బుద్ధుడు చివరి బోధ చేసిన వైశాలి సందర్శన
x

వైశాలి లోని మంకీ టాంక్ వనం లో చెక్కుచెదరని 2300సం.రాల అశోకుని ఏక శిలా స్థంభం. ఆనంద్ శిష్యుల స్థూపాలు.

బుద్ధుడు చివరి బోధ చేసిన వైశాలి సందర్శన

కాంతి నల్లూరి ఉత్తర భారత బౌద్ధయాత్ర విశేషాలు


అక్టోబర్ 22, 2024న కపిలవస్తు నుండి నేపాల్ సరిహద్దులకు ఉదయం 10: 00 కల్లా చేరుకున్నాము. ఎండ మండిపోతుంది. మన వైపు జీరో మైల్ రాయి ఉంది. దీనికి నాలుగు మీటర్ల దూరంలో నేపాల్ వారి ఆర్చి ఉంది. ఆధార్ చెకింగ్ కోసం గంటపాటు క్యుQ లో నిలబెట్టారు. అది లేటు కావటంతో అందరం షాపింగ్ కోసం షాపులువైపు వెళ్ళాం. అన్నీ ఖరీదుగానే ఉన్నాయి. అందరూ పూసలదండలు (కొద్దిగా సవగ్గా ఉన్నాయి) కొన్నారు. ఆకలిగా ఉండి తిందామని చూస్తే అన్ని ఈగలు దోమలు దుమ్ము ధూళి, అన్ని చల్లగా ఉన్నాయి. హోటల్ లాంటి పాకలు మురికిగా ఉన్నాయి. ఏమీ తినలేకపోయాం. కూల్డ్రింకు వాటర్ బాటిల్స్ కొన్నారు. కూరగాయలు, సరుకులు,బట్టలు మన వైపు నుండే షాపింగ్ చేస్తున్నారు. సరుకులు ఏమంత నాణ్యంగా లేవు. అన్నీ మనవే. మన రేటు, నేపాల్ రేటు చెబుతున్నారు. మా మని (డబ్బు విలువ) మీకన్నా ఎక్కువ కదా రేటు ఎందుకు ఎక్కువ చేపుతున్నారు అన్నాం. ఇండియా డబ్బుల్లోనే తీసుకోమన్నారు. ఇండియా డబ్బులు శుభ్రంగా తీసుకున్నారు. రోజువారి తిరిగేవారికి ఏ చెకింగ్ లేకుండా ఫ్రీగా వెళుతున్నారు. మైలురాయిని ఆర్చిని ఫోటోలు తీయనీయలేదు. నేను కొంచెం దూరంగా ఉండి తీస్తున్నా ఓ మహిళా కానిస్టేబుల్ వచ్చి వద్దు అని ఆపింది. దిస్ ఈజ్ మై కంట్రీ(This is my country). మా వైపు నుండి తీసుకుంటున్న అన్నా ఊరుకోలేదు. మా దుర్గన్నయ్య మాత్రం ఎలా తీశాడో కానీ తీశాడు. పేదరికం బాగానే కనిపిస్తుంది. రోడ్లు కూడా సరిగ్గా లేవు. మన రోడ్లులా నిగనిగ లాడటం లేదు. దుమ్ము ధూళితో వాహనాలు తో పాటు దుమ్మురేగుతూ మట్టిరోడ్డులా ఉంది. మనుషులు కూడా యావరేజ్ గా ఉన్నారు. నేపాలీలు చాలా అందంగా ఉంటారు కదా అనుకున్నాం. ఈ సరిహద్దు వెనకబడిన ప్రాంతమేమో అనుకున్నాం. చెకింగ్ అయిన తర్వాత ఒంటిగంటకు మా బస్సులో ప్రయాణం మొదలెట్టాo. ఏమన్నా కనిపిస్తాయని కళ్ళంతా దూరంగా అప్పజెప్పి.

జీరో మైల్ రాయి నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే లుంబిని ఉందన్నారు. కానీ ఎక్కువ దూరమే ఉంది. మా నత్తనడక బస్సు వలన ఏమో రెండు గంటలు పట్టింది. మూడు గంటలకు నేపాల్ తైవాన్ చైనా శ్రీలంక విహారాలను చూసాము. ది గ్రేట్ డ్రిగంగ్ కాగ్యుడ్ లోటస్ అకార స్థూపం ఉంది. అన్ని అందంగా నీట్ గా ఆకుపచ్చని తోటలతో పచ్చపచ్చగా ఉన్నాయి. లుంబినిలో ప్రతి దేశానికి ఒక కట్టడం ఉందట. కానీ మా ట్రిప్ మేనేజర్ శివకుమార్ "బంతి" అయిన బుద్ధ చరణ్ గారు యధావిధిగా మూడు గంటలకి లుంబినికి తీసుకెళ్లారు. లుంబినిలో స్టే ఉన్నదని చెప్పినా, స్టే చేయకుండా ఏడు గంటలకల్లా దబదబా తిప్పేసి బస్సు ఎక్కించారు. మా బుద్ధిష్టులందరూ (బుద్ధిష్టులు కదా) ఏమీ అడక్కుండానే బస్సు ఎక్కారు.

ఈ క్రింది కట్టడం ఏ దేశస్తులదో?(ఒక్క ఇంగ్లీష్ అక్షరం కూడా లేదు. గైడ్ లేడు. నిర్మాణాన్ని బట్టి నేపాల్ ది అనుకుంటున్నాను. మా వాళ్లకు తెలియలేదు) భలే అందంగా ఆకర్షణీయంగా ఉంది. చూసి మైమరిచిపోయాను. బుద్ధిని జీవిత చరిత్ర మొత్తాన్ని చిత్రాలలో చెప్పారు. అద్భుతమైన కట్టడాలు. సిమేంట్ నే బొంగుల్లా అచ్చులు పోసి మన పెంకుటిళ్ళ ఆకారంలో నిర్మించారు. దీన్ని చూడగానే నేపాల్ లోని పశుపతి ఆలయం గుర్తొచ్చింది. నిజమైన బొంగులు (వెదురుబొంగులు) కట్టడాలులా ఉన్నాయి. రంగు కూడా అదే. ప్రహరీ కూడావాటితోనే. భలే ఉన్నాయి అని చెయ్యి వేసి చూస్తే సిమెంటులా గట్టిగా ఉన్నాయి. జాగ్రత్తగా చూస్తే అతుకులు(జాయింట్లు) కనిపించాయి. ప్రధానంగా గుడి నిర్మాణంలో సుమారు రెండు అడుగుల ఎత్తులో గుండ్రంగా స్తూపాకారంగా కదిలిస్తే (రౌండ్ దిండంత సైజులో )గుండ్రంగా తిరుగుతున్నాయి. ప్రతిదానిపై ఓ సూక్తి ఉంది. గుడి అంతా నీట్ గా ఉంది.

ఐదు గంటలకు బుద్దుడు పుట్టిన లుంబిని వనంలోకి వచ్చాము. బౌద్ధమత ఆధారాలు, అశోకుని శాసనం, చైనా యాత్రికుల గ్రంథాల ఆధారంగా క్రీస్తుపూర్వం, 563 లో రాణి మాయాదేవి సిద్ధార్దునికి జన్మనిచ్చిన ప్రాంతం. బుద్ధుడు సిద్ధార్థుడుగా తిరిగాడిన ప్రాంతం. బౌద్ధామాతానికి సంబంధించిన ప్రదేశాలలో లుంబిని ఒక ప్రధానమైన, అందమైన ఆకర్షణనియమైన ప్రశాంతమైన ప్రదేశం. లుంబినిలో మాయాదేవి ఆలయంతో పాటు అనేక పురాతన ఆలయాలు స్మారక చిహ్నాలు, మఠాలు, మ్యూజియం, లుంబిని అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ఉన్నాయి. ఇవి కాక విదేశీ సంస్థలచే నిర్మించిన దేవాలయాలు, నిర్మాణాలలో ఉన్న దేవాలయాలు చాలా ఉన్నాయట. 1997లో లుంబిని నీ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

పుస్కిరీణి... మాయాదేవి ఆలయం మధ్యలో పురాతన కట్టడాల నిర్మాణాలు, బౌద్ధమత జెండాలు.

లుంబినికే ఆకర్షణీయంగా భూమి ఆకాశానికి మధ్యలో బంగారు బాల బుద్ధుడి విగ్రహం దగదగలాడిపోతుంది. ఇక్కడ ఎక్కువగా బాల బుద్ధ విగ్రహాలే ఉన్నాయి. బుద్ధుడు పుట్టిన చోటు కనుక అనుకున్నాం. మహామాయ బుద్ధుడుకు జన్మనిచ్చిన సాలవృక్షాల వనం కనుక ఇక్కడ పక్కపక్కనే రెండు సాలవృక్షాలు ఉన్నాయి. కొద్దిగా ముందుకు వెళితే ఓ పెద్ద బిల్డింగు(శాంతి పగోడా) దాని చుట్టూ బుద్ధుడు పుట్టిన ప్రదేశాన్ని ఎవరు అంటుకోకుండా రైలింగ్ ఉన్నది. నున్నటి పాలిష్ రాయి పరిచి ఉంది. ఈ రైలింగ్ చుట్టూ తిరిగి లోపలికి వెళ్ళాం.ఇక్కడ దమ్మదానం చేసేవాళ్లు ఎవరు, ఏ దేశస్తులైనా వారి వారి కరెన్సీ వేస్తున్నారు. కొద్దిగా ముందుకు వెళ్ళగానే మహా మాయావతి (మన మాజీ సీఎం మాయావతి కాదు) కర్మ స్నానం, సిద్ధార్థుడు పుట్టిన మొదటి స్నానం చేసిన కొలను పుష్కిరిణి ఉంది. ఈ కొలను తాబేళ్ళతో, చిన్నిచిన్ని చేప పిల్లలతో స్వచ్ఛమైన నీటితో అందంగా ఉంది. కొలను అందానికి పరవసమై ఫోటోలు దిగారు. కొలనుకు ఎడమవైపున మూడో శతాబ్దం లో నిర్మించిన నిర్మాణాల అడుగుభాగాలు ఉన్నాయి. పోలీసులు పాపలాదారులుగా ఉన్నారు. కొలను ముందు బౌద్ధమత జెండాల తోరణాలు కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళితే మహామాయ దేవాలయము లైటింగ్ లో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. కొలను దగ్గరనుంచి కొంచెం ముందుకు పక్కకు రాగానే క్రీస్తుపూర్వం 249లో అశోకుడు నిర్మించిన (1896లో కనుగొనబడినది) ఏకశిలాస్తంభం, స్తంభం పైన బ్రహ్మిలిపితో ఉంది. ఇక్కడ ఓ పెద్ద చెట్టు ఉంది. ఇక్కడ బౌద్ధ పూజ చేశారు. అనేక దేశాల పర్యాటకులతో నిండుగా ఉంది. దారంతా ఎడమవైపున ఒక నది ప్రవహిస్తూ ఉంది. సూర్యాస్తమయ వెలుగులో సూర్యుడు ఆ నదిలో ఓ దీపముల వెలుగుతున్నాడు. ఒకవైపు బౌద్ధ దీపం. మరియు ఒకవైపు నీటిలో సూర్య దీపం.మనలో హృదయ దీపం. లుంబిని వనం చాలా పెద్దగా ఉంది. నడవాలి పదండి పదండి అని బయలుదేరారు. ఎట్లా అయితేనేమి? చారిత్రిక బౌద్ధ ప్రదేశాన్ని చూశానన్నా ఆనందాన్ని నింపుకొని బయలుదేరాం.

లుంబిని లో అశోకుని స్థంభం.

23..10..24న బుద్ధిని జన్మస్థానమైన లుంబిని నుంచి బుద్ధుడు మహానిర్యాణం పొందిన ఖుషినగర్ కు వచ్చాము. ఖుషినగర్ ఉత్తరప్రదేశ్ లోని 27 జాతీయ రహదారిపై గోరఖ్ పూర్ కు 53 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఖుషి, బుద్ధుడు నిర్యాణం పొందిన ప్రదేశము. నిర్యాణం చెందిన నిజమైన స్థలం. బుద్ధిని దేహాన్ని సందర్శన కోసంఎత్తైన పీఠంపై ఏడు రోజుల ఉంచిన ప్రదేశం. బుద్ధుడిని దహనం చేసిన ప్రదేశం. బౌద్ధమత అనుసరులకు అత్యంత ముఖ్యమైన ప్రదేశం. పురాతన కాలం నుండి, విదేశీ యాత్రికులకు కూడా, హుయాన్సాంగ్ నుండి పాసియాన్ వరకు బౌద్ధయాత్రికులకు ముఖ్యమైనది.

బౌద్ధమత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ఖుషినగరాన్ని కుషినారా అనికూడా అంటారు. బుద్ధుడు వైశాలిలో ఉన్నప్పుడే జబ్బుపడ్డాడట. పరిసరాల్లోని భిక్షువులను కలుసుకోవాలన్న సంకల్పంతో తిరుగుతూ ఖుషినార చేరుకుంటాడు. మంచినీరు దొరకక, కుమ్మరి, బిక్షగా పెట్టిన పంది మాంసం లేదా పుట్టగొడుగులకూర అరగక ఇబ్బందిపడి శిష్యుడు ఆనంద్(తమ్ముడు కూడా)ని రెండు సాలవృక్షాల నడుమ శయ్యను ఏర్పాటు చేయమనికోరుతాడట. ఆనందు ఏర్పాటు చేసిన శయ్యపై బుద్ధుడు శిష్యులతో తన మరణం గురించి చెబుతూనే ఆఖరి శ్వాస విడిచాడట.దీనినే మహాపరినిర్వాణం అంటారు. ఖుషీనారా మల్ల జనపదానికి రాజధాని.

బుద్దుని నిర్యాణ దేవాలయం. దీనిలోనే 6.1 మీ. బుద్దుని విగ్రహం ఉంది. "చివర్" లు కప్పేది ఇక్కడే.

బుద్ధుడు మరణించిన ప్రదేశంలో ఒక పెద్ద స్తూపం నిర్మించబడింది.దీనిని మహాపరినిర్వహణ స్తూపం అంటారు. బుద్ధుని బూడిదలో కొంత భాగాన్ని ఉంచి నిర్మించారు. దీనినే రామభర్ స్తూపం అనికూడా అంటారు. బుద్ధుడు మరణించిన చోట సుమారు 200 అడుగుల పైగా ఎత్తులో మహాపరినిర్యాణ దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం లోపల కుడి వైపుకు తిరిగి పడుకున్న బుద్ధిని విగ్రహం తల కింద కుడిచెయ్యి పెట్టుకొని నిద్రపోతున్నట్లుగా ఉన్నది. 1837 డి.లిస్టన్ కాలం నుండి 1876లో అలగ్జాండర్ కన్నింగ్ హమ్ కాలం వరకు పురావస్తు తవ్వకాలలో 1876లో 6.1 మీటర్ల (20 అడుగుల) పొడవున్న బుద్ధ విగ్రహం కనుగొన్నారు. అప్పుడు కొద్దిగా విరిగున్న విగ్రహాన్ని జాగ్రత్తగా అతికించారట.

నిర్యాణ దేవాలయం ముందున్న ఈ ఇటుకల స్టుపంపైన బుద్దుని పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనం కోసం ఏడు రోజులు ఉంచారట.

అశోకుడు మూడో శతాబ్దంలో నిర్మించిన స్థూపంను విస్తరించి గుప్తులు పడుకుని ఉన్న బుద్ధిని విగ్రహాన్ని ఉంచి ఆలయాన్ని నిర్మించారట. విగ్రహం చుట్టు రైలింగ్ఉంది. బుద్ధిని విగ్రహంపై "చివర"లు కప్పుతున్నారు. ఊరేగింపుగా తీసుకుపోయి మేము కూడా మహిళలు ఒకటి, పురుషులు ఒకటి రెండు చివరలు కప్పేం. ఒక్కొక్కటి ₹1000 .చుట్టూ భక్తులు వేసిన కానుకలు ఉన్నాయి. ఇద్దరు బిక్షువులు అవన్నీ వేరి హుండీలో వేస్తున్నారు. ఓ గంట వరకూ అందరూ (నేను, భాను తప్ప) బౌద్ధపూజ చేశారు. ఫోటోలు దిగారు.

ఈ మహాపరినిర్యాణ దేవాలయానికి ఒక మూలగా బుద్ధిని పార్దేవ దేహాన్ని ఏడు రోజులపాటు ఉంచిన ఎత్తైన పీఠం ఉంది. ఈ దేవాలయానికి ఒక కిలోమీటర్ దూరంలో బుద్ధుడిని దహానం చేసిన చోట, అస్థికల కోసం పోటీ వచ్చిందట.(బుద్ధిని అస్తికులు శాఖ్య వంశానికి చెందాలి) ద్రోణ అనే బ్రాహ్మణుడు బుద్ధిని దహన బూడిదను అస్థికలను ఎనిమిది భాగాలుగా చేసి మగధ, మల్లుల, శాఖ్యా, కొలియల, అలీకప్ప బలియలకు, ఖుషినగర మల్లులకు బ్రాహ్మణులకు పంచిపెట్టాడట. ద్రోణ అస్థికలు ఉంచిన పాత్రను తీసుకున్నారట. వారికి వచ్చిన వాటాల ప్రకారం ఇక్కడ 8 చిన్న చిన్న వివిధ ఆకారాల్లో స్థూపాలున్నాయి. శాఖ్య వంశ స్థూపం గోపురం ఆకారంలో ఉంది. దీర్ఘచతురస్రంలో ఉన్నది లిచ్చవలది. మగధరాజు కు పెద్ద భాగము స్తూపాకారం. జంబుద్వీపం లేదా జాంబా ద్వీపం వారికి అత్యంత తక్కువ భాగమ వచ్చిందట.

బిల్వ వృక్షాలు, అశోకుని ధర్మచక్రం, మాయాదేవిగుడి ,నది చూసాం. కొద్ది దూరంలో ఓ గోపురాకారంలో బుద్ధిని విగ్రహం, చుట్టూ నీళ్లు, భక్తులు వేసిన కానుకలు చూసాం. మన దేశస్థులు కన్నా విదేశీ భక్తులు యాత్రికులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ అంతా పరిశుభ్రంగా ఉంది.ఇప్పటి కుసి, ప్రజలు సాధారణంగానే ఉన్నారు.

24.10.24న ఖుషి నుండి బుద్ధుడు తన బిక్షపాత్ర ఇచ్చిన వైశాలి నగరానికి. బీహార్ రాష్ట్రoలో వైశాలి, జాతీయరహదారులు 19,77కు దగ్గరగా ఉన్నది. ప్రాచీన వైశాలి బౌద్ధ జైన మతాలకు ముఖ్యమైనది. మహావీరుడు, జైనమత 24వ గురువు తీర్థంకరుడు జనన ప్రదేశమట కూడా. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దం లోవైశాలిని లిచ్ఛవి వంశం పాలించి నేపాల్ కొండల వరకు విస్తరింప చేశారట. ప్రపంచంలోనే మొదటి గణతంత్ర రాజ్యమట. బౌద్ధ జైన మతాలు రాకముందే వైశాలి రాజ్యానికి రాజధానట. బుద్ధుడు తన చివరి ప్రసంగం చేసిన ప్రాంతంకూడానట.

ఖుషి లో పురాతన కట్టడాల నిర్మాణ భాగాలు

బుద్ధుడు మహాపరినిర్యాణం చెందక ముందు క్రీస్తుపూర్వం 483 లో వైశాలికి ఆషాడ ( ఫిబ్రవరినెల అనుకోవాలి) మాసంలో చేరి అక్కడ ప్రజలకు ధర్మ ప్రవచనం చెప్పిన తరువాత మరో మూడు నెలలలో (అంటే వైశాకి మాసం, మే నెల)లో మహాపరినిర్యాణం చెందుతానని చెబుతాడట. వైశాలి ప్రజలు అయ్యో! మీరు పరినిర్యాణం చెందితే ఎలా? మాకు ఇంకా మీ ధర్మ ప్రవచనాలు కావాలి అంటారట. బుద్ధుడు నేను చెప్పక ముందు చెబితే ఆలోచించేవాడిని. కానీ నా పని అయిపోయింది అంటాడట.

ఈ లోపల రాజనర్తకి ఆమ్రపాలి (వైశాలి జానపద, బౌద్ధ సాహిత్యంలో కనిపించే గొప్ప భారతీయ వేశ్య) వచ్చి బుద్ధుడిని బిక్షకు రమ్మని కోరుతుందట. బుద్ధుడు మాట ఇస్తాడట.బుద్ధుడు వచ్చాడని తెలిసి తదుపరి లిచ్చివి రాజు వచ్చి బిక్షకు రమ్మని బుద్ధుడిని కోరుతాడు. ఆమ్రపాలికి మాట ఇచ్చాను ఆమె అనుమతి ఇస్తే వస్తానంటాడట. మహారాజు వెళ్లి ఆమ్రపాలిని, బుద్ధుడు నువ్వు అనుమతిస్తే బిక్షకు వస్తాడని,అనుమతించమని అడిగినప్పటికీ అంగీకరించదట. ఎంత ధనం, సగoరాజ్యం ఇస్తానన్న అంగీకరించదట. నేను ఈ దేశానికి రాజుని అంటాడట. మీరు ఏ శిక్ష వేసినా అంగీకరిస్తానని ఆమ్రపాలి అంటుందట. అలా ఈ ప్రాంతము ఆమ్రపాలి ప్రాంతంగా కూడా పిలవబడినదట.

విశ్రాంతి తరువాత బయలుదేరిన బుద్ధిని వెంట ప్రజలు కూడా బయలుదేరుతారట. వెనక్కి వెళ్ళమని చెప్పగా ప్రజలు మీ గుర్తుగా మాకు ఏమన్నా ఇవ్వండనగా బుద్ధుడు తన బిక్ష పాత్రను ఇస్తాడట. ఇక్కడ స్తూపము బోర్లించిన భిక్ష పాత్ర ఆకారంలో ఉంటుంది. దీనిని రెలిక్ స్థూపం అంటారు.(దాదాపు స్తూపాలన్ని బిక్ష పాత్ర బోర్లించిన వాటివలె ఉన్నాయి) ఆ బిక్ష పాత్రని అందులో ఉంచి స్థూపం నిర్మించారట. ఈ స్తూపం అంతా శిథిలం అవ్వగా, స్థూపాకారంలో రేకులతో నిర్మించినది ఉంది. ఇక్కడే బుద్ధుడు తన నిర్యాణ విషయాన్ని ప్రకటించాడట. అయితే ఈ భిక్షపాత్ర ఇప్పుడు బీహార్ రాజధాని పాట్నాలో ఉందట. కొద్ది దూరంలో దీని పక్కనే నూతన భవన నిర్మాణం జరుగుతుంది. ఆ పాత్రను పాట్నా నుండి తీసుకొచ్చి డిసెంబర్ లో నూతన నిర్మాణంలో ఉంచుతారట. బుద్ధుడు వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి చూసి వైశాలి పెద్ద నగరం అవుతుందని అన్నాడట. ఈ స్తూపప్రాంతము చాలా విశాలంగా, ఉద్యానవనంతో, మొక్కలతో గడ్డితో పచ్చ పచ్చగా ఉంది.

దీనికి కొoత దూరంలో అశోకుడు నిర్మించిన (స్వస్తిక్ వనం అన్నట్లు గుర్తు) ఏకశిలపై ఏకసింహ స్తంభం, ఆనంద్ ని స్థూపం ఉన్న ప్రాంతానికి వెళ్ళాం. ఇక్కడి స్తూపము బుద్ధిని శిష్యుడైన(తమ్ముడు కూడా) ఆనంద్ అస్థికలను ఉంచి నిర్మింపబడిన స్థూపమట. ఆనందుడు బుద్దునికి పరిచర్యలు చేస్తూ బుద్ధిని వెంటే ఉండేవాడట. ఎప్పుడన్నా వినటం వీలుకానప్పుడు తర్వాత అయినా బుద్ధుడు ఆ ప్రవచనాలను చెప్పేవాడట. ఇది వారి మధ్య ఉన్న వడంబడిక అట. కనుకనే బౌద్ధ బిక్షువులలో ఎవరు విననన్ని ధర్మాలను ఆనందుడు విన్నాడట. బుద్ధిని అనంతరము బుద్ధ బోధనలను ప్రచారం చేశాడట. అతని శిష్యులవే చిన్న చిన్న స్థూపాకార, చతురస్ర, దీర్ఘ చతురస్ర ఆకారపు స్థూపాలున్నాయి. అశోకుడు ఆనంద్ ని జ్ఞాపకార్థం ఈ స్థూపాన్ని, ఏకశిలా సంభాన్ని నిర్మించాడట.

ఈ స్థూపం కుడివైపున అశోకుడు నిర్మింపజేసిన ఏకశిలా స్తూపంపై ఏకసింహం ఉన్న స్థంభం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నది. ప్రపంచంలోనే అత్యుత్తమంగా పరిరక్షింపబడిన కట్టడాలలో ఈ అశోక స్తంభం ఒకటి అన్నారు. స్తంభం పైభాగం వరకు బౌద్ధమత ధర్మాలను సూత్రాలను ప్రవచనాలను పాళిభాషలో చెక్కబడి ఉన్నాయి. బొమ్మల రూపంలో కూడా చెక్కబడి ఉన్నాయి. 2300 కాలంనాటి అశోకుని స్థూపము మన చారిత్రక సంపద. ఆనాటి చరిత్ర కూడా తెలుస్తుంది. ఈ స్తంభం, స్తూపం పక్కనే ఓ పెద్ద కోనేరు ఉంది. అక్కడున్న బౌద్ధ బిక్షువుల నీటి వనరుల కోసం. దీనిని మంకీ ట్యాంక్ అంటారట. దీనికి ఓ కథ ఉంది. ఈ ప్రాంతంలో బుద్ధుడు తిరుగుతున్నప్పుడు దాహంగా ఉందన్నాడట.వెంటనే కోతులు చెట్ల మీద ఉన్న తేనెతుట్టల నుండి తేనెను (కొబ్బరి చెట్లు లేవేమో? లేకపోతే కొబ్బరి బొండాలు తెస్తాయి కదా!) తెచ్చాయట. ఆ తేనెలో ఈగలు ఉన్నాయని అనడంతో పెద్ద కోనేరుని తవ్వి నీళ్లు తీసి ఇచ్చాయట. వానరాలు తవ్వింది కాబట్టి మంకీ ట్యాంక్ అని పేరు వచ్చిందట. రామాయణంలో వారధి కట్టిన కోతులు బౌద్ధంలో కోనేరును తవ్వాయి.

ఖుషి... అశోకుని కాలం నాటిబుద్దుని 6.1మీ.(లేదా 20అడుగులవిగ్రహం)

ఏకశిలా వనంలోనే ఆ చివర స్వస్తిక్ ఆకారంలో మూడు అడుగుల ఎత్తులో ఓ కట్టడం ఉంది. మధ్యలో వరండా,స్వస్తిక్ మార్క్ లో ప్రతి భుజానికి మూడు గదుల చొప్పున చుట్టూ 12 రూములు ఉన్నాయి.ప్రవేశ ద్వారం తూర్పు వైపు ఉన్నందున, దక్షణం న స్నాన వాటికలు కూడా ఉన్నాయి. స్వస్తిక్ గుర్తు బుద్ధుని కాలము (మంచికి చిహ్నమట) నుండే ఉంది. ఇక్కడున్న ఓ శిలాఫలకంపై స్వస్తిక్ గుర్తు తీరగబడ్డ జడ్(z)ల్లా ఉన్నది. స్వస్తిక్ గుర్తు ఎడమవైపు నుంచి కుడి వైపుకు(రాస్తాము)ఉంటుంది. ఇక్కడ జెడ్z ఇలా లేదు. ఇది గుప్తుల కాలమనాటిదని తెలియుచున్నది. ఈ స్వస్తిక్ బిల్డింగులో బౌద్ధ బిక్షువులు ఉండేవారుట.

స్వస్తిక్ ఆకారం లో 12 గదుల పురాతన కట్టడం.

వీటన్నిటిలో వాస్తవం అశోకుని ఏకశిలా స్తంభం. ఆనంద్ ని స్థూపం కూడా వాస్తవం అవ్వవచ్చు. మిగతావన్నీ జాతక కథలే. వాస్తవం చెప్పాలంటే ఈ జాతక కథలే బాగా గుర్తున్నాయి నాకు.

నలంద విశ్వవిద్యాలయం లో కలుద్దాం

Read More
Next Story