విద్వాన్ విశ్వం ‘పెన్నేటి పాట’.. ‘రాయలసీమ’ కన్నీటి పాట
x

విద్వాన్ విశ్వం ‘పెన్నేటి పాట’.. ‘రాయలసీమ’ కన్నీటి పాట

విద్వాన్ విశ్వం (1915 అక్టోబరు 21 - 1987 అక్టోబరు 18) రాఘవ నివాళి


నేడు, అక్టోబర్ 21, విద్వాన్ విశ్వం జయంతి


విద్వాన్ విశ్వం (విద్వాన్ విశ్వం, (1915 అక్టోబరు 21 - 1987 అక్టోబరు 19) అనగానే, ‘‘కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచూ..కోటి గుండెల కంజర కొట్టుకొనుచూ..వినిపింతునింక రాయలసీమ కన్నీటి పాట..’’ అంటూ గానం చేసిన ‘పెన్నేటి పాట’ గుర్తుకు వస్తుంది.

అనంత జనజీవన రాగాలను మీటిన ‘మాణిక్య వీణ’ గుర్తుకు వస్తుంది. బాణుడి ‘కాదంబరి’ , కాళిదాసు ‘మేఘసందేశం గుర్తుకు వస్తాయి. కవి, రచయిత, అనువాదకుడు, పండితుడు, పండిత పాత్రికేయుడు మాత్రమే కాదు, విద్వాన్ విశ్వం స్వాతంత్య్ర సమరయోధుడు.
అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలోని ఒక పండిత కుటుంబంలో 1915 అక్టోబర్ 21న పుట్టిన మీసరగండ విశ్వరూపాచారి, అదే గ్రామానికి చెందిన కమ్యూనిస్టు యోధుడు తరిమెల నాగిరెడ్డికి బాల్య మిత్రుడు. మద్రాస్ (చెన్నై)లో విద్వాన్ పూర్తి చేశాక విద్వాన్ విశ్వంగా రూపాంతరం చెందారు. ‘‘మనం ఇళ్ళ పేర్ల పడవలే కాదు, కులాల పేర్ల పడవ లెక్కి ప్రయాణం చేయడానికి అలవాటు పడ్డాం. ఆ అవసరం విశ్వంగారికి లేదు.’’ అని పురాణం సుబ్రమణ్యం శర్మ అంటారు.
‘‘విశ్వం గారొక్కరే ఇంటి పేరు వదిలేసి, విద్వాన్ విశ్వంగా నాలుగు చెరగులా జయించుకు వస్తున్నారు.’’ అని పురాణం ఊరికే అనలేదు. చదువుకునే రోజుల్లోనే కమ్యూనిస్టు సాహిత్యం వైపు బాగా మొగ్గుచూపారు. అందుకు తరిమెల నాగిరెడ్డి సహచర్యం ఎంతగానో దోహదం చేసింది.
విద్వాన్ విశ్వం జీవితానికొక సరైన అర్థం కోసం అన్వేషిస్తున్న సమయంలో స్వాతంత్ర్యోద్యమం ఆకర్షించింది. కాంగ్రెస్ పార్టీలో చేరి, అనేక మార్లు జైలుజీవితాన్ని గడిపారు. నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ లో చేరే నాటికే విశ్వం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
విద్వాన్ విశ్వం జీవితమంతా ఎడారి ప్రాయాణమైపోయింది. రాజకీయాలతో మొదలై పత్రికారంగానికి పరిమితమయ్యారు. తెలుగు ‘మీజాన్’ దిన పత్రికలో ఉప సంపదాకుడుగా చేరి, విజయవాడలో ‘ప్రజాశక్తి’ కి మారారు. ప్రజాశక్తిలో పనిచేస్తున్నప్పుడు చండ్రరాజేశ్వరరావు వంటి కమ్యూనిస్టు నాయకులతో కలిసి ఉండగా, ఆ కాలనీమీద దాడి జరగడంతో చెట్టుకొకరు, పుట్టకొకరు అయిపోయారు. యూనియన్ సైన్యాలు 1948లో హైదరాబాద్ ను చుట్టముట్టడంతో ‘ప్రజాశక్తి’ మూతపడింది. దాంతో విద్వాన్ విశ్వం తన మకాం మద్రాస్ కు మర్చారు.
విద్వాన్ విశ్వం కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పిల్లల మనస్తత్వం పై పరిశోధన చేశారు. నాటి రష్యాని ప్రేమించారు. గోర్కీని, చెహోవ్ ను అనువదించారు. ఫ్యాసిజాన్ని ద్వేషించారు. లెనిన్ మీద, స్టాలిన్ మీద పుస్తకాలు రాశారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం నవ్వుతూనే నలిగిపోయారు.
ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్ర జ్యోతి వంటి దిన, వార పత్రికల్లో పనిచేశారు. ఏపత్రికలోనూ నిలకడ లేని జీవితం. ఆత్మాభిమానాన్ని చంపుకోలేకపోయారు. ఎవరినీ సంతృప్తి పరచలేకపోయారు. సాహిత్యాన్ని అధ్యయనం చేసి, ఆధునికతను ఆకళింపు చేసుకున్నారు. సంప్రదాయాన్ని అంగీకరించినా, చాందసాన్ని అంగీకరించలేదు. ఆధునికతను ఆహ్వానించినా, ఆర్భాటాన్ని అనుమతించలేదు.

పాండిత్యంతో పాటు సృజనాత్మక శక్తి , తార్కికత, విమర్శనా శక్తి కలగలిసిన వ్యక్తిగా తెలుగు పత్రికారంగంలో నార్ల తరువాత విద్వాన్ విశ్వం తప్ప మరొకరు లేరనడం అతిశయోక్తి కాదు. నార్ల వారి మాటామంతి, పిచ్చాపాటి వ్యాసాలలో సైతం లోపాలను ఎత్తి చూపగల ధీశాలి విద్వాన్ విశ్వం.
విద్వాన్ విశ్వం తన పదిహేనవ ఏటనే కవిత్వం రాయడం మొదలు పెట్టారు. విరికన్నె, నా హృదయం ఒకనాడు, పెన్నేటి పాట వంటి ఎన్నో కావ్యాలు రాశారు. పెన్నేటి పాటను తెలంగాణా రచయితల సంఘం 1955లో ప్రచురించించింది. రాయలసీమ జీవన నేపథ్యంలో వచ్చిన ఏకైక కావ్యం ఇది. తన జీవితానుభవం నుంచి రాయలసీమ దైన్యాన్ని పరిశీలించినప్పుడు జనించిన తీవ్ర నిర్వేదమే పెన్నేటి పాట.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని దాశరథి అంటే ‘రాయలసీమ పచ్చల బజారు. జుమ్మని మ్రోయు మించుల సితారు’ అంటారు విద్వాన్ విశ్వం. రాయలసీమ అంటే చాలు విద్వాన్ విశ్వంకు పూనకం వస్తుంది. అది ప్రాంతీయ తత్వం కాదు, తన నేల తల్లి మీద ఉన్న మమకారం. పెన్నేటి పాట ప్రాచీన ఆధునిక రీతుల మేలుకలయిక. రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ దీనికి ముందుమాట రాశారు.
పెన్నేటి పాటకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వాలని కృష్ణ శాస్త్రి రాశారు. ఆ అవార్డు రాకపోయేసరికి కృష్ణ శాస్త్రి చాలా బాధపడిపోయారు. విశ్వం ప్రాచీనులలో ప్రాచీనుడు, ఆధునికుల్లో ఆధునికుడు. పెన్నేటి పాటలో రాయలసీమ మాండిలికాలను విరివిగా వాడారు.
విద్వాన్ విశ్వం కాళిదాసు ‘మేఘ సందేశం’ కావ్యాన్ని అనువాదం చేసినప్పడు, దానిక రాసిన ప్రవేశికలో ‘‘అల్పుడను స్వామీ! నేనింత రసానుభూతిని భరించలేను. అందాలను పంచిపెట్టి పుట్టిన వాడను కాను. అందుకే వేడుకుంటున్నాను-నన్ను నీ అమేయ భావనా బలంతో వివశుని చేయకు. నా పిచ్చిక గూళ్ళను నన్ను కట్టుకోనియ్యి.’’ అని అంటారు. విశ్వం కట్టినవి మామూలు పిచ్చిక గూళ్ళు కావు, అవి బంగారు పిచ్చిక గూళ్ళు. కాళిదాసు మేఘసందేశానికే మెరుగులు దిద్దిన మహా పండితుడు విద్వాన్ విశ్వం.


ప్రపంచ సాహిత్యంలోనే ఒక విశిష్ట రచనగా మిగిలిపోయిన సంస్కృతంలో బాణభట్టు రాసిన ‘కాదంబరి’ వచన కావ్య అనువాదం విద్వాన్ విశ్వంకు చాలా మంచి పేరు తెచ్చింది. ఏడవ శతాబ్దంలో రచించిన కాదంబరి భారతీయ సాహిత్యంలో వచ్చిన తొలి వచన కావ్యం. దాన్ని తొలి నవల అని కూడా అంటారు. ఎంతో కవితాత్మకంగా సాగే ఒక్కో వాక్యం పదిపన్నెండు పుటలుంటుందట. అలాంటి కావ్యాన్ని చిన్న చిన్న వాక్యాల కింద విడగొట్టి కవితాధార ఏమాత్రం చెడకుండా, అనువాదం చేయడం విద్వాన్ విశ్వంకు తప్ప అన్యులకు సాధ్యం కాదని పలువురు సంస్కృత పండితుల వ్యాఖ్య .
కవిగా పెన్నేటి పాట, కాలమిస్టుగా మాణిక్య వీణ విద్వాన్ విశ్వంకు ఎంత ఖ్యాతి తెచ్చాయో, ఒక్క కాదంబరి అంతకు మించిన ఖ్యాతి తెచ్చిపెట్టింది. కాదంబరిలో ఎంతో ఉన్నత మైన వ్యక్తిత్వం కల కాదంబరి పాత్ర అంటే విశ్వంకు ఎంత ఇష్టమంటే, తన కూతురుకు కాదంబరి అని పేరుపెట్టుకున్నారు. ‘కాదంబరి చదివిన రసాస్వాదనలో పరవశులైన వారికి ఆహారం మాత్రం రుచిస్తుందా?’ అన్నది ఒక నాటి పండితుల భావన.
విద్వాన్ విశ్వంలాంటి మరో వ్యక్తి తెలుగు పత్రికా రంగంలో లేరంటే అతిశయోక్తి కాదు. పెన్నేటి పాటలోని ఈ కింది చరణాలు రాయలసీమ గురించిన విద్వాన్ విశ్వం హృదయ వేదనకు అద్దం పడతాయి.
‘అదే పెన్న! అదే పెన్న! నిదానించి నడు
విదారించు నెదన్, వట్టి ఎడారు తమ్ముడు!’
‘ఏదీ నీరు?ఏదీ హోరు? ఏదీ నీటి చాలు?
ఇదే నీరు! ఇదే హోరు ! ఇదే ఇసుక వాలు!’

‘ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో?
ఇంత మందిని కన్న తల్లి ఎందుకిట్లు మారెనో?’

‘దైవమా; ఉంటివా? చచ్చినావ నీవు?
ధర్మమా; గెంటిరా? నిన్ను ధరణి నుంచి?
సంఘమా; తలకెక్కెనా? సన్ని నీకు?
హృదయమా మానవుడు నిన్ బహిష్కరించె!
చచ్చె నీ లోకమున నాత్మ సాక్షి యనుచు
నెత్తినోరిడి కొట్టుకోనిండి నన్ను’



Read More
Next Story