జ్ఞానపీఠాన్ని అధిష్టించిన చిత్రసుందరి
x

జ్ఞానపీఠాన్ని అధిష్టించిన "చిత్రసుందరి"

ఇది ఒక మహత్తర నవలకు కథాంకురం. రచయిత సమాజంలో అంతర్భాగం అయినపుడు రచన సమాజాన్ని తనలో ప్రతిబింబిస్తుంది.

"అందంగా జీవించడం నేర్చుకో,

వీలైనంతవరకూ

జీవితాన్ని ఆనందమయం చేసుకో,

వీలుకాలేదని దాన్ని

వికారంగా మాత్రం మార్చుకోవద్దు."

ఇది ఒక మహత్తర నవలకు కథాంకురం. రచయిత సమాజంలో అంతర్భాగం అయినపుడు రచన సమాజాన్ని తనలో ప్రతిబింబిస్తుంది. అది అంతటితో సరిపెట్టుకోదు. ఆ సమాజం ఒక అడుగు ముందుకు వేసేందుకు ప్రేరేపిస్తుంది. ప్రోత్సహిస్తుంది. ఆ పనిని కళాత్మకంగానే చేస్తుంది. దానినే ఉత్తమ రచన అంటారు. ఆ రచన భాష, ప్రాంతం, దేశం అనే పరిధులను అధిగమిస్తుంది. కాలాన్నీ జయిస్తుంది. "చిత్తిరప్పావై" తమిళ నవల (తెలుగు అనువాదం చిత్రసుందరి విషయంలోనూ అదే జరిగింది.

....."ఆ అదురుబాటులోంచి పుట్టిన కల్పనా బీజం నా హృదయ సముద్రంలోని ఆలిచిప్పలో వానచినుకులా పడింది. దాదాపు రెండేళ్ళపాటు నన్ను వెంటాడుతూనే ఉంది. ఇలాంటి సంఘటనలెన్నో నాకు గుర్తు వచ్చాయి. భార్యకన్నా, కన్నబిడ్డల కన్నా, ఆప్త మిత్రులకన్నా, అయినవారికన్నా డబ్బొక్కటే ఎక్కువ అనుకునేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది కదా! ఇలాంటి కొందరి చేతుల్లోపడి నేను కూడా ఆర్థికంగా మోసపోయిన సందర్భాలున్నాయి. తన జీవితానుభవాలతోనే రచయిత సాహిత్యరూపాలు సంతరిస్తాడు కదా!" అన్నారు ప్రముఖ తమిళ రచయిత అఖిలన్ తన నవల "చిత్తిరప్పావై" ముందు మాటలో.

ఎవరీ అఖిలన్? ఎందుకీ ప్రకటన చేశారు?

తమిళనాట ఉద్దండ రచయిత అఖిలాండమ్. అఖిలన్ గా ప్రసిద్ధుడు. మనదేశంలో సాహిత్య రంగంలో అత్యున్నతమైన జ్ఞానపీఠం పురస్కారం 1975లో ఈయన రచనకు లభించింది. ఆ రచనే "చిత్తిరప్పావై" నవల. అఖిలన్ గారికి, వారికి పరిచయస్తులయిన కొందరికి కలిగిన జీవిత అనుభవాల ప్రేరణతో సాగిన రచన ఇది. పైన పేర్కొన్న ప్రకటన దానికి సంబంధించినదే.

1967 మనకు స్వాతంత్ర్యం వచ్చి సరిగ్గా 20 ఏళ్ళు. 'ఆనంద వికటన్' అనే ప్రముఖ తమిళ వారపత్రికలో "చిత్తిరప్పావై" నవల ధారావాహిక (సీరియల్)గా ప్రచురితం అయింది. సీరియల్ ముగిశాక రచయితపై ఉత్తరాల దాడి జరిగింది. "భర్త ఎంత దుర్మార్గుడయినా భార్య భరించాల్సిందే' అనే తమిళ సంప్రదాయాన్ని ముగింపులో పాటించలేదని రచయితనూ, పత్రికనూ విమర్శించారు తమిళ పురుషులు. కానీ "నవల చదివిన స్త్రీలు ఆ ముగింపుకు ఆదరణ అందజేశారు." అన్నారు రచయిత.

ఏమిటి నవల? దీని ప్రాధాన్యత ఏమిటి?

కళాకారులు, కళారాధకులు, కళే జీవితమనుకునేవారి జీవనయానం ఈ కథ. విలువలతో బతకాలనే తపనతో తనువు చాలించిన ఒక కష్టజీవి కుటుంబం కథ. పరుల జీవితాలను ధ్వంసం చేసి ఆ పునాదుల మీద భవంతులు కట్టుకునే ఒక స్వార్ధం కథ.

ఈ నవలలో అణ్ణామలై కథానాయకుడు. గొప్పచిత్రకారుడు. లౌకిక వ్యవహారాల్లో అమాయకుడు. ఆనంది కథానాయకి. కళారాధకురాలు. దుర్మార్గుడి ఉచ్చులో చిక్కువడి సంప్రదాయ భావనలకు తనకుతాను బందీగా జీవితాన్ని ప్రారంభించి తీవ్ర అణచివేతకు గురై ఆవేదనకు లోనై అంతిమంగా తిరుగుబాటు బావుటా నెగరేస్తుంది. కదిరేశన్ ఆనంది తండ్రి. చిత్రకళాశాల నుండి పదవీవిరమణ చేసిన ప్రధాన ఆచార్యుడు. గొప్పశిల్పి, చిత్రకళావేత్త. కళా సౌకుమర్యాన్ని, సౌందర్యాన్నీ జీవితానికి అన్వయింపచేసుకున్న వ్యక్తి. యవ్వన ప్రాయంలో కుల కట్టుబాట్లను ధిక్కరించి వితంతువును పెళ్ళాడి ఆమెను ప్రేమించి ఆరాధించినవాడు. గంభీరుడు. శారద కథానాయకి స్నేహితులు. ఆర్ట్స్ కళాశాలలో అన్నామలై సహాధ్యాయి. స్నేహం పట్ల గొప్పనిబద్ధత గల యువతి. ప్రేమైక జీవుల ఆశలు, ఆశయాలను నెరవేర్చేందుకు అవమానాలు, ఛీత్కారాలు ఎదురైనప్పటికీ వాటిని లెక్కచేయక త్రికరణ శుద్ధిగా శ్రమించి వారికి వెన్నుదన్నుగా నిలిచిన కార్యశీలి. సంప్రదాయ భావనల బందీ అయిన ఆనంది మనసులో తిరుగుబాటుకు ప్రేరకులు. ఒక ఉదాత్త పాత్ర. శరవణన్ కళా జ్యోతి పత్రిక సంపాదకుడు. విలువలకు ప్రాముఖ్యతను ఇచ్చే మేధావి. గొప్ప సంస్కారి. వీళ్ళు చిత్ర కళా రంగానికి చెందిన వారు. మద్రాసు మహానగరంలో రెక్కలుముక్కలు చేసుకునే కార్మికుడి స్థాయినుండి నిర్మాణరంగంలో మే స్త్రీ గా ఎదిగిన కష్టజీవి, లౌక్యం తెలిసిన దిగువ మధ్యతరగతి నుండి మధ్యతరగతికి చేరిన కుటుంబీకుడు, చిదంబరం మేస్త్రీ. కానీ మోసం, దగాను దరిచేరనియ్యని వాడు. తాను పాలుపోసి పెంచిన పాము కాటుకు గురైనవాడు. ఆ చిదంబరం మేస్త్రీ నీడన పెరిగిన వాడు, అతని సహకారంతో సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసిన మాణిక్యం ప్రతినాయకుడు. పరమ స్వార్థపరుడు. దుష్ట పన్నగంతో ఆనందిని పెళ్ళి చేసుకుంటాడు. అటు కదిరేశన్ ఆస్తిని, ఇటు మేస్త్రీ చిదంబరం ఆస్తిని హస్తగతం చేసుకుంటాడు. కాముకుడు. పగబట్టిన నల్లత్రాచుతో పోల్చాడు రచయిత ఒకానొక సందర్భంలో. చిదంబరం మేస్త్రీ స్నేహితుడు దండపాణి కమీషను ఏజెంటు, వ్యాపారి. మధ్యతరగతికి చెందినవాడు. దండపాణి కూతురు సుందరి. ఆమె దృష్టిలో జీవితం అంటే విలాసం. తనమాటే నెగ్గాలనే మొండితనం. ఆధిపత్య స్వభావం ఆమె సొంతం. ఆ స్వభావానికే తనను తాను బలిగావించుకుంది. ఈ ప్రధాన పాత్రల నడుమ నడచిన కథనం, జరిగిన సంఘర్షణే ఈ నవల.

"మానవుణ్ణి మానవోత్తముణ్ణిగా చేయగలిగేది అతనిలోని మానవత్వమే. ఏ కళాసాధనలోనైనా యింతకుమించిన విలువ ఏముంటుంది?" అన్నారు అఖిలన్, కళాతత్వవేత్త కదిరేశన్ పాత్ర ద్వారా.

నిజమే, ఇది 57ఏళనాటి రచనే. ఇప్పుడు ఆ రచయితా లేరు. అనువాదకుడూ లేరు. కానీ "చిత్రసుందరి" నవల ఇప్పటికీ సజీవసుందరే! ఎందుకంటే ఇప్పుడు ఈతరం వారు ఈ నవలచదివితే మన సమాజం, మన జీవితాలు మొత్తంగా మానవ స్వభావ పరిణామం, ఈ క్రమంలో వచ్చిన ఫలితాలు అవగతం అవుతాయి. ఆ ఫలితాలు ఊర్థ్వ ముఖంగా ఉన్నాయా, అథోముఖంగా ఉన్నాయా ? ఈ ప్రశ్నకు సరియైన సమాధానం వస్తే మనకు, మన సమాజానికీ నేడు ఏమికావాలో అవగతం అవుతుంది.

జ్ఞానపీఠం పురస్కారాన్ని అందుకోవడానికి ముందే ఈ నవలను సంక్షిప్తరూపంలో నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్ బి టి) సంస్థ హిందీ, ఉర్దూ, కన్నడం తదితర భారతీయ భాషలలోకి అనువదించి ప్రచురించింది. అందులో సంపూర్ణత లోపించిందని అఖిలన్ భావించారు. అందువల్ల తిరిగి హిందీ, ఆంగ్లం, గుజరాతీ, ఒరియా, మళయాళీ భాషల్లోకి అనువదించి ప్రచురించారు. తెలుగునాట ప్రసిద్ధ కథకుడు, నవలా రచయిత మధురాంతకం రాజారాం ఈ నవలను"చిత్రసుందరి" పేరుతో తెలుగులోకి అనువదించారు. పేర్లు మినహాయిస్తే అదొక స్వతత్ర రచనగానే అనిపిస్తుంది. అనువాదం అయినప్పటికీ తెలుగు భాష సొగసును అద్భుతంగా ఆవిష్కరించారు మధురాంతకం వారు. 1981నవంబరులో విజయవాడకు చెందిన శ్రీకమలా ప్రచురణాలయం ప్రచురించింది. మూడు దశాబ్దాల అనంతరం 2014 నవంబరులో విశాలాంధ్ర ప్రచురణాలయం పునర్ముద్రించింది.

చిత్రసుందరి ఒక రసవత్తర నవల. అసంబద్ధ సంప్రదాయంపై ఒక తిరుగుబాటు. సున్నిత మనస్కులైన కళాకారుల జీవితపు నిలువుటద్దం.


Read More
Next Story