చీమలే అక్కడ  పరమాన్నం!
x

చీమలే అక్కడ పరమాన్నం!

ఎక్కడో కాదు, విశ్వనగరం హైదరాబాద్‌ కి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త గూడెం సమీపంలోని గిరిజన తండాలలో .


ఆరోగ్యపరమైన పుట్టతేనెను మొదటగా పట్టి తెచ్చిందీ ఆదివాసీలే... ఇవాళ పండిస్తున్న కూరగాయలు,పండ్లు,ఔషధ మొక్కలు, పూల గురించి తెలియ జెప్పింది వారే, రుచికరమైన పక్షి, జంతు మాంసాలను తొలిగా రుచి చూసి, మాంసాహార జాబితాలోకి కొత్త రుచులను చేర్చింది వారే. వారి పేదరికం, ఆకలి, అవసరమే కొత్త రుచులను కనిపెట్టేలా చేసింది.

ఆదివాసీలు

మనం ఎంతో అభివృద్ధిని సాధించామని చెప్పుకుంటున్నా...

ఇప్పటికీ, మన మధ్య ఇంకా ఆకలితో అలమటించే ప్రజలున్నారు. తినడానికి తిండిలేక ఆకులు, దుంపలు,గడ్డి, ఆఖరికి చెట్ల మీద పాకే ఎర్ర చీమలు కూడా తింటున్నారు. పిడికెడు చీమలను తిని, బురదకుంటలో నీళ్లు తాగి నిద్రిస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గొత్తికోయలు విషాద జీవన చిత్రమిది. వాళ్లకు చీమల కూరే చేపల కూర. చీమల వేపుడే చికెన్‌ బిర్యానీ. బతుకు తెరువు లేక, ప్రభుత్వ రేషన్‌ సరుకులు అందక, తిండిలేక చీమలనే పరమాన్నంగా కడుపునింపుకుంటున్నారు.

గొత్తికోయలు పండిరచిన ఎర్ర ధాన్యం

ఎవరీ గొత్తికోయలు?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ,అర్లపల్లి, లక్ష్మిదేవిపల్లి మండలాల్లోని మారుమూల అటవీప్రాంతమంతా, గొత్తికోయలకు షెల్టర్‌ జోన్‌ లాంటిది. వీరు ఛత్తీస్‌గఢ్‌ నుంచి బతుకుదెరువు కోసం నాలుగు దశాబ్దాల క్రితమే వలస వచ్చారు. గోదావరి నది పరివాహక ప్రాంతం పొడవునా గుంపులుగా జీవిస్తున్నారు. వీళ్లు పనికి వెళ్లినా,వేటకు వెళ్లినా గుత్తులు(గుంపు)గా వెళ్తారు కాబట్టి వీరిని ‘గుత్తికోయలు’ అని కూడా అంటారు. అటవీశాఖ పెంచే వెదురు,జామాయిల్‌ చెట్లను నరికే పనులు చేస్తారు. అది వేసవిలోనే ఉంటుంది. వానా కాలం, చలికాలంలో వీరికి పనిదొరకదు. దీంతో చేతిలో చిల్లి గవ్వలేక, అడవిలో దొరికే కాయలు, దుంపలు, చీమలను ఆహారంగా తీసుకుంటారు. వీరికి ఆధార్‌, ఓటరు కార్డ్‌లున్నాయి కానీ, రేషన్‌ కార్డు ఉండదు. ప్రభుత్వం అమలు చేసే పనికి ఆహార పధకంతో పాటు ఏ పథకం వీరికి అందదు. శతాబ్దాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు.

చీమలను ఎలా సేకరిస్తారు?

అడవుల్లో తిరుగుతున్నపుడు, పుట్టెడు చీమలున్న చెట్ల కొమ్మలను నరుకుతారు. ఓ పక్క చీమలు కుడుతుంటే, మరోపక్క వాటిని గిన్నెల్లో నింపుతారు. వాటిని ఆకులలో వేసి చుట్టి , పొయ్యిలో కాలుస్తారు. తరువాత గిన్నెలో వేసి..రొయ్యల కూరలాగా వండుతారు. ఇంట్లో జొన్నలు ఉంటే అంబలి చేసుకుని.. చీమల కూరను నంజుకొని తింటారు.

ఛత్తీస్‌గఢ్‌ నుండి వచ్చిన సంప్రదాయం

‘‘ విచిత్రమైన ఈ చీమల వంటకాన్ని ఛత్తీస్‌గఢ్‌లో మా వాళ్లే కనిపెట్టారు.


అక్కడ దీనిని చాప్రా "Chaprah," అని పిలుస్తారు. ఎర్ర చీమలతో పాటు,వాటి గుడ్లు కలిపి చెట్నీలా తయారుచేస్తారు. అక్కడి నుండే వచ్చిన మా పూర్వీకులు ఈ తిండిని మాకు నేర్పారు. ఈ వంటకంలో కారం వాడం. అప్పటికప్పుడు ఎండుమిర్చిని నానబెట్టి, మెత్తగా నూరి వాడుకుంటాం. చాలా రుచిగా ఉంటుంది...’’ అంటారు, లక్ష్మీదేవిపల్లి మండలం గండ్రబండకు చెందిన మడకం జ్యోగి. కారం ఓరి.

ఎర్ర చీమలతో చేసిన వంటకాలు

చీమల్లో ప్రొటీన్స్‌...

‘‘ వీరికి ఒక్కొక్కరికి రెండు ఎకరాలుంటుంది. ఏడాదికి ఒక్కసారే సాగు చేస్తారు. అది తినాలంటే ఏడాదంతా సరిపోదు. వేరే ఉపాధి లేక, ఆకలిని తట్టుకోవడానికి చీమలను తింటున్నారు. భారీ వృక్షాలకు పట్టిన గండు చీమలు గూళ్ళను దులిపి వాటిలోని గుడ్లను సేకరించి, పచ్చడిగా నూరుకుంటారు. కొందరు ఎర్ర చీమల మిశ్రమంతో చారు కాచుకుంటారు. ఈ ఆహారంలో ప్రొటీన్స్‌ శాతం ఎక్కువ.ఆరోగ్యానికి మంచిదే... అయితే, అన్ని సీజన్లలో చీమలు వీరికి దొరకవు. ఇక్కడి పిల్లలు,మహిళలు 90 శాతం రక్తహీనతతో బాధపడుతున్నారు...’’ అంటారు డాక్టర్‌ ఆర్‌.నరేందర్‌ .

ఆదివాసీలకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్న డాక్టర్‌ ఆర్‌.నరేందర్‌

హైదరాబాద్‌కి చెందిన ఈ యువ డాక్డర్‌ గత రెండేళ్లుగా, ఈ గిరిజన గుంపుల మధ్యనే ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నారు. వారి ఆహారపు అలవాట్లు, ఆరోగ్య సమస్యల మీద అధ్యయనం చేస్తున్నారు.

మహిళలకు రక్త హీనత

పిల్లలు, గర్భిణులు, బాలింతల్లో పౌష్టికాహారలోపం గుర్తించి, వేరుశనగ, గోధుమలు, జొన్నపిండితో తయారు చేసిన పౌష్టికాహారాన్నివారికి అందిస్తూ, వారి ఆరోగ్యానికి అండగా నిలిచారు.

భూమిని దున్నకుండా పంటలు

వీరి సాగుబడి అత్యంత సహజంగా ఉంటుంది. నేలను దున్నకుండా, కలుపు తీయకుండా, రసాయన ఎరువులు వాడకుండా సాగు చేస్తారు. వర్షాధారంతో ఎర్ర బియ్యం,రాగులు, సామలు పండిస్తున్నారు. ఆ విత్తనాలనే దాచుకొని మరో పంటకు వాడుతారు.

దున్నకుండా, సహజంగా పండే వరి పంట.

వెదురు కొమ్ముల కూర

ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల , కొండ వెదురు కొమ్ములను కూడా వీరు తింటారు. ఇవి వర్షాకాలంలోనే దొరుకుతాయి.. ఈ కాలంలో ప్రతి ఇంటా కొమ్ముల కూర ఉండాల్సిందే. ఆ కొమ్ముల సేకరణలో, మహిళలు అనేక ఇబ్బందులు పడతారు. వెదురు పొదల్లో ఉండే కొమ్ములను కోయడం కోసం చేతులు పెడుతున్నప్పుడు, విష సర్పాలు ఉండే అవకాశం ఉంటుంది. వెదురు ముళ్లు చేతులకు విపరీతంగా గుచ్చుకుంటాయి.ఈ సమస్యల మధ్య వీటిని అడవుల్లో సేకరించిన వాటి తొక్కలు తీసి, ఆ కొమ్ములను సన్నగా తరిగి, ఉడకపెట్టి,గుప్పెడు చింతచిగురు వేసి కూర చేసుకుంటారు. అడవుల్లోకి కట్టెల కోసం వెళ్లే వారు వెదురు కొమ్ములను వెంట తెచ్చుకుంటారు.

వారు వండిన కూరను రుచి చూసినపుడు క్యాబేజీ కూరలా కమ్మగా ఉంది.

పండుగలు వైవిధ్యమే...

గొత్తికోయల పండుగలన్నీ వైవిధ్యమే. జూలైలో కొత్త పండుగ వస్తుంది. కొత్త విత్తనాలను కులదైవానికి సమర్పించిన తర్వాత వాటిని వండుకొని తింటారు. ఆగసు ్టలో పెద్దల పండుగ వస్తుంది. వీరు ప్రతి పంట పేరుమీద పండుగ చేసుకుంటారు. అడవిలో లభించే ఇప్ప పువ్వు,తునికాకు, పరికి, బలుసు, పాలపండ్లను సేకరించి, సంతలో అమ్మగా మిగిలింది వారు తిని జీవనం సాగిస్తున్నారు.

తండా జీవనం

అరణ్యంలో స్వేచ్ఛగా ఉండేందుకు మక్కువ చూపుతారు తప్ప జనారణ్యంలోకి రమ్మన్నా రారు. సహజ పంటలు పండిస్తూ, అడవినీ, తమ శ్రమను మాత్రమే నమ్ముకుంటూ, ప్రకృతి సంపదను కాపాడి, జీవ వైవిధ్యాన్ని తరతరాలకు అందిస్తున్న వీరికి ప్రభుత్వ,ప్రభుత్వేతర సంస్దల చేయూత ఉంటే సుస్ధిరులవుతారు. ఆహార సంస్కృతి అభివృద్దిలో ఆదివాసీలు ఆదిగురువులు.

Read More
Next Story