అసాధారణ స్టేజీ నటుడు బీసీ కృష్ణకు నివాళి
x

అసాధారణ స్టేజీ నటుడు బీసీ కృష్ణకు నివాళి

పద్య నాటకాలలో కొత్తవరవడి సృష్టించిన మేటి నటుడు


- సానేము నర్సన గౌడు

పౌరాణిక పద్య నాటకాలలో కొత్త ఒరవడిని సృష్టించి ఆ పద్ధతిని కొనసాగించేందుకు కర్నూలు జిల్లాకు చెందిన నేతి మిఠాయి వ్యాపారి కేసి శివారెడ్డి పడిన బాధ అంతా ఇంతా కాదు. ఒక కొత్త పద్ధతిలో పౌరాణిక పద్య నాటకాన్ని ప్రదర్శించడం అంత సులువు కాదనే విషయం ఆయన బాధ చూసిన నాకు బాగా తెలుసు. అందుకోసం శివారెడ్డి కర్నూలు కు చెందిన బీసీ కృష్ణను ఎంచుకోవడం కత్తిమీద సాము లాంటిది. ఇక్కడ కొంత నేపథ్యాన్ని చెబుతే బాగుంటుంది. వృత్తి రీత్యాదోబీ. అయితే, సంగీతం మీద మక్కువతో కర్నాటక సంగీతం నేర్చుకున్నాడు.

అది 1982. ఆ ప్రాంతంలో కాళ్ళకూరి నారాయణరావు రచించిన చింతామణి పద్య నాటకం ఎక్కువగా ప్రదర్శించే వారు.నేను పుట్టి పెరిగింది గ్రామీణ ప్రాంతంలో. అలా నాకు స్టేజి నాటకాలు పరిచయం అయ్యాయి. మా వూర్లోనే కాదు, నా చుట్టుపక్కల పౌరాణిక పద్య నాటకాలు ఎక్కడ ప్రదర్శించినా వీలు చేసుకుని ఆ నాటకాన్ని చూసేందుకు నా తోటి నాటక ప్రియులను కలుపుకొని వెళ్లేవాడిని.

ఇపుడు సినిమాల మీద చర్చ జరుగుతున్నట్లే ఆ రోజుల్లో పౌరాణిక పద్య నాటకాల గురించి.నటుల గురించి, మారి కంఠ మాధుర్యం గురించి, పద్యాల గురించి గ్రామాల్లో చర్చలు జరిగేవి. తర్వాత నేను నాటకాల వైపు మళ్లాను. కాకపోతే, వామపక్ష ఉద్యమంలో ఉన్నందున నేను సాంఘిక నాటకాలు రాయడం వాటిని ప్రదర్శింప చేయడము పాటలు రాయడం పాడడం లాంటి ప్రక్రియల్లో ప్రవేశించాను. అయినా సరే,పద్యనాటకాల మీద మక్కువ తగ్గలేదు. అదే పద్యనాటకాల మేటినటులతో పరిచయం కొనసాగించేలా చేసింది.

బిసి కృష్ణ

అప్పటికే కళలపై ఒక అవగాహన ఉండటం వల్ల పౌరాణిక పద్య నాటకాలపై కూడా సద్విమర్శలను చేసే వాడిని దాంతో నేను చేసే విమర్శల్లో విషయం ఉండడంతో సదరు కళాకారులు సహృదయతతో స్వీకరించడం నాకు ఆనందం కలిగించేది. అందుకే నాటకాలు చూడడం సంతోషంగా ఉండేది. అందులో భాగంగానే చింతామణి నాటకాన్ని రాత్రి 10 గంటలకు ప్రారంభించి తెల్లవారుజామున మూడు గంటలకు ముగించినా ఓపికతో చూసి కళాకారులను అభినందించడం నాకు ఎంతో ఆనందంగా ఉండేది.

ఆ రోజు చింతామణి నాటకంలో అప్పటికే పౌరాణిక పద్య నాటకాలలో స్త్రీ వేషాలు అద్భుతంగా పోషించి పేరుగాంచిన బుర్ర సుబ్రహ్మణ్యం శాస్త్రి చింతామణి పాత్ర ధరించారు. బిల్వ మంగళుడిగా బీసీ కృష్ణ నాటకం ప్రదర్శించిన తీరుకు నేను ఎంతో ముగ్దునయ్యాను. ఈ అభిమానం వల్లే బీసీ కృష్ణకు నేను స్నేహితుడినయ్యాను.

అప్పటికే పాంఘిక నాటకల ద్వారా నాకు కొంత గుర్తింపు వచ్చింది. దాంతో నేను వేదికపైకి వెళ్లి వారి నటనా వైభవాన్ని ప్రశంసించే వాడిన. వారు ఇరువురు ఎంతో సంతోషపడ్డారు. బీసీ కృష్ణ బిల్వమంగళుడి వేషం నటన పద్య పఠనం ఎంతో గొప్పగా ఉండేవి. పాత్రకు తగినట్టుగా హావభావ వ్యక్తీకరణ చేస్తూ సందర్భోచితంగా పద్యానికి అవసరమైనంత రాగాలు తీయడంతో నాటకం ఆధ్యాంతం రక్తి కట్టేది.

బుర్రా సుబ్రమణ్యం సైతం చింతామణిగా ఆ వేషధారణ గొప్పగా ఉండేది ఈయన స్త్రీ పాత్రలు ధరిస్తూ అప్పటికే ఆ రంగంలోని మహిళా కళాకారుణి లకు ఒక సవాలుగా ఉన్నారంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు.

ఆ రకంగా కేసి శివారెడ్డి తో పరిచయం కలిగింది. ఆయనతో పరిచయం నాటికి నేను పాత్రికేయుడిగా జీవితాన్ని ప్రారంభించాను. పౌరాణిక పద్య నాటకాలలో అప్పటికే మహామహులు పీసపాటి నరసింహమూర్తి, ఏవి సుబ్బారావు, షణ్ముఖి ఆంజనేయరాజు, డివి సుబ్బారావు, సంపత్ నగర్ లక్ష్మణరావు, వెల్దుర్తి వెంకట నర్సు లాంటి ఉద్దండులు రంగంలో ఉన్నారు. దాదాపు పైన పేర్కొనబడిన వారందరూ ఎక్కువ శృతి లో పద్యాలను చదవడంలో ప్రఖ్యాతిగాంచారు.

మూడు నిమిషాల పద్యం ఆరు నిమిషాల రాగం లాగా వారి పద్య నాటక ప్రదర్శన జరిగేది. ఆ రంగంలో వారిని ఏమాత్రం తక్కువ చేయడం కాదు కానీ అదే సరసన పద్యము రాగయుక్తంగా అవసరమైనంత ఆలాపన ఉండే విధంగా కేసి శివారెడ్డి ఒక కొత్త వరవడికి నాంది పలికారు.

పద్యం చదివిన తర్వాత చాలా సేపు రాగం తీయడం వల్ల నాటక స్ఫూర్తి దెబ్బతింటుందనే భావన నాతో ఆయన చాలాసార్లు ప్రస్తావించారు. ఆ విధానానికి భిన్నంగా నాటకం ఒక సందేశాత్మకంగా మలచేందుకు ఆయన పడిన శ్రమ చాలా ఉంది. శివారెడ్డి తో అనేకసార్లు సాయంకాలం పూట కర్నూలు మున్సిపల్ ఓపెన్ థియేటర్ ఆవరణలో కూర్చుని నాటకారంగంపై దాని బాగోగులపై మాట్లాడుకునేవాళ్లం.

శివారెడ్డి

శివారెడ్డి పాత కర్నూలు జిల్లా ఆత్మకూరు ప్రాంతంలోని మద్దూరు గ్రామానికి చెందినవారు. అక్కడ ఆయనకు రెండు ఎకరాల పొలం మాత్రమే ఉండేది ఒకవైపు వ్యవసాయం చేయాలని ఉన్నా కుదరక తనకు ఎంతో ఇష్టమైన పౌరాణిక పద్యాల ప్రదర్శన కోసం ఊరూరా హార్మోనియం పెట్టే నెత్తిన పెట్టుకొని తిరిగేవారు.

ఆనాడు శ్రీకృష్ణ పాత్రధారునిగా పేరుగాంచిన కె.వి రాఘవరావు కు హార్మోనియం సహకారం అందించేవారు. తదనంతరం చిన్న నేతి మిఠాయిల దుకాణం పెట్టుకుని తర్వాత కాలంలో కొంత గడించారు. కళాకారుని గా ఉంటూ వ్యాపారస్తునిగా ఆయన మారడానికి ఇసుక నుండి తైలం తీసినట్టుగా కష్టపడినట్లు చెప్పారు. తనకు ఎంతో ఇష్టమైన హరిశ్చంద్ర సబ్జెక్టును నేర్పేందుకు బాగా శ్రమించారు. ఆ క్రమంలోనే బీసీ కృష్ణ ఆయనకు తారసపడడం అప్పటికే ఆర్థికంగా చితికిపోయి ఉన్న బీసీ కృష్ణ ను అన్ని విధాలుగా ఆదుకొని హరిశ్చంద్ర పాత్రను నేర్పించారు.

ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాల్సి ఉంది, నిజానికి శివారెడ్డి తన స్వీయ అనుభవాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి నాటకాలలో పాత్రలను పోషించేవారు సైతం కొంతైనా ఆ పాత్ర స్వభావాలను కలిగి ఉండాలని కోరుకునేవారు. తాను స్వతహాగా హరిశ్చంద్రుని విలువల్ని పాటించాలని తపనపడ్డారు. అందులో భాగంగానే బీసీ కృష్ణను ఆ పాత్రకి ఎంపిక చేసి వేషం కట్టించారు . తొలి ప్రదర్శన గురించి ఆయన చెప్పిన తీరు నన్ను ఎంతో ఆకట్టుకుంది.

ఆదోనిలో హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు వీరికి దగ్గర బంధువైన వెంకటరెడ్డి (సర్కిల్ ఇన్స్పెక్టర్) నాటకాన్ని చూసేందుకు ఆహ్వానించారు. అప్పుడు వెంకటరెడ్డి చెప్పిన సమాధానం ఆసక్తికరంగానే ఉంది. ‘‘నేను పోలీస్ నాకు నాటకాలతో ఏం పని. నాటకం ఎప్పుడు చూస్తాము కుదరదు, పో,’’ అని చెప్పారట. దానికి శివారెడ్డి వీలైతే ఒకసారి వచ్చి పోండి 10 నిమిషాలు కూర్చోండి అని కోరగా చూద్దాంలే అని చెప్పారట.

నాటకం ప్రారంభమైంది అంతలోనే పోలీస్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి ఆ నాటకం ప్రదర్శించే ఆవరణలోకి జీపులో ప్రవేశించే సరికి నాటకం చూసేందుకు వచ్చిన జనం ఒక్కసారి లేచి పరిగెత్తడం ప్రారంభించారు. వెంకట్ రెడ్డి స్వయంగా కలగజేసుకొని జనానికి నచ్చజెప్పి నేను ఎవరి కోసం రాలేదు. నేను కూడా మీలాగే నాటకం చూసేందుకు వచ్చాను దయచేసి అందరూ కూర్చొని నాటకాన్ని చూడండి అని చెబితే గాని జనం సావధాన పడలేదట.

నాటకం ప్రారంభమైంది. పదినిమిషాలు... అరగంట గడిచింది. గంట సైతం గడిచిపోయింది. హరి చంద్రుడు తన భార్యను అమ్మే సీనులో కాలకౌశికుడికి అప్పగించే సమయంలో దుఃఖపరితమైన సన్నివేశాన్ని చూసి అప్పటివరకు దుఃఖిస్తూ కూర్చున్న వెంకటరెడ్డి ఇక ఆగలేక, ‘ఒరేయ్ నాన్న, నాటకం ఆపండి రా. ఏంటిది నాటకమా? ఇది నాటకం అంటే ఏదో కాలక్షేపానికి అనుకున్నానే గాని ఇలా ఉంటది అని తెలియరా నాన్న,’ అంటూ వేదిక పైకి పోయి ప్రేక్షకులను క్షమించమని కోరాడట.

ఆ సందర్భంగా హరిశ్చంద్ర పాత్రధారి బీసీ కృష్ణను చంద్రమతి పాత్ర ను ధరించిన గూడూరు సావిత్రిని ఆలింగనం చేసుకొని అభినందించి,‘ఇక నాతో కాదు, నాకు సెలవు ఇవ్వండి. ఇక నాటకం చూడలేను. ఇక్కడే ఉంటే గుండె ఆగిపోయి చనిపోతాను,’ అంటూ వేదిక దిగి వెళ్ళిపోయారు.

ఇలా చెబుతున్నప్పుడు శివారెడ్డి కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి ఆయన చెప్పడమే కాదు నేనే స్వయంగా బీసీ కృష్ణ హరిశ్చంద్ర నాటకాన్ని ఎక్కడ ప్రదర్శించినా వీలు చూసుకుని వెళ్లేవాడిని. ఒక మాటలో చెప్పాలంటే ఆ నాటకం చూడడం అంటే ఏడ్చేందుకు మాత్రమే వెళ్లేవాడిని అని అర్థం. ఇది నిజం హరిశ్చంద్ర సబ్జెక్టులో అంత విషయం ఉంది. ముఖ్యంగా పాత్రధారులు అందులో జీవించగలిగితే ప్రేక్షకుల జీవితం ధన్యం. సత్యహరిశ్చంద్రతో పాటు ఆయనకు పేరు తెచ్చిన మరొక పాత్ర బిల్వమంగళుడు.

నాటకరంగానికి అపారమైన సేవ చేసిన బీసీ కృష్ణ(80) ఫిబ్రవరి 1 రాత్రి కర్నూలు నగరంలో కన్నుమూశారు. ఆదివారం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు ఉన్నారు. జబ్బుకు చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. కర్నూలు నాటక రంగానికి రాష్ట్రస్థాయిలో ఖ్యాతి తీసుకువచ్చిన ప్రముఖుల్లో ఒకరు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన చింతామణి నాటకంలో బిల్వ మంగళుడిగా వేలాది ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందారు. కృష్ణ కోసమే పరమహంస నాట్య కళా సమితి అనే సంస్థను స్థాపించారు.

బీసీ కృష్ణ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నుంచి ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కందుకూరి పురస్కారం కూడా ఆయనకు లభించింది. అలాగే ఎన్నో కళాపరిషత్తుల పోటీ లకు ఆయన న్యాయ నిర్ణేతగా వెళ్లి సత్కారాలు అందుకున్నారు.

హరిశ్చంద్ర పాత్ర మీద ఆయనకు ఒక తాత్విక ధోరణి ఏర్పడింది. హరిశ్చంద్రుడు అరిషడ్వర్గాన్ని జయించినవాడు. ఆ మహనీయుడి పాత్ర వేసేటపుడు నాకు కొంతయినా ఆశక్తి ఉండాలి. అందుకే ఆయన బాటలో నడవాలని ప్రయత్నిస్తున్నాను. అనేవాడు. నాటకాలు ఆయనకు కీర్తి తెచ్చయి తప్ప ధనమీయలేదు.

ఇక్కడ కేసీసీ శివారెడ్డి గురించి ఒక విషయం చెప్పాలి. మిఠాయి వ్యాపారంలో కొంత ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత వృద్ధ కళాకారులకు అండఅయ్యారు. పౌరాణిక పద్య నాటకాలలో ఒక వెలుగు వెలిగిన వాళ్లకి ఆయన చేయూత నిచ్చారు. కె.వి రాఘవరావు, లంకా పిచ్చయ్య శాస్త్రి, బుర్రా సుబ్రమణ్య శాస్త్రి వీరితోపాటు ఒక పదిమంది వరకు పరోక్షంగా ప్రత్యక్షంగా వారికి జీవనోపాధి కలిగించి ఆదుకున్న ఘనత ఈ అభినవ ఆంధ్రభోజుడు కేసి శివారెడ్డికి దక్కుతుంది. శివారెడ్డి 2019లో చనిపోయారు

(బీసీ కృష్ణ ఈ మధ్యనే ఫిబ్రవరి ఒకటో తేదీన స్వర్గస్తులయ్యారు ఆయన స్మరణలో......)

(సానెము నర్సన్న గౌడు, రచయిత, జర్నలిస్టు, నాటకాభిమాని)

Read More
Next Story