
Photo- Ravi Pedapolu
'తుక్కు'లో ఉట్టిపడుతున్న చిత్రకళ!
చెత్తతో తయారైన అపురూప చిత్రాలెన్నో..
అప్పుడెప్పుడో కమల్ హసన్ నటించిన ఆకలి రాజ్యం చిత్రంలో ఓ డైలాగ్ ఉంటుంది. చెత్తలో చిత్రరత్నం దొరికిందనే డైలాగ్ ఇప్పటికీ ఎంతో ఫేమస్. ఇప్పుడు అలాంటిదే విజయవాడ వీధుల్లో దొరికింది. ఓసారి వెళ్లి చూసి తరించండి..
తుప్పుపట్టిన ఇనుము, పనికిరాని పరికరాలు, యంత్రాల ముక్కలు…
ఇవి కళ్ల ముందు కనిపిస్తే “చెత్త” అని చెప్పకనే చెప్పవచ్చు.
కానీ కళాకారుల చేతుల్లో పడితే, అదే చెత్త
జీవం పోసుకుంటుంది, శిల్పం అవుతుంది, ఆశ్చర్యం కలిగిస్తుంది.
అలా జీవం పోసుకున్న జింక ఒకటి అడవిలో పరుగులు తీస్తుంటుంది.. గరుత్మంతుడు ఆకాశంలో ఎగురుతుంటాడు.. ఆకుపచ్చ చిలకొకటి ముక్కుతో జామకాయ కొరుకుతుంటుంది.. ఓ జిరాఫీ గర్వంగా మోరపైకెత్తి చూస్తుంటుంది.. మరో డైనోసార్ సినీలోకాన్ని తలపింపజేస్తుందీ.. ఇలా ఎన్నో.. ఇవన్ని—all made from scrap!
విజయవాడలోని స్క్రాప్ పార్క్ లో ఉట్టిపడుతున్న తుక్కు కళకు సజీవ చిత్రాలు ఇవి. సృజనాత్మకత ఉట్టిపడుతోంది. విజయవాడ నగరవాసులకూ, సందర్శకులకూ కొత్త ఆకర్షణగా నిలుస్తోంది. ఇనుము, ఆటోమొబైల్ స్పేర్‌పార్ట్స్, యంత్రాల తుక్కుతో తీర్చిదిద్దిన విభిన్న శిల్పాలు ఈ పార్క్‌ను ఒక ప్రత్యేక శైలిలో నిలబెట్టాయి.
ప్రకృతిని ప్రతిబింబించే తుక్కు శిల్పాలు
పార్కులోకి ప్రవేశించింది మొదలు చివరికంటా వెళితే మీకు బోలెడన్ని ప్రతిరూపాలు కనిపిస్తాయి. ఇక్కడ అడవి జింక, పక్షులు, జిరాఫీ, డైనోసార్, జింకలు, పందులు వంటి విభిన్న జంతువుల ప్రతిరూపాలు తుక్కు సాయంతో రూపొందించారు. వీటిని చూడగానే నిజమైన జంతువుల మాదిరి అనిపించి, చిన్నారులనూ పెద్దలనూ ఆశ్చర్యపరుస్తున్నాయి.
సృజనాత్మకతకు మారుపేరు...
ఈ శిల్పాలు కేవలం కళాఖండాలే కాదు, "స్వచ్ఛ భారత్ – సృజనాత్మక భారత్" అనే సందేశాన్నీ అందిస్తున్నాయి. వాడి పడేసే స్క్రాప్ (తుక్కు)ను వినూత్నంగా వినియోగించడం ద్వారా వ్యర్థాన్ని విలువగా మార్చవచ్చని ఇవి చాటి చెబుతున్నాయి.
పర్యావరణ స్నేహపూర్వక ఆకర్షణ
ఈ పార్క్ పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా మారింది. ప్లాస్టిక్, లోహ వ్యర్థాలు కాలుష్యానికి కారణం కావచ్చు. కానీ వాటినే కళాఖండాలుగా మార్చి ఇక్కడ నిలిపారు. ఫలితంగా పర్యావరణానికి మేలు, ప్రజలకు వినోదం రెండూ కలిసొచ్చాయి.
పర్యాటకులకూ హాట్ స్పాట్...
ఈ విభిన్న శిల్పాలు సోషల్ మీడియా కోసం ఫోటోలు దిగే యువతను, సృజనాత్మకతను ఆస్వాదించే కుటుంబాలను, పిల్లలను ఆకర్షిస్తున్నాయి.
విజువల్‌గా చూడగానే వావ్ అనిపించే ఈ పార్క్, నగరంలో కొత్తగా అభివృద్ధి చేసిన ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందుతోంది.
మొత్తానికి, విజయవాడ స్క్రాప్ పార్క్ కేవలం ఒక పార్క్ కాదు.. వ్యర్థ పదార్థాలకూ రెండో జీవితం ఇస్తే అవి ఎంత అందంగా ఉంటాయో చూపిస్తున్న సజీవ మ్యూజియం లాంటిది.
ఫోటోలు- రవి పెదపోలు, ది ఫెడరల్ (ఆంధ్రప్రదేశ్)
Next Story