ఆంధ్రాలో  బర్డ్ ఫ్లూ హై ఎలెర్ట్.  మరిపుడు చికెన్ తినవచ్చా?
x

ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ హై ఎలెర్ట్. మరిపుడు చికెన్ తినవచ్చా?

వెటర్నేరియన్. ఎం గోవిందరాజ భాస్కర్ ఏమంటున్నారంటే...



ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని నర్సరావుపేటలో ఇటీవల H5N1 వైరస్ (Bird Flu or Avian Influenza) కారణంగా ఓ చిన్నారి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదు. కానీ, చిన్నారి ఈ ప్రమాదకర వైరస్ బారిన పడిన సంగతి వెలుగులోకి రావడంతో అందరిలోనూ భయాందోళనలు పెరిగాయి. మీడియా రిపోర్టుల ప్రకారం పాపకి తల్లితండ్రులు ఒక కోడి మాంసం పచ్చి ముక్కని ఇచ్చారు. అది తినడంతో ఆమెకు బర్డ్ ఫ్లూ సోకి చనిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూవల్ల సంభవించిన తొలిమరణం (మార్చి 16). 2021 లో హర్యానాలో సంభవించిన ఇలాంటి మరణం తర్వాత ఆంధ్రా బాలిక మరణం రెండోది. ఆమె శరీరం నుంచి సేకరించిన శాంపిల్స్ లో బర్డ్ ఫ్లూ వైరస్ కనిపించింది. దీనితో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హైఎలర్డ్ ప్రకంటించింది. బర్డ్ ఫ్లూ జ్వరాలకోసం స్క్రీనింగ్ మొదలుపెట్టాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
వైరస్ వ్యాప్తికి అసలు కారణం ఏమిటి?
వైద్య నిపుణుల ప్రకారం, ఈ సంఘటనకు ప్రధాన కారణం అపరిపక్వంగా వండిన మాంసం తినడమే. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం ప్రకారం, మాంసం కట్ చేసేటప్పుడు చిన్నారికి పచ్చి మాంసం తినిపించారని తెలిపారు. దాంతో, రెండు రోజుల తర్వాత చిన్నారిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి.
పచ్చి లేదా సరిగ్గా ఉడికించని మాంసం వల్ల H5N1 వైరస్ జీవించి ఉండే అవకాశం ఉంది. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే తీవ్రమైన అనారోగ్యానికి దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుంటూరు జిల్లా కేసు కోళ్ల నుంచి మనుషులకు వ్యాపించినది కాదు, పచ్చి మాంసం తిన్నందున వచ్చిందని అధికారులు చెప్పారు.
బర్డ్ ఫ్లూ ఎలా వ్యాపిస్తుంది?
బర్డ్ ఫ్లూ (influenza H5N1 virus) వైరస్ పక్షులలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ, వైరస్ సోకిన కోళ్లు, వాటి మాంసం, గుడ్లు సరిగ్గా వండకుండా తింటే మానవులకు కూడా ఇది సంక్రమించే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా, మాంసం లేదా గుడ్లను తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తే, వైరస్ ఇంకా జీవించి ఉండొచ్చు.
మాంసాన్ని సరిగ్గా ఉడికించి తింటే ప్రమాదం ఉండదా!!
అవును ప్రమాదం ఉండదు!! బర్డ్ ఫ్లూ అనగానే చికెన్ సెంటర్లన్నీ ఖాళీ అవుతాయి. చికెన్ తినడం మానేస్తారు. చికెన్ సెంటర్లు నడిపే వాళ్ల ఆర్థిక సంక్షోభంలో పడతారు. ఇంత ఆందోళన అవసరమా.
భారత ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం, కనీసం 70°C ఉష్ణోగ్రత వద్ద మాంసాన్ని ఉడికించాలి. ఈ ఉష్ణోగ్రతకు వైరస్ పూర్తిగా నశిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి, బర్డ్ ఫ్లూ ప్రమాదం నుండి రక్షణ పొందాలంటే మాంసాన్ని పూర్తిగా ఉడికించడం తప్పనిసరి.
భారతీయ సంప్రదాయ వంట ఆచారాలలో రక్షణ ఉందా?? ఉందనే చెప్పాలి!!
మన సంప్రదాయ వంటకాలలో మాంసాన్ని ఎక్కువసేపు ఉడికించడం, మసాలాలు వేసి వండడం లాంటివి ఉంటాయి. ఇవి బాక్టీరియా, వైరస్‌లను నాశనం చేసే గుణం కలిగి ఉంటాయి. అయినప్పటికీ, వంటకాల ప్రాసెస్‌ను నిర్లక్ష్యం చేయకూడదు.
బర్డ్ ఫ్లూ నివారణకు జాగ్రత్తలు
*మాంసాన్ని పూర్తిగా ఉడికించి తినాలి.
* కోడిగుడ్లను బాగా మరిగించి తినాలి.
*మాంసాన్ని హ్యాండ్లింగ్ చేసిన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.
* అనుమానాస్పదమైన లేదా అపరిశుద్ధమైన మాంసాన్ని తినకూడదు.
*బర్డ్ ఫ్లూ కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లడం తగ్గించుకోవాలి.
*పక్షులతో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
*జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాసకోశ సమస్యలు ఉంటే వెంటనే వైద్యసలహా తీసుకోవాలి.
* కోళ్ల ఫారమ్‌ల యజమానులు శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
బర్డ్ ఫ్లూను తేలిగ్గా తీసుకోవద్దు!
H5N1 వైరస్ సోకితే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అందుకే, తినే ఆహారాన్ని ఎలా వండుతున్నామో గమనించి, పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది! మాంసాన్ని సరిగ్గా ఉడికించుకుని తిని, ఆరోగ్యంగా ఉండండి!


Read More
Next Story