
భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టుకకు నూరేళ్లు నిండిన సందర్బమా?
....లేదంటే కాన్పూర్ కాన్ఫరెన్స్ కి నూరేళ్లు నిండిన సందర్బమా?
భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ చరిత్ర గూర్చి భిన్న కధనాల పై ఓ సంక్షిప్త వివరణ! ఇది కాన్పూర్ సిపిఐ ఆవిర్భావ కాన్ఫరెన్స్ కి నేటికి నూరేళ్లు నిండిన సందర్బ ప్రతిస్పందన
-పి ప్రసాద్ (పిపి)
భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించే లక్ష్యంతో 26-12-1925 తేదీన కాన్పూర్ కాన్ఫరెన్స్ ప్రారంభమై మూడు రోజుల పాటు జరిగింది. అది మొదలై ఈరోజుకి నూరేళ్లు! కేంద్ర కమిటీని ఎన్నుకోవడం ద్వారా నిర్మాణపరంగా పార్టీ ఉనికిలోకి వచ్చి ఎల్లుండి 28 తేదీకి నూరేళ్లు! ఇలా ఉనికిలోకి వచ్చిన భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టుక (ఆవిర్భావం) పరిణామం చర్చనీయాంశంగా వుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) పుట్టుక గూర్చి; సిపిఐ ఆవిర్భావ చరిత్ర గూర్చి విభిన్న వైఖర్లు, వాదనలున్నాయి. వాటి గూర్చి స్పష్టత ఇవ్వాల్సి వుంది. ఇది అందుకోసం ఓ సముచిత సందర్బం. ఒక చిన్న ప్రయత్నమిది.
బ్రిటిష్ ఇండియా నుండి విద్య, ఉద్యోగ, ఉపాధి వంటి వృత్తుల నిమిత్తం విదేశాలకు వెళ్లి అక్కడే కమ్యూనిస్టులుగా మారి లెనిన్ ని కలిసిన వాళ్ళు చాలా మంది వున్నారు. లెనిన్ నేతృత్వంలోని కొమింటర్న్ (కమ్యూనిస్టు ఇంటర్నేషనల్) తో కూడా కాంటాక్ట్ కావడం విశేషం. అలా వారు కమ్యూనిస్టు సైద్దాంతిక వెలుగులో వలస పీడన నుండి మన దేశ విముక్తి సాధన కోసం భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపనకి నడుం కట్టారు. ఫలితంగా 17-10-1920 తేదీన నాటి USSR లో భాగమైన తాష్కెంట్ టౌన్లో సమావేశం జరిపి భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఏర్పడినట్లు ఒక ప్రకటన చేశారు. అదో చారిత్రిక పరిణామం.
బ్రిటిష్ ఇండియాలో భారత కమ్యూనిస్టులు 26-12-1925 నుండి కాన్పూర్ లో మూడు రోజులు కాన్ఫరెన్స్ జరిపి సిపిఐ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) ఏర్పాటు చేశారు. అది మరో చారిత్రిక పరిణామం.
పైన పేర్కొన్న రెండు పరిణామాలు ఐదేండ్ల వ్యవధిలో జరిగాయి. ఆ రెండు పరిణామాలను కేంద్రంగా చేసుకొని సిపిఐ ఆవిర్భావ చరిత్ర గూర్చి ఒక వివాదాస్పద చర్చ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో చాలా కాలంగా కొనసాగుతోంది.
పై రెండు సందర్భాల్లో కూడా సిపిఐ స్థాపన కై కొమింటర్న్ (కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్) తరతమ రూపాలలో రాజకీయ మార్గదర్శక పాత్రను పోషించడం విశేషం!
పై రెండింటిలో సిపిఐ ఆవిర్భావ దినం ఏదనేది చర్చనీయాంశంగా వుంది.
తాష్కెంటా కాన్పూరా?
తాష్కెంట్ సభను సిపిఐ ఆవిర్భావ పరిణామంగా గుర్తించాలని సిపిఎం భావిస్తూ వస్తోంది. కాన్పూర్ కాన్ఫరెన్స్ ని ఆవిర్భావ పరిణామంగా గుర్తించాలని సిపిఐ భావిస్తూ వస్తోంది. అందుబాటులో వున్న సమాచారం ప్రకారం, ముఖ్యంగా నా వ్యక్తిగత అధ్యయనం, పరిశీలనల మేరకు సిపిఐ ఎంఎల్ పార్టీలు ఈ అంశాన్ని నిర్ధారణ చేసినట్లు లేదు. కొన్ని ఎమ్ఎల్ పార్టీలు భవిష్యత్తులో సందర్బం వస్తే ప్రత్యేకంగా చరిత్ర మహాసభ (HISTORY CONGRESS) జరిపి నిర్ధారణ చేసుకోవాల్సిన అంశంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ చరిత్ర గూర్చి మా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ వైఖరి కొంత భిన్నమైనది. ఈ చారిత్రిక పరిణామం పై మా పార్టీ కూడా నిర్ధారణ చేయని మాట నిజమే. అదే సమయంలో ఈ చారిత్రిక పరిణామం నుండి దూరంగా కూడా లేదు. ఈ పరిణామం పట్ల నిర్ధిష్ట అవగాహన వుంది. ఆ వెలుగులో కాన్పూర్ కాన్ఫరెన్స్ కి నూరేళ్ల సందర్బంగా మా పార్టీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం గమనార్హం!
పై రెండు వాదనల వెనక బలమైన సమర్ధనీయ కారణాలు ఉండడం ఒక భౌతిక వాస్తవం. చరిత్రకు సంబందించి నిర్ధారణ చేయడానికి అదో సంక్లిష్ట రాజకీయ అంశంగానే ఉండడం గమనార్హం!
తాష్కెంట్ ఆవిర్భావ సమావేశం ఇండియా లోపలి ప్రాతినిధ్యంతో ఏర్పడలేదు. భారతదేశం కోసం దేశం బయటి కమ్యూనిస్టుల ద్వారా ఏర్పడింది. అదో భౌతిక వాస్తవం. కానీ కాన్పూర్ కాన్ఫరెన్స్ అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. దేశం లోపలి ప్రాతినిధ్యంతో ఏర్పడింది. ఇది మరొక భౌతిక వాస్తవం. అందుకే తాష్కెంట్ సమావేశాని కంటే కాన్పూర్ కాన్ఫరెన్స్ కి ఒక ప్రత్యేక రాజకీయ విశిష్టత వుందని మా పార్టీ భావిస్తోంది.
మరో విషయాన్ని కూడా చెప్పాలి. తాష్కెంట్ సభ కాన్ఫరెన్స్ కాదు. అది కేవలం కొందరు ప్రవాస భారత కమ్యూనిస్టులు సమావేశం జరుపుకొని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఏర్పడినట్లు ప్రకటన చేశారు. కాన్పూర్ సభ పూర్తి భిన్నమైనది. దేశంలో వివిధ కేంద్రాల కమ్యూనిస్టు బృందాల ప్రతినిధివర్గాలను ఒక ముందస్తు ప్రణాళికా బద్దంగా హాజరు పరిచి కాన్ఫరెన్స్ జరిపారు. ఈ రెండింటి మధ్య మౌలిక తేడా ఉండడం విశేషం.
తాష్కెంట్ సభ నాటికి బ్రిటిష్ ఇండియాలో వర్గ పోరాటాల్ని నడిపించి వర్గ సంఘాలు నిర్మించి, కమ్యూనిస్టు పార్టీ శాఖల నిర్మాణాల్ని నిర్మించిన రాజకీయ నేపథ్యం లేదు.
కాన్పూర్ సభ నాటికి కలకత్తా, బొంబాయి, మద్రాస్, లాహోరు, కాన్పూర్ వంటి కేంద్రాలు వర్గ పోరాట కేంద్రాలుగా మారాయి. లేదా క్రమంగా మారుతున్నాయి. అక్కడ కమ్యూనిస్టు పార్టీ శాఖలు కూడా తరతమ స్థాయిల్లో ఏర్పడి పని చేస్తున్నాయి. అంతేకాక మూడుసార్లు వరసగా పెషావర్ కుట్ర కేసులను కమ్యూనిస్టుల పై బ్రిటిష్ ప్రభుత్వం మోపి తీవ్ర అణచివేతకి దిగింది. తిరిగి కాన్పూర్ కుట్ర కేసు కూడా మోపింది. దీన్ని బట్టి దేశంలోని వివిధ కేంద్రాల్లో కమ్యూనిస్టు ఉద్యమ పునాదితో పాటు నిర్మాణ పునాది ఏదో ఒక మేరకు ఏర్పడ్డ లేదా ఏర్పడుతున్న స్థితి వుందని అర్ధమౌతుంది. పరిమితంగానైనా వివిధ కేంద్రాల్లో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ, నిర్మాణ పునాదులతో కాన్పూర్ సభ జరిగిందని స్పష్టంగా అర్ధమౌతుంది. ఈ రీత్యా కూడా తాష్కెంట్ సభ కంటే కాన్పూర్ సభకు రాజకీయ ప్రాధాన్యత వుందని మా పార్టీకి ఒక స్పష్టత వుంది. అందుకే కాన్పూర్ సభకు నూరేళ్ల సందర్బంగా మా పార్టీ దేశవ్యాపిత చారిత్రిక సంస్మరణ కార్యక్రమం ప్రకటించడం గమనార్హం!
పైన పేర్కొన్నట్లు మా పార్టీ కూడా పై వాదనలు రెండింటిలో ఏ వాదన సరైనదనే అంశం గూర్చి నిర్ధారణ చేయలేదు. అదే సమయంలో భవిష్యత్తు చరిత్ర కాంగ్రెస్ (హిస్టరీ కాంగ్రెస్) కి వదిలివేసి ఈ నూరేళ్ళ సందర్భానికి దూరంగా గానీ, మౌనంగా గానీ మా పార్టీ లేదు. భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టుక గూర్చి నిర్ధారణ కాలేదనే పేరిట ప్రస్తుత నూరేళ్ళ సందర్భానికి దూరంగా ఉండకపోగా దేశవ్యాపిత కార్యక్రమం చేపట్టడం గమనార్హం!
మా పార్టీ కేంద్ర కమిటీ 24-12-2025 తేదీన కోలకొత్తాలో ప్రత్యేకంగా నూరేళ్ళ సందర్బ సభని జరిపింది. ఈ సందర్బంగా మిత్రులు, కామ్రేడ్స్ కి ఒక స్పష్టత ఇవ్వాల్సి వుంది. భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టుకకి నూరేళ్లు నిండిన సందర్బ సభగా మా పార్టీ నిర్వహించలేదు. కేవలం కాన్పూర్ కాన్ఫరెన్స్ కి నూరేళ్లు నిండిన సందర్బ సభగా నిర్వహించింది. భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టుక పరిణామానికి నూరేళ్ళ సందర్భ సభ ఒక కోవలోకి వస్తుంది. కాన్పూర్ కాన్ఫరెన్స్ కి నూరేళ్లు నిండిన సందర్భ సభ మరో కోవలోకి వస్తుంది. ఈ రెండింటి మధ్య గుణాత్మక తేడా ఉండడం గమనార్హం!
భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టుక 1925 లో జరిగిందని నిర్ధారణకు వచ్చినట్లయితే దానికంటే ముందు 1920 నుండే సాగిన కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ, నిర్మాణ కృషికి చరిత్రలో స్థానం లేకుండా పోతుందా? ఇదో ప్రశ్న! ఒకవేళ 1920 సభను ప్రాతిపదికగా తీసుకుంటే, దేశంలో వర్గ పోరాటాల్లో ఏర్పడ్డ వర్గ నిర్మాణాలు లేకుండా, అదే విధంగా కనీస కమ్యూనిస్టు పార్టీ శాఖలు కూడా లేకుండా జరిగిన సమావేశాన్ని ఆవిర్భావ పరిణామంగా గుర్తించడం చారిత్రికంగా సమర్ధనీయమా? ఇది మరో ప్రశ్న! ఈ రెండు ప్రశ్నల వెనక బలమైన చారిత్రిక, రాజకీయ సమర్ధనీయ కారణాలు ఉండడం గమనార్హం! అందుకే దీని నిర్ధారణ సంక్లిష్ట చారిత్రిక అంశం.
1921 లో అహ్మదాబాద్ భారత జాతీయ కాంగ్రెస్ కి హాజరైన ప్రతినిధులకి కమ్యూనిస్టు ప్రతినిధులు డ్రాఫ్ట్ మేనిఫెస్టో పంపిణీ చేశారు. ఆనాడు అది కమ్యూనిస్టు బృందం సృష్టించిన ఓ సంచలనం. మరుసటి ఏడాది 1922 భారత జాతీయ కాంగ్రెస్ గయ మహాసభలో సంపూర్ణ స్వాతంత్య్రం కోరుతూ బొంబాయి కమ్యూనిస్టు బృందం ఓ ముసయిదా తీర్మానాన్ని ప్రతిపాదించడం విశేషం. 37 ఏండ్ల సుదీర్ఘ కాంగ్రెస్ చరిత్రలో మొదటిసారి దాన్ని లేవనేత్తిన ఘనత కమ్యూనిస్టులకే దక్కింది. అది వారు సృష్టించిన మరో సంచలన రాజకీయ పరిణామం. అందులోనే మద్రాస్ కమ్యూనిస్టు బృందం కార్మికవర్గ మేనిఫెస్టోని ప్రతిపాదించి ఆమోదం పొందడం మరో విశేషం. 1922 నుండి బొంబాయి కేంద్రంగా "సోషలిస్టు" పత్రిక నడవడం, 1923 లో మద్రాస్ లో తొలి మేడే నిర్వహించి, ఆ వెంటనే "కిసాన్ లేబర్ పార్టీ ఆఫ్ హిందూస్తాన్" స్థాపన వంటి పరిణామాలు కమ్యూనిస్టుల రాజకీయ ప్రతిష్టను పెంచింది. ఇవి ఏవీ చిన్న పరిణామాలు కాదు. ముఖ్యంగా 1923 పెషావర్ కుట్ర కేసులు, 1924 కాన్పూర్ కుట్ర కేసు నేపథ్యం చిన్నదేమీ కాదు. నిజానికి ఇవన్నీ భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో అంతర్భాగమే. పైగా లెనిన్ సారథ్యంలో మనదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కోసం 1920 నుండే కోమింటర్న్ కృషి చేపట్టింది. అందుకే 1925 కాన్పూర్ సభతో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి మొదలైనట్లు చెప్పడం సమర్ధనీయం కాదనే వాదనకు సమర్ధనీయ, బలమైన రాజకీయ కారణాలు వున్నాయి.
నాణేనికి మరో కోణం కూడా వుంది. సిపిఐ కేంద్ర కమిటీకి 1958 లో సోదర ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఒక లేఖ రాసింది. ప్రపంచ, ఆసియా దేశాల్లో కమ్యూనిస్టు పార్టీ చరిత్ర రచించే పనికి పూనుకొని భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ చరిత్ర గూర్చి లేఖలో వివరణ కోరింది. ఆ సందర్బంగా సిపిఐ కేంద్ర కార్యదర్శివర్గం సమావేశమై 1925 లో కాన్పూర్ కాన్ఫరెన్స్ ని ప్రాతిపదిక సంవత్సరంగా ఏకగ్రీవంగా నిర్ధారణ చేసి తెలియజేసింది. అవిభక్త కమ్యూనిస్టు పార్టీ చేసిన ఆ నిర్ణయానికి విరుద్ధంగా 1920 సభను ప్రాతిపదిక సంవత్సరంగా నిర్ధారణ చేయడం క్లిష్టమైనది. అదో సున్నిత రాజకీయ సమస్యే! అందుకే మా పార్టీ చరిత్ర నిర్ధారణలోకి వెళ్లడం లేదు. అలాగని నూరేళ్ళ సందర్భానికి దూరంగా కూడా లేదు.
కాన్పూర్ కాన్ఫరెన్స్ కి నూరేళ్ల సందర్బ సభగా మాత్రమే కోల్కతాలో మొన్న మా పార్టీ సభని నిర్వహించడం ప్రత్యేక గమనార్హం. అంతేతప్ప భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టి నూరేళ్లు నిండిన సందర్భ సభగా మా పార్టీ నిర్వహించ లేదు.
మరో అంశాన్ని గుర్తు చేయాలి. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ చరిత్రను పరిశీలిస్తే సమ్మేళనం (కాన్ఫరెన్స్), మహాసభ (కాంగ్రెస్) ఒకటి కాదని అర్ధమౌతుంది. రెండింటి మధ్య మౌలిక తేడా వుంది. కాన్పూర్ లో నూరేళ్ళ క్రితం జరిగిన సభ కాన్ఫరెన్స్ తప్ప కాంగ్రెస్ కాదు. సిపిఐ మొదటి మహాసభ (కాంగ్రెస్) 1943 లో బొంబాయిలో జరిగింది. దీన్నిబట్టి కాన్పూర్ సభ మహాసభ క్రిందికి రాదని అర్ధమౌతున్నది. భారత కమ్యూనిస్టు పార్టీ 1943 వరకూ మహాసభ కూడా జరుపుకోలేదంటే, 1925 కాన్పూర్ కాన్ఫరెన్స్ ఎలా కాంగ్రెస్ అవుతుంది? అది సభ్యత్వం ప్రాతిపదికన ప్రతినిధుల ఎంపిక జరిగి దిగువ స్థాయి నుండి నిర్వహిస్తే వాటిని కాంగ్రెస్ అంటారు. కాన్పూర్ సభ ఆ కోవలోకి రాదు. అది తాష్కెంట్ సమావేశంలా ఓ బృందం సమావేశమై పార్టీ స్థాపన జరిపినట్లు ప్రకటన చేసిందైతే కాదు. దేశం నలుమూలల్లోని కమ్యూనిస్టు బృందాల ప్రతినిధివర్గాల్ని పిలిచి పార్టీని ఏర్పాటు చేసింది. అదే సమయంలో అది దిగువ స్థాయి నుండి ఎగువ స్థాయి వరకు పార్టీ మహాసభలు జరుపుకొని నిర్వహించింది కాదు.
1920 లో సమావేశం జరిగింది. 1925 లో సమ్మేళనం జరిగింది. 1943 నుండి వరసగా మహాసభలు జరిగాయి. ఈ మూడింటి మధ్య గల తేడాల పట్ల స్పష్టత వుండాల్సి వుంది.
భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ చరిత్ర పట్ల ఎవరి వాదనలు వారికి వుంటాయి. ఇది ఆయా పార్టీల వాదనల పై చర్చ కోసం రాస్తున్నది కాదు. ఏఏ వాదనలు ఏఏ పార్టీలు చేస్తున్నాయో తెలియజేసే ఉద్దేశ్యంతో చేసిన ఒక ప్రయత్నమిది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ చరిత్ర పట్ల ప్రత్యేక ఆసక్తిగల జిజ్ఞాసపరుల కోసం స్పష్టత ఇస్తున్నది. పరిమిత దృష్టికోణంతో మిత్రులు, కామ్రేడ్స్ స్వీకరిస్తారని ఆశిస్తున్నా.
(పి ప్రసాద్ ,సిపిఐ ఎం (న్యూ డెమెక్రసీ) నాయకుడు)
Next Story

