
'రాయలసీమ మత సామరస్యాన్ని చెడగొట్టడం ఎవరితరం కాదు'
రచయిత డా. వేంపల్లి షరీఫ్ తో మాటా మంతి
జమ్మలమడుగు విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడం కోసం సాహితీ వేత్తలు దర్పణం శ్రీనివాస్, మిరియాల శివ గణపతి పిలుపు మేరకు ప్రఖ్యాత రచయి డాక్టర్ వేంపల్లె షరీఫ్ గారు స్థానిక యస్. పి. డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో మాటా మంతి నిర్వహించారు.
ఈ కార్యక్రమం రెగ్యులర్ సాహిత్య సభలా కాక విభిన్నంగా జరపబడింది. ఆయన రచనల్లోని మూడు పుస్తకాల నుండి మూడు కథలను ఎన్నుకుని తొలిత వాటిని చదివి వినిపించడం జరిగింది. తదనంతరం వాటిపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
మతం కన్నా మించిన అనుబంధాలు ఈ భూమిపై ఇంకా మిగిలి ఉన్నాయని చెప్పే 'జుమ్మా' కథ, రాయలసీమ పల్లెటూర్లలో ఉన్న మత సామరస్యాన్ని చెడగొట్టడం ఎవరితరం కాదు అని చెప్పే 'సైకిల్ చక్రాలు' కథ, పిల్లలపై జరుగుతున్న హింసను అర్థం చేసుకునేలా చేసే తాంత్రిక వాస్తవిక కథైన 'ఒంటిచేయి' కథలను మొదట పఠించడం జరిగింది. తదనంతరం వాటిపై అర్థవంతమైన చర్చ జరిగింది.
కథకుడితో ముఖాముఖిగా జరిగిన ఈ చర్చలో వేంపల్లి షరీఫ్ గారు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన భారతదేశంలో సంస్కృతి, సాంప్రదాయాలను పునరుజ్జీవనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. పుస్తకాలు చదవడం ద్వారా మనిషిలోని వివేకం, విచక్షణ పెరుగుతుందని అన్నారు. ఇలాంటి చర్చ గోష్టి వలన రచయితలు కూడా పాఠకుల అభిప్రాయాలను తెలుసుకునే వీలు ఉంటుందని అన్నారు. తమలోని లోపాలను సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుందని అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు నిర్వాహకులను కళాశాల కరస్పాండెంట్ అయిన పాల నాగేశ్వర్ రెడ్డిని అభినందించారు. కార్యక్రమం అనంతరం వేంపల్లి షరీఫ్ మరియు మెట్టుపల్లి జయదేవ్ గార్లను శాలువాతో సత్కరించారు.
ఈ సభలో ఆటా సాంస్కృతిక సభ్యులైన మెట్టుపల్లి జయదేవ్ గారు, డా. ఎం ఎల్ నారాయణ రెడ్డి గారు, పాల నాగేశ్వర్ రెడ్డి గారు, తిప్పాబత్తిని నరసింహులు గారు, గురు భాస్కర్, భాషా, గురు కుమార్, పార్థసారథి, సంజీవరాయుడు, శ్రీనివాసులు, నాగరాజ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Next Story