మేఘాలలో లీనమౌతున్న ఐజ్వాల్
ఈశాన్య భారతం ఒక అందాల రాశి. ఇక మిజోరాం రాజధాని ఐజ్వాల్ ఒక వింత. మేఘాలలో లీనమౌతూ ఉంటుంది. ఇటీవల మిజోలో పర్యటించిన ఆంధ్రా మహిళల బృందం అందిస్తున్న యాత్రా కథనం
-కాంతి నల్లూరి
25.5.24 (శనివారం) కోలాసిగ్ (కొలాజిజ్) జిల్లాలో మిజోరాం చెక్ పోస్ట్ లోకి ఎంటర్ అయ్యాం. మిజో సిఆర్ పిఎఫ్ (Mijo CRPF 147) బెటాలియన్ వాళ్లు చెక్ చేశారు. టీచర్స్ అనగానే వ్యాన్లో చెక్ చేయకుండా నవ్వుతూ బై చెప్పి పంపించారు. ఆధార్ ఇచ్ఛాం. కొంత టైం తీసుకున్నది ఈ చెకింగ్ కు. అక్కడ ఐదు ఇళ్ళే (వచ్చిన NH.8 అంతా 4, 5 ఇళ్లే కనిపిస్తున్నాయి దొంగల,రేపిస్తుల భయం లేదేమో అనుకున్నాం) దూరదూరంగా ఉన్నాయి. దొంగల భయం లేదా అని అడిగితే, "ఏముంది పోవడానికి అని చాలా క్యాజువల్ గా చెప్పింది". ఎడ్యుకేషన్ గురించి అడిగితే ఇప్పుడిప్పుడే లైలాపూర్, రోమన్ క్యాథలిక్ స్కూల్, ఆర్మీ స్కూల్, జవహర్ నవోదయ స్కూల్ కు వెళ్తున్నారని చెప్పారు.
ఐజ్వాల్ 100 కి.మీటర్ల దూరం. అయిదు గంటలు జర్నీ మన దగ్గర అయితే రెండు గంటల్లో వెళ్ళిపోతాము.ఘాట్ రోడ్. పది నిమిషాలకొక జలపాతం. మా వాళ్ళ అరుపులు. దూరంగా నీలి నీలి మబ్బులు. పొగ మంచు మేఘాలు. మేఘాల కన్నా ఇంకా పచ్చగా కనిపిస్తున్న కొండలు కెరటాలు కెరటాలు గా కనిపిస్తున్నాయి. దూరంగా ఉండగానే సిటీ అంతా లైట్స్ తో దేదీప్యమానంగా అలలు అలలుగా కనిపిస్తుంది. పట్టణం పట్టణమే లైటింగ్ తో అలంకరించినట్టు, మలుపులు మెలికల రోడ్లలో రకరకాల ఆకారాలతో, ఇళ్ళ మీద డ్రాగన్, పూల మొక్కల అందాలతో మాకు స్వాగతం చెబుతున్నట్టుగా ఉంది. అనుభవించాల్సిందే కాని చెప్పలేం. అస్సాం వాహనానికి పర్మిట్ లేదని ఐజ్వాల్లోకి రానివ్వలేదు. మాకు ఒక్కొక్కరికి 350 రూ.లు కట్టి చెకింగ్ దగ్గర ఇన్నర్ లైన్ పాసు తీసుకున్నాం. ఇక్కడ టోల్ గేట్ల గోల, హారన్ల మోత లేదు.
అస్సాం, మేఘాలయ, ఐజ్వాల్, త్రిపురల్లో మేమందరం ఇష్టపడింది, మమ్మల్ని అందరినీ తన అందాలతో ఆకర్షించినది మిజోరాం రాజధాని ఐజ్వాల్. ఎందుకు?
ఐజ్వాల్ మూడువేల (3715) ఏడువందల పదిహేను అడుగుల ఎత్తులో "మీజో"లోనే ఎత్తైన నగరం అనిపించింది.నిజంగానే ఎతైన నగరం. అంత ఎత్తులో ఉన్న నీటికి కొరత లేని, చల్లని ప్రదేశం. వాష్ బేసిన్ల దగ్గర కూడా వేడి వేడి నీళ్ళు వస్తున్నాయి. ఐజ్వాల్ అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో ఉన్నది."ల్యాండ్ ఆఫ్ ద హైలాండ ర్స్" అని అంటారట. కనుచూపుమేరా పచ్చ పచ్చని కొండలు. దొంతులు దొంతులు గా కొండలు.మలుపుల మలుపుల కొండలు. అంతలోనే మేఘాలలో మాయమైపోయే కొండలు. జలపాతాలు, నీలి నీలి మబ్బుల జలతారు పందిళ్లు. చూపర్లను ఆశ్చర్యపరుస్తూ క్రింద నుండి పైకి ఎగబాకుతున్న పాలనురగ లాంటి మేఘాలు. మనం ఆకాశంలో మబ్బుల్ని, మేఘాల్ని తల ఎత్తి చూస్తాం. ఐజ్వాల్ లో తలదించి కింది నుంచి పైకి వచ్చే మబ్బుల్ని మేఘాలని చూడాలి. ఆ మబ్బుల్లో మేఘాలలో సినిమాల్లో లాగా దేవతలు వచ్చినట్లు, మనకు కూడా తెలియాడుతున్న అనుభూతి.
రోడ్ల పక్కన కూడా ,మన వెదురులా గూములు గూములుగా కాకుండా రెండు మూడు వెదురు కర్రలు సన్నగా, పొడవుగా ఉన్నాయి. రోడ్డు పక్కన జొన్న మొక్కల్లా, చిన్నచిన్న వెదురు మొక్కలు కొంచెం కూడా నేల కనిపించకుండా నల్ల రోడ్లను, నీలి కొండలను పచ్చగా మార్చేశాయి. రణగోణ ధ్వనులు లేని, కార్బన్ డైఆక్సైడ్ లేని స్వచ్ఛమైన ఆక్సిజన్ ని నిశ్శబ్ద ఐజ్వాల్ లో పీకల దాకా పీల్చుకున్నాం.
హోటల్ దగ్గర కొంచెం దూరంలో యూత్ (యూత్ క్లబ్ లాంటిది) క్లబ్బులో బొంగుల డాన్స్ రిహార్సల్స్ (పైఫోటో) జరుగుతున్నాయి. ఆడ, మగ పిల్లలు రోజు ఉదయం, సాయంత్రం గంట గంట ప్రాక్టీసు చేస్తున్నారట. ఒక గ్రూప్ మగ పిల్లలు బొంగులు కదుపుతుండగా, ఒక గ్రూప్ డ్రమ్స్ వాయిస్తుండగా, ఆడపిల్లలు ఆ వాయిద్యాల రిథమ్ కు, ఆ బొంగుల కదలికిల మధ్య డాన్స్ చేస్తూ చెమటలు కక్కుతున్నారు. కాళ్ల నొప్పులని పడిపోతున్న ఆడపిల్లల కాళ్లకు మసాజ్ లు చేస్తున్నారు. డాన్స్ నేర్పే కోచ్ కూడా మసాజ్ చేయటం చాల ఆశ్చర్యం గా అనిపించింది. (మన దగ్గర అయితే డ్యాన్స్ నేర్పే గురువులు "గజ పూజ పేరుతో" నాలుగేలో ఐదువేలో తీసుకొని శిష్యుల కాళ్లకు గజ్జలు కడతారు. ఆ తర్వాత మరి ఎప్పుడు కాలికి గజ్జలు కట్టరు). ఇది, సంస్కృతిని, సాహిత్యాన్ని, కళలను కాపాడుకోవడానికి వాళ్ళు పడే తపనకు ఓ ఉదాహరణ. అబ్బురపరిచే ఈ బొంగుల నృత్యాన్ని"చెరావు" అంటారట. మిజో బొంగుల డాన్స్ గురించి చూడాల్సిందే. ఇది వారికే ప్రత్యేకం.వచ్చేనెల మిజోరం స్టేట్ పండగ ఉందట. మిజోరాష్ట్రంలో ప్రధానంగా మూడు పండుగలు జరుపుతారట. ఈ మూడు పండుగలు వ్యవసాయ సంబంధించిన పండుగలే. మా బేబీ, మధులు కారం కారంగా ఉన్న పెద్ద బూంది కవర్ను వాళ్లకి ఇచ్చేశారు. ఆడపిల్లలు బావుంది బావుంది ఆంటీ అంటూ తిని నీళ్లు తాగేశారు.
మిజోలో 160 గిరిజన, ఉప జాతులు ఉన్నప్పటికీ "మిజో", ఇంగ్లీష్ ప్రధాన భాషలు. మన ప్రభాస్ ఎన్టీఆర్ లను ఇష్టపడుతున్నారు. ఒక కార్ డ్రైవర్ కొడుకు పేరు ప్రభాస్ అట. మా కారు డ్రైవరు తెలుగు పాటలుపెట్టాడు.చక్కగాపాడుతున్నాడు. క్రిస్టియానిటీ ఎక్కువట. ఏ మతమైనప్పటికీ మిజో ప్రజలు పంది మాంసం (అసలు ఈశాన్య రాష్ట్రాలలో పంది మాంసం ఎక్కువట. ఎక్కడ పడితే అక్కడ కూరగాయల పక్కనే పందిమాంసంకనిపిస్తుంది.)
వెదురుచిగుర్లు,చికెన్,మోమూస్,బంగాళదుంపలు,నూడిల్స,బియ్యప్పిండి వంటకాలు ఇష్టపడతారట. కుక్క మాంసం గురించి అడగలేకపోయాము. మాకు కుక్కలు ఎక్కడ కనపడలేదు. రోడ్డు మీద కూడా. అసలు ఏ జంతువులు, పక్షులు కనిపించలేదు. పాలు పెరుగు లాంటివి అసలు కనిపించలేదు. వాటి గురించి అడిగినా నవ్వుతున్నారు. రెడ్ టీ లు (మన డికాక్ష లా) ఎక్కువగా తాగుతున్నారు.తాగితే బాగున్నాయి.
అన్నం, బియ్యప్పిండితో చేసిన తెల్లటి డ్రింకు బాటిల్స్ అమ్ముతున్నారు. నేను,అజితా టెస్ట్ చూద్దామని కొందామనుకుని దగ్గరకు వెళ్ళాము. మన కల్లు లాగా అనిపించి అమ్మో! ఏమిటో? ఇవి అనుకొని భయపడి కొనలేదు. మా కార్ డ్రైవరు బాగుంటాయి, భలే ఉంటాయి కొనమని ఆ బాటిల్ పట్టుకొచ్చి పదే పదే అడిగాడు. మేం కొనక పోయేసరికి అతనే కొనుక్కున్నాడు. లీటర్ బాటిల్ 200 రూపాయలు. అవి నిజంగానే కొద్దిగా మత్తుగా, మందు వాసనగా ఉంటాయట. టీం లీడర్ బేబీ, వాళ్ళ డ్రైవరును తాగారా వాసన వస్తున్నది అని అడిగితే తాగలేదండని ఆ బాటిల్స్ గురించి చెప్పారట. నేను కొనకపోవడం మంచిదే అయింది.
కొబ్బరి బొండాలు దొరకలేదు. కొబ్బరి నీళ్లు (200 ml మజా బాటిల్స్ లా) బాటిల్స్ లో అమ్ముతున్నారు. ఒక్కొక్క సీసా 60 రూపాయలు.
.26.5.24 (ఆదివారం) 8 AM కల్లా ఎత్తైన ప్రదేశం రీక్ కాంగ్ ( REIEK KAWNG) కి బయల్దేరి 3400 అడుగుల ఎత్తులో ఉన్న దూరాన్ని ఒక గంటలో నడిచి పిక్ పాయింట్ కి చేరాం. ఐజ్వాల్ కన్నా మేము ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం.
హిమాలయపర్వతాల్లోఉన్నాం.ఆకాశంఅందుతుంది,మేఘాలనుతాకుతున్నాం,పక్కనే జలపాతాలున్నాయి,ఏదో నది ప్రవహిస్తుంది, ఐజ్వాల్ అందమైంది ఇది ఇంకా అందమైనది,ఇక్కడ అద్భుతంగా ఉందoటూ ముందు ఎక్కిన వాళ్ళు వెనక వాళ్ళని పిలుస్తున్నారు. ఆనందమే ఆనందం అరుపులతో. కూర్చున్నారు,వెల్లకిల్లా పడుకోని ఆకాశం కేసి చూసారు.
ఈ పిక్ పాయింట్ నుండి చూస్తే మొత్తం ఐజ్వాల్ కనిపిస్తుంది. చుట్టూ పొగ మంచు సిటీని కమ్మేస్తూ, కుంభవృష్టి కురుస్తాదేమో అన్నట్లు, మబ్బులన్నీ కింద నుండి పైకి ఎగబాకుతూ రకరకాల ఆకారాలతో విన్యాసాలు చేస్తూ ఊరిస్తూ ఉరకలేస్తూ, ఐజ్వాలని మాయం చేస్తూ, చీకటిచేస్తూ. అంతలోనే మాయం.లేత ఎండను తెస్తూ దోబూచులాడుతున్నాయి.
ఎత్తైన కొండలపై ఇళ్ళు, లోయల్లో ఇళ్ళు. పక్కనే జలపాతాలు నదుల్లా ప్రవహిస్తూ. శిఖరం అంతా మాదే. ఎవ్వరూ లేరు. పక్కనే బంగ్లాదేశ్ కొండలు లోయలు కూడా కనిపిస్తున్నాయి. కొండ, అడివి అంతా నీట్ గా ఉంది. చెత్త, బాటిల్స్, ప్లాస్టిక్ ఏమి కనిపించలేదు. ఎక్కడకక్కడ డస్ట్ బిన్ లు ఉన్నాయి. మా వాళ్లే రెండు మూడు బాటిల్స్ పడేశారు. ఇంత పచ్చదనంతో ఉన్నా ఓ చిన్న జంతువు గాని, పిట్టగాని, తూనీగలు, సీతాకోక చిలుకలుగాని (రెండు గొడ్డు ఈగలు తప్ప) కనిపించలేదని ఆశ్చర్యపడ్డాము.
గంటన్నర ప్రయాణం చేసి ఓ మిజో విలేజికి (అది మోడల్ విలేజి) చేరాం. దాని పేరు జోకువా(Zokhua) నిజమైన విలేజి చూపిస్తారనుకున్న నాకు నిరాశ అనిపించింది. గిరిజన ఇళ్ళు, నిర్మాణం , రోళ్ళు, రోకళ్ళు, డప్పులు వగైరా ఉన్నాయి. దారంతా, ఇక్కడా వర్షమే. నాలుగున్నరకే చీకటి.
అరగంట ప్రయాణం చేసి సోలోమాన్స్ (Solomon's temple )టెంపుల్ కు (చర్చిని టెంపుల్ అంటారట) వెళ్ళాం. చాలా బాగుంది బయట నుండి (అదివారమైన తాళం వేశారు) చూస్తేనే. లోపల ఇంకెంత బాగుంటుందో చూడలేకపోయామని బాధపడ్డాం. ఇది ఐజ్వాల్ లో పెద్ద చర్చి అట,
ఐజ్వాల్ నీట్ గా ఉంది. ఉమ్ములు వూసేవాళ్ళు, ఉచ్చలు పోసే వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. పిచ్చిపిచ్చిగా జుట్లు పెంచకుండా నీట్ గా కట్ చేసుకుని ఉన్నారు. ఎక్కువగా నల్ల బట్టలు, ప్రతి ఒక్కరి చేతిలో గొడుగు. మంచి రంగులో కుదురైన పోలికలతో చాలా అందంగా నేపాలి, చైనీయుల కన్నా బాగున్నారు. ప్రశాంతంగా ఉన్నారు. హారన్ల గోల వ్యాపారుల హడావుడి, వ్యాపార ప్రకటనలు విగ్రహాలు కనిపించలేదు. పెట్రోల్ బంకులు హోటల్స్ తక్కువే. బోర్డులన్నీ ఇంగ్లీష్ లోనే ఉన్నా (ai ,ui లతో) చదవడం కష్టంగా ఉంది.
కొండ అంచు బారెడు ఉంటే, ఇంకొక మూరెడు పిల్లర్లు వేసి చిన్నఇల్లు లేదా షాపులు కట్టారు. ఇళ్ళ పైనా చుట్టుపక్కల, బాల్కనీ, మెట్లు పూల మొక్కలమయం. చిన్న భూమి కూడా (రోడ్లు తప్ప) పచ్చదనం, పూల మొక్కలతో అందంగా ఉంది. ఎక్కడా చెత్త, ప్లాస్టిక్ కనిపించలేదు. సిమెంటు గోతాలను దడిగానన్న కట్టారు గానీ వేస్ట్ గా పడేయలేదు. చిన్న మిస్ బిహేవియర్ కూడా కనిపించలేదు. చాలా రెస్పెక్ట్ తో మాట్లాడుతున్నారు. కాకపోతే బహిరంగ ధూమపానం (సిగరెట్లు బీడీలు) ఎక్కువగానే కనిపించింది.
మీ సిటీ ఇంత నీటుగా ఉంది, ఎలా? అని అడిగితే మా సీఎం గారు చీపురు పట్టుకొని ఊడుస్తారండి (చెత్త ఎక్కువగా ఉందని ఎప్పుడో ఓ సీఎం గారు ఊడ్చారట). అందుకని నీట్ గా ఉంచగా తప్పడం లేదని నవ్వుతూ చెప్పారు.మొత్తంగా ఐజ్వాల్ని క్లీన్, గ్రీన్, సౌండ్ లెస్, డీసెంట్, రెస్పెక్ట్, ఎడ్యుకేట్, (మిజోరాం 90% ఎడ్యుకేషన్ తో కేరళ తరువాత ప్లేస్ లో ఉంది). ఫ్లవర్ సిటీ అని చెప్పవచ్చు.
ఆ కొండల మీద వలయాలు వలయాలుగా ఇళ్ళు మానవమాత్రులు కట్టినట్టుగా లేవు. రాత్రిపూట లైటింగ్స్ లో చూస్తే భూమి మీదగా ఉన్నట్లు లేం. ఏవో రెక్కలు కట్టుకుని ఆకాశంలో విహరిస్తున్నట్లుగా ఉంది. అందరికి నచ్చిన ఐజ్వాల్ కు చెప్పలేక చెప్పలేక వీడ్కోలు చెప్పి త్రిపుర కు బయలుదేరాం.