ఆంధ్రా మోడల్ ప్రైమరీ స్కూల్ ఒక బూటకం
x

ఆంధ్రా మోడల్ ప్రైమరీ స్కూల్ ఒక బూటకం

వైసిపి ప్రభుత్వం తెచ్చిన జీవొ 117 కొంత నష్టం చేస్తే, కూటమి ప్రభుత్వం తెస్తున్నజీవొ సవరణలు ప్రాథమిక విద్యా వవస్థను మరింత పతనం చేసే విధంగా ఉన్నాయి


-దర్పణం శ్రీనివాస్

గత వైసిపి ప్రభుత్వం 117 జీవో తీసుకువచ్చిందని, తద్వారా మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగతులను హైస్కూల్లలో విలీనం చేస్తున్నారని, తద్వారా ప్రాథమిక విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుంది అని మెయిన్ స్ట్రీమ్ మీడియా వాపోయింది. దాంతో ఆ ప్రభుత్వం కొన్ని పరిమితులను విధించుకుని మూడు కిలోమీటర్ల పరిధిని ఒక కిలోమీటరుకు కుదించింది. దాంతో కొంతమేరకు మాత్రమే విలీన ప్రక్రియను చేపట్టగలిగింది. కొంతమేరకు నష్ట నివారణ జరిగింది.

నిజానికి ఇతర పాఠశాలల నుండి 3,4,5 తరగతులను ఏ హైస్కూలుకు అయితే విలీనం చేశారో ఆ విద్యార్థులు మాత్రం ఆ హైస్కూల్లలో చేరలేదు. వారంతా ప్రైవేటు పాఠశాలల వైపే మొగ్గు చూపారు. ఈ విషయాన్ని గణాంకాలు ప్రస్ఫుటంగా చూపాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో 117 జీవో ఫలితాలపై ప్రభుత్వం ఒక సర్వే కూడా చేసింది. ఆ సర్వేలో కూడా ఇదే విషయం తేటతెల్లమైంది.

117 జీవోను రద్దు చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత 117 జీవో కు సవరణలు చేసింది. నిజానికి ఈ సవరణలు ఇప్పుడు ప్రాథమిక విద్యా వవస్థను మరింత పతనం చేసే విధంగా ఉన్నాయి. వివరాలలోకి వెళితే

మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని పాఠశాలలలోని 3,4,5 తరగతులను ఒక పాఠశాలలో విలీనం చేస్తున్నారు. ఆ పాఠశాలను మాడల్ ప్రైమరీ స్కూలుగ మార్చి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తున్నారు. ఏ ఒక్క పాఠశాలను మూయబోవడం లేదు. మిగిలిన అన్ని పాఠశాలలు PP1, PP2, 1, 2 తరగతులను మాత్రమే కలిగి ఉండి ఫౌండేషన్ స్కూల్స్ గా ఉంటాయి. ప్రస్తుతం 60 రోల్ ఉన్న పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్ గా మారుస్తున్నారు. పేరెంట్స్ కమిటీ తీర్మానం చేస్తే ఫౌండేషన్ స్కూల్ గా కాక బేసిక్ ప్రైమరీ స్కూల్ గా అంటే ఒకటి నుండి ఐదు తరగతులు ఉండేలా స్కూలును కొనసాగిస్తారు. ఆ విధముగా మూడు రకాలుగా ప్రాథమిక పాఠశాలలు ఉంటాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది అనిపిస్తుంది.

ప్రభుత్వం చేసిన సవరణలకు అనుగుణంగా మండల విద్యాశాఖ అధికారులు గత నెల రోజులుగా దీనిపై కసరత్తులు చేశారు. కానీ ఆ ఫలితాలు ప్రభుత్వం కోరుకున్నట్లుగా సేవా రంగాన్ని తగ్గించలేకపోగా కొత్త పోస్టుల సృష్టి జరిగి ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రపంచ బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా విద్యారంగాన్ని కుందేలు చేస్తున్నారని వాపోయిన వారే నేడు అంతకుమించి ప్రాథమిక విద్యను కుదేలు చేయడానికి సిద్ధమయ్యారు. వీరు కూడా ప్రపంచ బ్యాంకుకు తొత్తులయ్యారా? ఏది ఏమైనా ప్రస్తుతం ఏం జరుగుతుందంటే

రాష్ట్ర విద్యా శాఖ నుండి కలెక్టర్లకు డీఈవో లకు మౌఖిక ఆదేశాలు కొన్ని వచ్చాయి. అవేమిటంటే 1 నుండి 5 తరగతుల వరకు ఉండే బేసిక్ ప్రైమరీ స్కూల్ల సంఖ్యను వీలైనంత వరకు తగ్గించండి అని. తద్వారా మండలానికి కేవలం ఐదు లేక ఆరు పాఠశాలలు మాత్రమే ఐదు తరగతులను కలిగి ఉండి మోడల్స్ ప్రైమరీ స్కూల్ గా మారుతాయి. మిగతా పాఠశాలలన్నీ ఫౌండేషన్ స్కూల్ లాగా మారుతాయి. ఇందుకోసం గతంలో 60 మంది విద్యార్థులు ఉంటే మోడల్ స్కూల్ అన్నవారు నేడు 45 మంది ఉన్నా మోడల్ స్కూల్ గా మార్చండి అంటున్నారు. ఏడు కిలోమీటర్ల లోపు ఉండే పాఠశాలలను అందుకోసం విలీనం చేయండి అంటున్నారు.

నిజానికి విలీనం అనే ప్రక్రియ బూటకమని గత ప్రభుత్వం హయాంలోనే తెలిసిపోయింది. పేరుకు ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను కిలోమీటర్ పరిధిలోని హైస్కూల్లో విలీనం చేసినప్పటికీ ఆ విద్యార్థులు మాత్రం సదరు హైస్కూల్లోకాలేదు. 80 శాతం పైగా విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వలస పోయారు. ఆ విషయాన్ని ప్రభుత్వం సర్వే ద్వారా తెలుసుకుంది. అయినా కానీ ఇప్పుడు విలీనం విలీనం అంటున్నారు. మోడల్ ప్రైమరీ స్కూల్ గా మారితే ఐదుగురు టీచర్లు ఉంటారు అని ఆశ చూపి చాలా గ్రామాలలో కేవలం రెండవ తరగతి వరకే విద్య ఉండేలా చేస్తున్నారు‌. ఆయా పాఠశాలల్లోని మూడు నాలుగు ఐదు తరగతి విద్యార్థులు తల్లికి వందనం తీసుకుని ప్రైవేటు పాఠశాలల్లో చేరిపోతారు. ఉన్నవి అన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలు అవుతాయి. కేవలం ఒకటి రెండు సంవత్సరాలలోనే అవి కూడా మూసివేత దిశగా అడుగులు వేస్తాయి. సంవత్సరం తిరగకముందే మోడల్ ప్రైమరీ స్కూలు పిల్లలు లేక తిరిగి బేసిక్ ప్రైమరీ స్కూల్ గా మారుతాయి. అంటే ఒకరు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలుగా మారుతాయి. చివరకు రెండు మూడు సంవత్సరాలలో మండలంలో ఐదారు స్కూల్లు మాత్రమే మిగిలి ఉంటాయి. గ్రౌండ్ లెవెల్ లో ఈ విషయం ఉపాధ్యాయులకు బాగా అర్థమైంది. వారి నుంచి సంఘ నాయకులకు ఒత్తిడి ఉంది. ప్రతినెల విద్యాశాఖ అధికారులతో సమీక్షలు జరుగుతూనే ఉన్నా ఈ విషయంలో ఏమి చేయలేక సంఘం నాయకులు చేతులెత్తేశారు. వారితో జరిగే చర్చలు పేరెంట్స్ కమిటీ తీర్మానం ఉంటేనే మేము మూడు నాలుగు ఐదు తరగతులను విలీనం చేస్తాం అంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో తప్పనిసరిగా తీర్మానం చేయాల్సిందే అన్న మౌఖిక ఆదేశాలు అందుతున్నాయి.

తెగించి కొందరు ఉపాధ్యాయులు పేరెంట్స్ కమిటీలు మా పాఠశాలలోని తరగతులను విలీనం చేయవద్దు అని తీర్మానం చేసినప్పటికీ ఆ తీర్మానాన్ని మండల స్పెషల్ ఆఫీసర్లు పరిశీలించి తల్లిదండ్రులను ఒప్పించాలి అంటున్నారు. వారి పరిధిలో లేనప్పుడు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు ప్రయత్నించాలని అప్పటికి తేలకపోతే కలెక్టర్ గారే ఆ విషయంపై దృష్టి సారిస్తారని మౌఖిక ఆదేశాలు అందుతున్నాయి. వీలైతే ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ ఇస్తామని చెప్పి ఒప్పించండి అంటున్నారు. ఈ వారంలో జరిగిన మండల విద్యాశాఖ అధికారుల సమావేశంలో ఈ విషయమై డీఈవోలు కలెక్టర్లు హుకూం జారీ చేశారు.

నిజానికి మోడల్ స్కూల్ భ్రమలో, ఉన్న ప్రాథమిక పాఠశాలలనన్నిటినీ కనుమరుగు చేస్తున్నారు. తల్లికి వందనం ట్రాన్స్ పోర్టు అలవెన్స్ ఆశ చూపి విద్యా వ్యవస్థను ప్రైవేట్ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యపై ఎటువంటి ఆసక్తి లేని తల్లిదండ్రుల పిల్లలే ఎక్కువ సంఖ్యలో చేరుతున్నారు. వారికి అందుబాటులో ఉన్న తరగతి వరకే వారు చదివే అవకాశం ఉంది. మిగిలిన వారు డ్రాప్ అవుట్లుగా మారే అవకాశం ఉంది.

ప్రభుత్వానికి ప్రతి రంగంలో రాబడి ఉండాలంటే అది అయ్యే పని కాదు ‌ విద్యా వైద్యం కనీస అవసరాలు. వాటికి ఎంత వెచ్చించినా తక్కువే. నేడు పథకాలను, అలవెన్సులను ఆశ చూపి ఉన్న పాఠశాలలను మూసివేస్తే రేపటి రోజున పథకాలు లేక పాఠశాలలు లేక పేద పిల్లలు విద్యుకు దూరమవుతారు.

పెట్టుబడిదారీ విధానాలకు దాస్యం చేసే మన నాయకులు బడుగు బలహీన వర్గాలకు ఆసరాగా ఉన్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను అంచలంచలుగా నాశనం చేస్తూ వారికి కావలసిన కూలీలను తయారు చేసుకుంటారని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

(దర్పణం శ్రీనివాస్, ఉపాధ్యాయుడు, కథా రచయిత)

Read More
Next Story