విజయవాడలో పాక ఇడ్లీ
హోటల్ స్ఫూర్తి సుందరయ్య నుంచి సాయిగా మారటం వింతే. అయితే, పేరు మారినా ఇడ్లి నాణ్యత అలాగే ఉన్నందుకు సంతోషం.
తిండి యాత్రలన్నా నాకు భలే ఇష్టం. దేశంలో ఏ మూలనయినా ప్రత్యేకమని తెలిస్తే చాలు పోయి తినొచ్చేది. ప్రపంచ దేశాల తిండ్లు అమెరికాలోను, లండన్ లోను దొరుకుతాయి గనుక ప్రతి దేశమూ పోనక్కరలేదు.
ముళబాగల్ దోసె కోసం అది పనిగా పోయి తిని రావటం, దావణగిరి దోసె కోసం ఆ వూరికి పోయి రావటం, బుహరీ బిరియాని, పాయ కోసం మద్రాసు పోవటం, వెనకటి రోజుల్లోనయితే మద్రాసు పానగల్ పార్కు దగ్గరలో హమీదియాలో పాయ కోసం అది పనిగా పోయి వచ్చే వాణ్ణి.
ప్రతి వూరికీ వొక సిగ్నేచర్ తిండి (Signature Dish) ఉంటుంది. మా తిరుపతిలో తుంట మిరక్కాయ బజ్జీ, బజారు వీధి పకోడీ, రేణిగుంట ఆపాలు, మొగిలిలో చెని గుంటలు, మురుగులు, మదనపల్లెలోరంగన్న మసాల దోసెలు, ప్రొద్దుటూరులో అమ్మవారి వీధి దోసెలు, మార్కెట్టులో కడ్డీచియ్యలు, తంగెడుపల్లి స్వీటు, వెంకటగిరిలో కమలమ్మ మైసూరు పాకు,మా ఈదరపల్లి మూకటకారం ,వేంపల్లిలో నన్నారి,అనంతపురం కమలానగర్ దోసెలు, పోలీలు, నంది కొట్కూరు ఉగ్గాణి ,మధురైలో తలకాయ కూర-ఇట్లా ప్రతి ఊరికి ఒక ప్రత్యేకమయిన,అద్భుతమయిన రుచికరమయిన తిండి ఉంటుంది. మచ్చుకు కొన్ని మాత్రమే చెబుతున్నా.
మేము విరసంలో వుండిన రోజుల్లో విజయవాడ పోయినప్పుడు తప్పనిసరిగా బాబాయి ఇడ్లిలు తినకుండా రాము. త్రిపురనేని మధుసూదనరావు, మహాకవి శ్రీశ్రీ లతో ఆ నేతి ఇడ్లీలు అల్లం ఊరుబిండి తో తినటం వొక గొప్ప అనుభవం.
ఆ తర్వాత విజయవాడ మునిసిపల్ ఉద్యోగుల కాలనీలో ఉన్న పాక ఇడ్లి అంటే నాకు మహా ఇష్టం. రెండు పదుల తర్వాత మొన్న అది పనిగా పాక ఇడ్లి కోసం, పుస్తక ప్రదర్శన కోసమూ పోయి చూసినా. ఇడ్లి అంతే తాజాగా ఉండడం చాలా సంతోషంగా అనిపించింది.
నాలుగు దశాబ్దాల మునుపు మేడసాని మల్లిఖార్జున రావు ఈ ఇడ్లి కొట్టును ప్రారంభించాడు. ఆయన నికార్సయిన కమ్యూనిస్టు కార్యకర్త. పుచ్చలపల్లి సుందరయ్య గారికి వీరాభిమాని. ఆ చిత్తశుద్ధి వల్లనే ఈ పాక కొట్టును శుచిగా, శుభ్రంగా చల్లటి నీడన, కడప బండలతో ముచ్చటగా తయారు చేసినాడు.
ఇక్కడ రకరకాల ఇడ్లీలు మాత్రమే దొరుకుతాయి. రెస్టారెంటులో సుందరయ్యగారి పెద్ద సైజు చిత్రపటం ప్రత్యేక ఆకర్షణ. సరసమైన ధరలతో ప్లేటుకు మూడు వేడి వేడి ఇడ్లీలు నేరుగా మనమే తెచ్చుకుంటే అక్కడ నిలబడిన కార్మికులు వొకరొకరుగా చేనగ్గింజల ఊరు బిండి ,అల్లం పచ్చడి,సాంబారు ,నెయ్యి పాకెట్టుతో సిద్ధంగా ఉంటారు.
ఇడ్లిలోకి పొడి ప్రత్యేకం. అట్లా తుంచి నాలుకకు చేరిస్తే సర్రన కరిగిపోవటమే. ఆవురావురమని తినేయాల్సిందే. అంత రుచిగా ఉన్నాయి. మూడనుకున్న వాణ్ణి ఆరు లాగించి పారేసినాను. ఆ రోజులనాటి రుచి అలాగే ఉంది. కొట్టు మధ్యలో నీటి కుండలు అదొక ఆకర్షణ. మజ్జిగ, ఉలవచారు, లస్సీ,సున్నుండలు కూడా దొరుకుతున్నాయి.
ప్రస్తుతం మల్లిఖార్జునరావు గారి కొడుకు కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో నడుస్తున్నది. దీని పేరు ట్రిపుల్ ( SSS) గా ప్రసిద్ధి. అంటే SRI SATYA SAI రెస్టారెంటు. సుందరయ్య గారి నుంచి సాయిగా మారటం వింతే. పేరు మారినా ఇడ్లి నాణ్యతా అలాగే ఉన్నందుకు సంతోషం.
బాబాయి హోటల్ కి ఉన్నంత పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, మొన్న మొన్న మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు పాక ఇడ్లిలు ఆరగించటం వల్ల బాగా ప్రాచుర్యమయింది. బాబాయి హోటల్ కయితే సినిమా నటులు, రాజకీయ నాయకులు, కవులు, రచయితలు, తొలినుండి వస్తుండటం వల్ల చాలా ప్రసిద్ధి చెందిన రెస్టారెంట్లలో వారి మెనూలో బాబాయి ఇడ్లి తప్పని సరైంది. పైగా జంధ్యాల దర్శకత్వంలో బాబాయి హోటల్ సినిమా కూడా వచ్చింది.
ఏదయితేనిం ఈ పాక ఇడ్లి నాణ్యంగా,నాజుగ్గా ,నోట్లో సర్రున కరిగిపోయేట్టుగా ఉంది.
మనిషి అన్ని అలవాట్లతో పాటు తిండ్ల అలవాట్లు కూడా అలవరచుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం. నడతకు నడతా. బయట తిండ్లంటే పనికిమాలినవేనని అనుకోవద్దు. ఇట్టాంటివి కమిటెడ్ గా ఉన్నవి కూడా ఉన్నాయి.
మాయాబజారూ ముందు తర్వాత తిండ్ల గురించి ఎంత విని వుంటాము ,చదివి వుంటామూ. తరచి వెదకి చూస్తే మీకు మీ ఊళ్ళో అపురూపమైన ఇంటి రుచి ,నాణ్యంగా ఎక్కడో ఒకచోట దొరక్కపోదు వెతకండి.