అపర ధన్వంతరి డా. ఎల్లాప్రగడ
x

అపర ధన్వంతరి డా. ఎల్లాప్రగడ

జనవరి 12న 130వ జయంతి సందర్భంగా సీనియర్ జర్నలిస్టు నందిరాజు రాధకృష్ణ నివాళి


-నందిరాజు రాధాకృష్ణ

చర్మ, నేత్ర, జననేంద్రియాలు, ఉదర, మూత్రకోశ వ్యాధులు.. నిమోనియా వంటి ఎన్నో జబ్బులను మానవాళి సమర్థంగా తట్టుకుంటోందంటే.. మనిషి ఆయుః ప్రమాణం పెరిగిందంటే.. కేవలం ఒక్క మహానుభావుడి పుణ్యమే! ఆయనే ఎల్లాప్రగడ సుబ్బారావు. భారతదేశ వైద్య శాస్త్రజ్ఞులలో చాలా సుప్రసిద్ధ వ్యక్తి. కొందరి అసూయతో సుబ్బారావు పరిశోధనలు వెలుగు చూడక పోవడం వలన ఆయన కనుగొన్న కొన్ని న్యూక్లియోటైడ్లను అనేక సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులు తిరిగి కనుగొనవలసి వచ్చిందని సుబ్బారావు సహచరుడు, 1988లో గెట్రూడ్ ఎలియాన్తో కలిసి వైద్య శాస్త్ర నోబెల్ బహుమతిపంచుకొన్న జార్జ్ హిచ్చింగ్స్ వ్యాఖ్యానించారు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బస్తీలో 1895, జనవరి 12 న జన్మించారు. తండ్రి జగన్నాథం చిరుద్యోగి. ఎలిమెంటరీ, ఉన్నత పాఠశాల చదువులు పూర్తి చేసేటప్పటికి తండ్రి రిటైర్ అయ్యారు. సమీపబంధువుల అకాల మరణంతో సుబ్బారావు బాల్యం బండరాయి అయింది. అరటిపండు వ్యాపారి కావడానికి 13 సంవత్సరాల చిన్న వయస్సులో ఇంటి నుండి పారిపోయాడు. ఆయన 18 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మరొక ప్రయత్నం చేసారు, ఈసారి సన్యాసి అయ్యాడు. రెండు సార్లు అతని తల్లిదండ్రులు అతనిని వెనక్కి లాగి, చదువు కొనసాగించమని ఒప్పించారు. ఈయనను చదివించడానికి తండ్రి వెనుకంజ వేయగా తల్లి పట్టుబట్టి సుబ్బారావును రాజమండ్రికి పంపించి మెట్రిక్యులేషన్ పరీక్ష చదివించారు. ఫెయిలయ్యారు. ఇంతలో తండ్రి మరణించారు.

తల్లి పట్టుదలతో మద్రాసుకు పంపదల్చగా చేత చిల్లిగవ్వ లేదు. పుస్తెలు అమ్మి కొడుకు చదువుకు ఇచ్చింది. మద్రాసు హిందూ ఉన్నత పాఠశాలలో చేరి, చదువులో ముందడుగు వేశాడు. పేదరికంలో విద్యాపరమైన నైరాస్యంతో కూడా భవిష్యత్తు పట్ల ఆత్మవిశ్వాసంతో వర్తమాన ఇబ్బందులను అధిగమించే సాహసం ఈయనకు అబ్బింది. సంఘ సంస్కర్త చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రభావం బాగా పొడసూపింది. మద్రాస్, మైలాపూర్ లోని రామకృష్ణ మిషన్ వైపు ఆకర్షితుడాయ్యారు. బంధువుల సహకారంతో మద్రాసు మెడికల్ కాలేజీ ఇంటర్మీడియట్ డిస్టెంక్షన్ లో పాసయిన ఘటన ఈయన చరిత్ర గతిని మార్చివేసింది.

సుబ్బారావుది పేద కుటుంబం అయినప్పటికీ, స్వచ్ఛంద సంస్థల సహాయంతో మద్రాసు మెడికల్ కాలేజీలో చేరాడు. దేశ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో విదేశీ దుస్తులను బహిష్కరించి, ఖద్దరు దుస్తులతో కాలేజీకి వెళ్ళడం ఆయన శస్త్రచికిత్స ప్రొఫెసర్ ఎం సి బ్రాడ్ ఫీల్డ్ కు కోపం తెప్పించింది. ఎం బి బి ఎస్ బదులుగా తక్కువ ఎల్ ఎం ఎస్ డిగ్రీని అందించారు. ఇంతలో ఒక దుర్ఘటన జరిగింది. అత్యంత సన్నిహితుడైన పెద్దన్నయ్య పురుషోత్తం భయంకరమైన "స్ఫ్రూ" వ్యాధితో మరణించాడు. వారం రోజుల వ్యవధిలో మరో సోదరుడు కృష్ణమూర్తి కూడా ఇదే వ్యాధికి బలయ్యాడు. ఈ రెండు మరణాలు ఈయనను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి.

ఎంతటి శ్రమపడి అయినా ఈ వ్యాధికి ముందు కనుగొనాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆర్థిక ఒత్తిడి ఎంతగా ఉన్నా, ఎన్ని అవరోధాలు ఎదురైనా చదువు కొనసాగించాలని నిశ్చయించు కున్నారు. మద్రాసు ఇండియన్ మెడికల్ కాలేజీలో ఎల్.ఐ.ఎం. చేసి, కార్పొరేషన్ ఆయుర్వేద హాస్పటల్ లో నెలకు అరవై రూపాయల జీతం మీద పనిచేశారు. విదేశాలకు వెళ్ళీ పరిశోధనలు చేయాలని వైద్యశాస్త్రాన్ని శోధించి, పరిశోధించి అనేక రహస్యాలను వెలికి తీయానల్ల దృఢ కాంక్షను రోజు రోజుకీ బలపరచుకున్నారు. నిరాశ పడక మరుసటి సంవత్సరం మళ్లీ దరఖాస్తు చేసుకోగా అనాటమీ శిక్షణ కు పట్టుబట్టగా చివరకు అంగీకారం లభించింది. సుబ్బారావు హార్వర్డ్ మెడికల్ స్కూల్ నుండి డిప్లొమా పొంది, మెడిసిన్‌లో జూనియర్ లెక్చరర్‌గా చేరారు.

సుబ్బారావు ఫిస్కే- పద్ధతి ఆవిష్కరణతో మొదటి ప్రయత్నం విజయవంతమైంది. శరీర ద్రవాలు, కణజాలాలలో భాస్వరం మొత్తాన్ని అంచనా వేయడానికి ఆ విధానం సహాయపడింది. ఆయన సైరస్ ఫిస్కేతో అభివృద్ధి చేసిన పద్ధతిని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది జీవశాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్నారు. ఫిస్కే - సుబ్బారావు పత్రం 1925లో జర్నల్ ఆఫ్ బయోలాజికల్ కెమిస్ట్రీలో ప్రచురితమైంది . సుబ్బారావు భావాలలో నైశిత్యం ఉంది. లోతైన పరిశోధనా పటిమా ఉంది. 1925 ప్రాంతంలో ఆయన అతిసార వ్యాధితో శుష్కించిపోయారు. మద్రాసు లో ఉన్న ఆనాటి ప్రసిద్ధ ఆయుర్వేద భిషగ్వరులు ఆచంట లక్ష్మీపతి వైద్యం చేసి ప్రాణ రక్షణ చేశారు. ఈ వ్యాధినే ఉష్ణమండల స్ప్రూ వ్యాధిగా నిర్ధారించారు.

ఆ క్రమంలోఆయన కండరాల చర్యలో ఫాస్ఫోక్రియాటిన్ , అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ (ఆట్ఫ్) పోషించె పాత్రను కనుగొన్నాడు . దీంతో 1930లలో బయోకెమిస్ట్రీ పాఠ్యపుస్తకాల్లో ఆయన పాఠాలకు ప్రవేశం లభించింది. అదే సంవత్సరంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. హార్వర్డ్ చరిత్రలో బయోకెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసిన మొదటి భారతీయుడుగ చరిత్రలో నిలిచారు. తర్వాత న్యూయార్క్ ల్యాబ్‌లోని పెర్ల్ రివర్‌లోని లెడర్లేస్ లాబొరేటరీస్‌లో రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ గా చేరారు.

ఎల్లాప్రగడ నాలుగు అద్భుత వైద్య అణువులను కనుగొన్నారు. ఈ అణువులు పోషక , అంటు వ్యాధులు, క్యాన్సర్ చికిత్సకు కొత్త విధానాలను ఆవిష్కరించారు. ఆరియోమైసిన్, మొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్స్ ఆవిష్కృతమైంది. పసిఫిక్‌లో పోరాడుతున్న అమెరికన్ సైనికులను మలేరియా, ఫైలేరియా నుండి రక్షించడానికి సుబ్బారావు ఒక ప్రాజెక్ట్‌ను స్థాపించారు. ఇది ఆయన తదుపరి ప్రధాన అణువు హెట్రాజాన్ అభివృద్ధికి దారితీసింది , ఇది ఇప్పటికీ విస్తృతంగా ఉపయోగంలో ఉంది. జంతువులలో ఫైబ్రోసిస్ చికిత్సకు కూడా హెట్రాజాన్ ఉపయోగిస్తున్నారు.

సుబ్బారావు అమినోప్టెరిన్ అనే అణువును కూడా కనుగొన్నారు. తత్ఫలితంగా అమినోప్టెరిన్ సృష్టికి దోహద పడింది. మెథోట్రెక్సేట్, అమినోప్టెరిన్ తదుపరి ఉత్పన్నం, అది నేడు వివిధ రకాల క్యాన్సర్‌ల చికిత్సలో ఉపయోగించే ప్రధాన ఔషధాలలో ఒకటి. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు 53 సంవత్సరాల చిన్న వయస్సులో ఆగష్టు 9, 1948 న మరణించారు. ఎన్నో విజయాలు సాధించినా ఆయన వెలుగులోకి రాలేదు.

లెడర్లీ ప్రయోగశాలలో వైద్యబృందం నాయకులుగా క్షయరోగ నివారణి బసోనికోటి నికాసిడ్, హైడ్రాక్సైడ్ మందులను కనుగొన్నారు. బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం మొదలైన వ్యాధులకు పూర్తిగా నిర్మూలించే మందులను ఆయన కనుగొన్నారు. కొత్తగా కనుగొన్న ఒక ఫంగస్ కు ఈయన గౌరవార్ధం సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ అని నామకరణం చేశారు. 1947లో అమెరికా పౌరసత్వానికి అర్హత పొందినా డాక్టర్ ఎల్లాప్రగడ జీవితాంతం భారతీయ పౌరునిగానే వైద్య శాస్త్ర పరిశోధనకే అంకితం చేసిన మహనీయుడు.

డాక్టర్ ఎల్లాప్రగడ 1948 ఆగష్టు 9వ తేదిన 'కరోనరి త్రాంబసిన్' వ్యాధితో అమెరికాలో కన్నుమూశారు. లెడర్లీ వైద్యపరిశోధనా కేంద్రం ముఖ ద్వారం దాటిన తర్వాత పెద్ద కాంస్య ఫలకంపై డా. ఎల్లాప్రగడ సుబ్బారావు చిత్రం క్రింద "యల్లాప్రగడ సుబ్బారావు - 1886-1948 పరిశోధకులు, విద్యావేత్త, తత్వవేత్త, దయామయుడు. లెడర్లీ పరిశోధనా సంస్థ డైరెక్టర్." అన్న వాక్యాలు ఆయన జ్ఞాపకార్థం ఉంచింది. అంతే కాక ఈ ప్రముఖ భారతీయ వైద్యుని పట్ల గౌరవసూచకంగా బొంబాయిలోని బల్సార్‌లో లెడర్లీ సంస్థ నిర్మించిన ప్రయోగశాలకు డా. ఎల్లాప్రగడ సుబ్బారావు సంస్థ అని నామకరణం చేసింది.

(నందిరాజు రాధాకృష్ణ, వెటరన్ జర్నలిస్ట్, హైదరాబాద్)

Read More
Next Story