తిరుపతి సమీపంలో అద్భుతం ‘ఉప్పసట్టి- పప్పు సట్టి’
x

తిరుపతి సమీపంలో అద్భుతం ‘ఉప్పసట్టి- పప్పు సట్టి’

అప్పటి రాజులు , రాణులు ఇంత ఎక్కుడు ఎక్కి ఎట్లా వచ్చినారో ఏమో ? ఏమి సౌందర్య కాంక్షవారిది ? ఆక్షణం విజయనగర రాజుల కాలంలోకి పోయి ఆ వైభవాన్ని నెమరేసుకునేలా చేస్తుంది


-భూమన్ *

తిరుపతికి చంద్రగిరి వొక అద్భుతమయిన చారిత్రాత్మక ప్రదేశం. అక్కడి కోట అంటేనే వొళ్లు పులకిస్తుంది. చిత్తూరు నుండి తిరుపతి వచ్చేప్పుడు కనిపించే కట్టడంలాంటి ఆరాతి కొండ చూపరులను అబ్బురపరుస్తుంది. భువనగిరిలో ఉన్నట్టుగా ఇక్కడకూడ ROCK CLIMBING ఏర్పడితే బావుణ్ణునని ఎన్నాళ్లగానో కలలు కంటున్నాను.




చంద్రగిరి అంటూనే ఏడుసార్లు తిరుమల కొండకు వచ్చి అనేక ఆభరణాలు సమర్పించిన శ్రీకృష్ణదేవరాయులు గుర్తుకొస్తాడు. తిరుమల ఆలయంలోని శ్రీకృష్ణదేవరాయలు , దేవేరులతో కూడ విగ్రహాలు , అచ్యుతరాయలు , వెంకటపతిరాయలు విగ్రహాలు గుర్తొస్తాయి.





ఎన్నో విలక్షణ చారిత్రకఘట్టాలకు నిలువెత్తు నిదర్శనం ఈ కోట. చక్కటి ప్రకృతి పరిసరాల మధ్యన , రొడ్డువార కోటగోడ , చూపుకందే ఉరికంబం , ఎత్తయిన శిఖరంతో భలే ఆకర్షిస్తుంది. ఈ కోట. కోటలో ఆంజనేయుల గుడి దగ్గర నుండి. రాజమహాల్ వరకు చూసినన్ని చారిత్రాత్మక విశేషాలు అబ్బుర పరుస్తాయి. కొన్ని పదులసార్లు చంద్రగిరికి , ఉరికంబంకు పోయొచ్చినా తనివి తీరని కోట ఆకర్షణ చంద్రగిరికోట.




కోట పైభాగాన ఉప్పుపట్టి - పప్పుసట్టి అనే ప్రదేశం ఉంది. అక్క ఎన్ని సార్లు పోయినా , ఈమారు పోవటం మరింత ఉత్సాహాన్నిచ్చింది.

ప్రతిసారీ ఉరికంబందారి గుండా నైనా , ఏనుగుల మండపుదారి గుండానైనా ఎక్కేవాళ్లం. ఈ సారి చంద్రగిరి కోట అధికారి ప్రవీణ్ , ‘సార్ ! చిరంజీవిని గైడుగా పంపుతాను , తీసికెళ్లండి,’ అంటే 20 మంది అతణ్ణి రమ్మని దారితీసినాము.




రాజమహల్ ని పదే పదే చూస్తూ , కాసిరాయి , మట్టి , ఇసుక , సున్నంతో కట్టిన ఆభవంతి వొక్కచెక్కముక్కలేకుండా ఎంత అద్భుతంగా రాణిస్తున్నదో ! రాజమహాలకు ఉత్తరం వైపున్న పెద్ద తామరకొలను. అక్కడికి వెనక భాగంలో బాగా బల్లపరుపుగా వుండే రాతిపరుపు మీదుగా పోతే దూరం తగ్గుతుందని చిరంజీవి పట్టుబట్టినాడు. ఏందయ్యా సర్రున జారేట్టుగా ఉ ందంటే , మీకెందుకు సార్ నాతో రాండని ధైర్యం చెబుతూ , క్రాస్ నడవమని హెచ్చరికలు చేస్తూ సులువుగా నే ఎక్కెట్టుగా చేసినాడు. అడుగులు భద్రంగా , బిగువుగా వేస్తూ ఎక్కటంవల్ల సాధ్యమయింది. అంతా ఎక్కుడే. మధ్య మధ్యలో కిందికి చూస్తే అద్భుతమయిన కోటకట్టడాలు , చుట్టూతా చూసినంత మేరా చూపుకందనంత సౌందర్యం.




మార్గంలో తొలిదర్వాజ అద్భుతమయిన శిల్పసంపదతో ఉంది. విజయనగర రాజులు సామాన్యులుకాదు రా స్వామీ అనుకున్నాము. కళలు , శిల్పం , సంగీతం , సాహిత్యం అంటే ఎంత పిచ్చిప్రేమ వారికి. గడపకు ఆ పక్కా ఈ పక్కా దశావతారాలు చెక్కి ఉన్నారు. పూలు , సింహాకారాలు , కోతులు ఆకారాలు ఆ దర్వాజా నిండుగా ఉన్నాయి. పెద్ద పెద్ద కొయ్యతలుపులు ఉన్నట్టుగా గుర్తులున్నాయి. పులిజూదం , పాచికలాటలు ఆడినట్టు గుర్తులున్నాయి. అక్కడ గడిపినంతసేపూ తనివితీరా గడిపి పైకి కదిల్తే మరికొంత ఎత్తులో ఇంకో ద్వారం. ఇక్కణ్ణించిచూస్తుంటే రాజమహలు , గుళ్లు , గోపురాలు , కొండలు , కోనలు , తోటలు , ఊళ్లు అద్భుతంగా కనువిందుచేస్తున్నాయి. ఇక్కడ నుండి చూస్తే కుడి పక్క ఎగువన ఒక నునుపాటి పెనుబండకు అతికించనట్టుగా దర్గా. అక్కడికి తప్పక పోవల్సిందేననుకుంటూ రెండో ద్వారం దాటుకున్నాము. దాటగానే ఆంజనేయుడు స్వాగతం చెబుతున్నట్టుగా చక్కటి విగ్రహం.




అక్కడ నుండి కుడిపక్కన పోగానే ఇంకో ద్వారం. ఇది మూడోది. పాములు. ఉడుములు రక రకాల బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. చుట్టూ నిధుల కోసం తవ్వకాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. ఇక్కడే ఏవో దేవుళ్ల గుళ్లు ఉన్నట్లుగా ఆనవాలు ఉన్నాయి. అక్కడనుండి ఎగువకు పోతూంటే బండలపైన పాదాలు , మంచం ఆకారంలో ఒక బొమ్మ ఆకారం చూపించి చిరంజీవి ఇవి శ్రీవేంకటేశ్వరుడి పాదాల్సార్ , ఇదిగో ఇక్కడే పద్మావతితో నిద్రజేసిందని పూనకంతో కథ కథలుగా చెప్పినాడు. ఇక్కడే వెలసి ఉండవల్సిందట , స్థావరం నచ్చక తిరుమల వెళ్లిపోయినాడట స్వామి. దాన్నానుకొని చూడ చక్కటి కోనేరు. దీన్ని మంగలికోనేరు అని పిలుస్తారట.




ఈ తటాకానికి ఓ మూలన దేవుళ్ళ బొమ్మల కొలువు చూపించి టెంకాయ కొట్టి పూజలు చేసినాడు. దీని అంచునే మహ్మదీయుల శిల్ప చాతుర్యంతో కట్టిన నరూజుకట్ట ఉంది. అంతా శిథిలమయిన కొంచెం గోడ కనిపిస్తున్నది. అక్కడ కొండంతా సమతలంగా ఉంది. అక్కడ కూడా అప్పటి సైనికుల నివాసస్థలాలని చూపించినాడు. అక్కడ నుండి వెనక్కి వస్తే మెట్ల వరస మీదుగా గంభీరంగా నాలుగో ద్వారం కనిపించిది. దాన్ని దాటగానే చుట్టూతా బండలమీద గుళ్లు , మండపాలు , నివాసస్థలాలు , పశువుల కొట్టాలు మధ్యలో తామరకొలను మహాద్భుతంగా ఉన్నాయి. అంత విశాలమయిన బండరాతి పలక కొన్ని ఎకరాలుంటుంది.




అప్పటి రాజులు , రాణులు ఇంత ఎక్కుడు ఎక్కి ఎట్లా వచ్చినారో ఏమో ? ఏమి సౌందర్య కాంక్షవారిది ? ఆక్షణం విజయనగర రాజుల కాలంలోకి పోయి ఆ వైభవాన్నంతా నెమరేసుకున్నాను. పైగా కోటలంటే నాకు మితి మీరిన ఇష్టం. దేశంలోనివే గాకుండా , ప్రపంచంలోని అనేక కోటల్ని చూసివచ్చిన వాణ్ణి. ఆ కలవరం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. పైన ఒక కట్టడానికి తాక్కుంటూ ఎగబాకిన చెట్టు నీడ ప్రతి సారీ నా ఆసరా. అందరం దాని కింద చేరి తెచ్చుకున్న అల్పాహారమేదో తిని చుట్టూ చూస్తూ కొంచెం పైభాగాన ఉన్న ఉప్పుపట్టి - పప్పుపట్టి దగ్గరికి చేరుకున్నాము. ఒక భూగృహంలాంటిది. అంతకుమునుపెన్నడో రెండుమార్లు దిగి చూసినాను గనుక ఈ మారు రిస్క్ ఎందుకని దిగలేదు.

వొక్కరొక్కరే దిగి చూసి పరమానంద పడిపోతున్నారు. సీసాల్లో నీళ్లు పట్టి తెచ్చుకునే వారు తెచ్చుకుంటున్నారు. దిగిచూస్తే రెండు అరలుంటాయి. ఒక అరనీరు ఉప్పంగాను , ఇంకో దాంట్లో తియ్యంగాను నీళ్లుంటాయి. ఇక్కడ గాని నీళ్లు ఎండిపోతే చంద్రగిరి నీటికి కట కటలాడవల్సిందేనని చిరంజీవి ఉవాచ.




అక్కడ నుండి దక్షిణం వైపుకు వస్తే వారంగా ఒక చెట్టు భలేగా ఉంది. కొంచెం సేపు ఆ చెట్టు నెక్కి కిందికి చూస్తే భీతిగొలిపేంత వార. అక్కడ నుండి కదిలే కొండచీలిక. ఇక్కడే బతుకు భారమనిపించి ఆత్మహత్యలు చేసుకుంటారట. దీన్ని SUICIDE SPOT అన్నాడు చిరంజీవి.

తిరుపతి మార్గంలో కనిపించే పెద్ద రాతి బండపలక దిగువన ఉంది. దాని పై భాగాన మేం నడుస్తున్నామన్న స్పృహే గొప్ప థ్రిల్లింగ్ గా ఉంది. అక్కడ నుండి కొంచెం దింపి నాటి రాజుల ఆయుధాగారాన్ని చూపించినాడు. వెనుతిరిగి వచ్చిన దారిలో కాకుండా మరొక దగ్గర దారుందని పేటుకు ఆనుకుని వున్నా దర్గా దగ్గరికి పిలుచుకుని పోయినాడు.




కిందికి చూస్తేనే భయం భయంగా ఉంది. ఒక చెట్టు నెక్కించి దిగమంటాడు. ఎక్కిదిగి నానుగాని అక్కడ నుండి రాతి బండ మీదుగా దిగటం అత్యంత ప్రమాదకరమనిపించి వద్దులే చిరంజీవి , ఇంకోసారెపుడయినా తాళ్లు తెచ్చుకుని దిగుదామని వచ్చినదారి పట్టినాము. కొంచెందూరం దిగినామోలేదో పశువుల గుంపొకటి వేగంగా పరుగెత్తుకుంటూ వస్తున్నాది. పల్లెల్లో వాళ్లు వదిలేసిన ఆవులంట. కొమ్ములు పొడుచుకుని భీకరంగా , అడవి జంతువుల మాదిరిగా భయపెట్టినాయి. అవేంచేయవు. సాధువులేనని , కొత్తవారిని చూస్తే అట్లా బెంబేలెత్తి పరుగులు పెడుతున్నాయని చిరంజీవి అందరికి ధైర్యం చెబుతూ అతితొందరగా దిగేట్టు మాటల్లో ఊపిరి పోసినాడు నడకకు.

ఆ రకంగా ఈ కొత్తదారిలో మా ఉప్పుపట్టి విజ్ఞానదాయకంగా ముగిసింది.

-

పప్పుసట్టి ట్రెక్కింగు మహా అద్భుతంగా , వైభవంగా సాగింది.


(*భూమన్, చరిత్రపరిశోధకుడు, ఉపన్యాసకుడు, రచయిత, ట్రెకింగ్ యోధుడు)

Read More
Next Story