నాకు మా ఆయన కోపం అంటే ఇష్టం: బీనాదేవితో బాతాఖానీ
x

నాకు మా ఆయన కోపం అంటే ఇష్టం: బీనాదేవితో బాతాఖానీ

ఆమె ఇంటి పేరు శ్రీరంగం ఆయన ఇంటి పేరు భాగవతుల శ్రీశ్రీ, ఆరుద్ర వాళ్ళకి బంధువులు ఆమె పేరు బాలాత్రిపురసుందరీ దేవి. రచయిత్రి. అనువాదకురాలు.



ఆమె ఇంటి పేరు శ్రీరంగం

ఆయన ఇంటి పేరు భాగవతుల

శ్రీశ్రీ, ఆరుద్ర వాళ్ళకి బంధువులు

ఆమె పేరు బాలాత్రిపురసుందరీ దేవి.

రచయిత్రి. అనువాదకురాలు.

ఆయన బి.నరసింగరావు, సీనియర్ లాయరు,జడ్జి.

భార్యాభర్తల ఇద్దరి పేర్లూ కలిపి, బీనాదేవి అన్నారు. తెలుగు సాహిత్యంలో ఒక చిన్న తుఫాన్ సృష్టించారు. విశాఖ దగ్గర చోడవరం నరసింగరావుగారిది. ఇద్దరివీ హైలీ సోఫిస్టికేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్, క్లాసికల్ బ్రాహ్మణ కుటుంబాలు. ఇంటి నిండా పుస్తకాలే! క్లాసిక్స్ అన్నీ అలా పడుండేవి. చిన్ననాటి నుంచీ చదువుకోవడం తప్ప మరో ధ్యాస లేదు.
అలనాటి పాత రచయితల్ని ఇప్పుడు తల్చుకోవడానికో సందర్భం ఉంది. ఆవిణ్ణి అందరూ సుందరమ్మ అని పిలుస్తారు. మనసు ఫౌండేషన్ వాళ్ళు వేసిన ‘బీనాదేవి సమగ్ర రచనలు’ పుస్తకానికి బాపు వేసిన కవర్ చూస్తే అలనాటి అపురూప సుందరమ్మ ఎంత అందమైనదో ఇట్టే తెలిసిపోతోంది.
2024, నవంబర్ 9 న్ హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలో వుంటున్న 89 ఏళ్ళ సుందరమ్మని మేం అందరం కలిసి మాట్లాడాము. దానికో కారణం, ఇప్పటికీ చురుగ్గా, ఉత్సాహంగా వున్న సుందరమ్మ ఈ మధ్యనే మొపాసా ‘ బెల్ అమీ’, సోమర్ సెట్ మామ్ The painted veil (రంగుల పరదా) నవలలు అనువాదం చేశారు. రచయిత కూనపురాజు కుమార్ చెప్పడం వల్ల విజయవాడ ‘ సాహితి’ లక్ష్మి గారు ఈ రెండు పుస్తకాలూ ప్రచురించారు. ముందుమాటలు రాసి మంచి కవర్ పేజీలు డిజైన్ చేయించిన కుమార్, కొత్త పుస్తకాలతో రచయిత్రిని కలుద్దాం అన్నారు. కుమార్, ఆయన భార్య శారద, కేకు, పూలగుత్తి , ఒక మంచి చీర, మెరుస్తున్న శాలువా పట్టుకుని వచ్చారు. ఈ మధ్యనే డాస్తో స్కీ ‘ ఇడియట్’ నీ తెలుగులోకి అనువదించిన లాయర్ వేణుగోపాలరెడ్డి, కవి కొర్లపాటి శేషు, నేనూ ఆమె యింటికి వెళ్ళాము. పెద్దవాళ్ళయిన సుందరమ్మ గారి ఇద్దరు కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు, మనవరాళ్లు అంతా వున్నారక్కడ. కొద్దిసేపు కబుర్లూ, కాఫీలూ నడిచాయి.

బీనా దేవి తన కొత్త అనువాద పుస్తకాలతో . కూనపరాజు కుమార్, వేణుగోపాల రెడ్డి, తాడి ప్రకాష్ , కొర్లపాటి శేషులతో ...

వినికిడిశక్తి తగ్గినా యాక్టివ్ గా వున్న బీనాదేవిని చూస్తే 1972- 76 మధ్య చదివిన వాళ్ళ నవలలూ, కథలూ గుర్తొచ్చాయి. పేర్లు పెట్టడంలో స్పెషలిస్టులు. హేంగ్ మీ క్విక్, ఎ మేటరాఫ్ నో ఇంపార్టెన్స్ , రాధమ్మ పెళ్లి ఆగిపోయింది, తొడిమ లేని పువ్వు, థాంక్స్ ఫర్ ది పి.ఎం, పుణ్య భూమీ, కళ్లుతెరు, ఫస్ట్ కేస్ , జాలీ నోట్ ……ఇవేమన్నా గుర్తున్నాయా? కొన్ని ప్రశ్నలు అడిగాను ఆ పెద్దావిణ్ణి. చకచకా సమాధానాలు చెప్పారు. నేను ప్రశ్న చెప్పడం, ఒక పెద్దాయన దాన్ని సెల్ ఫోన్ లో టైప్ చేసి ఆమెకు చూపించడం, చదివి జవాబు చెప్పడం….అదీ పద్ధతి!

పాతకథల్లో మీకు బాగా ఇష్టమైనది?
దేవి :థాంక్స్ ఫర్ ది పీ ఎం. అది నిజంగా జరిగిన సంఘటనే. మేం రాసిన చాలా కథలు వాస్తవంగా జరిగినవే. పెద్ద రచయితల్లో మీకు ఎవరు ఇష్టం?
దేవి : టాల్ స్టాయ్ రాసినవన్నీ చదివాను. గోర్కీ రచనలు చాలా యిష్టం. ఆయనలో బ్రెవిటీ ఎక్కువ. నాలుగు వాక్యాల్లో చెప్పాల్సిన దానిని ఒక్క వాక్యంలోనే చెబుతాడు. ఆయన రాసినవన్నీ చదివాను.
భర్త నరసింగరావులో మీకు ఏ క్వాలిటీ ఇష్టం?
దేవి: ఆయన కోపం యిష్టం. ఇంగ్లీషు లో తిట్టేవారు.
కవిత్వం చదివేవారా?
దేవి:శ్రీశ్రీ, తిలక్ ఇద్దర్నే చదివాను.
కృష్ణశాస్త్రిని చదవలేదు.
క్లాసిక్స్ ఏవి యిష్టం?
దేవి : హోమర్ ఒడిస్సీ, థామస్ హార్డీ ‘ మేయర్ ఆఫ్ కాస్టర్ బ్రిడ్జి’ నచ్చాయి.
చాలా క్లాసిక్స్ చిన్నప్పుడే చదివాను. పెద్దయ్యాక మళ్లీ చదివాను.
తెలుగు రచయితలు?
బీనా: ముళ్లపూడివెంకటరమణ సెటైర్ హ్యూమర్ నచ్చుతాయి.
వంశీ కథలు కూడా చాలా బావుంటాయి.
అనువాదాలు?
దేవి :ఆర్కే నారాయణ్ వి రెండు కథలు, అన్నే ఫ్రాంక్ డెయిరీ, ఇంకా చాలా అనువాదం చేశాను.ఆస్కార్ వైల్డ్, డికెన్స్, బెర్నార్డ్ షాలని చదువుకున్నాను.
మీరు వామపక్ష వాదా? అంటే లెఫ్టిస్టా?
దేవి :నేను హ్యూమనిస్ట్ ని. అందులో కమ్యూనిజం ఉంటే చెయ్యగలిందేమి లేదు.
ఇంకా ఏమన్నా చెయ్యాలన్నవీ, చెయ్యలేకపోయినవీ...
దేవి :పీకాక్ క్లాసిక్స్ గాంధీగారు మహాభారతం ఆరు వాల్యూములు పంపించారు. నా స్టయిల్ లో భారతాన్ని ఒక పుస్తకంగా రాయమన్నారు. రాయలేకపోయాను. నేను గనుక రాసి వుంటే బిజెపి వాళ్లు తన్నడానికి వచ్చేవాళ్ళు!
సుందరమ్మగారు మాటలపోగు.ఎంత సేపు మాట్లాడడానికన్నా సిద్ధంగా ఉన్నారు.
ఆమె వయసుని గౌరవించి క్లుప్తంగానే ముగించాను.
కేకు కట్ చేయించీ, కొవ్వొత్తి ఆర్పించి,శాలువా కప్పి,కొత్త చీర చేతిలో పెట్టి, ఎంతో గౌరవంతో ఆమె పాదాలకి నమస్కరించారు కూనపరాజు కుమార్, శారదగారు. సుందరమ్మతో అందరం ఫోటోలు తీయించుకున్నాం.
* * *
బీనాదేవి నవలలు, కథలు, వ్యాసాలు తెలుగు సాహిత్యంలో వెరీ వెరీ స్పెషల్. Complete works of Beenadevi అని మనసు ఫౌండేషన్ వాళ్లు 2011 లోనే 1200 పేజీల పుస్తకాన్ని అద్భుతంగా ముద్రించారు.ఖరీదు 250 రూపాయలు మాత్రమే.అదిపుడు మార్కెట్ లో దొరకదేమో!


మనసు ఫౌండేషన్ వాళ్ళు వేసిన ‘బీనాదేవి సమగ్ర రచనలు’ పుస్తకానికి బాపు వేసిన కవర్:నర్సింగరావు,బీనా దేవి


రావిశాస్త్రి, బి నరసింగరావు,పురాణం సుబ్రహ్మణ్య శర్మ మంచి మిత్రులు. కలిసి చాలా అల్లరి చేసే క్రియేటివ్ గ్యాంగ్ అది.రావిశాస్త్రి, బీనాదేవి ఇద్దరూ బ్రిలియంట్ లాయర్లూ.ఇద్దరిదీ దాదాపు ఒకటే సబ్జెక్ట్. కోర్టులు, లాయర్లు, పోలీసులు, తాగుబోతులు,వేశ్యలు, బ్రోకర్లు,రిక్షా పుల్లర్లు,నిస్సహాయులైన ఆడవాళ్ళు...రావి శాస్త్రికి బీనాదేవి కార్బన్ కాపీ అని, అచ్చు అలాగే రాస్తున్నారనీ అనేవారు. బీనాదేవి రచనలు చేస్తున్న సమయానికి రావిశాస్త్రీని అసలు చదవనే లేదని తర్వాత్తర్వాత తెలిసింది.

నరసింగరావుకీ, సుందరమ్మకీ 1950 లో చోడవరంలో పెళ్ళయింది.1965 లో ఆయన ఒంగోలులో సబ్ జడ్జిగా వున్నపుడు, సుందరమ్మకు ఎందుకో కథ రాయాలన్న దుర్బుద్ధి పుట్టింది.'రిబ్బను ముక్క'అనే కథ రాసి, నరసింగరావుగారికి చూపిస్తే,ఆయన, రాధమ్మ పెళ్ళి ఆగిపోయింది అనే కథ రాశారు.బీనాదేవి అనే కొత్త పేరుతో ఈ కథలు నాటి జ్యోతి మాస పత్రికలో వచ్చాయి.అవి రావిశాస్త్రి రాసినవే అనుకున్నారు.'నేను రాసినవి కావవి' అని రావిశాస్త్రి క్లారిఫై చేశారు.అసలు కథలు నరసింగరావు రాస్తారు, సుందరమ్మ ఫెయిర్ చేస్తారు అనే ఆరోపణ ఉంది.దానికి ఆమె తేలిగ్గా నవ్వి వూరుకున్నారు.
* * *
తొడిమలేని పువ్వు కథలో ఓ మెరుపు
"కీళ్ళు పట్టే సీ వొయిసొచ్చినా మీకీ 'ఇది'పోలేదు"అంది ముత్యాలమ్మ. "ఏటోనే" అంటూ లేస్తూ మూలిగి లాల్చి గుండీలు పెట్టుకున్నాడు హెడ్డు (కానిస్టేబుల్ ).నువ్వేం అనుకోకపోతే...అని ఎపాలజెటిగ్గా అంటూ, " మాకీపాలి కేసులు తక్కువొచ్చినాయి,రెండు కేసులు సర్దిపెట్టావంటే, సచ్చి నీ కడుపున పుడతా" అని బతిమలాడేడు హెడ్డు.
ముత్యాలమ్మ తోక మీద నిలబడిపోయి బుసకొట్టింది."మరోరి కడుపునబట్టి ఈ జనమలో ఇంతసేసేవే! నా కడుపున పుట్టి ఇక ఉద్దరిస్తావా? " అని అతన్ని ప్రత్యేకంగా తిట్టింది.పోలీసువాళ్ళని జనరల్ గా తిట్టింది.తన కింద పని చేసే అమ్మాయిల్ని,వాళ్ళ కోసం వచ్చే సరసుల్ని కూడా తిట్టింది."సూస్తే సూస్తే డాట్టర్ల బిల్లులకీ, అధికార్ల మామూళ్ల కే నేనీయాపారంలోకి దిగినట్టుంది. నీకేటన్నా న్యాయం వుందీ?ఊహు... వుందా అని? నాకు తెలకడుగుతాగానీ కేసులకీ నా గుంటలే, వూసులకీ నా గుంటలే? నీకేటన్నా నీతుందా?ఎదవముండ కాడ ఎదురి బేరంగోడిని, నీతోనా నాకేటి ఎల్లెల్లు.ఏదో గుట్టుగా బతుకుతున్న నా మీదొడకపోతే, కాలవ్వార కొత్త గుడిసెల్లె గిసినాయి.ఆళ్ళనట్టుకోకూడదూ"అని పీక మీద చెయ్యేసి హెడ్డును గెంటేసింది.ఉత్తరాంద్ర యాసా సౌందర్యం తెలిసిన వాళ్ళకి ఈ సీను మరీ నచ్చుతుంది. బీనా దేవి రచనలు వచ్చి 59 సంవత్సరాలు అయిపోతున్నా అవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గానే వుంటాయి. నిన్నో మొన్నో రాసినంత మోడర్న్ గా ఉంటాయి.ఆ అద్భుతమైన భాష, విరుపు, వెటకారం, అన్యాయాన్ని ధిక్కరించడంలో తెగువ, తెంపరితనం, ఆ ఆగ్రహంలోనే హాస్యాన్ని పండించడం... దటీజ్ బీనాదేవి, ఎ రైటర్ ఫరాల్ సీజన్స్.


Read More
Next Story