ఒకనాటి మేటి జర్నలిస్టు DNF  హనుమంతరావుకు నివాళి
x

ఒకనాటి మేటి జర్నలిస్టు DNF హనుమంతరావుకు నివాళి

ఢిల్లీ నుంచి పార్లమెంటు వార్తలందించిన తొలి తెలుగు జర్నలిస్టు హనుమంతరావుకు శతజయంతి నివాళి


-నందిరాజు రాధాకృష్ణ

తెలుగునాట 65 ఏళ్లుగా జర్నలిజం రంగంలో ప్రసిద్ధి చెందిన వార్తా సంస్థ, డేటా న్యూస్ ఫీచర్స్ (DNF) ను నడిపి మూడు దశాబ్దాలకు పైగా డి ఎన్ ఎఫ్ ఏజెన్సీని నిర్వహించదమే గాక, వార్తా రంగానికి, విద్యా, ఉద్యోగ పోటీ రంగంలో యువతకు ఏ ఏడాదికాఏడు తాజా సమాచారంతో ఇయర్ బుక్ లను ప్రచురించిన అరుదైన ఘనత వాడకట్టు హనుమంతరావుది. జర్నలిస్టులలో ఆయన విహెచ్ పాపులర్. ఇది ఆయన శత జయంతి సంవత్సరం. 1925లో తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఆయన జన్మించారు. 2016 డిసెంబర్ 13న హైదరాబాద్ లో చనిపోయారు.

ఆయన కృష్ణా పత్రిక, ఈనాడు, ది ఎకనామిక్ టైమ్స్, విశాలాంధ్ర, ప్రజాశక్తి మొదలైన మీడియా సంస్థలలో వివిధ హోదాలలో ఫ్రతిభ కనబరచారు. ఐ ఎన్ ఎస్ విక్రాంత్ నుండి యుద్ధ వార్తలు అందించిన వార్ రిపోర్టర్‌ హనుమంత రావు. వీక్షణం అనే మాసపత్రికకు వ్యవస్థాపక సంపాదకులు. వివిధ వార్తాపత్రికలు పత్రికలలో అసంఖ్యాకంగా వ్యాసాలు వ్రాసారు.

విహెచ్ గా ప్రాచుర్యం పొంది, 65 సంవత్సరాల సుదీర్ఘ జర్నలిస్ట్‌ ప్రయాణంలో నాలుగు తరాల జర్నలిస్టులకు స్ఫూర్తినిచ్చారు. తెలుగు వార్తాపత్రిక విశాలాంధ్ర కోసం పార్లమెంటు సమావేశాలకు హాజరయి వార్తలు అందించిన మొదటి తెలుగు ఢిల్లీ పాత్రికేయుని ఘనత ఆయనది. సామాన్యుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వార్తలను, అభిప్రాయాలను అందించే జర్నలిజమే నిజమైన జర్నలిజం అని చెబుతూ ఉండేవారు. ఈనాడు పత్రిక ప్రారంభ సమయంలో ఆ పత్రికకు వెన్నెముకలా నిలబడ్డ సుమారు పదిమంది ఉద్దండులలో వి.హెచ్ ఒకరు.

ఆర్థిక అంశాలను రాజకీయ అంశాలను విడగొట్టి బడ్జెట్ వార్తలు ఇచ్చే పద్ధతిని చెప్పేవారు. చట్టసభల వార్షిక బడ్జెట్‌లను అక్షరం వదలకుండా అధ్యయనం చేసిన వ్యక్తి అని చెప్పవచ్చు. అసెంబ్లీ, పార్లమెంట్ వార్షిక బడ్జెట్ లపై వివరాణాత్మక సమాచారం అందివ్వడంలో, విశ్లేషించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన సరళమైన భాషకు, నిజాయితీకి నిలువెత్తు వ్యక్తి. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలపై ఖచ్చితమైన డేటాను అందించడంలో ఆయన అందె వేసిన చెయ్యి. ఆయన రచనలు పలు రంగాల వారిని ఆలోచింపజేసేవి.

హనుమంతరావు కమ్యూనిస్ట్ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య వద్ద స్టెనోగా చేరి, ఆతరువాత జర్నలిజం వృత్తిలో ప్రవేశించి అంచలంచెలుగా ఎదిగి వివిధ పత్రికల్లో వివిధ హోదాలకు ఎదిగి తన ప్రతిభ చాటుకున్నారు. అనుభావిక డేటా ఆధారంగా వార్తాకథనాలు రాయడంలో ఆయన నిపుణుడు, తెలుగులో డెవలప్‌మెంట్ జర్నలిజంలో మార్గదర్శకుడు. జర్నలిజం పాఠశాలను వార్తా సంస్థ, డేటా న్యూస్ ఫీచర్స్ (డి ఎన్ ఎఫ్) ను నెలకొల్పి, డేటాను వివరించే అభివృద్ధి జర్నలిజంలోకి యువta ప్రవేశించడానికి ఆయన కృషి అపారం. రాజకీయ, పాత్రికేయ రంగాలలో పలువురు సీనియర్లు ఆయన అభిమానులున్నారంటే ఆర్థిక, రాజకీయ సామాజిక, గ్రమీణ వ్యవస్థలపై ఆయనకున్న పట్టు తెలుపుతుంది. ఆయన చెప్పింది ఆథెంటిక్.

హనుమంత రావు మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రా ప్రావిన్షియల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఎ పి యు డబ్ల్యు జె) వ్యవస్థాపక సభ్యుడు. మాజీ ప్రధాన కార్యదర్శి, యూనియన్ జీవితకాల సహచరుడు, వయోధిక పాత్రికేయ సంఘం వ్యవస్థాపకులలో ఒకరు. ఆ సంఘానికి ఉపాధ్యక్షులుగా దీర్ఘకాలం సలహాలు అందించడమే గాక అన్ని కార్యక్రమాలకూ హాజరయ్యేవారు. సామాజిక, ఆర్థిక సమస్యలపై రాయడానికి పలువురు యువకులను ప్రోత్సహించారు.

వి హెచ్ తో అనుబంధం

ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభానికి ముందు హైదరాబాద్ వచ్చిన నాకు పరిచయమయ్యారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నెల రోజులు పైగా లో మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రాం ఆశ్రయంలో ఉన్నప్పుడు ప్రస్తావనకు వచ్చిన అనేక విషయాలలో బడ్జెట్ ఒకటి. ఆయన దగ్గర ఉన్న అయిదారు మంచి ఇంగ్లీష్ పుస్తకాలు నాకు ఇచ్చి చదవమనేవారు. అయన కూడా వివరించేవారు. ఆ సందర్భంలో డి ఎన్ ఎఫ్ హనుమంతరావు గురించి చెప్పేవారు. ఆయనతో పరిచయం పెంచుకుంటే, వారి అపార అనుభవ పాఠాలతో పత్రికా రంగంలో నిలదొక్కుకోవడం సులువని చెప్పేవారు. ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు సతీష్ బాబు ద్వారా వి హెచ్ పరిచయమయ్యారు.

ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా - మళయళ మనోరమ సంయుక్తంగా కేరళ, కొట్టాయంలో “పార్లమెంట్, బడ్జెట్ రిపోర్టింగ్” పై జాతీయ స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకులు ప్రకాశరావు వర్క్ షాప్ గురించి పత్రికలకు సమాచారం పంపినప్పుదు, నేను పాల్గోనడానికి ఉత్శాహం చూపగా వి హెచ్, ఏ బి కె సంయుక్తంగా ప్రోత్సహించి బ్యూరో చీఫ్ ఐ వెంకట్రావుకి నా పేరు సిఫారసు చేసారు.

ఆ సదస్సులో జాతీయ స్థాయిలో పాతికమంది పాత్రికేయులు హాజరైన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్న ఏకైక తెలుగు పాత్రికేయుడు కావడం పాత్రికేయ జీవితంలో ప్రథాన ఘట్టం. దాదాపు పదిమందికి పైగా జాతీయస్థాయి పత్రికా ప్రముఖులు, కేరళ, అసెంబ్లీ పార్లమెంట్ నుంచి అనుభవజ్ఞులైన కీలక వ్యక్తులు పాఠ్యాంశాలు బోధించడం, వృత్తిపరంగా ఎంతో దోహద పడింది. కేరళ నుంచీ మూడు రోజులపాటు వర్క్ షాప్ వార్తలను ఆంధ్రజ్యోతి బై లైన్ తో ప్రచురించడం గర్వం. ఆరు నెలల పాటు ఆంధ్రజ్యోతి కామర్స్ పేజీ బాధ్యతలు నిర్వహించడానికి దోహద పడింది. అందుకు వి.హెచ్ – ఏ.బి. కె. కారకులు.

(నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్)

Read More
Next Story