తెలుగు జర్నలిజాన్ని జనానికి చేరువ చేసిన వాడు ఎబికె
x

తెలుగు జర్నలిజాన్ని జనానికి చేరువ చేసిన వాడు ఎబికె

అక్షర ప్రేమికుడు, అవిశ్రాంత చదువరి, పాత్రికేయ గురువు ఎబికె. తొంభయ్యవ వసంతాన కాలిడినా, అనుకున్నది ఎలుగెత్తి చాటే ఎడిటర్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ అనే ఎబికె



- నందిరాజు రాధాకృష్ణ


ఎ.బి.కె వచనానికి సోయగం వుంది, పరిపక్వత వుంది, పరిమళం వుంది, ఒక్కొక్కసారి రచనలో కవిత్వపు తళుకులు చూపిస్తారు. ఒక్కొక్కసారి ఆవేశంలో అక్షర జలపాతాలు కురిపిస్తారు ఈ శిల్పం నిబద్ధత వల్లనే అబ్బింది. అతని సాహిత్య సంపాదకీయాలలో ప్రతీ రచనా ఒక కావ్యం. నిశిత బుద్దితో, సముద్రమంతటి గాంభీర్యంతో, భావనా వైశాల్యంతో సాగిన అద్భుత సాహిత్యదర్శనం, విశ్వ విజ్ఞానాన్ని పిడికిట్లో ఇముడ్చుకున్న రచనలాయనవి. ఆయన అక్షర నిబద్దుడు. 90వ దశకంలో కూడా ఆయన ఆలోచనల్లో, అక్షర సంధానంలో నవ యువకుదు. కొత్త పత్రికలకు పురుడు పోయడం, సరికొత్త ఆలోచనలకు వేదికనివ్వడం, అక్షరాన్ని ఆయుధంగా చేసుకోవడం ఎ.బి.కె విలక్షణత. వస్తువు, రూపం కలిపిన మేలిమి కలయికలు, విజ్ఞాన పేటికలు ఆయన సంపాదకీయాలు అనిపలువురి పొగడ్తలు అందుకున్నారు.

తెలుగునేలపై దశాబ్దాలుగా జర్నలిజానికి ఆయన అడ్దా.. ఆయన కార్ఖానాలో ఎన్నో కలాలు తయారయ్యాయి. గళాలు నినదించాయి. ఆయన కలలు ఫలించాయనుకుని సంతోషించాడాయన "జర్నలిస్టులను - ఎడిటర్లను" తయారు చేద్దామనే తపన పడ్డాడు. కొందరు ఎర్నలిస్ట్ లయ్యారు. మరికొందరు సంపాదకులయ్యారు, ఇంకొందరు కలంకారులు కూలీలుగా మిగిలారు.. చివరకు ఆయన కూడా.... ఎందుకంటే ఆయన రాజీపడడు. పడిఉంటే ఒకే పత్రికలో దర్జాగా వెలుగుతూ ఉండేవాడు. నెలకు లక్షల రూపాయల నజరానాకు అమ్ముడు పోయి ఉండేవాడు. ఆయన జర్నలిస్టు మాత్రమే కాదు. సాహిత్య వేత్త, తత్వచింతకుడు, పీడిత జనపక్ష పాతి, ఉద్యమశీలి. మానవుడు సాధించిన అన్ని వైజ్ఞానిక శాఖలతోనూ ఆయనకు పరిచయం ఉంది. తెలుగు పత్రికా రంగంలో విశిష్ట స్థానం పొంది, సాధారణ జనచైతన్య దిగంతరేఖను విస్తృతం చేస్తున్న వ్యక్తి ఎ.బి.కె.

ముట్నూరి, నార్ల, గోరాశాస్త్రి, పొత్తూరి, రాఘవాచారి తదితర ఉద్దండులైన నైతిక విలువలు కల్గిన సంపాదకులలో ఎ.బి.కె చివరివాడు అని, ఫ్రెంచి విప్లవం ద్విశత జయంతి సంధర్బంగా (1989 జూలై) “ఆంధ్రభూమి” దినపత్రికలో ఆయన వ్రాసిన సంపాదకీయం చరిత్ర అధ్యాపకుడినైన తనను ఎంతో ముగ్ధుణ్ణి చేసిందని. ఎందరో చరిత్ర అధ్యాపకులకు కూడా అంతుచిక్కని అంశాలను ఆయన ప్రస్తావించడం ఆశ్యర్యం గొల్పిందని వకుళాభరణం రామకృష్ణ ప్రస్తుతించారంటే ఎ బి కె అంటే అర్ధమౌతుంది. ఆయన ప్రజల మనిషి. కులాలకు, పార్టీలకు అతీతుడు. జాతీయ స్థాయిలో ఎందరో పాత్రికేయులకు ఆయన ఒక మార్గదర్శి. అభిమాని. అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు.

తెలుగు భాష కు ప్రాచీనహోదా దక్కించటంలో తెలుగు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా ఏ.బి.కె. చేసిన కృషి ప్రశంసనీయం.తెలుగు వారందరూ ఒకే రాష్ట్రంగా ఉండాలనుకున్న సమైక్యవాది. తన వాదనకు అనుగుణంగా పుస్తకాలు రాసారు. కేంద్రంలో ఉన్న కమిటీకి నివేదికలు ఇవ్వడం, సచివాలయంలో సంప్రదింపులు జరపడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తేవడంలో కీలక పాత్ర వహించారు. ప్రాచీన హోదాకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూ, తెలుగు భాష ప్రాచుర్యానికి విస్తృతంగా ప్రచారం చేశారు.

కృష్ణా జిల్లా పునాదిపాడులో పుట్టిన ఆయన తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై నిక్కరేసుకుని దండ చేతపట్టాడు. కొద్దికాలానికే అదంటే గిట్టక బయటికొచ్చేశారు. నాగపూర్లో ఎం.ఎ చదువుతూ అక్కడ తెలుగువారు జరుపుకునే సాంస్కృతిక కార్యక్రమాలను ‘విశాలాంధ్ర’ పత్రికకు రాసేవారు. అలా ఫైనలియర్ వచ్చేటప్పటికి తనకు కావలసింది ఈ కోర్సులో ఏమీ ఉండదనిపించి చదువు మానేసి ఉద్యోగంలో చేరారు.

తొలి ఉద్యోగం విజయవాడ (1958) విశాలాంధ్రలో సబ్ఎడిటర్. ఆంధ్రపత్రిక తప్ప తెలుగులో అన్ని ప్రధాన పత్రికలకూ పనిచేశారు. వార, పక్ష, మాస పత్రికలు, చివరకు చానళ్ళూ కూడా వదలలేదు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని కళ్లారా చూశారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని కళ్లారా చూశారాయన. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మద్దుకూరి చంద్రశేఖరరావు, మాకినేని బసవపున్నయ్య, మేనమామ వాసుదేవరావు లాంటి ప్రముఖుల చర్చలకు ప్రత్యక్ష సాక్షి.. ఆయనను వాళ్లు చాలా ప్రభావితం చేశారు. కమ్యూనిస్టు పార్టీ కోసం, మార్క్సిస్టు పార్టీ పత్రిక ‘జనశక్తి’ని నడపడంలో 15 ఎకరాల పొలాన్ని కరిగించేశారు ‘జనశక్తి’సంపాదకుడిగా అనేక కేసులు నమోదయ్యాయి.

వసంత ఋతువులో అన్ని పూలగంధాలను పూసుకుని విహరించే వాయువులాంటిది ఎ.బి.కె వ్యక్తిత్వం, అని గుంటూరు శేషేంద్ర శర్మ వంటి దిగ్దంత దాదాపు మూడున్నర దశాబ్దాలనాడే కితాబు నిచ్చారంటే ఎ బి కె అంటే అర్ధమౌతుంది. ఏబికె ప్రసాద్.. అనే పేరు తెలుగు జర్నలిజంలో మార్మోగిపోయింది. ఆపేరుతోనే ఆయన పాఠక లోకానికి పరిచయం. అన్నె భవానీ కోటేశ్వర ప్రసాద్ అంటే అందరికీ తెలియకపోవచ్చు. ఆగస్ట్ నెలకు చరిత్రలో ప్రాముఖ్యం ఉంది. క్విట్ ఇండియా ఉద్యమం, స్వాతంత్ర్య సిద్ధి ఈ నెలలోనే.. ఏబికె పుట్టింది కూడా ఈ నెల మొదటి రోజునే! జన్మదినం ఆగస్టు 1.1935. ఏబికె 90వ ఏట అమితోత్సాహతో ప్రవేశిస్తున్నారు.

తెలుగు భాషా పతాకాన్ని రూపకల్పన చేసి ఆవిష్కరింపజేశారు. ఆయన ఇప్పటికీ రాస్తునే ఉంటారు. చిన్నపత్రికైనా.. పెద్ద పత్రికైనా.. ఆయనకు ఒకటే. దేనికైనా రాస్తారు ఆయన... కాలాన్ని, కలాన్ని నమ్ముకున్న ఒక కాలమిస్టు. ఆపర్చునిస్టు మాత్రం కాదు. ఇప్పుడు 90వ దశకం ప్రరంభంలో కూడా ఆయన ఒక ప్రయోగశాలనే. ఎబికె పత్రికా రంగంలోని అన్ని విభాగాలలో నైపుణ్యం సాధించిన వ్యక్తి. ఫ్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్, లీడర్ రైటింగ్, పేజ్ మేకప్, పరిశోధనాత్మక పాత్రికేయం.. అన్నింటా మేటి అని స్వయంగా నార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారంటే ఎబికే అంటే ఏంటో తెలుస్తుంది.

తమిళ సంప్రదాయంలో “కైవాసి”అనే పదం ఉందని,. ఎబికె చేతి చలువ అలాంటిదని,. ఆయన ప్రారంభించిన పత్రికలు యాజమాన్యాలకు ప్రతిష్ఠ చేకూరుస్తున్నాయంటూ, పత్రికలు పరిశ్రమకు, ఆయన మేథాశక్తికి తార్కాణాలని దాశరథి కృష్ణమాచారి కొనియాడడం ఎబికె సత్తా ఏంటో తెలుస్తుంది. ఎదుటి వారు అసూయపడేలా బ్రతకడం, ఈర్ష్యతో గింజుకు చచ్చేటంత బాగా వ్రాయడం శత్రువులు కూడా ఔరా అనుకున్నంత “స్వచ్చంగా”నైతిక విలువల్ని కాపాడుకోవడం మొండివాని లక్షణాలు. “నువ్వు మొండివాడివి. గట్టివాడివి! శాపగ్రస్తుడివైన గ్రీకు మహాశిల్పి “ఫిడియస్”లాంటివాడివి. నువ్వు అదృష్టం కరువైన అతిలోక బలశాలి “అట్లాస్”లాంటివాడివి. నిజానికి ముందుగా ‘నమస్కారం’అనాలి. కాని చివరికంటున్నా" అని సాహిత్య అకాదెమీ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ సైతం అన్నారంటే ఎబికె సమర్థత అర్ధమౌతుంది.

అక్షర ప్రేమికుడు, అవిశ్రాంత చదువరి, నిబద్ధుడైన పాత్రికేయ గురువు ఎబికె,తొంభయ్యవ వసంతాన కాలిడి, అనుకున్నది ఎలుగెత్తి చాటే ఎడిటర్.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మానసికంగా దెబ్బతినకూడదు. ఎంచుకున్న బాటను వదలకూడదన్నది ఆయన మార్గం. అరమరికలుండవు, ఈర్ష్య ఉండదు, కోపం ఉండదు. పనిమంతుడైతే చాలు ఆయన ప్రేమించేస్తారు. వై.ఎస్.ఆర్. లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు కూడా అందుకున్నారు.

పక్షపాత ధోరణి లేని వ్యక్తిత్వమాయనది. ఇంటా, బయట, అందరితో కలసిపోతారు. కబుర్లాడతారు. సభలు, సమావేశాలకూ హాజరవుతారు. రాయడాన్ని ఆయన ప్రేమించి ప్రాణమిస్తారు. అరమరికలు లేని ఆత్మీయ వ్యక్తికి అభివాదాలు. పాత్రికేయ గురువునకు నమస్సులు. శతాయుష్కులై అక్షర సూర్యునిగా వెలుగులు ప్రసాదించాలి. ఆయన అక్షర సంపదకు శతకోటి వందనాలు. ఆయన మరిన్ని సంవత్సరాలు పోరాటయోధుడుగా నిలిచి సైన్యాన్ని నడపాలి. సమాజంకోసం!


( హైదరాబాద్ లో నేడు ఎబికె 90వ జన్మదినోత్సవ జీవన సాఫల్య అభినందన సభ)



Read More
Next Story