధ రూపాల్లో రాసిన వారందరూ సీతారాములపై పరిపూర్ణమైన భక్తిప్రపత్తులు, రామకథ మీద గౌరవం ఉన్నవారే అయినా, వాల్మీకంలో లేనివి ఎందుకు రాశారంటే, జనశ్రుతిలో పరంపరగా వస్తున్న కథనాలను విస్మరించకపోవడం వల్లనేనని ఆరుద్ర అంటారు. సాంప్రదాయికంగా జనం చెప్పుకుంటూవచ్చిన కథలను తీసుకున్నారనడం వరకూ బాగానే ఉంది కానీ; సీతారాములపై భక్తిప్రపత్తులూ, రామకథపై గౌరవమూ ఉన్నవారు కనుకనే సొంత కల్పనలు చేర్చి ఉండరనడం మాత్రం కొంచెం మోతాదును మించిన సాధారణీకరణ(జనరలైజేషన్)లా అనిపిస్తుంది.
ఎందుకంటే, పురాణ ఇతిహాసాలపై భక్తిగౌరవాలకు, సొంత కల్పనలు చొప్పించడానికి సంబంధంలేదు. ఇక్కడ ప్రధానంగా ఉండవలసింది మూలకథపై భక్తిగౌరవాలతో ఉన్నది ఉన్నట్టు చెప్పవలసిన విద్యావిషయికమైన(అకడెమిక్) క్రమశిక్షణే కానీ, సీతారాముల మీదో మరొకరిపైనో భక్తిగౌరవాలు కాదు. భారత, రామాయణాలపై, అందులోని పాత్రలపై భక్తివిశ్వాసాలున్న సాంప్రదాయికపండితులు కూడా మూలాతిక్రమణకు పాల్పడడం ఆధునికకాలంలో కూడా జరుగుతూనే ఉంది. ఈ వ్యాసపరంపరలోనే ఇంతకుముందు ఇందుకు సంబంధించి కొన్ని ఉదాహరణలను ప్రస్తావించుకున్నాం. ఇకముందు కూడా అలాంటివి ప్రస్తావనకు రావచ్చు. మారిన కాలమానపరిస్థితుల దృష్ట్యా మూలపాఠంలో అసంబంద్ధంగా, ఆక్షేపణీయంగా ఉన్నట్టు అనిపించేవాటిని దాటవేయడం; లేదా వాటికి కొత్త అర్థాలు, కొత్త అన్వయాలు కల్పించడం; వాటిని నేరుగా మూలంలోనే చేర్చి ఆయా ఘట్టాలను తిరగరాయడం; ఒక్కోసారి మూలకథ అనే నేలను పూర్తిగా విడిచిపెట్టేసి మొత్తం కథకు ఏదో తాత్త్వికార్థాన్ని ఆపాదిస్తూ ఆకాశమార్గం పట్టించడం; అనేక పాఠాలలో భిన్నభిన్నంగా, పరస్పర విరుద్ధంగా ఉన్న ప్రతి ఒక్క వివరాన్నీ ప్రామాణికంగా తీసుకుంటూ ఏదో విధంగా నప్పించడం, చివరికి తనే రాసినదానితో సహా అచ్చులో వచ్చిన ప్రతిదానినీ ప్రామాణికంగా చూపడం మన సాంప్రదాయిక పండితుల్లో కనిపిస్తుంది.
***
ఈ సాంప్రదాయిక పండిత పంథా అంతా విశ్వరూపంలో కనిపించే రచనల్లో ‘శ్రీ రామాయణ సారోద్ధారము’ ఒకటి. ఇంతకుముందు మనం ఒకసారి ప్రస్తావించుకున్న రచనే ఇది. తొమ్మిది సంపుటాలలో ఉన్న ఈ బృహద్ గ్రంథాన్ని రచించినవారు ములుకుట్ల నరసింహావధానులుగారు. ఆరుద్ర ‘రాముడికి సీత ఏమవుతుంది” అనే రచన ద్వారా దేశవిదేశాలలోని అనేక రామాయణాలను పరిచయం చేయడానికీ, ఎ. కె. రామానుజన్ 300 రామాయణాల గురించి రాయడానికీ చాలాముందే, 1930లలో వచ్చిన రచన ఇది(ఈ పుస్తకం ఏ సంవత్సరంలో ప్రచురించారో ఎక్కడా ఇవ్వలేదు. ఎంతో గాలించినమీదట, పుస్తకంపై పండితులు రాసిన అభిప్రాయాలలో ఒక చోట 1931 అని కనిపించింది. అంటే, పుస్తక ప్రచురణలో పాటించవలసిన పద్ధతుల గురించిన స్పృహ మన పండితుల్లో, ప్రచురణకర్తల్లో ఇటీవలివరకూ కూడా పూర్తిగా ఏర్పడలేదన్నమాట. ఇప్పటికీ ఏర్పడిందని చెప్పలేం). 200 ఆర్షరామాయణాలను పరిశీలించి, వాటిలో 24 రామాయణాలను ఎంచుకుని వాటిలోని కథాంశాలను, ఇతర విశేషాలను కూర్చుతూ ‘శ్రీ రామాయణ సారోద్ధారము’ను రచించినట్టు నరసింహావధానులుగారు చెప్పుకున్నారు. కాకపోతే, పైన చెప్పుకున్న సాంప్రదాయిక పండిత లక్షణాలు అన్నీ ఇందులో కనిపిస్తాయి.
ఉదాహరణకు, బాలకాండ ప్రారంభంలోనే ‘శ్రీ రామాయణ సాంప్రదాయార్థ సంగ్రహము’ అనే శీర్షికతో 27 పేజీలలో మొత్తం రామాయణకథకు ఆధ్యాత్మికపరమైన అర్థం చెబుతారు. దానిప్రకారం, ఇతిహాస, పురాణాలు చెప్పేది వేదాంతార్థం; శ్రీరాముడు పరబ్రహ్మస్వరూపం. పద్నాలుగు లోకాలూ సీతారాముల్లోనే పుట్టాయి, వారిలోనే ఉంటాయి, వారిలోనే లయమవుతాయి. కుశలురు, అంటే ఇంగితజ్ఞానం కలవారు నివసించేదే కోసల. సరయూనది అంటే సంసారం; ఆ సంసారానికి తీరంలోనే ఉన్నా దానిని అంటకుండా జీవించే వివేకవంతుడి దేహమే అయోధ్య. దశరథుడు అంటే పది ఇంద్రియాలనే అశ్వాలను కట్టిన రథం వంటి శరీరం కలిగిన- జీవుడు. కౌసల్య అంటే కుశల, అంటే పుణ్యం. అన్ని జీవులతోనూ స్నేహంగా మెలగేది సుమిత్ర. భోగాలపై ఆసక్తి కలిగినది కైక...ఈవిధంగా బాలకాండలోని కథ మొత్తం బ్రహ్మజ్ఞానం గురించి చెబుతుందని నరసింహావధానులు గారు అంటారు.
రామాయణంలో ఈ తాత్త్వికార్థాన్ని అన్యాపదేశంగా (లౌకికమైన కథారూపంలో)చెప్పడమెందుకు, సూటిగానే చెప్పవచ్చు కదా అన్న ప్రశ్నను ఆయనే ముందుకు తెచ్చి, ఆయనే సమాధానం చెబుతారు. జీవులందరూ అజ్ఞానంలో మునిగి విషయసుఖాలే యథార్థాలని భావిస్తారు కనుక, అలాంటివారికి నేరుగా తత్త్వం బోధిస్తే, అది బలంగా నాటుకోదనీ; సంసారంలోని దోషాలను చెప్ప, దానిపై వారికి విముఖతను కలిగించి వ్యంగ్యరూపంలో తత్త్వం ఉపదేశిస్తే అది సరిగా నాటుకుంటుందనీ దాని సారాంశం. అయితే, కనీసం రామాయణ, మహాభారతాల మేరకే చూసినా వాటిలోని కథ, కవిత్వం, నాటకీయత, పాత్రపోషణ, ధర్మాధర్మాల పరిశీలనను దాటి, అందులో లేని... పోనీ గుప్తంగా ఉందనుకునే... తత్త్వోపదేశాన్ని అర్థం చేసుకున్నవారు ఎంతమంది ఉంటారు, అసలు ఉంటారా అన్నది ప్రశ్న. వాల్మీకీ, వ్యాసుడూ తాత్త్వికతను బోధించడానికే రామాయణ, మహాభారతాలను చెప్పారని కానీ; అదే సాంప్రదాయికంగా చెబుతున్న అర్థమని కానీ అనడానికి ఎలాంటి ప్రమాణమూ లేదు. వాటిలో లేనిదాన్ని, లేదా కనిపించని దాన్ని ఏకపక్షంగా పాఠకులపై విధించి నమ్మించే ప్రయత్నంగానే ఇది కనిపిస్తుంది.
నరసింహావధానులు గారు చెప్పిన ఆ సంప్రదాయార్థాన్ని మాటవరసకు అంగీకరిద్దామనుకున్నా, మళ్ళీ ఆయనే ఆ అర్థంనుంచి తప్పుకుని రామాయణంలోని విషయాలను లౌకికమైన చర్చలోకి తీసుకొస్తారు. ఉదాహరణకు పరబ్రహ్మస్వరూపుడని తనే చెబుతున్న రాముడి జననకాలాన్ని నేటి కాలపు పంచాంగాన్ని అనుసరించి సంవత్సరం, మాసం, తిథి, వారం, నక్షత్రపరంగా లెక్కిస్తూ సుదీర్ఘమైన చర్చ చేస్తారు. కోసల, సరయు, అయోధ్యలకు తాత్త్వికమైన అర్థాలు చెప్పి, మళ్ళీ తనే వాటిని భౌగోళికంగా గుర్తించే ప్రయత్నం చేస్తారు. రాముడు సంచరించిన ప్రాంతాలను మ్యాపులో చూపిస్తారు. ఇలా చివరికిది జోడు గుర్రాల స్వారీగా తయారై, కనిపించని తాత్త్వికార్థాన్ని తీసుకోవాలో, లేక స్పష్టంగా కనిపించే లౌకికార్థాన్ని తీసుకోవాలో తేల్చుకోలేని గంద్రగోళం వైపు పాఠకులను నడిపిస్తుంది.
అలాగే, రామాయణకథ ప్రతి కల్పంలోనూ మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుందని, అందుకే వేర్వేరు రామాయాణాలూ, భిన్న కథనాలూ కనిపిస్తాయని చెప్పి ఏదో విధంగా వాటిని నప్పించడమూ నరసింహావధానులు గారిలో కనిపిస్తుంది. విద్యావిషయికంగా(ఆకెడమిక్)గా సంప్రదాయపండితుల్లో ఉన్న అవ్యవస్థను సూచించడానికే ఈ ప్రస్తావనలు తప్ప, వారి పాండిత్యాన్ని ఆక్షేపించడానికి కాదని ప్రత్యేకించి మనవి.
***
తిరిగి కౌసల్య, సుమిత్రల విషయానికి వస్తే, నరసింహావధానులుగారు పేర్కొన్న ‘శ్రీ రామభాగవతము’ అనే వేరొక రామాయణపాఠం ప్రకారం కౌసల్య తండ్రి పేరు భానుమంతుడు; అదే పాఠం ప్రకారం సుమిత్ర మగధదేశపు రాజు కూతురు. దశరథుని ఆమె స్వయంవరంలో వరించింది. మళ్ళీ వికీపీడియా కౌసల్య, సుమిత్రల గురించి ఇచ్చిన సమాచారం వీటికి భిన్నంగా ఉంది. వాటి ప్రకారం, కౌసల్య తండ్రి సుకౌశలుడు, తల్లి అమృతప్రభ; సుమిత్ర కాశీరాజు కూతురు.
ఆపైన ‘నానారామాయణ సారము’, ‘ఆనందరామాయణము’, ‘శివరామాయణా’లను బట్టి కౌసల్యా, దశరథుల కథ ఎన్నో చిత్రవిచిత్రమైన మలుపులతో ఉండి, ఒక జానపదసినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అందులో కూడా రావణుడు ఒక ముఖ్యపాత్రధారి అవుతాడు...
వాల్మీకంలో లేని ఆ విశేషాలను చెప్పుకోబోయేముందు మన ప్రస్తుత పరిశీలనకు అవసరమైన ఒక ముఖ్యవివరం ఏమిటంటే,
కౌసల్య తండ్రి అని చెబుతున్న భానుమంతుడు కోసలరాజు! అంటే, కౌసల్య కోసలరాకుమారి!!
మరి దశరథుడు...!?