‘చెమట చెక్కిన వాక్యం’ కవిత్వ పరామర్శలో కొత్త దారి
x

‘చెమట చెక్కిన వాక్యం’ కవిత్వ పరామర్శలో కొత్త దారి

ప్రముఖ కవి, విమర్శకుడు గుంటూరు లక్ష్మీ నరసయ్య పుస్తక పరామర్శ



తెలుగు కవిత్వ విమర్శలో పదునైన ఆయుధంగా కెంగార మోహన్ రాసిన ‘చెమట చెక్కిన వాక్యం’ నిలుస్తుందని ప్రముఖ కవి, విమర్శకుడు గుంటూరు లక్ష్మీ నరసయ్య అన్నారు. ఆదివారం ఉదయం విజయవాడలోని బాలోత్సవభవన్ లో ‘చెమట చెక్కిన వాక్యం’ కవిత్వ పరామర్శ గ్రంధాన్ని ఆయన ఆవిష్కరించారు. సభకు ‘సాహితీ స్రవంతి’ మాజీ రాష్ట్ర అధ్యక్షులు వరప్రసాద్ అధ్యక్షత వహించారు.

60 కవిత్వ పుస్తకాలను లోతైన దృక్పథంతో మార్క్సిస్ట్ కోణంలో చూడడం సామాజిక కోణంలో విశ్లేషించడం చేశారని మానవీయ కోణంలో వివరించడం ఈ పరామర్శ ప్రత్యేకత అన్నారు. ప్రసిద్ధ కవులు మొదలుకొని వర్తమాన కవుల సంపుటాలను తనదైన శైలిలో పరిచయం చేయడం వల్ల ఈ గ్రంథం వైవిధ్యతను సంతరించుకున్నదని ఆయన అన్నారు.

ప్రముఖ కవి జి.వెంకటకృష్ణ మాట్లాడుతూ ఈ చెమట చెక్కిన వాక్యాన్ని వివిధ కోణాల్లో విశ్లేషించినప్పుడు స్థానిక కవులు మొదలు అంతర్జాతీయ కవుల వరకు పరిచయం చేయడం అరుదైన సందర్భంగా. కే శివారెడ్డి, లోసారి సుధాకర్ గుంటూరు శేషేంద్ర శర్మ, సి.నారాయణరెడ్డి, అప్సర్ కవులు మొదలుకొని అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ప్రపంచ విప్లవకారుడు పాబ్లో నేరుడా ఇరానియన్ కవి అబ్బాస్ కియరోస్తమి కవుల కవిత్వాలను విమర్శనాత్మక దృక్పథంతో చూశాడని అనేక సూత్రీకరణలు ఇందులో కనిపిస్తాయని అన్నారు. ముందుమాటలో డార్విన్, సిగ్మాండ్ ఫ్రైడ్ కార్ల మార్క్స్ మొదలైన వారి జీవితాలను చదివినప్పుడు ఆధునిక సాహిత్యానికి భూమిక ఏర్పడుతుందని చెప్పడం భిన్నంగా ఉందన్నారు.




ఇటివల కాలంలో వచ్చిన విమర్శ గ్రంథాల్లో ముందు వరుసలో ఉంటుందన్నారు. ప్రముఖ కవి, ఏ సి బి అడిషనల్ ఎస్పీ లోసారి సుధాకర్ మాట్లాడుతూ ఈ కవిత్వ విమర్శ గ్రంధం విమర్శకు కొత్తదారులు పరిచిందన్నారు. ప్రగతిశీల సాహిత్య దృక్పథాన్ని ఈ గ్రంథం ధ్రువీకరించగలిగిందని అన్నారు. కవి దృక్పథాన్ని కవిత్వ దృక్పథాన్ని బేరీజు వేసి సరికొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినట్లు అయిందన్నారు. కవిత్వ లోకంలో ఉంటున్న వర్ధమాన వర్తమాన కవులకు ఈ గ్రంథం పాఠ్యపుస్తకం అన్నారు.


దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ప్రగతిశీల సాహిత్యాన్ని మాత్రమే ఎంచుకోవడం వల్ల ఈ రచన విభిన్నంగా కనిపిస్తుందని అన్నారు. సామాజిక ఉద్యమాలు బహుజన ఉద్యమాలు మైనార్టీ ఉద్యమాలు వివిధ అస్తిత్వ ఉద్యమాల కవులను ప్రత్యేకంగా పేర్కొనడం వల్ల ఈ కవిత్వ గ్రంథం తెలుగు సాహిత్య లోకంలో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకుంటుందని అన్నారు.




వరప్రసాద్ మాట్లాడుతూ ఈ గ్రంథం కవిత్వాన్ని మాత్రమే ఎంచుకోవడం కవిత్వపు లోతులను స్పృశించడం వల్ల విమర్శ విస్తృతి పెరిగిందన్నారు. కవిత్వంలో వస్తు శిల్ప వైవిధ్యాలను చెబుతూ ఎత్తుగడలను విశ్లేషిస్తూ కవిత్వం అంటే ఇలా అని ధైర్యంగా చెప్పగలిగారని అన్నారు. స్పందనగా కెంగార మోహన్ మాట్లాడుతూ కవిత్వాన్ని ప్రాంతాలకతీతంగా వర్గాలకతీతంగా తీసుకోవడం జరిగిందని కవిని కవిత్వాన్ని సామాజిక మార్పు దిశగా నడిపించడమే తన లక్ష్యమని అన్నారు.


వర్తమాన సాహిత్యంలో అనేక ధోరణులు కలగాపులగం చేస్తున్న సందర్భంలో గొప్ప విమర్శతో తెలుగు సాహిత్యంలో కవిత్వాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలన్న లక్ష్యంతో ఈ గ్రంథం రాయడం జరిగిందన్నారు. ఈ గ్రంథాన్ని కవులు విమర్శకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. సభలో తొలిప్రతిని ప్రముఖ కథారచయిత మారుతి పౌరోహితంకు అందించారు. ఈ కార్యక్రమంలో కవులు శిఖామణి, వైష్ణవి శ్రీ, సత్యాజి, జాషువా విజ్ఞాన కేంద్రం కార్యదర్శి నారాయణరావు, సాహితీ స్రవంతి నంద్యాల జిల్లా కార్యదర్శి నీలం వెంకటేశ్వర్లు, గుడివాడ కార్యదర్శి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. సభను సాహితీ స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సత్య రంజన్ ప్రారంభించగా, సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు వందన సమర్పణ చేశారు.


Read More
Next Story