‘ఓహో అస్సాం.. నీ అందాలకు సలామ్’
x

అస్సాం మైదాన ప్రాంతం

‘ఓహో అస్సాం.. నీ అందాలకు సలామ్’

కాంతి నల్లూరి: ఈశాన్య రాష్ట్రాలలో (సెవెన్ సిస్టర్స్) కొండలు, లోయలు, జలపాతాలు మొదలైన ప్రకృతి అందాలను ఆస్వాదించే వారికి మంచి యాత్ర అవుతుంది.


-కాంతి నల్లూరి

చరిత్రలు వాటి ప్రాధాన్యతల జోలికి పోకుండా 15 రోజుల ఈశాన్య భారత యాత్రలో నేను పొందిన అనుభూతిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా అంచనాలు కొద్దిగా అటుఇటుగా ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళినా మనుషులు, వేష భాషలు, సంస్కృతి, పద్ధతులు, కట్టుబొట్టు చూడటమే ఆసక్తి. పైగా ఈశాన్య భారత రాష్ట్రాలలో, రాజస్థాన్లో ఉన్నట్లు పెద్ద పెద్ద కోటలుగాని, దక్షిణ భారతదేశంలో ఉన్నట్లు పెద్ద పెద్ద ఆలయాలు, శిల్ప సంపద పెద్దగా లేదు. ఈశాన్య రాష్ట్రాలలో (సెవెన్ సిస్టర్స్) కొండలు, లోయలు, జలపాతాలు, పచ్చదనం, టీ తోటలు, మేఘాల విన్యాసాలు మొదలైన ప్రకృతి అందాలను ఆస్వాదించే వారికి మంచి యాత్ర అవుతుంది.

ఉదయం 9 గంటలకు ఒంగోలులో బస్సు ఎక్కి 1 గంటకు గన్నవరం ఎయిర్పోర్ట్‌కు, సాయంత్రం 4: 45 గంటలకు గన్నవరంలో బయలుదేరి 6: 30 గంటలకు బెంగళూరు ఎయిర్ పోర్ట్‌లో దిగాం. చాలా పెద్దగా ఉంది. ఎయిర్పోర్టులో దాదాపు 50 విమానాలు వరకు ఉన్నాయి. అన్ని ఇండిగో ( IndiGo) వే. చూద్దాం అన్నా వేరే విమానం కనిపించలేదు.

పెద్ద తలపాగాతో, కొద్దిగా వంగి స్వాగతం పలుకుతున్న మనిషి సింబల్ కోసం ఎయిర్ పోర్ట్ లో ఎక్కడ చూసినా కనిపించలేదు. ఈ సింబల్ రద్దు చేశారని తెలిసినా ఎందుకు చూశాను (నాకు చాలా ఇష్టం కనుక). చాలా దిగులుగా అనిపించింది. వర్షం పడి బెంగళూరు ఎయిర్ పోర్ట్ అంతా చాలా క్లీన్‌గా ఉంది. గన్నవరంలో ఎంటర్ అయిన దగ్గర నుండి బెంగళూరులో దిగేదాకా ఓ అమ్మాయి ఏడుస్తూనే ఉంది. అతను దగ్గరకు తీసుకుని సముదాఇస్తూనే ఉన్నాడు. ఎందుకో తెలుసుకోవాలనిపించినా మేలి ముసుగుల సంస్కారం అడ్డు వచ్చింది.

కొద్దిగా లేటుగా బయలుదేరి గౌహతి ఎయిర్పోర్టులో అర్దరాత్రి ఒంటిగంటకు దిగాము. చాలా చిన్నగా గన్నవరం ఎయిర్‌పోర్ట్ అంత ఉండి ఉంటుంది. నాలుగు ఇండిగో విమానాలే ఉన్నాయి. ఇది చూసి ఎయిర్ లైన్స్‌లో ఇండిగో ఆధిపత్యమే అనుకున్నాం. గౌహతి ఎయిర్పోర్ట్‌లో తాళం వేస్తున్న విగ్రహం, కొంచెం లోపలికి రాగానే నరసింహస్వామి, హిరణ్యాక్షల విగ్రహాలు, అస్సాం సంస్కృతిని తెలిపే గ్రామీణ విగ్రహాలు, పెయింటింగులు భలే ఉన్నాయి. ప్రయాణికులు వచ్చే అంత దూరం చాలా నీట్‌గా ఉంది. కానీ జల్లులు జల్లులుగా వాన పడుతుండటంతో కొద్దిగా చేపల వాసనలా వస్తుంది.

బయటకు రాగానే ఇరవై సీటర్ల వాహనం రెడీగా ఉంది. సామానంత కుక్కి కుక్కి ఎక్కించారు. మొత్తం 17 మంది మహిళలం. మా టీం లీడర్ బేబీ రాణి రిటైర్డ్ హిందీ టీచర్. హిందీ చాలా ఫ్లూయెంట్‌గా మాట్లాడుతుంది. బుక్ చేసిన హోటల్ ఖాళీగా లేకపోవడంతో తెల్లారి ఎనిమిది గంటల దాకా ఆ హోటల్ ఈ హోటల్ అంటూ చివరికి కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్‌లో దించారు.

గౌహతి రాజధాని అయినా మురికి గానే ఉంది. మేం తిరిగినంతమేర పెద్దపెద్ద ఆకాశాన్ని తాకే అపార్ట్మెంట్లు లేవు. విగ్రహాలు, వాల్ పోస్టర్స్, రాజకీయ నాయకుల ఫోటోలు కనిపించలేదు. ఇవి చాలా సంతోషాన్ని ఇచ్చాయి. బహుశా ఎలక్షన్ జరుగుతుండటం వల్లనో ఏమో? మేం బుక్ చేసుకున్న హోటల్ దగ్గర సీఎం హిమంత బిశ్వశర్మ, మోడీ ఫోటోలు ఉన్నాయి. ఎక్కడికి వచ్చినా మోడీ ఫోటోలు ప్రత్యక్షం అవుతున్నాయి. గాయత్రి, మైత్రి, మిత్ర పేర్లు చూసి ఆంధ్ర పేర్లులా ఉన్నాయ్ అనుకున్నాం.

బ్రహ్మపుత్ర నది ఒడ్డున పదిహేడు మంది

రెండు గంటలకు బయలుదేరి "బ్రహ్మపుత్ర" నది దగ్గరకు వెళ్ళాం. గంగ, యమున, బ్రహ్మపుత్ర అని చదువుకోవడం, వినడంతో ఇది “బ్రహ్మపుత్రా” నదియేనా!అని ఉద్వేగానికి గురయ్యాను. సముద్రమంత ఉంటుందనుకున్నాను. లేదు. అయినా సరే జీవనదుల్లో ఒకటైన బ్రహ్మపుత్రను చూసిన ఆనందం మా కళ్ళల్లో కనిపించింది. వాతావరణం, పువ్వులు, మొక్కలు భలే ఉన్నాయి. రోప్ వేలో, నది మధ్యలో ఓ దీవికి వెళదాం అని వెళితే వాతావరణం బాగోలేక రద్దు చేశామని కౌంటర్‌లో చెప్పారు.

కామాక్షి, బాలాజీ, పద్మావతి టెంపుల్స్ చూశాం. బాలాజీ పద్మావతి దక్షిణాది విగ్రహాల్లా పెద్దగా, అందంగానే ఉన్నాయి. కామాక్షి టెంపుల్ అక్కడ ఫేమస్ అట. అస్సాంలోనీ కరింగర్ జిల్లాలోని బాదర్పూర్ (Badarpur) లో భారక్ వ్యాలీ (Barak valley)లో దిగాం. దుప్పట్లు చాలా మురికిగా, నాసిరకంగా, వేలు పెడితే చాలు నల్లటి దుమ్ము. సంవత్సరం క్రితం తలుపులు తెరిచిన దానిలా ఉంది. ఉండలేక హోటల్ ఫోటో తీసుకుని ఒక్కదాన్నే బయటికు వెళ్లాను. ఎర్రటి ఉమ్ములతో రోడ్లన్నీ సుమారైన ఎర్రటి వానజల్లు కురిసినట్లుగా ఉన్నాయి. మనుషులు మురికి మురికిగా, టౌన్ అంతా చిత్తడి చిత్తడిగా ఉంది. రంగనాయకమ్మ "శుభ్రంగా ఉండడానికి తగినంత నీరు వసతులు లేకపోవడమే కాదు అసలు శుభ్రంగా ఉండాలని తెలియదనే మాటలు గుర్తొచ్చాయి". ఎక్కడ నిల్చుంటే అక్కడే ఉమ్ముతున్నారు. అక్కడే తింటున్నారు. అక్కడే టీలు తాగుతున్నారు. మార్కెట్ అంతా సందడిగా ఉంది. దాదాపు మనలాంటి కూరగాయలు, పళ్ళు ఉన్నాయి. నాటు గుడ్డు 15 రూపాయలు. యాపిల్, దానిమ్మ రేటు కొంచెం ఎక్కువగానే ఉంది.

అస్సాం ట్రాన్స్పోర్ట్ అంతా 20 సీటర్స్ లోపల ఉండే వ్యాన్లే. ప్రైవేట్ ఆటోలు, అక్కడక్కడ రిక్షాలు. రోడ్డంతా దుమ్ము లేస్తుంది. కళ్ళల్లో పడుతుంది. మనుషులు గౌరవంగా ఉన్నారు. పాల కోసం నీళ్ల కోసం మాట్లాడిన వారు చాలా గౌరవంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మినరల్ వాటర్ షాప్ అతను "విశాఖ వెరీ నైస్" అన్నాడు. తిరిగి తిరిగి హోటల్‌కి వచ్చాను. టీ బాగుంది తాగమన్నారు. టౌన్ మురికి గుర్తొచ్చి వద్దన్నాను.

ఐజ్వాల్! నీకు వందనాలు తల్లి. నువ్వు ఎంత సౌందర్యంగా కనిపిస్తున్నావో ఈ బదర్పూర్ ముందు. మీ ప్రకృతిని కాపాడుకోవడానికి ఎంత బాధ్యతగా కష్టపడుతున్నావు ఆ వలయాకార దొంతర దొంతరల కొండల మీద లోయల్లో అనుకున్నాను. మా వాళ్ళ కోరికపై టీ తాగాను. అద్భుతంగా ఉంది. ఆ టీ రుచి ముందు ఆ మురికి డోంట్ కేర్. టి మర్చిపోలేనంత అద్భుతంగా ఉంది.

అస్సాంలోని టీ తోటలు

ఆదివారం 6 గం.ల కల్లా ఈ మురికి సిటీ నుండి అర కిలోమీటర్ దూరం వచ్చాం. మా కళ్ళు హృదయం ఆనంద డోలికల్లో నాట్యం చేయడం మొదలెట్టాయి. బాదర్పూర్ లేక్ పరవళ్ళు తొక్కుతుంది. గోదావరి రంగు నీటి ప్రవాహాలు. నీటి సంద్రాలు. లేలేత నేరేడు రంగుల, తెల్ల తెల్ల అడవి మల్లెరంగుల మేఘాల విన్యాసాలు. ఆ మేఘాలలో ఆ నీటి ప్రవాహాలలో విహరిస్తున్నట్లు గొప్ప ఫీలింగ్. అటు చూడండి ఇటు చూడండి. అబ్బా! మేఘాలు, లోయలు, సూర్యోదయం, టీ తోటలు అంటూ ఆనందంగా అరుస్తుంది మా అజిత.

తలారా స్నానం చేసిన అస్సాం టీ తోటలు, సన్నగా పోటీపడి పెరుగుతున్న పోకలు, పచ్చని తలపాగ చుట్టుకున్నట్లు మధ్యరకంగా ఉన్న చెట్లు, నేల కనపడకుండా ముదురు ఆకు దుప్పటి పైన లేత ఆకు పచ్చని చుక్కలతో మందపాటి దుప్పటి పరిచినట్లు ముదురు లేత ఆకులతో టీ తోటలు ఇటు జల్ల వేస్తే అటు దొర్లేటట్లు చదునుగా ఉన్నాయి. అక్కడక్కడ టీ తోటలలో ఆకులు తెంపుతున్న కూలీలు వీపు మీద బుట్టలతో ఆ తోటల్లో విహరిస్తున్న దేవదూతల్లా ఉన్నారు మా కళ్ళకి.

కరీంగంజి నుండి త్రిపుర వైపు జోరువానలో మా ప్రయాణం. రాత్రి నుండి కురిసిన వర్షంతో పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఆరు రోజుల తర్వాత మైదానాన్ని చూస్తున్నాం. రోడ్డుమీద మేము, మా వాహనం తప్ప మరొక వాహనం కనిపించడం లేదు. మిథాలీ ట్రావెల్స్ డ్రైవర్స్ జోరు వానలో జోరుగా పోతున్నారు. ఆరు రోజుల డ్రైవింగ్లో చిన్న హారన్ కొట్టడం కాని, చిన్న జర్కు ఇవ్వటం గాని చేయకుండా, రోజు మొత్తంలో ఒకటి రెండు మాటలతో అతి తక్కువ ఆహారం తింటూ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇద్దరి నోటిలో ఎప్పుడు పాన్ పరాగలే.

దూరం పోయే కొద్ది, కొద్దిగా పెద్ద ఊర్లు పెద్ద పెద్ద ఇళ్ళు కనిపిస్తున్నాయి. బస్సులు, బైకులు, ఆటోలు ఏమీ కనిపించడం లేదు. కార్లు ట్రక్కులే కనిపిస్తున్నాయి. పోతున్న కొద్ది రోడ్డు పక్కనే ఐదు, ఆరు ఇళ్ళున్న ఊర్లున్నాయి. దీన్నిబట్టి ఇక్కడ దొంగల భయం, రేపిస్టుల భయం లేదనిపిస్తుంది. లారీలు ట్రక్కులు కనిపిస్తున్నా ఎక్కడ భోజనం హోటల్ కనిపించడం లేదు. నమిలే ఆకులు వక్కలాంటివి ఎక్కడపడితే అక్కడ అమ్ముతున్నారు. పనసకాయలు కూడా. పెరుగు ప్యాకెట్లు అంటూ ఏడు గంటల ప్రయాణంలో ఎక్కడా దొరకలేదు. ఒక్క పెంపుడు, అడవి జంతువులు కూడా కనిపించలేదు. ఎడమవైపు కొండ ఉంటే కుడివైపు లోయ, కుడి వైపు కొండ ఉంటే ఎడమవైపు లోయ. జోరువానకు కొండల్లో లోయల్లో ఉన్న చెట్లు, నగలు అలంకరించుకొని, తలవంచుకొన్నపెళ్లికూతుళ్ళలా ఉన్నాయి.

టీ తోటల అందాలకు మా కళ్ళు అప్పగించాం. ఇంకొంచెం ముందుకు వస్తే అరటి, పసుపు, కొబ్బరి తోటలు. అక్కడక్కడ మాగాణి. రోడ్డుకి ఇరుపక్కల మొక్కల పచ్చదనం, పువ్వుల రంగుల వాసనల వినోదం. రాయడానికి భాష లేదు. కళ్ళు, హృదయంతో ఆనందించటమే తప్ప. టీ తోటల అందాలకు దాసులమై ఓ చోట ఆగి తలా పది ఆకులు కోశాము. ఆకు నలిపి వాసనలు ఫీల్చేము. చెకింగ్ ఉంటుందని చెప్పి డ్రైవర్లు కోసినాకులు పడేయించారు. ఫోటోలు దిగాం.

ఇంకొంచెం ముందుకు వచ్చాం. కొండల మీద నుండి దుముకుతున్న కృష్ణానది రంగు స్వచ్ఛమైన నీళ్లు ప్రవహిస్తున్నాయి. పారుతున్న ఆ నీళ్ల అడుగు భాగం స్పష్టంగా కనిపిస్తుంది. కనుచూపుమేరా కొండల లోయల పచ్చదనాలు. చెట్లకు అల్లుకుపోయిన తీగలు. మేఘాల పందిళ్ళు. మురికి సిటి గుర్తురానంత అడుగున పడిపోయింది. ఓహో.. అస్సాం నీ టీ తోటల, లోయల మేఘాల అందాలకు సలామ్ అన్నామ్.

ట్రాఫిక్‌తో ఆగుతూ ఆగుతూ ఆనందిస్తూ కొనసాగుతున్నాం. రోడ్లు గుంతలమయం. మలుపులు. కిటకిటలాడుతున్న ట్రాఫిక్ అయినా చిన్న హారన్ కూడా మోగించకుండా డ్రైవింగ్ చేస్తున్న ఆ డ్రైవర్‌లు అందరికీ హృదయపూర్వక అభినందనలు చెప్పాం మనసులోనే. ఆంధ్ర లారీ డ్రైవర్లు కూడా బుద్ధిగా పోతున్నారు. ఈ కొండలలోనే జాదర్, హిల్స్, దాల్మియా సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు, ఇనప గజయంత్రాలతో ఆ కొండలను కరిగించి మన ఇళ్లను, ఫ్యాక్టరీలను పైకి లేపుతున్నాయి. ఈ కంపెనీల లేలాండ్ లారీలు, ట్రక్కులు తప్ప నాలుగు గంటల ప్రయాణంలో పెద్దగా ఊర్లు కనిపించలేదు.

Read More
Next Story