మన్యం మారేడుమిల్లిలో ఎర్రబంగారం!
x

మన్యం మారేడుమిల్లిలో ఎర్రబంగారం!

తూర్పుకనుమల్లో గిరిజనులను సిరిజనులుగా మార్చేసిన రంగుల పంట మీద శ్యాం మోహన్ కథనం

ఇది పెట్టుబడి పెద్దగా అవసరం లేని పంట. ఒక్క సారి నాటితే 30 ఏండ్లు పాటు దిగుబడి.

చీడ పీడలు ఉండవు, పశువులు పక్షుల బెడదు లేదు.

వీటి గింజలకు అంతులేని డిమాండ్‌ ! ఎకరాకు 500 కిలోల దిగుబడి!

గిరిజనులను సిరిజనులుగా మార్చేసిన రంగుల పంట గురించి తెలుసుకోవాలంటే తూరుపు కనుమల్లోని మారేడు మిల్లి వైపు వెళ్లాలి.


మలుపులు తిరిగిన ఎగుడు దిగుడు ఘాట్‌ రోడ్‌లో మా డొక్కు బొలేరో బయలు దేరింది.

‘అడవి గాలి ఫ్రెష్‌గా ఉంటుంది కదా... విండోస్‌ క్లోజ్‌ చేయకండి..’ అనగానే డ్రైవర్‌ ఏసీ ఆప్‌ చేసి విండోస్‌ కిందికి దింపాడు.

కొండ గాలి జివ్వుమని తాకడంతో హాయిగా ఉంది.


మారేడుమిల్లిలో ఉదయం 5 గంటలకు బయలు దేరాం. గంటన్నర తరువాత పందిరి మామిడి కోట గ్రామం వైపు వెళ్తుంటే ఎక్కడ చూసినా దారికి ఇరువైపులా మొత్తని ముళ్లు, ఎర్రని కాయలతో ఉన్న పొదలు మెరుస్తున్నాయి. ఆ చెట్ల కొమ్మలు కొన్ని రహదారి వైపు విస్తరించి కారు లోపల ఉన్నమాకు తగులుతున్నాయి.

‘ఈ చెట్లు పేరేంటి?’ అని నా పక్కనే ఉన్న సీడీఆర్‌ ఎన్జీఓ ప్రతినిధి శ్యామ్‌కుమార్‌ ని అడిగాం.

‘ సింధూరి చెట్లు అంటారు.స్ధానికులు లిప్‌స్టిక్‌ చెట్లు అని కూడా పిలుస్తారు. గత పదేళ్లుగా రంపచోడవరం , మారేడుమిల్లి లో ఇవి విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక్కడి గిరిజనులకు ఏ పంట మీద రానంత ఆదాయం దీని మీదనే వస్తుంది. మనం వెళ్లే ప్రతీ గ్రామంలో ఇవి తప్పకుండా కనిపిస్తాయి!’ అని వివరించాడు ఆయన.15 ఏండ్లుగా ఈ ప్రాంతపు గిరిజనుల సామాజిక అభివృద్ధి కొరకు అతడు కొన్ని ఎన్జీఓలతో కలిసి పనిచేశాడు.

ఉష్ణమండల పంట!

మారేడుమిల్లి రాజమండ్రికి 96కిలోమీటర్ల దూరంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఈ ప్రాంతంలో సాధారణంగా ఉష్ణమండల వాతావరణం ఉంటుంది.

గడచిన డిసెంబర్‌ నెలలో ఇక్కడ 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.ఈ ప్రాంతాలన్నీ సుందరమైన ప్రకృతి సౌందర్యం, దట్టమైన అడవులు, జలపాతాలతో నిండి ఉంటాయి. అయితే, వర్షాకాలంలో వాగులు, నదులు ఉప్పొంగే ప్రమాదం ఉండటంతో ఇటు వైపు వెళ్లే టూరిస్టులు వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడం మంచిది.

ఈ మండలం జనాభా 19507 . వీరిలో 18199 మంది ఆదివాసీలే. అత్యంత వెనుక బడిన ( Particularly Vulnerable Tribal Group (PVTG) )కొండరెడ్లు.

ఇక్కడ 74567 హెక్టార్లు అటవీ ప్రాంతం ఉంది. వరి, అరటి , కూరగాయలు, రబ్బరు తో పాటు ఇపుడు మనం చెప్పుకునే లిప్‌స్టిక్‌ మొక్కలు కూడా పండిస్తారు.

లిప్‌స్టిక్‌ పంట

ప్రతీ సంవత్సరం ఆదాయం గ్యారంటీ

‘ లిప్‌స్టిక్‌ మొక్కలు మా పొలాల్లో , గట్లు మీద , కొండల పైన పెరుగుతాయి. పశువుల బెడద లేదు. ఎందుకంటే అవి తినవు. 5 నుండి 8మీటర్లు ఎత్తు పెరుగుతాయి. పువ్వులు గులాజీ రంగులో ఉంటాయి. కాయలు ఎర్రగా మెత్తని ముళ్లతో రెడు బద్దలుగా ఉంటాయి. నొక్కగానే నెండుగా విడిపోయి ఎర్రని గింజలు బయటకు వస్తాయి. ఒక్క కాయలో 20 నుండి 30 గింజల వరకు ఉంటాయి. గింజలకు ప్రైవేటు వర్తకులు కిలో రూ.100 నుండి 120 వరకు ధర చెల్లిస్తున్నారు. మా దగ్గరకు వచ్చి కొంటారు. కొందరు ముందే అడ్వాన్స్‌ ఇస్తారు. ఈ పంట మీద మా ప్రాంతంలో లక్ష నుండి లక్షన్నర వరకు సంపాదించే రైతులున్నారు. మాకు ప్రతీ ఏటా గ్యారంటీగా ఆదాయం వస్తుంది.’ అన్నారు భీమవరం (మారేడుమిల్లి మండలం) కు చెందిన రైతు తిరుపతమ్మ .ఆమె మామిడి, అరటి తోటల మధ్య లిప్‌స్టిక్‌ మొక్కలు పెంచుతున్నారు. మిగతా వాటికంటే కంటే లిప్‌స్టిక్‌ మొక్కల వల్ల ఎక్కువ ఆదాయం పొందుతున్నానని చెప్పారు.

తిరుపతమ్మ, భీమవరం

లిప్‌స్టిక్‌ గింజల సాగు గిరిజన రైతులకు సిరులు కురిపిస్తోంది. నామమాత్రం పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. రంచోడవరం, మారేడుమిల్లి ప్రాంతంలో సాగు చేసే లిప్‌స్టిక్‌ మొక్కలకు జాతీయ మార్కెట్‌లో మంచి రేట్‌ ఉంది. ప్రపంచంమంతా ఆర్గానిక్‌ ఉత్పత్తుల వినియోగం పెరుగుతుండడంతో రాబోయే కాలంలో ఈ పంటకు తీవ్రమైన డిమాండ్‌ ఉంటుందని ఉద్యాన శాస్త్రవేత్తలు అంటున్నారు.

తెలుగు తమిళ భాషల్లో జాఫ్రా!

‘ ఆహారం, కాస్మెటిక్స్‌ పరిశ్రమల్లో కృత్రిమ రంగుల వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలు వెలుగులోకి రావడంతో సహజ సిద్ధ రంగుల నిచ్చే పదార్థాల వాడకం పెరిగింది. అలాంటి వాటిలో లిప్‌స్టిక్‌ మొక్క ప్రధానమైనది. దీనిని అన్నాటో (Jafra annatto)అంటారు.శాస్త్రీయ నామం బిక్స ఒరిల్లిన( Bixa orellana ). మన దేశంలో ఈ మొక్కను తెలుగు తమిళ భాషల్లో జాఫ్రా అంటారు. గిరిజన రైతులు వాడుకలో లిప్‌స్టిక్‌ మొక్క , జాబ్రా మొక్క అని పిలుచుకుంటారు.

అల్లూరి సీతారామ రాజు జిల్లా, మారేడుమిల్లి, వై.రామవరం, గంగవరం మండలాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. కొన్ని చోట్ల కాయలు పచ్చగా కూడా ఉంటాయి. ఈ పంటకు తేమతో కూడిన వాతావరణం ఉండాలి. ’ అని పందిరి మామిడి లోని కృషివిజ్ణాన కేంద్రం శాస్త్రవేత్త క్రాంతికుమార్‌ అన్నారు.

కృషివిజ్ణాన కేంద్రం శాస్త్రవేత్త క్రాంతికుమార్‌

ఎలా సాగు చేస్తారు?

‘ అన్నాటోను విత్తనాలుగా లేదా ముదురు కాండం కొమ్మలను నాటుకొని పెంచుతాం. కొమ్మల కన్నా విత్తనాలు నాటుకోవడం మంచిదని ఉద్యాన శాఖ అధికారులు సూచించారు. పాలిథిన్‌ సంచుల్లో మట్టి, సేంద్రీయ ఎరువు కలిపి నింపాలి. వాటిల్లో ఒక్కో విత్తనం వేసి నీరుచల్లాలి. పది నుంచి పదిహేను రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. 80 రోజులు పెరిగిన తరువాత తొలకరి సీజన్‌లో నాటుకుంటాం. మొక్కల మధ్య ఎటుచూసినా పది అడుగుల దూరం వుండేలా గోతులు తీసి ఎకరాకు 400 వరకు మొక్కలను నాటుకుంటాం. మూడేళ్ల నుండి నాలుగేళ్ల లోపు కాతకు వస్తాయి.ఈ మొక్కలను పశువులు తినవు. అలాగే తెగుళ్ల బెడద పెద్దగా వుండదు. ఒకవేళ ఏదైనా తెగులు సోకితే వేపకషాయం చల్లుతాం.ఒక్క చెట్టు నుండి 3కేజీల వరకు దిగుబడి వస్తుంది. ’ అని వివరించాడు పందిరిమామిడి కోట గ్రామానికి చెందిన యువ రైతు జానకి రెడ్డి.

జానకి రెడ్డి, పి,ఎమ్‌.కోట గ్రామం

అంతర్జాతీయంగా ఎందుకు డిమాండ్‌?

‘అన్నాటో దక్షిణ అమెరికాకు చెందిన ఉష్ణమండలపు పంట. అక్కడ దీనిని అలంకరణ మొక్కగా పెంచుతున్నప్పటికీ పెరు,ఆసియా,ఆఫ్రికా దేశాలలో దీనిని వాణిజ్యపంటగా పెంచుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ పంట దిగుబడి 14,500 మెట్రిక్‌ టన్నులు.ఇండియాలో దీని దిగుబడి 500 మెట్రిక్‌ టన్నులు.ఒరిస్సా,మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో దీనిని పెంచుతున్నారు. ఏపీలో 3,217 ఎకరాల్లో విస్తరించి గిరిజనులకు జీవనోపాధిగా మారింది.దక్షిణ భారతదేశంలో జాఫ్రా సాగుకు మారేడుమిల్లి ఏజెన్సీ అత్యంత అనుకూలం.

USFDA (The United States Food and Drug Administration ) ఆమోదించిన సహజ రంగులను అందించే 13 పదార్ధాలలో అన్నాటో పంట రెండవ స్ధానంలో ఉంది. అందుకే ఈ గింజలకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌.’ అంటారు, డా.వై.ఎస్‌.ఆర్‌.ఉద్యాన విశ్వవిద్యాలయంలోని, వ్యవసాయ సాంకేతిక పరిశోధాన సంస్ధ సైంటిస్ట్‌ డా.కె.రాజేంద్రప్రసాద్‌.

దళారుల దోపిడి

ఈ పంట ఆదివాసీలకు సుస్ధిర ఆదాయం ఇస్తున్నప్పటికీ, మార్కెటింగ్‌ సదుపాయాలు సరిగా లేవు.పంట చేతికి వచ్చే సమయంలో వివిధ రాష్ట్రాల నుండి దళారులు ఈ ప్రాంతానికి చేరుకొని కిలో 100 నుండి 120 కే కొంటున్నారు. దీనిని అరికట్టడానికి ఐటిడిఎ కొంత ప్రయత్నం చేసి తమిళనాడు,మహరాష్ట్ర వ్యాపారులతో మార్కెట్‌ నెట్‌ వర్క్‌ ఏర్పాటు చేసింది. దాని వల్ల 180 నుండి 250 వరకు ధర వస్తుంది అని పందిరిమామిడిలోని వ్మవసాయశాఖ అధికారులు చెప్పారు.

ఎకరానికి లక్షన్నర ఆదాయం!

‘అన్నాటో మొక్కలు నాటిన రెండు, మూడు సంవత్సరాల్లో ఎరువుల కోసం రూ.3-4 వేలు ఖర్చు చేశాం. నాలుగో ఏడాది నుంచి కాపుకొస్తున్నాయి. రెండేళ్లపాటు కాపు నామమాత్రంగానే వుంది. ఆరో ఏట నుంచి దిగుబడి క్రమంగా పెరిగింది. 25 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని అనుభవం ఉన్న రైతులు అంటారు. ఖర్చులుపోను ఎకరానికి రూ.1.5 లక్షల ఆదాయం వస్తుంది. వరి ,అరటి మీద కూడా ఇంత ఆదాయం రావడం లేదు’ అని తోటలో పండిన అన్నాటో కాయలను నొక్కి గింజలను చూపిస్తూ అన్నాడు బొడ్లంక గ్రామ రైతు పల్లాల లక్ష్మీ భూపతి రెడ్డి.

పల్లాల లక్ష్మీ భూపతి రెడ్డి, బొడ్లంక

గింజలను దేనికి ఉపయోగిస్తారు?

అన్నాటో గింజల ద్వారా తీసిన ఎరుపు మిశ్రమాన్ని ఎక్కువగా ఫుడ్‌ ఇండస్ట్రీలో వాడుతున్నారు. వెన్న,చాక్లెట్‌,సూపుల్లో ఇతర ఆహార పదార్ధాల్లో, కుంకుమ పువ్వుకు ప్రత్యామ్నాయంగా కూడా వాడుతున్నారు.లిప్‌స్టిక్‌, సన్‌ స్క్రీన్‌, హెయిర్‌ కలర్‌ వంటి సౌందర్య లేపనాల్లో వాడుతున్నారు. ఐస్‌ క్రీమ్‌, మాంసాహారం, సుగంధద్రవ్యాలు, మిఠాయిలు, శీతల పానీయాలు, వస్త్రాలు, సౌందర్య పోషకాలు, సబ్బులు, చెప్పుల పాలిష్‌, నెయిల్‌ పాలిష్‌, హెయిర్‌ ఆయిల్స్‌లో కూడా ఉపయోగిస్తున్నారు.

బొడ్లంక అనే గ్రామంలో మేం కొన్ని గింజలను రుచి చూడగా మిరియాల రుచితో కొంచెం తీపిగా ఉన్నాయి!


ఆదీవాసీలు చాలా ఏళ్ల నుంచి పొలాల గట్లపై వీటిని పెంచుతూ అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు.ఎన్నో ఔషధగుణాలు కలిగిన ఈ మొక్కలు మానవుల ఆరోగ్యానికి మేలుచేస్తాయి.

ప్రభుత్వమే మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించి గిట్టుబాటు ధర కల్పించి, ఉపాధి హామీపథకం, నాబార్డ్‌ అమలు చేస్తున్న ‘మాతోట’ ప్రాజెక్టు లో సరిహద్దుల మొక్కలుగా వీటి పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చి, అదనపు ప్రోత్సాహకాలను ఇస్తే తక్కువ పెట్టుబడితో ఆదివాసీ రైతులు అధిక ఆదాయం పొందవచ్చు!

Read More
Next Story