ప్లాస్టిక్‌ ప్రపంచంలో ఆకుపచ్చని మనిషి!
x

ప్లాస్టిక్‌ ప్రపంచంలో ఆకుపచ్చని మనిషి!

3 దశాబ్దాలుగా అడవిని కాపాడటమే అతడి దిన చర్య.


‘ కర్నాటక మహిళ పాలుమరద తిమ్మక్క పర్యావరణ పరిరక్షణ కోసం 8వేల చెట్లునాటి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.’ ‘పంజాబ్‌కు చెందిన రాకేశ్‌ సోహల్‌ సీడ్‌ బాల్స్‌ తయారుచేసి గుట్టల మీదకు విసురుతున్నాడు...’

‘అస్సాంలో జాదావ్‌ పయెంగ్‌ అడవిని కాపాడుతున్నాడు...’ దేశం నలుమూలల నుండి ఇలాంటి వార్తలు జాతీయ మీడియాలో చూస్తుంటాం. కానీ ఇన్ని పనులు ఒక్కడే చేస్తూ , అంతకంటే ఎక్కువే పర్యావరణం కోసం తపిస్తున్న అరుదైన యువకుడి కథ ఇది.

పాత డొక్కుస్కూటీ తో పొద్దు పొడవక ముందే నల్లమల అడవుల్లోకి వెళతాడు. అతడి కోసమే ఎదురు చూస్తున్న పక్షులు చుట్టూ చేరతాయి. గుప్పెడు సజ్జ, జొన్న గింజలు వాటికి వేస్తాడు. తరువాత అడవంతా కలియ తిరుగుతాడు, ఎండిన మొక్కలను గుర్తించి, పక్కనే ఉన్న కుంట నుండి నీళ్లు తెచ్చిపోస్తాడు. పొదల్లో గుట్టల్లా పేరుకు పోతున్న ప్లాస్టిక్‌ వ్యర్ధాలన్నీ ఏరి ఒక గోతాములో వేసుకొని అడవి బయటకు తెస్తాడు . ఇదీ గత 3 దశాబ్దాలుగా అతడి నిత్యదిన చర్య.

నల్లమల అతడి శ్వాస

పల్నాడు జిల్లా , కారంపూడి గ్రామం నివాసి కొమెర అంకారావు(42) అలియాస్‌ కొమెర జాజి ఎం.ఎ చదివారు. తగిన ఉద్యోగం రాలేదు అలాగని నిరాశ పడకుండా నీరు,గాలి,నేల కలుషితం అవకుండా కాపాడటం మీద దృష్టి పెట్టాడు. తన శక్తి మేర వాటిని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. అడవి బాగుంటే వ్యవసాయం బాగుంటుంది అని నమ్మి సమీపంలోని నల్లమల అడవుల్లో తిరుగుతూ మొక్కలను కాపాడుతుంటాడు. అరుదైన ఔషధ మొక్కలు కనిపెట్టి, వాటిని అందరికీ పరిచయం చేస్తుంటారు. ఒక్కో సారి మొక్కల ఆన్వేషణలో చీకటి పడిపోతుంది. అయినప్పటికీ ఒక టెంట్‌ వేసుకొని ఆ పూటకు అక్కడే ఉండిపోతాడు.

అడవి నుండి ఆరోగ్యం

‘‘ ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది? ఆకులు,కాయలు, వేర్లు ఏ రకంగా ఉపయోగించవచ్చు లాంటి సాధారణ మూలికా జ్ఞానం ఒక తరం నుంచి మరో తరానికి వందల సంవత్సరాలుగా అందుతున్నది. కొన్ని గిరిజన తెగల్లో మూలికలకు సంబంధించిన అద్భుత పరిజ్ఞానం ఉంది. ఆధునిక వైద్యం అందుబాటులో లేక పోయినా సాధారణ వ్యాధులను అడవుల్లో దొరికే వన మూలికలతోనే నయం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి కొన్ని వందల మొక్కల వివరాలు సేకరించాను. ’ అని అంటాడు జాజి. తనకు తెలిసిన మూలికా వైద్యాన్ని అందరికీ అందుబాటులో ఉండడానికి కొన్ని పుస్తకాలు కూడా రాశాడు.

అడవి పై అవగాహన

వారానికి ఒక రోజు జిల్లాలోని ఒక పాఠశాలకు వెళ్లి పిల్లలకు ప్రకృతి పాఠాలు చెబుతాడు. వారికి వ్యాధులను నయం చేసే మొక్కలను పరిచయం చేసి వాటిలోని ఔషధ గుణాలను విపులంగా చెబుతాడు. వారి బడులకు సమీపంలో అడవి ఉంటే అక్కడికి తీసుకెళ్లి మొక్కల విలువను వివరిస్తాడు.

‘సరస్వతి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఈ మొక్క సారాన్ని చైనీయులు వైద్యంలో మెదడుకి టానిక్‌ గా ఉపయోగిస్తారు. ఒత్తిడి, డిప్రెషన్ల నుంచి బయటపడేందుకు ఇది బాగా పనిచేస్తుంది. పల్లెల్లో కనిపించే, సరస్వతి మొక్క ఆకులను విద్యార్థుల లకు చూపించి, వాటిని తిని చూపించి, ఇంట్లో పెంచుకోవాలని చెబుతున్నాను .’ అంటాడు జాజి. ఈ ప్రయత్నం బాగానే ఫలించింది. పిల్లలు తమ పెరడులో,పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతున్నారు. విద్యార్థులకు అడవిని, ముఖ్యమైన మొక్కలను గుర్తించడం, జంతువులు అడవికి ఎలా తోడ్పడతాయో నేర్పిస్తాడు. ఆంధ్ర, తెలంగాణలో ఇప్పటి వరకు 3000కు పైగా ప్రభుత్వ పాఠశాలలు తిరిగి చిన్నారుల్లో పర్యావరణ చైతన్యం కలిగించాడు.

‘ మొక్కలను చూపించి, ఆకులు,వేర్లు , కాయలు ఆకట్టుకునేలా సరళంగా చెప్పే జాజి క్లాసులు మా విద్యార్దుల్లో చాలా మార్పు తెచ్చాయి. అడవులంటే ఏవో చెట్లు కాదు... క్రిములు, కీటకాలు, పక్షులు, జంతువులు నాచు తేమ... ఇవన్నీ అడవిలో భాగం... అవన్నీ ఒకదానిపై మరొకటి ఆధారితం అని పిల్లలు అవగాహన చేసుకుంటున్నారు. స్కూల్‌ గ్రౌండ్‌లో కొన్ని ఔషధ మొక్కలు నాటి కాపాడుతున్నారు. ఏమీ ఆశించ కుండా ఇంత విలువైన జ్ణానం పంచుతున్న జాజి లాంటి యవకులు ఈ సమాజానికి చాలా అవసరం’ అంటారు పల్నాడు జిల్లా , కోచర్ల కు చెందిన టీచర్‌ రాములు నాయక్‌.

ఇలా చేస్తే ఆసుపత్రితో పని ఉండదు!

అపార్ట్‌ మెంట్లు, ఇళ్ల పైనా కూరగాయలతో పాటు కొన్ని ఔషధ మొక్కలు కూడా పెంచుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.ఆసుపత్రి ఖర్చులు ఉండవు అంటాడు జాజి. ‘ సుంగంధపాల, ముళ్ల గోరింట, పాలబర్రంకి, మగలింగ మొక్క, కొండపిండి, ఉత్తరేణి ఇవన్నీ అరుదైన ఔషధగుణాలున్న మొక్కలే. అశ్వగంధ, తిప్పతీగ, శతావరి, బోడతరము, చిత్రమూలము, నేలతంగేడు, పసుపు, పాలసుగంధి, సరస్వతి, అడ్డసర వంటివి పెరట్లో, పొలాల్లో పెంచుకుంటే వైద్యుడి తో పని ఉండదు.’ అని వివరించాడు.

పక్షుల కోసం పంటలు!

జాజికి ఎకరంన్నర పొలం ఉంది. దానిలో జొన్నలు, సజ్జలు పండిస్తాడు. తన కుటుంబ అవసరాలకు కొంత పంట కోసుకొని మిగతాది పక్షుల కోసమే వదిలేస్తాడు.

‘అడవిలో ఆహారం లేక పక్షులు పంటపొలాలను ధ్వంసం చేస్తున్నాయి.దానిని తగ్గించాలని నా పొలంలో కొంత వాటికోసమే సాగు చేస్తున్నాను. దీనివల్ల ఇతర రైతులకు కూడా మేలు జరిగింది. వారి పంటల మీదకు పక్షులు వెళ్లడం తగ్గింది.

అన్నింటికంటే ముఖ్యం పక్షులను కాపాడుకోవాలి. అడవులు పెరగడంలో పక్షులే కీలకం. అవి తిన్న పండ్లలోని గింజలను భూమి మీద వదలడం వల్ల అడవులు ఏర్పడుతున్నాయి. వాటిని కాపాడుకోవాలి కదా...’ అంటాడు జాజి తన పొలంలో గింజలు తింటున్న పక్షులను చూపిస్తూ.

కోటి విత్తన బంతులు!

నల్లమలలో తరిగిపోతున్న వృక్షాలను గుర్తించిన జాజి కొత్తగా మొక్కలు పెంచాల్సిన అవసరం గుర్తించాడు. గత రెండేళ్లలో వానాకాలానికి ముందు కొన్ని అడవీ మొక్కలను సేకరించాడు. జాజి లక్ష్యాన్ని గుర్తించిన రాజమండ్రి సమీపంలోని కడియపు లంకలోని సప్తగిరి నర్సరీ వారు మొక్కలను ఉచితంగా ఇచ్చారు. దాదాపు 200 లకు పైగా మొక్కలను అడవిలో నాటాడు.

కేవలం నాటి వదిలేయకుండా అవి నిలదొక్కుకునేలా రోజూ నీళ్లను పోసి కాపాడాడు. ఇవి ఇపుడు పచ్చగా ఎదుగుతున్నాయి. అక్కడితో ఆగకుండా కోటి విత్తనాలు సేకరించి , విద్యార్ధులతో విత్తన బంతులు తయారు చేశాడు.

తనతో పాటు జిల్లా అటవీ శాఖ సిబ్బందితో పాటు, విద్యార్దులతో నల్లమలలోని వివిధ ప్రాంతాల్లో చల్లారు. అవన్నీ ఇపుడు చిగురులు తొడిగి, అడవి ఆకుపచ్చగా మారింది. జిల్లా కలెక్టర్‌ జాజి కృషిని గుర్తించి అభినందిస్తూ సర్టిఫికేట్‌ అందచేశారు.

నల్లమల రక్షకుడు

“ నల్లమలలో తిరుగుతున్న జాజి గురించి మాకు సమాచారం వచ్చిన వెంటే ఎంక్వైరీ చేశాం. కొందరు అడవుల్లో ఇతర అక్రమ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. ఆ దిశగానే జాజిగురించి మా సిబ్బంది విచారణ చేశారు. అతను నిజాయితీగానే అడవిని రక్షించడానికి కృషి చేస్తున్నాడని తేలింది,” అని ఆంధ్రప్రదేశ్‌ ఫారెస్ట్‌ శాఖకు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి రామచంద్రరావు తెలిపారు.

అడవిలో ప్లాస్టిక్‌ని ఏరి వేసి మొక్కలు నాటడం అనేది ప్రపంచంలోనే అరుదైన సేవ, పర్యావరణం పై కమిట్‌ మెంట్‌ ఉంటేనే తప్ప ఇలా ఎవరూ చేయలేరు అని ఆయన జాజిని ప్రశంసించారు.

తమ సిబ్బందితో స్వయంగా వెళ్లి ప్రతీ మొక్క పెరగడానికి జాజి చేస్తున్న ప్రయత్నాన్ని కళ్లారా చూశానని అతనికి అటవీ రక్షకుడిగా తాత్కాలిక ఉపాధి కల్పించాలని డిపార్ట్ మెంటు తరుపున కొంత గౌరవ వేతనం ఇవ్వాలని అనుకుంటున్నామని కూడా ఆయన చెప్పారు.

అయితే, జాజి మా ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాడు.

“ఒక ఉద్యోగానికి కమిట్‌ అయితే పిల్లలకు పాఠాలు చెప్పడం, ఇతర పర్యావరణ కార్య క్రమాలకు ఆటంకం కలుగుతుంది. వేసంగిలో అడవిలో అగ్ని ప్రమాదాలు జరిగితే తనొక్కడే అక్కడున్న పచ్చ రొట్టతో మంటలను ఆర్పుతాడు. ఒక్క రూపాయి ఆశించకుండా అడవి కోసమే జీవితాన్ని పణంగా పెట్టిన ఇలాంటి యువకులు ప్రపంచంలో అరుదుగా ఉంటారు. మా అటవీ శాఖకు జాజి ఒక అద్భుతమైన స్ఫూర్తి!’ అని రామచంద్రరావు అన్నారు.

నల్లమల వస్తున్న ప్రముఖులు

ప్లాస్టిక్‌ని ఏరివేస్తూ, పచ్చదనం కాపాడుతున్న ఈ గ్రీన్‌ మేన్‌ గురించి తెలుసుకున్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు జాజిని వెతుక్కుంటూ నల్లమల వస్తున్నారు.

పర్యావరణం కోసం కొమెర జాజి కృషిని గుర్తించిన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీ తంగేడ కిషన్‌ రావు నల్ల మల వెళ్లి ,ప్రకృతి పాఠాలు విని జాజిని అభినందించి, అరుదైన మొక్కల గురించి ఒక డాక్యుమెంట్‌ కూడా చేయాలని ప్రోత్సహించారు. ఆగ్రో ఎకాలజీ పై కృషి చేస్తున్నKrishna Sudha Academy for Agroecology ప్రతినిధి లవ జాజిని కలిసి ఆయన జీవిత విశేషాలను తమ సంస్ధ వాల్‌ పై ఫ్రేమ్‌ చేసి పెట్టుకున్నారు.

హైదరాబాద్‌ లోని సుచిర్‌ ఇండియా సంస్ధ ద్వారా సామాజిక సేవకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క చేతుల మీదుగా ‘ప్రకృతి వనమూలికా నిపుణుడి’ గా అవార్డ్‌ అందుకున్నారు.

యూట్యూబ్‌ అవార్డు

నల్లమలలో సేకరించిన ఔషధ మొక్కలను అందరికీ పరిచయం చేయడం కోసం ‘ విలేజ్‌ లైఫ్‌ జర్నీ ’ యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్నారు జాజి. కొన్ని వందల వనమూలికలు వాటి ఔషధ గుణాలను అడవిలో తిరుగుతూ ఆ ఛానెల్‌లో వివరిస్తారు. లక్షకు పైగా Subscribers తో ఆ ఛానెల్‌ ప్రాచుర్యం పొంది ‘యూట్యూబ్‌ సిల్వర్‌ ప్లే బటన్‌ అవార్డ్‌ ’ పొందింది.

‘‘అడవిలో ఉన్నపుడు ఒకసారి, పక్షులు ఆందోళనకరంగా శబ్దాలు చేస్తూ నన్ను హెచ్చరిస్తున్నట్లుగా అనిపించింది, తిరిగి చూసినప్పుడు, ఒక విషసర్పం నా వైపుకు వస్తోంది. దాని దారి నుంచి తప్పుకోవడం ద్వారా నా ప్రాణం దక్కింది. మరోసారి, అటవిలో నడుస్తూ నాకు అసౌకర్యంగా అనిపించింది. నా కాళ్లు పని చేయకపోయాయి, కడుపు నొప్పి ప్రారంభమైంది. ఇంక ఎక్కువ సేపు తట్టుకోలేక ఇంటికి వచ్చేశాను. గంటల వ్యవధిలోనే అటవిలో వాతావరణం ప్రబలంగా మారింది. భారీ వర్షం కురిసింది. ఎన్నో సంవత్సరాలుగా నేను అటవికి వెళ్తున్నాను, కానీ ఒక్కసారి కూడా నాకు ప్రమాదం కలగలేదు. మనం ప్రకృతిని సంరక్షిస్తే, అది మనలను సంరక్షిస్తుంది అని నేను నమ్ముతున్నాను.’’ అంటాడు జాజి.

వ్యక్తిగత జీవితం చిగురించిందా?

‘ఎడారిగా మారనున్న అడవిలో పచ్చదనం పెంచిన మీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది?’ అని అడిగినపుడు...

‘ చిన్న పొలం తప్ప ఎలాంటి జీవనాధారం లేదు. తల్లిదండ్రులు వ్యవసాయి కూలీలు. భార్య, ఇద్దరు పిల్లలలో చిన్న ఇంటిలో ఉంటున్నాం. ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు మాకు అందలేదు. నా చొక్కాలు పాతవి, కొన్ని చిరిగిపోయాయి. పండుగల సమయంలో గ్రామోత్సవాలకు వెళ్ళడం మానేశాను. ఒకసారి నా పనిని గుర్తించిన ఒక సంస్ధ సన్మానం చేస్తామని పిలిచారు. అపుడు ఆ ఊరికి వెళ్లటానికి నా జేబులో పదిరూపాయలు కూడా లేకపోయింది. నా పిల్లలు అనారోగ్యానికి గురైతే, వారి చికిత్సకు అవసరమైన డబ్బు దొరుకుతుందో లేదో నాకే తెలియదు. ఈ ప్రపంచంలో చాలామందికి నేను ప్రేరణగా ఉండవచ్చు, కానీ నా తల్లిదండ్రులు ,భార్యాబిడ్డల అవసరాలు తీర్చడంలో ఓడిపోతున్నాను. కానీ నాకు ప్రకృతి అంటే ప్రేమ. నా మార్గం నుంచి తప్పుకోవడం నాకు సాధ్యం కావడం లేదు.’’ అని దుఖపూరితమైన స్వరంతో అంటాడు జాజి.

‘నల్లమల అడవిలో ఉన్నప్పుడు పేదరికం మర్చిపోతాను. అక్కడ నేను ఏ కరోడ్‌పతికి తక్కువ కానంత ఆనందంగా ఉంటాను. అసలు ప్రకృతి లేకుండా జీవితం ఏమిటి?’’ అని అంటాడు. జాజి తన పనిని కొనసాగించేలా తనతో కలసి పని చేసే వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నాడు. ప్రపంచానికి ప్రాణవాయువు పంతున్న అడవిని రక్షించటానికి గొలుసు ఉద్యమం ప్రారంభించగలననే నమ్మకంతో ఉన్నాడు.

‘కలిసి శ్వాసిద్దాం’ అనేది నా నినాదం అంటాడతను. మనుషులు కార్బన్‌ డై ఆక్సైడ్‌ వదిలితే, చెట్లు దానిని పీల్చుకొని ఆక్సిజన్‌ విడుదల చేస్తాయి. మనం పీలుస్తాం. దీనిని ‘కలిసి శ్వాసించడం’ అనాలి. అవి లేకపోతే మనం మనం లేకపోతే అవి లేవు. మనతో పాటు వృక్షాలు కూడా మనగలగాలి ఈ భూమ్మీద... ’ అంటాడు.

స్వార్ధంతో పరుగులు తీసే సమాజానికి ఊరకనే మొక్కలు పెంచండి అని నీతులు చెబితే పట్టించుకోదు. వాటి విలువను ఆరోగ్య ప్రయోజనాలు చెప్పినపుడే ముందుకు వస్తారు ’ అంటాడు, అడివిలో ప్రజలు పారేసిన ప్లాస్టిక్‌ బాటిల్స్‌ని గోతాములో కట్టి టూవీలర్‌ని స్టార్ట్‌ చేస్తూ .

Read More
Next Story