మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధి పై ఘర్షణ
x

మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధి పై ఘర్షణ

బాబ్రీ కూల్చితరహాలో పెకలించేందుకు ప్రయత్నాలు, ఉద్రిక్తత, నాగపూర్ లో కర్ఫ్యూ


కృష్ణ కుమార్

ఔరంగజేబు ఈ పేరు వింటేనే మరాఠీలకు మొఘలుల కౄరత్వం గుర్తుకువస్తుంది. మిగిలిన మొఘల్ సుల్తాన్ ల పాలనలో కన్నా ఔరంగజేబు పాలన లో మరాఠీ లపై జరిగిన దాష్టీకం అంతాయింతా కాదన్నది ముఖ్యంగా మరాఠీల అభిప్రాయం .అందుకే మరాఠా రాజకీయాలన్నీ ఎప్పుడూ ఛత్రపతి శివాజీ మహారాజ్ చుట్టూనే తిరుగుతాయి. మొఘల్ చక్రవర్తులను గడగడలాడించిన వీర శివాజీ , అతని వారసులపై దేశ వ్యాప్తంగా గౌరవం వున్నా మరాఠా భూమిలో లభించే ఆదరణ వేరు. తాజాగా మహా రాజకీయం అంతా ఔరంగజేబు సమాధి చుట్టూ తిరుగుతూ మరాఠాల వీర భూమి లో వారిని హింసించిన ఔరంగజేబు సమాధి వుండటం,దానిని జాగ్రత్తగా పదిలపరచడం ఏంటన్న రచ్చ రాజుకుంది.

ఔరంగాబాద్ సమీపంలోని ఖుల్దాబాద్ లో ఔరంగా జేబు సమాధి ఉంది. దాని పెకలించేందుకు ప్రయత్నించి కొంతమంది సమాధి ఉన్నదర్గా ప్రాంతాన్ని అపవిత్రం చేస్తున్నారని మరొక వర్గానికి చెందిన వారు నాగపూర్ పట్టణంలో ఆందోళన చేపట్టారు. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. దీనితో సోమవారం నాడు నాగపూర్ పలు పట్టణ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దురాగతాలను మనం చరిత్రలో చదువుకున్నా, కళ్లారా చూసినవారు ఇప్పుడు ఎవరూ లేరు. అయితే ఇటీవల బాలీవుడ్ లో సంచలనంగా మారిన "ఛావా"సినిమా చరిత్ర వాస్తవాన్ని కళ్లకు కట్టింది.చావా సినిమా విడుదలైన తర్వాత , మొఘల్ చక్రవర్తిపై చాలా మంది అభిప్రాయాలు తీవ్రంగా మారిపోయాయి. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ వీరగాధను ఇప్పటి ప్రపంచానికి చాటిచెప్పిన ఆ సినిమా చివరలో శంభాజీ పై మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఎంత కౄరంగా వ్యవహరించాడో చూపిన తీరు అందరిలో గగుర్పాటు కలిగేలా చేసి ఔరంగజేబు పై వున్న ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది. 1689లో మొఘలులు శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్‌ను బంధించి, ఉరితీసే ముందు చిత్రహింసలకు గురిచేయడం అందరికీ గుర్తుండి పోయింది.

సరే ఛావా సినిమా మాట ఏమోగాని ఇప్పుడు మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ అదే ప్రస్తుత ఛత్రపతి శంభాజీ నగర్ సమీపంలోని ఖుల్దాబాద్ వున్న ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. జాతీయ రాజకీయాలతో పాటు మహారాష్ట్ర రాజకీయాలలో బీజేపీ పాత్ర పెరిగిన దగ్గరినుంచి, ఉద్దవ్ శివసేన తో వైరంతో పోటాపోటీ పాలిటిక్స్ రక్తికట్టిస్తున్నాయి.

ఇప్పుడు తాజా వివాదానికి కారణం ఏంటి?

సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ అబూ అసిం అజ్మీ ఔరంగజేబు గురించి శాసనమండలి లో ప్రస్తావించడం తాజా వివాదానికి కారణం అయింది. ఔరంగజేబు ను ఆయన మెచ్చుకోవడమే కాకుండా

అన్ని తప్పుడు చరిత్రను చూపిస్తున్నారు" అని అజ్మీ చెప్పడం మరాఠా ప్రజలలో కోపాన్ని పెంచింది. ఔరంగజేబు చక్రవర్తి చాలా దేవాలయాలను నిర్మించాడు ఆయన క్రూరమైన నాయకుడు కాదు అని కూడా అజ్మీ నొక్కిచెప్పాడు. ఈ వ్యాఖ్యలు మండలిలో గందరగోళానికి దారితీయగా, ఆయనను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తరువాత అజ్మీ తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకుంటున్నానని ప్రకటించినా, జరిగిన డ్యామేజ్ జరిగిపోయి ఆగ్రహజ్యాలలు ఎగిసిపడుతున్నాయి.ఆజ్మీ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన

ఛత్రపతి శివాజీ ప్రత్యక్ష వారసుడు, సతారా ఎంపీ ఉదయన్‌రాజే భోసలే అసలు ఔరంగజేబు సమాధి అవసరం ఏమిటి? JCB యంత్రాన్ని తీసుకువచ్చి దానిని కూల్చివేయండని పిలుపు నిచ్చి ఉద్యమానికి నాయకత్వం వహించాడు.ఔరంగజేబ్ ఒక దొంగ దోపిడీదారుడంటూ ఆరోపించారు. అధికార మహాయుతి కూటమి నేతే ఉద్యమం లేవదీయడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది.మరోవైపు

మిస్టర్ ఎక్బోటే సంస్థ, ధర్మవీర్ సంభాజీ మహారాజ్ ప్రతిష్ఠాన్ మద్దతుదారులు ఔరంగజేబు సమాధిని ధ్వంసం చేయడానికి ఖుల్దాబాద్‌కు చేరుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.మిస్టర్ ఎక్బోటే అతని మద్దతుదారులను ఛత్రపతి సంభాజీనగర్ సరిహద్దుల్లోకి ప్రవేశించకుండా జిల్లా యంత్రాంగం నిషేధించింది ఎక్బోటీ పై జనవరి 1, 2018న పూణే జిల్లాలోని భీమా కోరెగావ్‌లో కుల ఆధారిత అల్లర్లను రెచ్చగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. సతారాలోని ప్రతాప్‌గడ్‌లో ఉన్న అఫ్జల్ ఖాన్ సమాధిని కూల్చివేసే ఆందోళనలో కూడా ఆయన పాల్గొన్నారు. మరోవైపు ఔరంగజేబు సమాధిని తొలగించాలని కోరుతూ మార్చి 17 నుండి విశ్వ హిందూ పరిషత్ , బజరంగ్ దళ్ ఆందోళనలు చేపట్టాయి.

రాజకీయంగానూ ఔరంగజేబు వివాదం కాకరేపుతోంది. పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. మహారాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు అంబదాస్ దన్వే దమ్ముంటే సమాధిని కూల్చాలన్న సవాలు విసిరారు. సమాధి మన చరిత్ర యొక్క అవశేషాలు. ఔరంగజేబు ఇక్కడకు వచ్చి ఓడిపోయి ఈ భూమిలోనే ఖననం చేయబడ్డాడని మనం మన భవిష్యత్ తరాలకు చెప్పగలగాలి. సమాధిని తొలగించాలనే పిలుపు ఈ చరిత్రను అంతం చేయడానికి చేసిన కుట్ర. సమాధి ఉండటం మొఘల్ రాజును ఓడించి ఇక్కడ ఖననం చేశాడని గుర్తు చేస్తుంది. సమాధిని కూల్చివేసే ధైర్యం ఉన్నవారు, నేను వారిని అలా చేయమని సవాలు చేస్తున్నాను అని శ్రీ దన్వే వ్యాఖ్యానించి మరింత రెచ్చగొట్టారు. దానిపై తీవ్రంగా స్పందించిన శివసేన నాయకుడు ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా ఇంఛార్జి మంత్రి సంజయ్ షిర్సత్ వివాదాన్ని మరింత పెంచారు. ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ను హింసించి ఉరితీసిన క్రూరమైన చక్రవర్తి సమాధికి మహారాష్ట్ర నేలలో స్థానం లేదు. దానిని తొలగించాలి , దాని గురించి ఎటువంటి చర్చ లేదు. ఔరంగజేబు అతని సమాధిని ప్రేమించే వారు అవశేషాలను ఇంటికి తీసుకెళ్లవచ్చని పిలుపునిచ్చారు.. దాన్వే వంటి వ్యక్తులు సమాధిని ఉంచాలనుకుంటే, అతను అక్కడకు వెళ్లి నమాజ్ చేయాలన్నారు.

మహారాష్ట్ర లో ఔరంగజేబు పై వివాదం కొత్తది కాదా?

మహారాష్ట్రలో అత్యంత గౌరవం పొందే వ్యక్తులలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ లు వుంటారు. వీరిని అవమానించేలా ఎవరు మాట్లాడినా ఉపేక్షించరు. అందుకే మహారాష్ట్ర రాజకీయాల్లో తొలినుంచీ ఔరంగజేబు అంశం తీవ్ర చర్చలకు దారితీస్తుంది.

మొఘల్ చక్రవర్తిగా ఔరంగజేబు భారత ఉపఖండాన్ని 49 సంవత్సరాలకు పైగా పరిపాలించాడు .అయితే తన జీవితంలోని చివరి 25 సంవత్సరాలు ఇప్పుడు మహారాష్ట్ర రాష్ట్రంగా ఉన్న ప్రాంతాలలో గడిపాడు.దాంతో మరాఠా వీరులు, ఔరంగజేబు మధ్య పోరాటాలు కొనసాగాయి. శివాజీ వంటి మరాఠా యోధులు మొఘలులకు వణుకు పుట్టించారు.అందుకే మొఘల్ చక్రవర్తిని చారిత్రక విరోధిగా మరాఠాలు చూస్తారు.

శివసేన అధినాయకుడు బాల్ థాకరే కూడా ఔరంగజేబు ను తీవ్రంగా విమర్శిస్తూ రాజకీయం నడిపారు.300 సంవత్సరాలుగా, ఔరంగజేబు దెయ్యం ఈ దేశాన్ని వెంటాడుతోంది , 'మర్ద్ మరాఠాలు' ఔరంగజేబును అదే నేలలో సమాధి చేశారు అంటూ 1988లో ఔరంగాబాద్ నగరపాలక ఎన్నికల్లో శివసేన విజయం సందర్భంగా బాల్ థాకరే పార్టీ పత్రిక మార్మిక్‌ లో రాశారు. ఔరంగజేబు పేరున వున్న ఔరంగాబాద్ పట్టణ పేరు మార్చాలని ముందుగా డిమాండ్ చేసింది కూడా శివసేన పార్టీనే.

1995లో శివసేన ఆధ్వర్యంలో నగరం పేరుమార్చడానికి ఔరంగాబాద్ మున్సిపల్ కౌల్సిల్ లో ఒక తీర్మానాన్ని ఆమోదించించారు. కానీ అది కొన్ని కారణాలతో అమలు కాలేదు. శివసేన, కాంగ్రెస్ ,ఎన్సీపీ లతో చేతులు కలిపాక , ఔరంగజేబు ను విమర్శించి , వీర శివాజీ నామస్మరణతో రాజకీయాలను సొమ్ముచేసుకొనే పనిని బీజేపి తీసుకుంది. ఎన్నికల ముందు లండన్ మ్యూజియంలో వున్న ఛత్రపతి కరవాలం, యుద్ధంలో వాడిన మరో ఆయుధాన్ని మహారాష్ట్ర కు తెప్పించి ప్రజల మనస్సు గెలిచింది.అయితే

2022లో, తన ప్రభుత్వం పడిపోయినప్పుడు, ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే తీసుకున్న చివరి నిర్ణయాలలో ఒకటి , ఔరంగాబాద్ పేరును శంభాజీనగర్‌గా మారుస్తున్నట్లు ప్రకటించడం. ఆతరువాత బీజేపీ మద్దతుతో వచ్చిన ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం, మునుపటి నిర్ణయాన్ని రద్దు చేసి, ఔరంగాబాద్ నగరానికి ఛత్రపతి శంభాజీనగర్ అనే అదనపు పేరును జోడించి ఒక అడుగు ముందుకేసింది.ఇలా రాజకీయంగా శివసేన, బీజేపీలు వీలున్నప్పడల్లా ఛత్రపతిని వాడుకుంటూ మరాఠీల మనస్సుదోచేస్తున్నాయి. 2022లో, MIM నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఖుల్దాబాద్‌లోని ఔరంగజేబు సమాధిని సందర్శించారు. ఇది అప్పట్లో వివాదానికి దారితీసింది.ప్రస్తుతం ఔరంగజేబు సమాధి వివాదం ప్రధానంగా చారిత్రక, రాజకీయ, మతపరమైన అంశాల చుట్టూ తిరుగుతోంది.1992లో బాబ్రీ మసీదు ధ్వంసం సమయంలో చేసినట్లుగా, ఇప్పుడు కూడా వేలాది మందితో కరసేవ చేసి సమాధిని తొలగిస్తామని కొన్ని సంస్దలు ప్రకటించడంతో స్థానికంగా ఉద్రిక్తతలు పెరిగి అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఔరంగజేబు సమాధిని కూల్చడం సాధ్యమా?

ఒకవైపు ఔరంగజేబును క్రూర పాలకుడిగా చిత్రీకరిస్తూ సమాధి తొలగింపును కోరుతుండగా, మరోవైపు చరిత్రను గౌరవించాలని, దాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని కొందరు వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఔరంగజేబు సమాధిని కేంద్ర పురావస్తు శాఖ పర్యవేక్షిస్తోంది.మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా దీనిపై స్పందిస్తూ ఔరంగజేబు సమాధికి భారత పురావస్తు సర్వే శాఖ రక్షణ కల్పించిందని అన్నారు. ఈ పని చట్టపరమైన ప్రక్రియ కింద జరిగిందని చెప్పారు. కాబట్టి దీనిని తొలగించడానికి లేదా ఏవైనా మార్పులు చేయడానికి చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుందని, ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోలేమని తేల్చేశారు.

ఈ నేపథ్యంలో హిందూ జనజాగృతి సమితి ఆర్టీఐ ద్వారా పొందిన సమాచారం ప్రకారం.. 2011 నుంచి 2023 వరకు ఔరంగజేబు సమాధి నిర్వహణ కోసం కేంద్ర పురావస్తు శాఖ సుమారు ఆరు లక్షల 50 వేలు ఖర్చు చేసిందని వెల్లడైంది. సింధుదుర్గ్ కోటలో ఉన్న రాజరాజేశ్వర ఆలయ నిర్వహణకు ఏటా 6వేలు మాత్రమే ఇస్తుండగా.. సమాధి నిర్వహణకు ఇంత పెద్ద మొత్తాన్ని ఎందుకు ఖర్చు చేశారని కమిటీ కొత్త ప్రశ్నను లేవనెత్తింది. మొత్తం మీద ఔరంగజేబు సమాధి వివాదం మహా రాజకీయాలను ఒకకుదుపు కుదిపేలా వుంది.

Read More
Next Story