మండే ఎండ- వణికించే చలిలో కుమారధార - శక్తికటారి సాహసయాత్ర
x

మండే ఎండ- వణికించే చలిలో కుమారధార - శక్తికటారి సాహసయాత్ర

తిరుపతి నుంచి 58 కిలో మీటర్లు ద్విచక్రదహనాల్లో ప్రయాణించాలి. అక్కడి నుంచి మొత్తం ఆరుగంట నడక...



(ఆలూరు రాఘవశర్మ)

బండలపైనుంచి దుముకుతున్న జలపాతాలు. నీటి గుండాలను నింపుతూ, గులకరాళ్ళ కింద నుంచి సాగుతూ, గలగలా పారుతూ, ఒక్కో చోట ఒక్కో విధంగా సవ్వడి చేస్తోంది. రెండు ఎత్తైన కొండల నడుము ఈ ఏరు ఎన్ని అందాలను సంతరించుకుందో! ఆ లోయలో పది నీటిగుండాలూ అడవి అందాలను చూసి పరవశించిపోతున్నాయి. బయట నిప్పులు చెరిగే ఎండలు..! లోయలో గజగజా ఒణికించే చలి..! కుమార ధార - శక్తి కటారి మధ్య ఎన్ని అద్భుతాలు..! ఎన్ని ప్రకృతి సోయగాలు..!

కుమారధార-శక్తికటారి మధ్య నీటి గుండాలను ఈదుకుంటూ, పెద్దపెద్ద బండ రాళ్ళను ఎక్కుతూ దిగుతూ సాగడమంటే నిజంగా సాహనమే. ఈ సాహ సానికి శనివారం రాత్రి 8 గంటలకు మధు సైరన్ ఊదాడు. ఆదివారం ఉదయం అయిదు గంటలకల్లా అలిపిరికి చేరుకున్నాం.

అయిదుగురు పిల్లలు సహా అంతా ఇరవై మందిమి. పిల్లలు ఎక్కడివరకు రాగలిగితే అక్కడి వరకు వస్తారు. వాళ్ళు పిల్లలు కాదు పిడుగులు. వారిలో కొందరు జాతీయ స్థాయి స్విమ్మర్లు.

వాతావరణం సమతౌల్యంగా ఉంది. మా వాహనాలు తిరు మల ఘాట్ రోడ్డులో సాగుతుండగానే తెలతెలవారుతోంది. పైకొచ్చేసరికి 'తూర్పు భళ్ళున' తెల్లవారింది. తిరుమలలో ధర్మగిరి వద్దకు వచ్చేసరికి అరుగంటలైంది. చిరు చలి మొదలైంది. మా వాహనాలకు ఒక అడవి పంది అడ్డం వచ్చింది. కాస్త ఆగాం. దాని దారిన అది వెళ్ళిపోయింది. దారి పొడవునా ఏనుగు విసర్జితాలు. నిన్ననో, మొన్ననో పెద్ద సంఖ్యలో ఏనుగులు ఈ ప్రాంతంలో తిరుగాడినట్టున్నాయి.
దారంతా మట్టి, రాళ్ళతో, ఇనుకతో, ఎగుడుదిగుడుగా ఉంది. మా ద్విచక్రవాహనాలు ఎగిరెగిరిపడుతున్నాయి. ఒళ్ళంతా హూనమైపోతోంది. మా ప్రయాణం గుర్రపు స్వారీని తలపిస్తోంది. కొన్ని వాహనాలు ఆగిపోతున్నాయి, అదుపు తప్పుతున్నాయి. అతి కష్టంపైన సాగుతున్నాయి.

పులకించిపోయేలా రకరకాల పక్షల పలకరింపులు. ఎండిపోయిన బోద రోడ్డుకు ఇరువైపులా గాలికి తలలూపుతోంది. ఎండిపోయిన ఓ రెల్లు నన్ను సుతారంగా తాకింది. మా అమ్మ తల నిమిరి నట్టు అనిపించింది. ఒక చెట్టు కొమ్ము నా చెంప చెళ్ళు మనిపించింది. ఆగి వెనక్కి చూశాను. 'అయ్యో తగిలిందా!' అన్నట్టు జాలిగా చూసింది నా వైపు. తగిలింది నాకా, నీకా అనుకున్నాను. ఒక సన్నని వెదురు పుల్ల రోడ్డు పైకొచ్చి , స్కూల్లో అయ్యవారి బెత్తంలాఊ గుతూ కనిపించింది. ఎంత అడవి! ఎంత సౌందర్యం! ఎంత ప్రకృతి వైవిధ్యం!


కుమార ధార, పనుపుధార ప్రాజెక్టుల వద్దకు వచ్చేశాం. మండు వేసవిలోనూ నీళ్ళున్నాయి. అక్కడే మా వాహనాలను నిలిపి లోయలోకి దిగడం ప్రారంభించాం. రెండు కొండల నడుము ఏరు పెద్ద ఎత్తున ప్రవహించిన ఆనవాళ్ళు. దారి పొడవునా పెద్ద పెద్ద బండరాళ్ళు. రాళ్ళ కింద సన్నగా ప్రవహిస్తున్న జలధార. ఏటవాలుగా పరుచుకున్న బండ పైనుంచి చక చ కా లోయలోకి దిగేశాం. ఉదయం ఏడున్నరకల్లా కుమార ధార ముంగిట వాలిపోయాం.

ఒక పెద్ద కుండ లాంటి కుమారధార. దానికి దక్షిణ దిశగా పెద్ద చీలిక నుంచి చిన్న జలపాతం. ఇక్కడికి ఎన్ని సార్లు వచ్చినా, దీన్ని ఎన్ని సార్లు చూసినా తనివి తీరడంలేదు. దాని సోయగంలో తన్మయులైపోయాం. అల్పాహారం ముగించుకుని ఆ జలపాతం సాగే వేపు మా నడక మొదలైంది.


కుమార ధార లోకి దిగుతున్న తీరు


ఉదయం ఎనిమిదవుతోంది. అప్పటి వరకు వాతావరణం మామూలుగానే ఉంది. దగ్గరగా వచ్చిన రెండు కొండల నడుము నుంచి ఏరు పారుతోంది. ఆ కొండల మధ్యలో ఉన్న పెద్దపెద్ద బండరాళ్ళను ఎక్కుతూ, దిగుతూ సాగుతున్నాం.



లోయలో రెండు కొండల మధ్య సాగుతున్న వైనం


తొలి నీటి గుండం వచ్చేసింది. మా బ్యాగులు అక్కడే కొండ అంచున పెట్టి, బరువును దించేసుకున్నాం. నీళ్ళలో దిగక తప్పలేదు. నీళ్ళలో దిగే సరికి అవి జిల్లుమన్నాయి. తొలి మునకే ఇబ్బంది. గులక రాళ్ళ కింద నుంచి ఏరు పారుతోంది. వాటిపైన నడుస్తూ సాగుతున్నాం. మరికాస్త దూరం నడిచేసరికి మరో నీటి గుండం. ఈదుకుంటూ ఆవలికి చేరాం. కొండ అంచునే మర్రిచెట్టు ఊడలు వేలాడుతూ నేలకు తాకుతున్నాయి.


కుమార ధార తీర్థదినానికి ప్రతి ఏడాది నిచ్చెనలు ఏర్పాటు చేస్తారు. నీటి ఉదృతికి అక్కడి వరకు ఇనుప నిచ్చెనలు కొట్టుకు వచ్చాయి. అవి మామూలు నిచ్చెనలు కావు. పదిపదిహేను మంది పడితే తప్ప కదలనంతటి లావు నిచ్చెనలు. కొన్ని నిచ్చెనల్లో పెద్దపెద్ద రాళ్ళు ఇరుక్కుపోయాయి. నిచ్చెనల విడిభాగాలు కొన్ని కొట్టుకొచ్చాయి. ఒక చెట్టు కాండం రెండు కొండలనడము అడ్డంగా ఇరుక్కుపోయింది.


కొండ అంచున గుహ లో ప్రకృతి ప్రియులు


కొండ అంచులకు చొచ్చుకుపోయి గుహలా ఉన్న ప్రాంతాలు. ఆ గుహలో దాక్కున్న ఒక విలువైన బండ రాయి తెల్లగా మెరుస్తోంది. మెలికలు తిరిగిన ఒక చిన్న జలపాతం కింద ఉన్న నీటి గుండంలోకి దుముకుతోంది. ఒక తాడును పెద్ద బండరాయికి కట్టి ఆ జలపాతంతో పాటు నీటిగుండంలోకి వదిలారు. దాన్ని పట్టుకుని, గుండంలో నిలబడిన ఒకరి సాయంతో జాగ్రత్తగా గుండంలోకి దిగేశాం. బండ నిండా పాకుడు.


మరి కాస్త ముందుకు వెళ్లే నరికి ఒక మహావృక్షం కూలి రెండు కొండల నడుము ఇరుక్కుపోయింది (ఫీచర్). దాని కింద నుంచి ఏరు సన్నగా పారుతోంది. పిల్లలు సరదాగా అచెట్టు కాండం పైకెక్కి కూర్చున్నారు. పిల్లల్తో పాటు నేను కూడా ఆ చెట్టుకాండం ఎక్కి బాల్యపు సరదా తీర్చుకున్నాను. దగ్గరగా వచ్చిన రెండు కొండల నడుము ఎదురుగా దురో నీటిగుండం. ఏటవాలుగా బండ పైనుంచి జలపాతం గుండంలోకి జారుతోంది. అంతా పాకుడు పట్టిన బండ. పెద్ద వాళ్ళం కూడా చిన్నపిల్లలైపోయాం. ఆ పాకుడు పట్టిన ఏటవాలు బండపై కూర్చుని జారుడు బండలా జర్రున జారుతూ నీ టి గుండంలోకొచ్చి పడిపోయాం. గండాన్ని ఈదుకుంటూ ముందుకు సాగిపోయాం.


తాడు పట్టుకుని నీటి గుండంలోకి దిగి ఈదుకుంటూ వస్తున్న వైనం

మరికాస్త దూరం వెళ్ళే సరికి మరో నీటి గుండం. తాడుపట్టుకుని నీటి గుండంలోకి దిగుతున్నాం. ఎక్కడా పట్టుదొరకడం లేదు. దిగడమైతే దిగగలిగాం. వచ్చేటప్పుడు ఎక్కడం ఎలా!? పద్మవ్యూహంలోకి అభిమన్యుడు దూసుకుపోవడమే తప్ప, తిరిగి ఎలా రావాలో ఆలోచించలేదన్నట్టు మేం కూడా ఆలోచించలేదు. ఈత రాని ఒకరిద్దరు ట్యూబులు కట్టుకున్నారు. ఒక పిల్లవాడు లైఫ్ జాకెట్ వేసుకున్నాడు. ఈత రాకపోయినా ఈ సాహసాల వల్ల నీళ్ళంటే భయం పోతుంది.

నీటి గుండం లోంచి వస్తున్న ప్రకృతి ప్రియులు

నీటి గుండం లోంచి వస్తున్న ప్రకృతి ప్రియులు


అలా ఆరు నీటి గుండాలను ఈదుకుంటూ ఏడవ నీటి గుండం వద్దకు వచ్చేశాం. అది ఎంత విశాలమైందో! ఆ నీటి గుండాన్ని చుట్టూ రాతి కొండ చుట్టుముట్టేసింది. తలెత్తితే తప్ప ఆకాశం కనిపించదు. చలి వణికించేస్తోంది. నీళ్ళలో ఉన్నంత సేపు చలి తెలియ లేదు. ఒడ్డుకు వచ్చేసరికి తడిగుడ్డల్లో ఒణి కిపోతున్నాం. ఆ చలికి ఒక పిల్లవాడు తట్టుకోలేకపోయాడు. ముఖమంతా ఒణికిపోతోంది. వాళ్ళ నాన్న వచ్చి కాస్త నపర్యలు చేశాడు.


విశాలమైన నీట్ గుండంలో ఎన్ని విన్యాసాలు! ఆ నీటి గుండంలోకి సాగర్, జోషి దూకే దూకుడు చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. ఈత పోటీల్లో ఇద్దరూ జాతీయ స్థాయి క్రీడాకారులు. పెద్దదైన జోషిలో ఎంత జోష్ ఉన్నా కాస్త పెద్దరికం. సాగర్ చిలిపితనం, పాటలు, మాటలు ఎంత వినోదాన్ని కలిగించిందో! మరొక పిల్లవాడు తెల్లగా, బొద్దుగా ఉన్నాడు. వాడితో సరదా కబుర్లు. మరొకడు మరీ చిన్నవాడు. ఎనిమిదేళ్ళుంటాయి. పిల్లల్లో పెద్దవాడికి పదిహేనేళ్ళుంటాయి.


లోయ లో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న పిల్లలు


మేమంతా ఏడవ గుండం దగ్గర ఆగిపోయాం. ముందుకు సాగలేం. తాడుపట్టుకుని కింది గుండంలోకి దిగగలిగినా, ఎక్కడం చాలా కష్టం. కాళ్ళకు పట్టుదొరకదు. మన బరువంతా చేతులపైనే ఉండాలి. మన బరువు మొత్తాన్ని మోసేంత బలంగా చేతులు ఉండాలి కదా! మాలో కొందరు సాహసికులు మాత్రం ముందుకు సాగారు. ముందర మరో మూడు నీటిగుండాలున్నాయి. రెండు నీటి గుండాల వరకు వెళ్ళగలిగారు. మూడవ నీటి గుండందగ్గర ఆగిపోయారు.



అతి పెద్ద చివరి నీటి గుండం


అక్కడి నుంచి కొండపైకి ఎక్కి మూడవ నీటి గుండం నుంచి శక్తి కటారి తీర్థంలోకి పడే జలపాతాన్ని చూడగలిగారు. శక్తి కటారి తీర్థాన్ని ఈ వైపు నుంచి చూడాలని నాలుగైదు సార్లు ప్రయత్నాలు జరిగాయి. నా వరకు నేను ఏడవ నీటి గుండం దగ్గర ఆగిపోయాను. కానీ, శివారెడ్డి, తిరుమల రెడ్డి, కార్తీక్, దురొక ఇద్దరు మాత్రం తాళ్ళు పట్టుకుని ముందుకు సాగారు. తాళ్ళు పట్టుకుని నీటి గుండాల్లోకి దిగి, కాళ్ళకు చెప్పుల్లేకుండానే రాళ్ళలో కొండ ఎక్కి శక్తి కటారిని దర్శించుకున్నారు. ట్రెక్కింగ్ లో వారి జీవిత లక్ష్యం ఇలా నెరవేరి రిన్ ది. తాంత్రిక లోయలోంచి శక్తి కటారిని అనేక సార్లు చూశాను. కానీ, ఈ సాహసికుల్లా పై నుంచి దర్శించుకోలేపోయాను.
మా సాహసికులు తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండున్నరైంది. ఆకలి చంపేస్తోంది. అప్పటి వరకు పెద్ద నీటి గుండంలో పిల్లల్తో పాటు ఈదుతూనే ఉన్నాం. నీళ్ళలోపల ఎంత సేపు ఈదగలుగు తామని పిల్లల్లో పోటీ. పిల్లలు ఈత విన్యాసాలు చూస్తుంటే, వీరి ముందు చేపలుకూడా ఓడిపోతాయనిపిస్తుంది. నీళ్ళ లోంచి లేవక తప్పలేదు.


తన భుజాల పైన కాళ్ళు పెట్టించు కు ని పై కి ఎక్కిస్తున్న కార్తీక్ .


సూర్యుడు నడినెత్తికొచ్చాడు. కాసేపాగితే మళ్ళీ కనుమరుగవుతాడు. ఎక్కడ ఎండపడుతుందో అక్కడ నిలుచుని, శరీరాన్ని వెచ్చచేసుకున్నాం. తిరుగ ప్రయాణమయ్యాం. వచ్చిన నీటి గుండాలన్నింటినీ ఈదుకుంటూ తిరిగి వచ్చేస్తున్నాం. ఒక చిన్న జలపాతం నుంచి ఎదురుగా ఎక్కడం కష్టంగా ఉంది. రానైతే వచ్చాం కానీ, ఎక్కడానికి పట్టుదొరకడం లేదు. ఆ జలపాతం కింద కార్టీక్ నిలుచుని 'నా బుజాన కాలు పెట్టి ఎక్కండి' అన్నాడు. వేరే మార్గం లేదు. తాడు పట్టుకుని, అతని బుజం పైన కాలుపెట్టి, రాయికి పట్టుదొరికించుకుని ఎక్కుతున్నా జారుతోంది. పైనున్న తిరుమల రెడ్డి చేయి అందుకున్నాడు. అలా ఒకరొకరూ ఎక్కగలిగాం.

లోయలో చలి అలాగే ఉంది. మేం బ్యాగులు పెట్టిన వద్దకు వచ్చేసరికి మధ్యాహ్నం రెండున్నరైంది. వాతావరణంలో కాస్త వేడి మొదలైంది. అక్కడే భోజనాలు ముగించుకుని మూడు గంటలకు కుమారధారకు చేరుకున్నాం. ఒక పక్క కుమార ధార దుముకుతోంది. మరొక పక్క తడిసిన బట్టల్ని ఎండలో ఆరబెట్టుకుని, చల్లని నేలపైన నడుం వాల్చాం. సాయంత్రం నాలుగవ్వగానే తిరుగు ప్రయాణమయ్యాం. ఎగుడు దిగుడు రాళ్ళ పైనుంచి ధర్మగిరికి చేరాం. తిరుమల చేరే సరికి సాయంత్రం అయిదుగంటలు.


కుమార ధార నుంచి తిరుగు ప్రయాణంలో


తిరుపతిలో అలిపిరి నుంచి ఘాట్ రోడ్డులో తిరుమలకు 18 కిలో మీటర్లు. ధర్మగిరికి నాలుగు కిలో మీటర్లు. అక్కడి నుంచి కుమార ధార ప్రాజెక్టు వరకు మరొక ఏడు కిలోమీటర్లు. పోను 29 కిలో మీటర్లు, రాను మరో 29 కిలో మీటర్లు. మొత్తం కలిపి 58 కిలో మీటర్లు ద్విచక్రదహనాల్లో ప్రయాణించాలి. అక్కడి నుంచి ఏడవ గుండం వరకు మూడు గంటల నడక. తిరిగి మరో మూడు గంటల నడక. మొత్తం ఆరుగంట నడక.


కార్తీక్


అడవి పుత్రుడు కార్తీక్

ఎత్తైన జలపాతం పక్కనే చెట్టుకు కట్టిన తాడు కట్టుకుని కింద ఉన్న నీటి గుండంలోకి దిగేస్తాడు. అదే తాడు పట్టుకుని పైకి ఎక్కేస్తాడు. ఎక్కడా పట్టులేకపోయినా స్పైడర్ మ్యాన్ లా కొండ అంచులకు పా కేస్తాడు. ఆ కొండ పైనుంచి జలపాతంలోకి దూకేస్తాడు. కార్తీక్ సాహసాలు చూసి శేషాచలం కొండల్లోని జలపాతాలు కూడా విస్తుపోతున్నాయి. కొత్త దారులు కనుక్కుంటాడు. దారి సరిగా ఉందో లేదో పైలట్లా చూసి వస్తాడు. ట్రెక్క ర్లకు సాయపడుతుంటాడు. తన బుజం పైన కాలు పెట్టి ఎక్క మంటాడు. ట్రెక్కింగ్లోనే కాదు, తిండి దగ్గర కూడా ఏ మాత్రం భేష జాలకు పోడు. ఏడాది క్రితం వరకు ట్రెక్కింగ్ అంటే తెలియని కార్తీక్ 'తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్ ' లో చేరి అందరికీ తలలో నాలుకయ్యాడు. వృత్తి రీత్యా అ మరా ఆస్పత్రిలో లాబ్ టెక్నీషియన్ అయినా ప్రవృత్తి రీత్యా గొప్ప ట్రెక్కర్.


కుమార ధార ముందు ప్రకృతి ప్రియులు


సూర్యుడు అస్తమిస్తున్నాడు. లోయలో చలికి ఒణికిపోయిన శరీరం తిరుమలలో కాస్త వెచ్చదనానికి కుదుటపడింది. తిరుపతికి చేరేసరికి సాయంత్రం ఆరుగంటలైంది. తిరుపతిలో తట్టుకోలేని వేచి. మండు వేసవిలో వణికించే చలిని అనుభవించి, అనేక నీటి గుండాల్లో ఈది, రాళ్ళపైకెక్కి దిగి ఎన్ని సాహసాలు! రెండు కొండల నడుము ఎంత ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించామో!


Read More
Next Story