కోట గోడల, కొండరాళ్ల  ‘ఖిల్లా ఘనపురం’ యాత్ర గొప్ప అనుభవం
x

కోట గోడల, కొండరాళ్ల ‘ఖిల్లా ఘనపురం’ యాత్ర గొప్ప అనుభవం

దీనిని తెలంగాణా అడ్వెంచర్ టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయాలనే ప్రయత్నం కొంత జరిగినట్లు గ్రామస్తులు చెప్పారు. కానీ ఆదిశలో ఎలాంటి అభివృద్ధి అక్కడ కనిపించలేదు.



" పట్నమేలే రాజుపోయేను,

మట్టి కలిసెను కోట పేటలు" అని గురజాడ అన్నట్లు రాజులు పోయారు, రాజ్యాలూ పోయాయి. ఘనమైన గత చరిత్రకు ఆనవాళ్లుగా అక్కడక్కడా కొన్ని కోట గోడలు మిగిలాయి . అలాంటి వాటిలో అంతగా ప్రాచుర్యం పొందని చారిత్రక ప్రదేశం ఖిల్లా ఘనపురం. హైదరాబాదు నుంచి 120 కి. మీ. దూరం. రెండుమూడు గంటల ప్రయాణం.



క్రీ శ 13 వ. శ. లో కాకతీయ రాజులు ఈ కోటను నిర్మించారని చరిత్ర చెపుతోంది. సముద్రమట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో శత్రు దుర్భేద్యంగా కోట నిర్మాణం జరిగింది. ఎత్తైన రాతి కట్టడాలు, శిలాతోరణాలు, జలాశయాలను నిర్మించారు. కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువుల వలన వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది.

ఖిల్లా అంటే ఉర్దూ భాషలో కోట అని అర్థం. గణపతి దేవుని వారసులు నిర్మించిన కోట. గోన గనపరెడ్డి ఏలిన ప్రాంతం కాబట్టి ఆవూరికి గనపురం అనే పేరు. ఘనము అంటే గొప్ప అని అర్థం. అన్నీ కలిపి ఖిల్లా ఉన్న గనపరెడ్డి పాలించిన ఘనమైన చరిత్ర కలిగిన ఊరు ఖిల్లా ఘనపురం తమ ఊరని గ్రామస్థులు గర్వంగా చెప్పుకుంటారు. తెలంగాణా చారిత్రక సాంస్కృతిక అస్తిత్వాన్ని పునరుద్ధరించ వలసిన బాధ్యత పాలకులదే . ... ఈ ప్రదేశాన్ని తెలంగాణా అడ్వెంచర్ టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయాలనే ప్రయత్నం కొంత జరిగినట్లు గ్రామస్తులు చెప్పారు. కానీ ఎలాంటి అభివృద్ధి జరుగ లేదనడానికి అక్కడికి వెళ్ళి చూసిన మేమే ప్రత్యక్ష సాక్షులం.




సొసైటీ టు సేవ్ రాక్స్ సంస్థ వాళ్ళ పర్యవేక్షణలో 34 మందితో కూడిన బృందం ఖిల్లా ఘనపూర్ కు ప్రయాణమైంది. ఈసంస్థ 1996 లో ఏర్పడింది. జీవవైవిధ్యం పట్ల బాధ్యతతో ఉత్సాహవంతులైన కొందరు కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. సహజ సంపద పట్ల ప్రేమ, సామాజిక బాధ్యతా తప్ప లాభాపేక్ష లేని సంస్థ. అద్భుతమైన పురాతనమైన శిలాసంపదను సంరక్షించడం సంస్థ ఆశయం. ఆ దిశగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. హైదరాబాదు పరిసర ప్రాంతాలలో శిలా సంపద ఉన్న ప్రత్యేకమైన ప్రాంతాలను గుర్తించడం. ప్రతి నెలలో మూడో ఆదివారం నాడు రాక్ వాక్ నిర్వహించడం వాటిలో ప్రధానమైంది. అంటే ఆసక్తిగలవారిని ఆయా ప్రాంతాలకు తీసుకు వెళ్ళడం అన్నమాట. కొండలూ బండలూ మాయమై వాటిస్థానంలో భవనాలు ప్రత్యక్షమవుతున్న తరుణంలో .... ప్రజలలో అవేర్ నెస్ కల్పిండం కొరకు జూలై ఏడో తారీఖున రన్ ఫర్ సేవ్ రాక్స్ నిర్వహించారు. ఇందులో దాదాపు 125 మంది పాల్గొనడం విశేషం.


ఉదయం 6.30. లకు ఎన్. ఎం. డి. సీ నుంచి బయలుదేరిన మేము 9.30.లకు ఖిల్లా ఘనపూర్ గ్రామానికి చేరుకున్నాము. నిర్వాహకులు అందరినీ ఒకచోటకు చేర్చి ప్రాంత ప్రాముఖ్యాన్ని చెప్పి కొన్ని సూచనలు చేసారు. బృందంలో 10- 70 ఏళ్ళ వయసు వాళ్ళు ఉండడం విశేషం . ఒక యూరోపియన్ మహిళ కూడా ఉన్నది. బృందంలో చిన్నపిల్లలను చూసి నాకు చాలా సంతోషమైంది. భద్రమైన భవిష్యత్తుకు ఇలాంటి పిల్లలే ప్రతినిధులవుతారనే ఆశ కలిగింది. నడక మొదలైంది. ఎవరి సామర్థ్యం వాళ్ళది. కొంత దూరం వెళ్ళాక చిన్న ఆంజనేయుడి గుడి వచ్చింది. అక్కడ కాసేపు సేదతీరి మళ్ళీ నడక మొదలు పెట్టాము. మూడు ద్వారాలు దాటాము. అక్కడ నుంచి మొదలయ్యాయి ప్రకృతి అందాలు. కనుచూపుమేర హరిత వర్ణం. విభిన్న రంగుల అడవి పూలు. ఎరుపు, తెలుపు , పసుపు, పర్పుల్ ఇలా... రకరకాల ఔషధ ముక్కలు. ఆయా పూల శాస్త్రీయ నామాలు, మొక్కల శాస్త్రీయ నామాలు, ఏ జబ్బులకు ఏది పని పనిచేస్తుంది? లాంటి కబుర్ల వల్ల నడకలోని అలసట అసలు తెలియలేదు. వందలాది భిన్నవర్ణాల సీతాకోక చిలుకలు మా కంటి ముందే ఎగిరి పోతున్నాయి. వాటి నుంచి తప్పించుకు వెళ్ళడం ఒక ఆట లాగా ఉంది. మధ్య మధ్యలో మన పూర్వీకులు అంటే కోతులు. అన్నిటికీ మించి శిలాకారులను పరిశీలించడం. ఆ ఆకారాలలోని అందాలకు ఆనందించడం. కొన్ని చోట్ల క్రిమికీటకాలను గమనించడం.



జీవవైవిధ్యమంతా ఒకచోట పోత పోసినట్లుగా ఉంది. ఇది కదా జీవన సాహచర్యంమంటే... వీటికి భిన్నంగా చిన్న గుహలో ఒక మంచం కనిపించింది. ఇక్కడ ఎవరు నివసిస్తారు? అనే సందేహంతో ముందుకు సాగాను. కొంత ముందుకు వెళ్ళాక ఒక వృద్ధుడు ఎదురయ్యాడు. భుజం మీద ఒకటి, చేతిలో మరొక నీటి బిందెలతో... నా ఆతృత ఆపుకోలేక అడిగాను. ఆ గుహలో మంచం నీదేనా? ఇక్కడ నివసించేది నువ్వేనా? అని. గత నలభై యేళ్లుగా అక్కడ ఉంటున్నాడట. చిన్నప్పుడే వాళ్ళమ్మతో పాటు అక్కడికి వచ్చాడట. అమ్మ చనిపోయాక కూడా ఒంటరిగా అక్కడే ఉంటున్నానని చెప్పాడు. ముందుకు సాగుతూ ఉన్నాము. రాళ్ళ మధ్య ఇరుకైన సందుల్లోనుంచి దూరి దూరి వెళ్ళడం భలే ఉద్విగ్నంగా ఉంది.




ఒక చోట జలాశయం కనిపించింది. అక్కడదాకా వెళ్ళాక తెలిసింది మేము దారి తప్పామని . ... అక్కడ నుంచి కొంతదూరం వెనక్కి వచ్చి మరో దారి లోకి వెళ్ళాము. మాలో కొందరం మళ్లీ దారి తప్పా ము. కొందరు సరైన దారి దొరికే వరకూ ఒక చోట కూచుని ఉన్నారు. పెద్ద పెద్ద బండ రాళ్ళు ఎక్కడం చాలామందికి పెద్ద సవాలే అయింది. చాలా ఎత్తుకు చేరుకున్నాము. చల్లటి గాలి. ప్రశాంతమైన వాతావరణం. కానీ చూడాలనుకున్న చారిత్రక కట్టడం కనిపించక పోవడంతో కొంత నిరాశ.




మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. అక్కడే భోజనాలు చేశాము. ఇంతలో ఉన్నట్టుండి వర్షం మొదలైంది. చెల్లాచెదురుగా ఉన్న మేమంతా ఒక పెద్ద బండరాయి కిందకు చేరాము. భాగవతంలోని గోవర్ధన గిరి ఘట్టం గుర్తు వచ్చింది. కాసేపటికి ఎండ వచ్చింది. ఒకే రోజు ఎండా వానా చలీ గాలి ఇలా వాతావరణం లోని అన్ని మార్పులను చవి చూసాము. నిర్వాహకులు ఫోన్లు చేసి ఒక లోకల్ గైడును పిలిపించారు.



అతని పేరు పులిందర్. నేను పులి అని పిలిస్తే చాలా సంతోషపడ్డాడు. అతని గైడెన్సీ లో మేము తొందరగానే గమ్యస్థానాన్ని చేరుకున్నాము. చెట్లు, గుబురు పొదలు, ఎత్తైన రాతి మెట్లు, ఏటవాలు రాతి కొండతో దారి కఠిన తరమే ... దారిలో ఒక చిన్న ద్వారం ఉంది. దాదాపుగా వంగి వెళ్ళాలి. లేదంటే తల ముక్కలవుతుంది. కోటలోనికి ప్రవేశించే శత్రువులను నివారించడానికి ఇది ఒక పద్ధతి కావచ్చు.





కట్టడంలోనే మరింత పైకి వెళ్ళడానికి అతి చిన్న రాతి మెట్లు... హమ్మయ్య! అతికష్టం మీద గమ్యస్థానానికి చేరుకున్నాము. అక్కడ ఒక ఫిరంగి ఉన్నది. నివాస యోగ్యమైన కోట ఆనవాళ్ళు ఎప్పుడో శిథిలమైపోయాయి.




మేము నిలబడి ఉన్నది యుద్ధ సమయాల్లో శత్రువుల రాకను కనిపెట్టడానికి, యుద్ధం చేయడం కొరకు నిర్మించిన కట్టడం కావచ్చు. ఎత్తైన ప్రదేశం. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్న కింద పడి పోయేంత భయంకరమైన ఈదురు గాలి. ఒక వైపు హరిత వర్ణం. మరోవైపు అధికసంఖ్యలో పెద్ద పెద్ద బండరాళ్లు. ఇంకోవైపు ఖిల్లా ఘనపురం గ్రామం. ఇళ్లు బొమ్మరిల్ల లాగా కనిపిస్తున్నాయి. ఆ అద్భుత దృశ్యాన్ని మదిలో పదిలపరచుకొని తిరుగు ముఖం పట్టాము. ఇంకా అక్కడ చూడవలసినవి చాలా ఉన్నాయని పులి చెప్పాడు. చుట్టూరా మరో ఏడు చిన్న కోటలు ఉన్నాయట. సొరంగ మార్గంలో మెట్లు దిగి కిందకు వెళితే బావి ఉంటుందని అందులో నీళ్ళు తియ్యగా ఉంటాయని చెప్పాడు. సమయం లేనందు వలన మేము వెళ్ళలేక పోయాము. అందరూ బస్ లోకి చేరేసరికి 4.30. లు అయింది.




అక్కడి నుంచి మా ప్రయాణము వనపర్తి జమీందారు ప్యాలెస్కు. దారిలో ఒక పురాతన భవనం కనిపించింది. ప్రస్తుతం అందులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉన్నది. మేము వెళ్ళింది జమీందారు నివాస భవనం. పురాతన భవనం ఉన్నచోటనే అదే డిజైన్ లో ప్రస్తుత భవనాన్ని ముప్పై యేళ్ళ క్రితం నిర్మించారట. విశాలమైన ప్రాంగణంలో ఒకవైపు వరి పొలాలు మరోవైపు మామిడి తోట ఇంకోవైపు కోనేరు ఉన్నాయి . 140 గోవులు వున్నాయిట . పాడి పంటలకు కొదువ లేదు . ఆ ప్రాంగణంలోనే నాలుగువైపులా వారి పూర్వీకుల సమాధులున్నాయి. ఇంటి లోపల పాతకాలం నాటి టీకు ఫర్నిచర్ పెద్ద పెద్ద పందిరి మంచాలు, నిలువుటద్దాలతో ఆ రాజసం ఉట్టిపడుతూ ఉంది.




మూడోతరమైన శాంతా రామేశ్వర రావు దంపతులకు ముగ్గురూ ఆడపిల్లలే ఉండడం వల్ల మగపిల్లవాడిని దత్తత తీసుకుంటున్న వేడుక ఫోటోలు ఆ యింటిలో ఉన్నాయి. వాళ్ళ పూర్వీకుల చిత్రపటాలు కూడా ఉన్నాయి. శాంత గారు 1961లో విద్యారణ్య పాఠశాలను స్థాపించారు. ఇది హైదరాబాదులో సచివాలయం ఎదురుగా ఉన్నది. ఇక్కడ ఎనిమిదో తరగతి వరకు పరీక్షలు ఉండవు. ప్రత్యేకమైన విద్యా బోధనలో చాలా పేరు పొందిన పాఠశాల. సిబియసి సిలబస్ బోధించినా చరిత్ర, సంస్కృతి, లలితకళలు, క్రీడలు ...అన్నింటిలో విద్యార్థులకు శిక్షణ ఉంటుంది. యజమానులు హైదరాబాదులోనే ఉంటారట. దసరా పండుగ సమయంలో ప్రతి సంవత్సరం వనపర్తికి వచ్చి పది రోజులుండి నవరాత్రులు దసరావేడుకలు జరిపించి వెళతారట. మేము వెళ్ళినప్పుడు సిబ్బంది మాత్రమే ఉంది. టీ బిస్కట్లతో మాకు ఆతిథ్యం ఇచ్చారు. ప్యాలెస్ మొత్తం చూపించారు. అక్కడికి అరగంట దూరంలో 400 యేళ్ళ నాటి రంగనాథస్వామి దేవాలయం ఉందని చెప్పారు. సమయాభావం వల్ల వెళ్ళలేదు. అప్పటికే సమయం ఏడు గంటలయింది. అప్పుడు బయలుదేరి హైదరాబాదుకు రాత్రి పది గంటలకు చేరుకున్నాము.


Read More
Next Story