బస్తర్ జంక్షన్ కథలు ఇక వినిపించవు!
x

'బస్తర్ జంక్షన్' కథలు ఇక వినిపించవు!

ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు భద్రత లేదా?


అతనొక జర్నలిస్ట్. అంతరించిపోతున్న జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. అందునా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి ఊపిరి పోయాలనుకున్నాడు. ఆర్ధిక భద్రతా, ప్రముఖుల అండదండలు లేని చోట ప్రజల కోసం నిలబడ్డాడు. యూట్యూబ్ జర్నలిజానికి కొత్త శకం తెరిచాడు. పేదరికంలో పుట్టినా, పెద్ద చదువులు చదివే అవకాశం లేకపోయినా, తానూ పుట్టి పెరిగిన ప్రాంతంలో జర్నలిస్టులకు ఆర్ధిక,ప్రాణ భద్రతలు లేకపోయినా లెక్కచేయకుండా అవినీతి ఎక్కడ ఉన్నా దానిని బయట పెట్టడమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నాడు. అతనే ఛత్తీస్ గడ్ కి చెందిన ముకేష్ చంద్రాకర్.ముఖేష్ చంద్రకర్ ను కిరాతకంగా చంపడం మనందరికీ తెలిసిన వార్తే. కానీ ఇది ఒక జర్నలిస్టు మరణం మాత్రమేనా? అట్టడుగు వర్గం నుండి తానూ ఏదో చేయాలనీ తపించి, అవినీతిని బయటపెట్టడమే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా తన ధర్మంగా భావించినందుకు, దానికి కట్టుబడినందుకు ఒక సామాన్యుడు ధైర్యంగా ఉంటె ఇదే జరుగుతుంది అనే చెప్పే హెచ్చరికా ఈ హత్య? లేకపోతే ఛత్తీస్ గడ్ లాంటి ప్రాంతాల్లో జర్నలిస్టులు కనీస వేతనాలు కూడా అందని స్థితిలో పని చేస్తూ, పొట్ట గడవక వేరే వ్యాపకాలు ఎంచుకుంటూ ఉంటే,ఎవరో ఒకరు మాత్రం ఆ ప్రజల స్వరాన్ని ప్రపంచానికి వినిపిస్తూ ఉంటే,ఆ ఒక్కరు నడిచిన మార్గంలో ఇంకెవరైనా వస్తే మీకు ఇదే దిక్కు అని చెప్పే పాఠమా ఈ హత్యా?

ముకేష్ చంద్రాకర్ కథ ఏంటి?

సాయుధ మిలిటరీ దళాలు, నక్సలైట్ల మధ్య ఘర్షణ వల్ల 2000 దశాబ్దంలో హింసాపూరితంగా మారిన ఛత్తీస్ గడ్ లోని బిజాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో ముకేష్ పుట్టాడు. అతనికి ఒక అన్నయ్య యుకేష్ చంద్రాకర్. తండ్రి బాల్యంలోనే మరణించాడు. తల్లి అంగన్వాడిలో పని స్తూ చెస్తూ చాలిచాలని వేతనంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ఒకప్పుడు ఛత్తీస్ గడ్ లో భద్రతా వర్గాలు ఏర్పాటు చేసిన క్రూరమైన నక్సల్ వ్యతిరేక సంస్థ అయిన ‘సాల్వా జుడుం’ జరిపిన హింసాకాండ వల్ల చంద్రాకర్ కుటుంబం ఊరు విడిచి పోవాల్సి వచ్చింది, వేరే చోట శరణార్థులుగా బతకాల్సి వచ్చింది. ఇన్ని కష్టాల మధ్య అతని తల్లి క్యాన్సర్ తో 2013లో మరణించింది.అప్పటికి ముకేష్ తన తల్లిని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ తన దగ్గరున్న 50 వేలతో ఖరీదైన వైద్యం సాధ్యం కాకపోవడం వల్ల ఆమె మరణించింది. వచ్చే ఆదాయం చాలక, చంద్రాకర్ బైక్ మెకానిక్ గా కూడా పని చేసి కుటుంబాన్ని అండగా నిలబడ్డాడు.

ఇది చంద్రాకర్ కుటుంబ నేపథ్యం. ఇక అతను పెరిగిన బస్తర్ ప్రాంతంలో జర్నలిజానికి ఉన్న విలువ పక్కన పెడితే,అది ఎవరికి కూడా ఒక వృత్తి అయ్యే ఆస్కారం మాత్రం లేదు అక్కడ. జర్నలిస్టులకు అక్కడ ఒక గ్రౌండ్ రిపోర్ట్ కి 300 మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటప్పుడు దాన్ని ఉద్యోగంగా నమ్ముకోలేక జర్నలిస్టులు ఎంతోమంది తమకు తోచిన ఉపాధి అంటే అడవుల ఉత్పత్తులను అమ్మడం లేదా ఏదైనా ఒక చిన్న కొట్టు పెట్టుకోవడం లాంటివి చేస్తూ జీవితం గడుపుతున్నారు. కడుపే నిండని పరిస్థితి చిన్నప్పటి నుండి ఉన్నా కూడా ముకేష్ అప్పటికే ఫ్రీ లాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్న తన మార్గానే నడిచాడు.మొదట చిన్న చిన్న ప్రాంతీయ ఛానళ్ళకి పని చేస్తూ ఉన్నా; క్రమంగా వృత్తిలో మెళకువలు నేర్చుకుని స్ట్రింగర్ గా సహారా ,బన్సాల్ , న్యూస్ 18 , ఎన్ డి టివి వంటి వాటికి నక్సల్ ప్రాంతమైన అడవి లోపల ఎన్ కౌంటర్ స్పాట్స్ నుండి రిపోర్టింగ్ చేసేవాడు. ఇంత ప్రమాదకరమైన వాతావరణంలో గతంలో అతను ప్రాణాల అంచు మీద నడిచాడు. 2015 లో ఉసూర్ లోని నంబి దగ్గర అతన్ని,అతని అన్నయ్యని నక్సలైట్లు ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నారని సూటిగా తుపాకీలు గురి పెట్టారు కూడా. అయినా ఇలాంటి ప్రమాదాలకు ఆటను భయపడలేదు. సాటి జర్నలిస్టులు ప్రమాదకర ప్రాంతాల్లో రిపోర్టింగ్ చేయాల్సి వచ్చినప్పుడు తన మోటార్ బైక్ మీదే తీసుకువెళ్ళేవాడు. ఇలాంటి ప్రమాదాలు అతని జీవితంలో ఎన్నో.

ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా దాదాపు 10 ఏళ్ళు పని చేసాక 2021 లో 'బస్టర్ జంక్షన్' పేరుతో తన సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు ముకేశ్. అదే సంవత్సరం కోబ్రా జవాన్ మనాస్ ని నక్సలైట్లు బంధిస్తే రక్షణా బృందాలు వారితో చర్చలు జరిపి అతన్ని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి సహకరించిన ఏడుగురు జర్నలిస్టుల బృందంలో ముకేశ్ కూడా ఉన్నాడు.ఆ సమయంలో ఆ వార్త జాతీయ ముఖ్యాంశంగా మారింది. అతని రిపోర్టింగ్ బైట్స్ జాతీయ ఛానల్స్ దృష్టిలో కూడా పడ్డాయి.

ఇకపోతే యూట్యూబ్ ఛానల్ తో అతనికి ఒక మంచి ఆదాయ వనరు ఏర్పడింది. ఆ ఛానల్ లో కూడా తాను ఆ ప్రాంత ప్రజలకు ఉన్న సమస్యైనా సరైన రోడ్లు,మంచి నీటి వసతులు లేకపోవడం, ఫేక్ ఎంకౌంటర్ లలో మరణించిన గిరిజనుల గురించి; ఇలా దాదాపుగా అన్ని కూడా సామాజిక సమస్యలు లేక అవినీతి గురించే చేసాడు. అతను ఈ యూట్యూబ్ జర్నలిజాన్ని ఎంత గట్టిగా బలపరిచాడంటే,అప్పటికే నాలుగు ఏళ్ళుగా ఆ ప్రాంతానికి బ్రిడ్జి కోసం ఊరి ప్రజలు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ముఖేష్ తన ఛానల్ లో ఆ సమస్య గురించి వీడియో చేసిన మూడు రోజులకే ఆ బ్రిడ్జ్ ఆ ఊరికి శాంక్షన్ అయ్యింది.ముకేష్ ఏ సమస్యను అయినా, ఏవార్తను అయినాసరే ;అది ప్రజల కోణం నుండే ఆలోచించేవాడు.

ఇక డిసెంబర్ 25 న ఎన్ డి టివిలో ముకేష్ గంగలూరు నుండి హిరోలి వరకూ 120 కోట్లతో చేపట్టిన భారీ రోడ్డు ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి అతని కథనం వెలువడింది. ఆ కథనం ప్రసారం అయ్యాక అతను కనిపించకుండా పోతే ,అతని సోదరుడు ఫిర్యాదు చేసాడు. జనవరి 3 న అతని శవాన్ని ఏ రోడ్డు అవినీతి మీద ముకేష్ కథనం రాసాడో దానిలో కీలక వ్యక్తి అయినా సురేష్ చంద్రకర్ ఇంటి ఆవరణలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో శవంగా కనిపించదు. ఇక్కడ ఈ సురేష్ కూడా ముకేష్ కి బంధువే. అయినంత మాత్రాన దీన్ని మనం వ్యక్తిగత కక్షగా ఒక కోణంలో అనుకున్నా; ముకేష్ మామూలువ్యక్తిలా ఉంటూ బంధుత్వాన్ని కాపాడుకునేలా ఉంటే,అతన్ని చంపేవారు కాదు. ఈ కక్ష అతని మీద కాదు; ముకేష్ లోని నిజాయితీపరుడైన జర్నలిస్ట్ మీద.ఈ హత్య సురేష్ ప్రణాళిక మేరకు రితేష్ ,దినేష్ అమలు పరిచినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ అతన్ని ఎంత దారుణంగా చంపారంటే గుండె బయటకు తీసి, కాలేయం నాలుగు ముక్కలు చేసి, 15 చోట్ల తల పగలగొట్టి, పక్కటెముకలు,మెడ విరగ్గొట్టి చంపారు! ఎంత కక్ష ఉంటే అలా చేస్తారు! ఈ కేసులో ముఖ్య నిందితుడైన సురేష్ చంద్రాకర్ ను పోలీసులు మన హైదరాబాద్ లోనే అరెస్ట్ చేసారు.

ఈ విషయంపై స్పందిస్తూ స్వతంత్ర జర్నలిస్టు/ రచయిత నరేష్కుమార్ సూఫీ ఈ విధంగా అన్నారు.

' రూరల్ ప్రాంతాల్లో రిపోర్టింగ్ చేస్తున్న స్వతంత్ర జర్నలిస్టు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ముఖేష్ చంద్రాకర్ ఒక ఉదాహరణ. మన దేశంలో రూరల్ ప్రాంతాల్లో ఇలాంటి స్థితిని ఎదుర్కుంటున్న జర్నలిస్టులకు ఏ మాత్రం రక్షణ లేదన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అవినీతికి ఎదురు నిలిచే జర్నలిస్టుల హత్యలు, వాటిపై సాటి పాత్రికేయుల మౌనం రాబోయే కాలంలో కనీస స్పందన లేని సమాజాన్ని తయారు చేస్తాయి. ఇప్పుడు జర్నలిస్టుల నిర్లిప్తతే దీనికి ఉదాహరణ.'

33 ఏళ్ళవాడు, ఇంకా ఎంతో జీవితం ముందున్నవాడు. అవకాశాలు లేని చోట,ప్రమాదాలు పొంచి ఉన్న చోట, ధైర్యమనే ఆయుధంతో అవినీతిని బయట పెడుతూ, తన ప్రాంత ప్రజల సమస్యలను ప్రపంచానికి చెప్తూ; ఇంకా ఎన్నో చేయాలని కలలు కన్నా ముకేష్ జీవితం ముగిసిపోయింది. తాము నిజాయితీగా పని చేసినందుకు ప్రతిఫలంగా ప్రతీకార చర్యల వాళ్ళ చంపబడే జర్నలిస్టుల సంఖ్య భారతదేశంలోనే ఎక్కువ ఉందని జర్నలిస్టుల రక్షణ కోసం ఉన్న వాచ్ డాగ్ కమిటీ తన నివేదికలో తేల్చింది. అంతే కాదు, ఈ నివేదికలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రతీకార చర్యల వలన చనిపోయే 19 జర్నలిస్టుల్లో నలుగురు భారతీయ జర్నలిస్టులే ఉంటున్నారని ,ఇక ఐదో జర్నలిస్టు మాత్రం ఎదో ఒక ప్రమాదకరమైన రిపోర్టింగ్ లో ఉండగా మరణిస్తున్నారన్న దిగ్భ్రాంతి కలిగించే నిజాన్ని వెలువరించింది. భారతీయ జర్నలిస్టులకు ఇంత ప్రమాదకరమైన పరిస్థితి కొనసాగుతున్న క్రమంలో తాము నిజాయితీగా పని చేసినందుకు ప్రతిఫలంగా ప్రతీకార చర్యల వాళ్ళ చంపబడే జర్నలిస్టుల సంఖ్య భారతదేశంలోనే ఎక్కువ ఉందని జర్నలిస్టుల రక్షణ కోసం ఉన్న వాచ్ డాగ్ కమిటీ తన నివేదికలో తేల్చింది. అంతే కాదు, ఈ నివేదికలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రతీకార చర్యల వలన చనిపోయే 19 జర్నలిస్టుల్లో నలుగురు భారతీయ జర్నలిస్టులే ఉంటున్నారని ,ఇక ఐదో జర్నలిస్టు మాత్రం ఎదో ఒక ప్రమాదకరమైన రిపోర్టింగ్ లో ఉండగా మరణిస్తున్నారన్న దిగ్భ్రాంతి కలిగించే నిజాన్ని వెలువరించింది. భారతీయ జర్నలిస్టులకు ఇంత ప్రమాదకరమైన పరిస్థితి కొనసాగుతున్న క్రమంలో ఎన్నో నిరసనా స్వరాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృత్తి కాకుండా ఉండలంటే ఆ స్వరాల వేదికగాస్వేచ్ఛాయుత మీడియా కోసం పోరాడటం ఒకటే మార్గం .

Read More
Next Story