‘తుంబురు’ను చూడాలనే కోరిక నీటిపాలైంది
x

‘తుంబురు’ను చూడాలనే కోరిక నీటిపాలైంది

దారిపొడుగునా ప్రకృతి సోయగాలు రాసులు పోసినట్లు

చిత్తూరు జిల్లా శేషాచలం కొండల్లోని తుంబురు కోన చూడాలని రెండు నెలలుగా ప్లాన్ చేసుకున్నాం.

యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ యూనిట్ రెండు రాత్రులు మూడు పగళ్ళు ప్లాన్ చేశారు. దానికి రెడీ అయిపోయాం. గుంటూరు ట్రైక్కింగ్ వాళ్లు రెండు పగళ్ళు ఒక రాత్రి ప్లాన్ చేశారు. నేను గిరిజగారు రెండు రాత్రులు ఉండలేమని గుంటూరు ట్రిక్కింగ్ వాళ్ళతో వెళ్దామనుకొని వారికి ఫోన్ చేశాం. వాళ్ళు "45 సంవత్సరాల లోపు వారే" అని ఫారెస్ట్ వాళ్ళు నిబంధన పెట్టారని చెప్పారు. ఆ నిబంధనకు మేమెందుకు ఊరుకుంటాం అన్నాo. ఇదే డేట్ లో తిరుపతి వాళ్ళ ట్రిక్కింగ్ కూడా ఉందని తెలిసింది. తిరుపతి కొండల్ని అణువణువు ట్రిక్కింగ్ చేసిన రాఘవశర్మగారిని మేము వస్తాము అని అడిగాo. రాఘవశర్మగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. డిసెంబర్ 14న తిరుపతిలో రాఘవశర్మగారి ఇంటి నుండి శర్మగారు గిరిజగారు తెల్లవారుజామున ఐదు గంటలకు బస్సు ఎక్కేo . కుక్కల దొడ్డి అనే గ్రామానికి మూడు కిలోమీటర్ల ఇవతల రైల్వే బ్రిడ్జి దగ్గర దిగాలి.

తుంబురుయాత్రలో సీనియర్ మోస్టు సభ్యుడు ప్రముఖ రచయిత రాఘవశర్మ

ఆ చీకట్లో డ్రైవరు కుక్కల దొడ్డి ఊర్లోనే దించాడు. మూడు కిలోమీటర్లు వెనక్కి నడవాలి. ఆటో లాంటివి ఏమైనా వస్తాయేమోనని చూస్తూ నడవటం మొదలెట్టాo. అవి రాలేదు కానీ తిరుపతి తిరుమల ట్రెక్కింగ్ గ్రూప్ ఆర్గనైజర్ మధుగారు మా పక్కన బండి ఆపి ఏంటి మూడు కిలోమీటర్లు నడుస్తారా? నడవాల్సింది చాలా ఉంది అని కోప్పడి, అక్కడ హోటల్ దగ్గర ఉండండి ఏదో ఒకటి పంపిస్తానని వెళ్లారు. హోటల్ దగ్గర ఆగి, ఆ చీకట్లో ఆటోలు ఏమైనా వస్తాయని రోడ్డు వైపు చూస్తూనే ఉన్నాo. బస్సు వచ్చింది. ఈసారి డ్రైవర్ కచ్చితంగా రైల్వే బ్రిడ్జి దగ్గర దించారు.

మధుగారు గణేశ్ మరో ఇద్దరు ఉన్నారు. గణేష్ ను మరోతన్ని దిగిలోతు చూడమని మధుగారు చెప్పారు. లోతు చూడమన్నానురా కొలతలు వెయ్యమనలేదు.లోతు చూడటానికి ఫోన్ ఎందుకురా అని మధుగారు వాళ్ళమీద జోకులు వేశారు. బ్రిడ్జి కింద నీళ్లు చాలా ఎక్కువగానే ఉన్నాయి. నీళ్లు లేకపోతే జీపు, బళ్ళు మూడు కి.మీ లోపలికి వెళ్తాయట. నీళ్ళు లోతుగా ఉండటం వలన జీప్ పోవడం కష్టమని ఆపేశారు. మధుగారు కుంటుతూ నడుస్తున్నారు. అలా నడుస్తూ ఎలా వస్తారు గణేష్ని అడిగాను. వస్తాడండి అయినంతే. డాక్టర్ గారు, కాలు బెడ్ రెస్ట్ అని చెప్పారు. మధుగారు దగ్గరకు రాగానే మాకో డౌట్ ఉంది, ఆ కాలుతో కుంటుతూ ఎలా వస్తారని అడిగాను. రానండి మీకు ఇవన్నీ ఇచ్చేసి పచ్చజెండా ఊపేసి వెనక్కి వెళ్తాను అన్నారు.

యాత్రంలో వంటపాత్రలను ఇలా మోసుకెళ్లాలి

నీటి ఒడ్డున ఉన్న స్కూటీ మీద గిరిజగారు నేను ఫోజులిచ్చి ఫోటోలు దిగాం. గణేషు ఓ ట్రెక్కింగ్ లో కొండలా ఓ పెద్ద ఏనుగు కనిపించిందని టెంట్ లో నుండి కొంచెం కొంచెం గా బయటకు వచ్చి భయం భయంగా చూసానని ఓ కథ చెప్పాడు. ట్రైన్లు పోని బ్రిడ్జి అనుకున్నాను. ఈ లోపల ధన్ ధన్ అంటూ ఓ ట్రైను వచ్చింది. బ్రిడ్జ్ మీద ట్రైన్ శద్ధం, నీటిలో ట్రైన్ నీడ అద్భతంగా ఉంది. ఫోటో తీయండి ఫోటో తీయండి అంటుండంగానే ట్రైన్ వెళ్ళిపోయింది.నా ఫోన్ బ్యాగ్ లో ఉండిపోయింది. దాని వెనికీడితే మరో ట్రైన్ వచ్చింది. ట్రైన్ నేను నీళ్ళు వచ్చేటట్టు ఫోటో తీశారు. ఒక్కొక్కరిగా రాసాగారు. జోకులు నవ్వులు మొదలయ్యాయి. ఎవరో ట్రైన్ ట్రైన్ అనగానే బ్రిడ్జ్ మీద ఉన్నతను చెయ్యి అడ్డుపెట్టి అయిపోయింది ఆగిపోయింది అన్నాడు.ఆ సమయస్ఫూర్తికి మేoనవ్వుకున్నాo.

మధుగారు మంచి ఆర్గనైజరట. ఏడు గంటలకు జీప్ లో లంచ్ కోసం పులిహార తెచ్చి ఎవరిదివారే పట్టుకెళ్లాలి అందరూ ఆగండి అన్నారు. రాఘవ శర్మ గారి చెల్లెలు గాయత్రి మా ముగ్గురికి టిఫిన్ కోసం ఉప్మా, లంచ్ కోసం పులిహార ఆరు బాక్సులు రెడీ చేసి ఇచ్చారు. శర్మగారు మరుసటి రోజు కోసం బ్రెడ్ జాము రెండు పెరుగు ప్యాకెట్లు వాటితోపాటు ఫోన్ కు వాటర్ ప్రూఫ్ కవరు ఇచ్చారు. ఎలాగూ పులిహోరా తెచ్చారు కదాని ఆకలేస్తుందని నా ఉప్మా తిని(గోధుమ రవ్వ ఉప్మా చాలా బాగుంది) ఆ బాక్స్ లో పులిహార పెట్టించుకున్నాను. టిఫిన్ వస్తుందని చెప్పినా ముందుకు సాగుతున్న కొంతమందితో నేను నడవడం మొదలెట్టాను.

అడవి అందాలను, ఎగురుతున్న సీతాకోకల రంగులను ఆస్వాధిస్తూ, ఎవరో రాతిపై పాకుతున్న చిన్న జలగను చూపించారు. ఒక గంట నడిచిన తర్వాత అలా వెళ్లొద్దు ఆగండి అనడంతో వీపు మీద బ్యాగులు దించి కూర్చుండిపోయాం. వెనుక వచ్చిన వాళ్ళు తీసుకొచ్చిన టిఫిన్ ప్యాకెట్ ఇచ్చారు. ఒక్కొక్కరికి నాలుగు ఇడ్లీ ఓ గారే. ఇడ్లీ మనకన్నా డిఫరెంట్ గా, మెత్తగా తమిళనాడు టెస్ట్ లో భలే ఉన్నాయి. తిని కొద్దిసేపు రెస్ట్ తీర్చుకొని నడక మొదలెట్టాం. కబుర్లు చెప్పుకునేవాళ్ళు. అడవి అందాలను చూసేవాళ్ళు. జోకులు వేసేవాళ్లు ఎవరిలోకం వాళ్ళది. (ట్రయాంగిల్ సర్కిల్) అన్నమయ్య సర్కిల్ దగ్గర వెనక వాళ్ల కోసం మళ్లీ ఆగాము. అన్నమయ్య ఆ దారిన కొండమీదకు వెళ్లేవాడట. అందుకని దానికి అన్నమయ్య సర్కిల్ అని పేరు వచ్చిందని శర్మగారు వివరించారు. ఉన్నవారితో గ్రూపు ఫోటోలుతీసారు.

తుంబురు దారిలో

జేబులో ఉన్నవి తీసి పక్కనున్న వారికి పంచుతూ తినడం మొదలుపెట్టారు. మా గిరిజగారు తాబేలు కనిపించిందని జేబులో చెయ్యి పెట్టగానే పట్టుకొచ్చిందని ఏది ఏది అన్నాము. నేను అంత జీవహింస చేయనని ఫోన్లో తీసుకున్న ఫోటో చూపించింది. నేను అన్ని చిన్నచిన్నవి కనిపిస్తున్నాయి పెద్ద జంతువులు కనిపించడం లేదు అనగానే, కనపడతాయండి ఏనుగులు సింహాలు పులులు అన్నారు ఎవరో. అవి కాదండి జింకులు కోతులాంటివి అన్నాను. చెన్నై విశాఖ బెంగళూరు గుంటూరు ట్రిక్కింగ్ వాళ్ళు ఉన్నారు. గుంటూరు వాళ్ళు ఇంకా మాతో చేరలేదు. వాళ్లు దగ్గరగా వచ్చారని తెలిసి మేము నడకమొదలేట్టం. చిన్న చిన్న తుంబుర ప్రవాహాల దాటుతూ. ఓ చోట నిండుగా ప్రవహిస్తున్న తుంబురు పాయ అడ్డు వచ్చింది. అవేగానికి నాకు ముందుకు అడుగు పడటం లేదని కొద్దిగా వెనక్కి వచ్చాను. మేమున్నాo మీకు భయంలేదు రండి అన్నారు. బ్యాగు బరువుగా ఉండి వెనక్కి వాలుతున్నానని బ్యాగ్ ను అవతలిపడ్డకు పార్సెల్ చేసేశారు. తిరుమలా తిరుపతి ట్రైకింగ్ వాళ్ళు నా బ్యాగ్ లాగే నన్ను ఒకరినుండి ఒకరికి, నాకేమో నవ్వొస్తుంది, వాళ్లు నేను భయపడుతున్నానని మీకేం పర్వాలేదు మేమున్నాం మేమున్నాం అంటూ అవతల ఒడ్డుకు పంపించారు. అంతమంది మధ్య ఇలా వెళ్లడం భలే ఉంది.

మా రాఘవశర్మగారి స్టిక్ తుంబుర తీసుకుపోయింది. అడివిలో దొరికిన నాది కూడా. శర్మగారు, డెకత్లాను స్టీక్,3000 అండి, అది వచ్చిన తర్వాత నేను ఎక్కడా పడలేదండి అంటుంటే, తుంబుర మీ మీద కొరవగా ఉండి తీసుకెళ్ళింది లేండి అన్నాను. కొరవ ఎందుకండి తుంబుర మీద మూడు వ్యాసాలు రాసాను. అందాలు వర్ణించాను ఇంకేమీవ్వాలి అన్నారు నవ్వుతూ. కాశీలో మనకు ఇష్టమైనదివదిలేస్తాం. అలాగే తుంబురు మీకు ఇష్టం కదా తుంబురు మీకు ఇష్టమైన స్టిక్ను తీసుకెళ్ళింది అనుకోండి అన్నాను. అంతేలెండి అన్నారు. అడవిలో దొరికిన మరో స్టిక్ను ఇచ్చాను.

ఎత్తైనరకరకాల పచ్చనిచెట్లు. చిన్న చిన్న మొక్కలు,లేలేత గడ్డిదుబ్బులు,సన్నటి కాలిబాట. అడవి అందాలను, నీటి పాయలను దాటుతూ, నీటి కబుర్లను చెప్పుకుంటూ ఎక్కుతూ దిగుతు నడుస్తూ బండిరిసు మలుపు దగ్గరకు వెళ్ళాం. తుంబురు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆకాశంలో లేలేత నేరేడు రంగు మేఘాలు పిల్ల ఏనుగుల గుంపుల్లా కనిపిస్తున్నాయి. కొంతమంది ముందుకు వెళ్లలేం,వర్షం వస్తే తిరిగివచ్చేటపుడు ఇంకా ఇబ్బంది.వెనక్కి వెళదాం అన్నారు.

అప్పుడు చూడాలి. తిరుపతి గుంటూరుట్రెక్కింగ్ లు కలిసి చేసిన సాహసాలను చూచి ముందుకే వెళదాం అనుకున్నాం. ఇద్దరు ముగ్గురు ఈపు మీద బ్యాగులతో మమ్మల్ని టెన్షన్ పెడుతూ అవతల ఒడ్డుకు వెళ్ళి కత్తితో ఓ మోస్తరు చెట్టును నరికారు. దానికన్నా తుంబురు ఇంకాపాడుగ్గా ఉంది.ఈ పనిలో ఆర్య కళ్ళజోడు నీటిలో పడి వేగంగా కొట్టుకుపోయింది. ఆర్య దాని వెనికీడీతి పడుతుంటే వదిలేయని కేకలు పెట్టారు. ఆకాశం తాగుతుందా అన్నట్లున్న మరొక పొడవు చెట్టును నరికి తుంబురుకు అడ్డుగా పెట్టి యువకులంతా దానిని బలంగా పట్టుకొని ఒకరి తర్వాత ఒకరు మిలటరీ శిక్షణగా నిలుచున్నారు. దారిలో కలిసిన తిరుపతి ట్రెక్కింగ్ వారికి బాగా పరిచయం ఉన్న జై బాలాజీ గారు ఇటు చివర బలమైన కర్రను అడ్డుగా వేసిన చెట్టుకు శిలువలా(+)అడ్డం పెట్టి భుజానికీ అనీoచి బలంగా పట్టుకున్నాడు. ఒక్కొక్కరిగా అందరిని, బ్యాగులను వంట, టెంటు సామాన్లను అవతల ఒడ్డుకుచేర్చారు. గంట పైగానే పట్టింది. ఇదొక సాహసమే! దాదాపు అందరి బ్యాగులు తడిచి బరువెక్కినవి. తడిచిన బట్టలు. మళ్లీ అడవి గుండా నడక. దాటిన తుంబురనే మళ్లీ దాటటం. అలిసిపోయి లంచ్ బాక్సులు లాగించి, కొద్దిసేపు రెస్ట్ తీర్చుకున్నారు.

గుంటూరు ట్రెక్కింగ్ వాళ్ళని ఇక్కడే మొదటిసారి చూసాను. అఖిల్ చెల్లేమ్మ అంటు నోరారా పలకరించాడు. తెలిసినవాళ్ళు ఎలా వచ్చారు అంటూ పరామర్శలు చేసారు.ఓ చిన్న బాబుకనిపించాడు.పలకరించి,నడుస్తున్నావా,కాళ్లునొప్పులు పుడుతున్నాయా ? అడుగుతుంటే పక్కనున్నవాళ్లు పుల్లారావుగారి పెద్దబ్బాయి సత్య హర్ష అన్నారు.పుల్లరావుగారు అహోబిలం ట్రెక్కింగ్ కు 10ఏళ్ళ మెనల్లుడును తీసుకొచ్చి అందరిని అబ్బుర పరుస్తు ట్రెక్కింగ్ చేయించాడు. ఈ సారి 7సం.రాల కొడుకును తీసుకురావడం హ్యాపీగా అనిపించింది. హర్షను ఎవరో భుజాల మీదకు ఎక్కించుకొని ఇవతలకు చేర్చారు. గుంటూరు ట్రెక్కింగ్ పుల్లరావుగారు,మోహానగారు అన్ని శిష్టమెటిక్ గా నడిపే బాద్యులు. అతి చిన్న ట్రెక్కర్7 ఏళ్ళ హర్ష ఆయితే అతిపెద్ద టెక్కర్ 70 ఏళ్ళ రాఘవశర్మగారు. వారిద్దరి మధ్య మేము.మాకు స్పూర్తి దాయకం వాళ్ళిద్దరు.ఈ ఇద్దరు సాహసీకులు.

యాత్రలో పాల్గొన్న జూనియర్ మోస్టు సభ్యుడు సత్య హర్ష

అవతల ఒడ్డున కూర్చున్న నా దగ్గరకు గణేశ్ వచ్చి, అమ్మా దీనిని బండి ఇరుసు వాగు అంటారు అన్నాడు. ఎద్దుల బండి ఇరుసా, ఎందుకు అన్నాను. అవును. పూర్వకాలం లో ఎద్దులబండి పై వస్తుంటే ఇక్కడ బండి ఇరుసు ఇరిగిపొయిందట. అందుకని బండిరుసు వాగు అంటారు అన్నాడు.నీళ్ళలో రాళ్ళల్లొ ఇక్కడదాకా బండ్లు వస్తాయా? అచ్చర్యపొతుoటె వేసవిలో నీళ్ళుoడవు అన్నాడు. నీళ్ళు లేకపోయినా రాళ్ళు ఉంటాయిగా?అపట్లొ రాళ్ళుకూడ లేవేమో అన్నాడు. బండి ఇరుసు దాటటానికి గంటపైనే పట్టింది.పొంగుతున్న తుంబురను దాటటం. ఇదొక సాహసకృత్యమే.

తుంబురును చూస్తామన్నా సంతోషంతో మళ్లీ నడక మొదలు పెట్టారు. దారంతా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ రెండు వైపులా ఉన్న చెట్ల మీద ఏం కాయలు దొరుకుతాయో! అని చూస్తూ దొరికిన ఉసిరికాయలను కోసుకుని పంచుకుంటూ తింటూన్నారు. ఎప్పుడు ఇంత నీళ్ళు ఉండవని మాట్లాడుకుంటూ, కబుర్లు జోకులలో మనకలేస్తూ ఓ బెటాలియన్ లాగా ఒకరి తర్వాత ఒకరు కనిపించని క్రమశిక్షణగా నడుస్తున్నారు. 10...12 తేదీలలో తుఫాను ఎఫెక్ట్ వలన కురిసిన వర్షాలతో తుంబురు పాయల పాయలుగా విడిపోయి కొండల మీద నుండి వచ్చే నీళ్ళతో ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంది. ఈ పాయలు దాటడంలో ఎక్కడో దారి తప్పేం.15కి.మీ కాస్తా, కాస్తా పెరుగుతుంది. ఏనుగులు తిరిగినట్లు లద్దెల వలన తెలుస్తుంది.వాటి సామ్రాజ్యం లోకి మనం వచ్చాం అనుకున్నాం.తూనిగలుతప్ప మరొకటి కనిపించటం లేదు.

నీటి పాయలు దాటేకొద్దీ అడవి అందాలను ఆస్వాదించలేకపోతున్నాం. తుంబురును చూస్తామన్న ఆశతోనే ఉన్నాం. నాలుగు గంటలకు తుంబురు ఒడ్డున రెస్ట్ కోసం ఆగి స్నాక్స్ తినేశారు.గడ్డిలో తల కింద బ్యాగు లేసుకొనివెలికిలా పడుకొని కళ్ళతో ముందున్న చెట్లను పక్కన ఉన్న తుంబురును, ఆకాశంలో మేఘాలను ఆస్వాదించారు. ఆ తుంబురు నది ఒడ్డున పడిపోయిన లావుపాటి చెట్టు దుంగ కనిపించింది. కింద కూర్చొలేని కొంతమందిమి సింహాసనంలా దానిమీద కూర్చున్నాం. పొద్దుగూగుతుందని లేసాం. అరగంటలో చేరుతామనుకున్న, నైట్ స్టే పాయింట్ ఇంకా రావడంలేదు. చీకటి పడింది. టార్చ్ లైట్ లో పడుతూ లేస్తూ తుంబురును క్రాస్ గా దాటుతోనే ఉన్నాం. తిరుపతి పిల్లలు ముందు వెళ్లిపోయారు. ఐదుగురు అమ్మాయిలు ఇద్దరు జెంట్స్ మూడు కాలువలు దాటాల్సి వచ్చింది. చాలా జాగ్రత్తగా దాటించారు. మీరు ముందు వెళ్ళిపోతే ఎట్లా? మేము దాటడం ఇబ్బంది కదా? రండిని గట్టిగా పిలిచాను. ఒక్కొక్క చోట వెనక్కు వచ్చి మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లారు. దూరంగా లైట్లు,మాటలు వినిపించి మాలో ఉత్సహాo ఉరకలేసింది.

రానే వచ్చింది స్టే పాయింట్. అంతచలిలో కూడా చెమటలు కక్కుతూ టెంట్లు వేయటం, ఉరుకులు పరుగులతో కట్టెలేరుకొచ్చారు, తడిచి మండని కట్టెలతో వంటలు ప్రారంభించారు. టెంట్లు, బియ్యం ఉప్పులు పప్పులు వంటపాత్రలు లావుపాటి కర్రకు తగిలించుకొని డోలిలా భుజాలపై పెట్టుకుని పూజలు మార్చుకుంటూ, ఆర్యా, రామప్రసాదులు చెమటలు కక్కుతూ మోసుకోచ్చారు. మోస్తు,పక్కన పెడుతూ, ఉదృత తుంబురు పాయలను దాటిస్తున్నారు. బండిరుసు దగ్గర రెండవ పక్కన కర్ర ఎత్తుకొన్న అఖిల్ పడ్డాడు.

శక్తికి మించి మోసుకొచ్చినా వారి మొహాలలో ఎక్కడా చిన్న రవ్వంత అలసట కూడా కనిపించకుండా ఉంది. తొందరగా వంట చేసి పెట్టాలన్న ఆతృత మాత్రమే కనిపిస్తుంది. ఆ పిల్లల్ని చూస్తే అయ్యో అనిపించింది. ఆర్య అయితే బరువులను మోస్తూ, తుంబురును దాటిస్తూ, పడినవాళ్లను లేపుతూ, ధైర్యం చెబుతూ, ఆర్య దశావతారలలాగా కనిపిస్తున్నావు అంటే అయ్యో లేదండి అందరం కలిసి చేస్తున్నాo అని వినయంగా అన్నాడు. గుంటూరు నుండి వచ్చిన, అంతకుముందు తిరుపతిలో ఉన్న రాంప్రసాద్ కూడా అంతే. గుంటూరు వారికి తోడుగా వచ్చాడట.

వంట చేసేవాళ్ళు చేస్తుంటే మిగిలిన వాళ్ళు తడిబట్టలు తీసేసి పొడిగా ఉన్న బట్టలు వేసుకున్నారు. బ్యాగ్ అంతా తడిచిపోయినవాళ్లు ఆ తడి బట్టలతోనే ఉండిపోయారు. నడకలో ఒంటి మీద పై బట్టలు చాలావరకు ఆరాయి. చెమట పట్టినా నీళ్ళు దాటేటప్పుడు చాల కొట్టుకు పొయింది. నా బ్యాగ్ లో ఓప్యాంటు, షాలు, మంకీ క్యాప్ పొడిగా ఉన్నాయి. మార్చుకొని తినటానికి లేవకుండా పడుకుండిపోయాను. గిరిజగారు సాంబారు,అన్నం వేడిగా బాగున్నాయి. కొద్దిగా తిను అని లేపినా,ఉదయం డబల్ టిపిన్ తిన్నా,షుగర్ టాబ్లెట్ వెసుకొలేదు,వద్దన్నాను. మాటలు వినిపిస్తూనే ఉన్నాయి.

అలవాటులేని నేలపడక.నిశ్శబ్దం అయ్యే కొద్ది స్పష్టంగా వినిపిస్తున్న తుంబురు హోరు. టెంట్ పై పడుతున్న మంచుచుక్కల గుండె చప్పుడులా టఫ్ టఫ్ లదరువు శబ్దాలు. గుచ్చుకుంటున్న రాళ్ళు.పక్కకు జరిగి టెంట్ తగిలితే చలి. టెంట్ కాబట్టి పాముల, తేళ్ళ,పురుగుల. దోమల భయం.అందురున్నారు కనుక పెద్ద జంతువుల భయం లేదు.

ఎంత ప్రయత్నించినా నిద్ర కన్నా అలోచనలొస్తున్నాయి. ఒక్క రోజుకే ఇలా ఉన్నాo. అడవిలో ఉండే గిరిజనుల పరిస్థితి ఏమిటి? ఆ గిరిజనులకు పౌష్టికాహారం, దోమల నుండి రక్షణ, చదువు, ఆరోగ్యం ఉన్నాయా? ఆ గిరిజనుల జీవితాలకు రక్షణ ఉందా? వారి పంటలకు, అడవి నుంచి వేరుకున్న పండు ఫలాలకు గిట్టుబాటు రేట్లు ఉన్నాయా? వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వాళ్ళ దగ్గర ఎంత గీసి గీసి బేరమాడతారు? ఇంతకన్నా ఎక్కువ బరువును మోసుకుంటూ తిరిగే, మోషాలు అంతర్గత శత్రువులుగా, కగార్ యుద్ధాన్ని ప్రకటించి 2026కి అంతం చేస్తాం అంటున్న ఆ దళాల పరిస్థితి ఏమిటి? 50% గా ఉన్న మహిళల పరిస్థితి ఏమిటి? వారి ఆరోగ్యం, ఆహారం ఎలా ఉంటుంది? ఇది నిజంగా యుద్ధమా? బలమైన శక్తివంతమైన శత్రువుతో పోరాటం. గెలుస్తారా? మూల వాసులైన గిరిజనులను అడవుల నుండి తరిమి, ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించాల్సిన అవసరం ఏముంది? ఆలోచిస్తూ, నా ప్రశ్నలలో నేనుండి పోయాను సమూహంలో వంటిరిగా.

అందరూ అలసిపోవడంతో క్యాంపు ఫైర్ కు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. తుంబురుని దాదాపు 20..25 సార్లు దాటుంటాము. కొంత విసుగ్గా కూడా ఉన్నాం. నొప్పులకు ఎవరి దగ్గర ఉన్న టాబ్లెట్స్ వాళ్ళు వేసుకున్నారు. తలా ఒక డోలో650 కూడా వేసుకున్నారు. ఒక్కొక్క టెంట్లో ముగ్గురు నలుగురు పడుకున్నారు. చాలక వెంగమాంబ గుహలో కూడా పడుకున్నారు.

మధ్య రాత్రికి అంతా నిశ్శబ్దం అయిపోయింది. నాలుగు గంటలకే వంట ప్రయత్నాలు మొదలుపెట్టినట్టున్నారు శబ్దాలు వస్తున్నాయి. ఒక్కొక్కరిగా లేస్తున్నారు. తిని బయలుదేరబోయేటప్పటికి లేట్ అవుతుంది అని, అప్పుడే నిద్ర పట్టిన కొంతమంది నిద్ర పోతున్నారు.

చలిగా ఉన్నా, తెల్లవారితే కాలకృత్యాలకు కష్టమని ఐదు గంటలకి లేసాము. గలగలా, జలజలా స్వచ్ఛంగా, మన నీడ కనిపించేటంత తేటగా పారుతున్న తుంబురు మా కాలకృత్యాలతో మా ఊరి చింతచెరువులా కనిపించింది. నోటిలో నీరు పోసుకోవాలంటే ఎనక ముందు ఆడాను. అంతలోనే మనకు వచ్చే మున్సిపాలిటీ నీళ్ల కన్నా, ప్రవహిస్తున్న ఈ నీళ్ళు 100% నయం అనిపించి మొహం కడుక్కున్నాను.వంటకు కొండమీద నుండి ధారలు ధారలుగా పడుతున్న నీటిని వెడల్పాటి పెద్ద గిన్నెతో పట్టుకొచ్చి చేస్తున్నారు. కొంతమందికి ఇంకా నీటి కుతి తీరక ఈతలు కొడుతున్నారు. మునుగుతున్నారు. తేలుతున్నారు. తీయని టెంట్ ల వైపు చూస్తే గుడారాల్లా భలే ఉన్నాయి రంగు రంగుల్లో.

రాత్రి చీకటిలో మా వెనక ఎత్తు గోడలా కనిపించింది. ఇప్పుడు చూస్తే ఓ పెద్ద గుహలా కనిపించింది. ముందు కొంత చదునైన స్థలం. దాని ముందే ఈ గోడ. ఎక్కడానికి7,8 మెట్లు ఉన్నాయి.చూస్తే ఒకటి కాదు రెండు గుహలున్నాయి. గుహలో మా వాళ్లు ఫోటోలు దిగటం మొదలుపెట్టారు. తిరగేసిన v ఆకారంలో, లైట్ పింక్, గోధుమ రంగు,అక్కడక్కడ నలుపు రాళ్ల పలకలు ఒకదానిపై ఒకటి పేర్చినట్లు భలే భలే అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఓ గుహలో మా ట్రక్కర్లు వెచ్చగా పడుకున్నారట. మరొక గుహ మాతో పాటు వచ్చిన జై బాలాజీ గారు పూజ చేసేది. ఈ గుహలోmrpనాద్ వగోరిబాబ ఫొటో,గుహగోడలకు తగిలించిన వెంకటేశ్వర స్వామి, మరికొన్ని ఫోటోలు ఉన్నాయి.

ఇది ఉత్త, ఒట్టి కొండగుహలు కాదు. ద గ్రేటెస్ట్ వెంకటేశ్వరస్వామి భక్తురాలైన వెంగమాంబ వంటరిగా నివసించిన గుహలు.ఈ గుహలో 18 శతాబ్దంలో తిరుపతికి దగ్గరగా ఉన్న వాయల్పాడుకు సమీపంలోని తరిగొండకు చెందిన తరిగొండ వెంగమాంబ వెంకటేశ్వరస్వామి కి గొప్ప భక్తురాలట. గొప్ప సాహిత్యకారిణి,కవయిత్రి, రచయిత్రి కూడా. ఈమె వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఇక్కడే ఒంటరిగా ఉండేదట. "రాజయోగసారము," "వెంకటాచలం మహత్యము" "చెంచు నాటకం" వంటి యక్షగానాలతో మొత్తం 18 గ్రంథాలను రాసిందట. శివ విలాసాన్ని "కృష్ణ" అనే మకుటంతో, విష్ణువుపై దాదాపు 400 సంకీర్తనలను రాసిందని మా సీనియర్ జర్నలిస్టు రాఘవశర్మగారు చెప్పారు. ఇంతటి గొప్ప రచయిత్రి, కవయిత్రి వంటరిగా ఈ అడవిలో ఈ గుహలో ఎలా ఉన్నారు? ఆలోచిస్తే చెప్పలేనంత ఆశ్చర్యం వేస్తుంది. చరిత్రలో ఈమెకు దక్కాల్సినoతచోటు, చెందాల్సినంత ప్రాదన్యత రాలేదనిపిస్తుంది. మేము బస్సులో వచ్చేటప్పుడు పాపవినాశనం తర్వాత వెంగమాంబ పేరుతో ఒక బిల్డింగు పార్కింగ్ కనిపించింది.

వెంగమాంబ తరువాత ఇటీవల కాలంలో సుబ్బారావు స్వామి అనే అతను వైరాగ్యాంతో ఈ గుహలో దిగంబరంగా అడివిలో దొరికే ఆకులు అలుములు తింటూ బ్రతికేడట. అక్కడకు వచ్చినవారు ఏదన్నా ఇస్తే తినేవాడట. ఓ ఐదారు సంవత్సరాల క్రితం ఈ దిగంబరుని దగ్గర కూడా ఏదో సంపద ఉంది దోసుకుపోవాలి అని సుబ్బారావు స్వామిని ఎవరో హత్య చేశారట. ఇది ఎంతటి విషాదం. దీన్ని తలుసుకుంటే కళ్ళల్లో నీటి చలములు తుంబురులా ఉప్పొంగుతున్నాయి.

తుంబురు కోనంలో ధ్యానం చేస్తున్న బాలాజీ స్వామి

జై బాలాజీ స్వామిది మరో చరిత్ర. జై బాలాజీ గారిని నాలుగు సంవత్సరాల పిల్లవాడప్పుడు తల్లిదండ్రులు అక్కడ వదిలేసారట. స్వామివారి ఉత్సవాలప్పుడు దీవిటీలు పట్టుకునే ఓ కుటుంబం వారు అతనిని దగ్గరకుతీసి సాకారట. ఆ కుటుంబంలోని వారందరూ చదువుకుని ఉద్యోగాలలోకి వెళ్లారట. ఈ బాలాజీగారు నిరక్షరాస్యుడు. ఒంటరిగా బ్రతుకుతున్నాడు. ప్రసాదాలు తప్ప ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోడట. ఆ రాత్రి, తెల్లవారి ట్రెక్టర్లు వండిన భోజనం కూడా తినలేదట. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానంవారు,తి.తి. ట్రెక్కింగ్ వాళ్లు చూస్తున్నారట. జై బాలాజీగారు బ్రహ్మాండమైన ట్రెక్కర్.మనిషి కొద్దిగా పొట్టి. నిన్న బండిరుసు దగ్గర బలమైన కర్రతో అతను పట్టుకున్న తీరే తెలుస్తుంది. నాదమని జలపాతం దగ్గర కూడా నేను ఎనక ముందు ఆడుతూ వెళ్లొద్దండి అన్నా, అక్కడ దీపం వెలిగించాలమ్మ అని డింగ్ డింగ్ మనీ ఎక్కుకుంటూ వెళ్లి డింగ్ డింగ్ మనీ దిగుకుంటూ వచ్చారు. ఈ వయసులో ఈయన ఎంత హుషారుగా ఉన్నాడు అనుకున్నాను. ఆ ఉషారు చూసి మేమందరము అతనితో ఫోటోలు దిగాం. ముందు ముందు ఈ జై బాలాజీగారి పరిస్థితి ఏమిటో? ఓ పెద్ద ప్రశ్నగా మన ముందున్నది.

తుంబురు కోనలో బాలాజీ స్వామి హారతి

ఈ వెంగమాంబ గుహలకు ఓ అరకిలో మీటరు దూరంలోనే మేము చూడాలనుకున్న, ఆశపడిన, రాఘవశర్మగారు వర్ణించిన, అందమైన తుంబుర ఉంది. ఏడు గంటలకు తుంబురుకు పోవడానికి వీలు కాదు, చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. గజ ఈతగాళ్లు కూడా పోలేరని తుంబురుకు పోవడాన్ని క్యాన్సిల్ చేశారు. పోలేని పరిస్థితి. కొంచెం బాధపడ్డాం. పక్కనే జలపాతం ఉంది చూసిరండి అన్నారు. 7గం.ల కల్లా తి.తి ట్రేక్కర్లు పెట్టిన వేడివేడి ఉప్మా దానిలోకి ఊరగాయని ఆస్వాదించి పోలోమoటు బయలుదేరాం. దారిలో ఐదు అడుగుల పైనున్న పుట్ట, సుబ్రహ్మణ్యస్వామి చిన్న విగ్రహం, పూజలు కనిపించాయి. మనవాళ్లు దేన్ని వదలరు కదా! రెండు తుంబురుపాయలను దాటుతూ ఎత్తైన కొండపై నుండి పడుతున్న జలపాతం దగ్గరకు వెళ్ళాం. కని కనిపించకుండా ఉదయిస్తున్న సూర్యో దయానా, లేతలేత మబ్బుల్లో పచ్చటి కొండపై నుండి గలగల దుముకుతున్న జలపాతం పైకన్నా కింద నుండి చూస్తేనే చాలా అందంగా ఉంది. చాలామందికి ఈ జలపాతం పేరు తెలియలేదు. ఈ జలపాతం పేరేంటని జై బాలాజీ గారిని అడిగితే నాదముని జలపాతం అని చెప్పారు. మాలో ఉన్న కొంతమంది సాహశీకులు తుంబురు వైపు సాగేరు. సాహసించని వాళ్ళు పై నుంచి దూకుతున్న జలపాతంలో తడిచి ముద్దయ్యారు. తుంబుర పాయలోనే మునిగి ఆనందించి తేలారు. తుంబురవైపు వెళ్ళినవాళ్ళు వెళ్లలేక వెనక్కి వచ్చారు.

మధ్యాహ్నం"లంచ్" బాక్స్ లో పెట్టించుకోండి అని అనౌన్స్ చేశారు. వేడివేడి అన్నం సాంబారు పెరుగు. నేను సర్దుకోకుండా ఆ వేడివేడివి తినేసాను. ఆర్య, నాకు తిన్నంత పెరుగు వేశాడు. పెరుగు కోసం పాలు తెచ్చారా? అంటే లేదు పెరిగే తెచ్చామన్నారు. ఉదయం డబల్ టిఫిన్ తింటే సాయంత్రం వరకు ఆకలి వేయదు నాకు. ఆకలి వేసీనా నా దగ్గర బ్రెడ్ జామ్ ఉంది.

రాఘవశర్మగారు వచ్చిననీటిలో వెళ్లలేము. పాపనాశనం వైపు వెళ్దాం అన్నారు.తోడు లేకుండ ముగ్గురం అంటే, పెద్దవాళ్ళం కష్టమని చిన్న డౌటు వ్యక్తం చేసాను. పర్మిషన్ కోసం ప్రయత్నిస్తున్నారు అన్నారు. చివరికి 27 మంది అయ్యాం. ఇది కూడా రహస్యంగా పర్మిషన్ లేకుండానే. వెళ్ళేటప్పటికి తీసుకుంటామని నాగార్జునగారు చెప్పారు. మళ్లీ ప్రారంభంలోనే దారితప్పేం. ఒకరువెనక్కి వచ్చి ట్రెక్కర్ హరిగారిని పిలుసుకొచ్చారు. హరిగారు వచ్చి తుంబుర దాటించి దారి చూపారు. ఈ దారిలో ఎక్కడా దారి తప్పo అని రాఘవ శర్మగారు అన్నారు. ఇక్కడ మాకు గైడు శర్మగారే.

మొదట మౌనంగా ప్రారంభమైన మా నడక మెల్లిగా మాటల్లోకి దిగింది. కొండ అంచున మా నడక.మాకు ఎడమవైపు లోతైన లోయ.ఆ లోయలో తుoబురు ప్రవాహ జలసంగీత సరిగమలు. దానికి ఎడమవైపున లేయర్లు లేయర్లుగా ఉన్న కొండ, పచ్చటి చెట్లు అటు చూడండి ఇటు చూడండి అంటూ ఆ అందాలను చూపుతూ ఓహో ఆహో అనుకోవడం. మాకు కుడి వైపున అడవి అందాలు. అసలైన ట్రిక్కింగ్ ఇదే. నిన్నటిది ట్రెక్కింగ్ కాదు వాటరింగ్. నిన్నటిది ఒక అనుభవం ఈరోజుది మరొక అనుభవం అంటూ రకరకాల కొత్త డైలాగులు వస్తున్నాయి.

మేము నడుస్తున్న దారంతా లేత రాగిరంగు రాళ్లు పరిచినట్లుగా,ఓ రోడ్డులా నున్నగా ఉంది. ఈ దారి తిరుమల తిరుపతి దేవస్థానం వారు మార్చిలో తుంబురకు అనుమితించేదట. అక్కడక్కడ 4000, 3000, 2500, 500మీ కనిపిస్తుంటే ఇవి ఏమిటని అడిగాను.(మెడికల్ క్యాంప్1,2 అని కూడా ఉంది)పాప వినాశనం నుంచి దూరం అన్నారు. ఎంత దూరం నడిచాము ఎంత దూరం నడవాలని తెలుస్తుంది. దీనితో మాకు సార్ ఎక్కువైంది.ఫోన్ సిగ్నల్స్ లేవు. సిగ్నల్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫారెస్ట్ వారి నుండి అనుమతి వస్తుందని. ఫోటోలు జోలికి కూడా పోవడం లేదు.

నిన్న దారంతా ఉసిరికాయలు దొరికితే ఈరోజు కారక్కాయిలు కనిపిస్తున్నాయి. లేత రంగు పచ్చటి గడ్డి గుబుర్లు. జొన్న పంటలా కనిపిస్తున్న నడుము ఎత్తుఈతమొక్కలు. పంట చేనులో మొక్కల్లా,రా రమ్మని, మమ్మల్ని కౌగిలించుకొమ్మని పిలుస్తున్నాయి. ఎవరో అదిగో! అది ఎర్రచందనం మొక్క అన్నారు. అంత చిన్న,సన్నటి మొక్క నా? అది ఎర్రచందనమా? మీకు తెలుసా? అన్నాను. మరొకరు వీటి కోసమేనా పుష్ప వస్తుంది అన్నారు. ఎంత అర్థం ఉన్నది ఆలోచిస్తే. స్మగ్లర్లు అన్ని కొట్టుకుపోయారండి. మామూలుగా అయితే లావుగా ఉంటాయి. ఇవి కొత్తగా పెరుగుతున్న మొక్కలు అన్నారు. చూస్తే మామూలు మొక్కలు లాగే ఉన్నాయి.

ముందు నడుస్తున్న వారిని అక్కడ ట్రయాంగిల్ దారులు ఉన్నాయి. దారి తప్పుతారు ఆగమన్నారు. అందరము రోడ్డుపైనే చెట్టు కింద బైఠాయించారు వెనక వాళ్ళు వచ్చిందాకా. జోకులేసుకుంటూ గ్రూప్ ఫోటోలు దిగాము. ఓ దారి పాపనాశనం వైపు మరొకటి రామకృష్ణ మఠం వైపు, ఇంకొకటి తాంత్రికలోయ వైపు (అనుకుంటా,గుర్తులేదు) పోతుందని శర్మగారు చెప్పారు. మళ్ళీ నడక మొదలెట్టాం. ఆగుతూ సాగుతుంది. భోజనాలు కూర్చున్నారు పంచుకుని తిన్నారు. మా వెనక చల్లగాలులను పంపుతున్న పచ్చని చెట్లు. ఎత్తయిన కొండ. మా ముందు పాపనాశనం, రామకృష్ణ మఠం, తాంత్రిక లోయలు వైపునుండి వస్తున్న నీటి జరజరలు. దాని ముందు మరొక కొండ. అంటే రెండు కొండల నడుమ ప్రవహిస్తున్న ఏరు. ఆ బండలపైనే కొంతమంది నడుము వాల్చారు. మళ్ళీ నడక అర కిలో మీటర్ దూరంలో పాపనాశనం దగ్గర ఆగాం. నాలుగు మూలల నాలుగు అడుగుల ఎత్తున నాలుగు రాళ్ల పేర్పులున్నాయి. అక్కడ జై బాలాజీ ఆశ్రమం ఉంది. అక్కడ ఓ నాలుగు దారులు ఉన్నాయి. ఏ దారి ఎటు పోతుంది శర్మగారు చెప్పారు. ఓ దారి తుంబురువైపు అనగానే ఎవరో పోదామా? అనటంతో అందరూ గలగల నవ్వారు. అదిగో డ్యాం కనిపిస్తుంది అనటంతో అందరూ దబదబ ముందుకు వచ్చారు. ఒక్కొక్కరుగా వెళ్ళవద్దు మనకు ఫారెస్ట్ వాళ్లు పర్మిషన్ ఇచ్చినప్పటికీ డ్యాం వాళ్లు ఏదన్నా అంటారు. కలిసి వెళ్దాం అన్నారు శర్మ గారు. శర్మగారికున్న పరిచయాలతో డ్యామ్ వాళ్లు ఏమి అనకపోవచ్చు అనుకున్నాము.

నిండుగా అలలు అలలుగా కనుచూపుమేర ఉన్నది. నాకు మాత్రం చాలా నీరసంగా అనిపించింది. 87 లో పద్మావతి యూనివర్సిటీలో బిఈడి చేస్తున్నప్పుడు వెళితే పాపనాశం జలపాతం కొండపై నుండి దుముకుతుంది. ఆ జలపాతం లో అనేకమంది ఆనందిస్తున్నారు. ఆ జలపాతం కనిపించడం లేదంటే అది పాతది ఇప్పుడు దూరంగా ఉండి చూడవచ్చు. ఆ నీటికి అడ్డుగా ఇక్కడ డ్యామ్ కట్టారు. ఈ డ్యామ్ నీళ్లు లక్షల మంది భక్తులకు సత్త్రాలకు ఇస్తున్నారని శర్మగారు అన్నారు. పాత పాపనాశన జలపాతమే నాకళ్ళల్లో, కలలలో ఉండిపోయింది.

అందరం డ్యాం వాళ్ళకి చెయ్యూపి అమ్మయ్య అనుకుంటూ పాపనాశనంలోకి వచ్చాం. అక్కడినుంచి బస్సు ఎక్కి కొండపైన బస్టాండ్ కి, అక్కడ బస్సు ఎక్కి, తిరుపతికి బస్సు ఎక్కి, అలిపిరి లో దిగి అక్కడ నుంచి ఆటోలో శర్మగారి ఇంటికి వెళ్ళాం. గాయత్రి మీ అన్నయ్యగారిని మీకు జాగ్రత్తగా అప్పచెప్తున్నాo ఇదిగో అన్నాo. వెళ్లేటప్పుడు గాయత్రిగారు ఈ వయసులో ఇంకా ట్రెక్కింగ్ అవసరమా అని భయపడుతుంటే మేమున్నాం. జాగ్రత్తగా మీకు అప్పచెప్తామని ధైర్యం ఇచ్చాం. పెద్దవర్షం ఆగకుండా పడి ట్రెక్కింగు ఆగిపోతే బాగుండు అని అనుకున్నదట. పాపం ఆమె కోరిక నెరవేరలేదు. తుంబురు చూడాలన్న మా కోరిక నెరవేరలేదు. చిన్న అసంతృప్తి మిగిలిపోయిందిమాకు. అయితేనేo పచ్చటి ప్రకృతిలో స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ సమూహంతో నడుస్తూ, తుంబురు పరవళ్లను దాటుతూ దారి తప్పుతూ, కొండలను ఎక్కుతూ, రెండు పగళ్ళు ఓ రాత్రి సమూహగానంలో ఓలలాడాము. డాక్టర్లు, టీచర్లు బ్యాంక్ ఎంప్లాయిస్, బిజినెస్ మహిళలు, సాఫ్ట్వేర్లు, జర్నలిస్టులు,మెడికల్ రిప్రజెంటేటివ్ లు. రకరకాల వ్యక్తులు. రకరకాల భావాలు. వీలైతే తుంబురకు మరోసారి సమూహప్రయాణం సాగిద్దాం అనుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ కౌగిలించుకుంటూ విడిపోయాం.

ట్రెక్కింగ్ లో పకృతి సౌందర్యంతోపాటు, ఎక్కడ ఎప్పుడు చూడని ఓ సహకారం, ఐకమత్యం కనిపిస్తుంది. అంతకుముందు పరిచయాలు లేకపోయినా ఎవరో ఏమిటో తెలియకపోయినా, ఆడ మగ తేడా లేకుండా ఒకరికొకరు చేతులు అందిస్తూ ముందుకు తీసుకెళ్లడం, ధైర్యం చెప్పడం, మోయలేని వారి బరువులు తీసుకోవడం, కలిసి మెలిసి తినడం ఉమ్మడి కుటుంబ వాతావరణం కనిపిస్తుంది. ఈ సమూహ వాతావరణం కోసమైనా ట్రెకింగులు చేయాలి. పకృతి ఒడిలో స్వచ్ఛమైన గాలిని గుండెలనిండా పీల్చుకోవాలి. స్వచ్ఛమైన నీటిలో మునగాలి. మనకున్నా దిగుళ్లను విచారాలను ఒంటరితనాలను అన్నింటినీ పక్కకు తోసి సమూహంలో ఉన్నామన్న ధైర్యాన్ని నింపేదే టెక్కీంగ్. మహిళల్లారా ముందుకు రండి. మీకోసం మీరు కొంత కాలాన్ని వినియోగించుకోండి. వయసును మర్చిపోండి. ట్రెక్కింగ్లు, ప్రకృతిలో ప్రయాణాలు చేద్దాం. జీవిత సౌందర్యాన్ని పొందుతాం రండి.

Read More
Next Story