మంగళగిరి ముక్తి కొండకు ట్రెక్...
x

మంగళగిరి ముక్తి కొండకు ట్రెక్...

మంగళగిరి పానకాల స్వామివారు కొలువైన పర్వతాన్ని ముక్తి పర్వతం అని పిలుస్తారు.



సెప్టెంబర్ 15 ఆదివారం. ఉదయం ఒంగోలులో మూడు గంటలకు బస్సు ఎక్కి గుంటూరులో ఐదు గంటలకల్లా దిగేను. గుంటూరు ట్రిక్కింగ్ కింగ్స్ తో కలిసి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ పక్కనే ఉన్న ఏకోపార్క్ దగ్గరకు చేరుకున్నాం.

మొత్తం 35 మంది సభ్యులం. ఒక్కొక్క టిక్కెట్టు 50 రు. తీసుకొని ట్రిక్కింగ్ మొదలుపెట్టాం. చల్లటి ఉదయాన, కాలుష్యం లేని ఆక్సిజన్ ను పీల్చుకుంటూ, సూర్యోదయాన్ని, కళ్ళ నిండుగా ఆకుపచ్చటి కొండ అందాలను ఆస్వాదిస్తూ, గాలిలో నుండి వచ్చే చెట్ల సువాసనలను, సన్నటి చిన్న శబ్దాలను వింటూ, ఫారెస్ట్ వారు వేసిన సన్నటిదారిలో ఒకరి వెనక ఒకరుగా మిలటరీ కవాతు చేస్తున్నట్లు నడక మొదలెట్టాం. దారి చూపుతూ ముందు పుల్లారావు వెనక మోహన్ . మధ్యలో గ్రూపులు గ్రూపులుగా జోకులు నవ్వులు ఫోటోలు. వ్యు పాయింట్లు నుండి ఎదురుగా ఉన్న కొండలను, మంగళగిరి పట్టణాన్ని అపార్ట్మెంట్లను, రోడ్లను పరిశీలిస్తున్నాం.


ఎకో పార్క్ లో నడక

ఎకో పార్క్ లో నడక

ఎదురుగా ఉన్న కొండలను కూడా ఎక్కిస్తారా? అని మా టీం లీడర్ను అడిగేను. ఎదురుగా ఐదు కొండలు కనిపిస్తున్నాయి. అవన్నీ పోలీస్ బెటాలియన్ వారి ఆధీనంలో ఉంటాయట. వారి ట్రిక్టింగు, ట్రైనింగులు ఆ కొండలపై జరుగుతాయట. ఎవరికి పర్మిషన్ ఇవ్వరట. ఎదురుగా ఉన్న కొండపై కొంతమేర సదును చేసినట్లుగా ఉంది. అక్కడ చెట్లు కనిపించలేదు. వాటి అందాలకు అందరూ ఫోన్లకు పని చెప్పారు. మాతోపాటు జర్నలిస్టు ఫోటోగ్రాఫర్ కూడా వచ్చారు. ఇద్దరు హుషారుగా ఉన్నారు. ఆ ఫోటోగ్రాఫర్ గారిని ఆ ఫోటో ఈ ఫోటో తీసియ్యమని అడిగేను. ఓపిగ్గా తీశారు.

మంగళగిరిలో మొత్తం ఆరు కొండలున్నాయి. ముక్తి కొండపై మేము ట్రెక్కింగ్ చేస్తున్నాము. దారి పొడవు రెండు కిలోమీటర్లు. రెండు వ్యూ పాయింట్లు తర్వాత గండాలయ్య గుడి దగ్గరకు చేరుకున్నాo. (గుడి గురించి తర్వాత వస్తుంది). ఎవరో తెచ్చిన వేరుశెనగ గుళ్లను బెల్లం ను, బిస్కెట్లను తిని కొంతసేపు రెస్ట్ తీర్చుకున్నారు.




పల్లీలతోపాటు, వేడివేడి పల్లిలోయ్, పల్లీలలోకి బెల్లమోయ్, రండి రండి అని 'కాళీ ప్రసాద్' అమ్మకపు నవ్వులు కూడ తిన్నారు. టీం లీడర్ పుల్లారావు అక్కడనుండి కనిపిస్తున్న లక్ష్మీ నరసింహ స్వామి గోపురాలను చూపించారు. లక్ష్మీనరసింహస్వామి ప్రధాన గోపురం సమున్నతంగా ఎత్తుగా కనిపిస్తుంది. ఇంకొక రెండు గోపురాలు చిన్నవిగా కనిపిస్తున్నాయి. పానకాల స్వామి గుడి అక్కడ నుండి కనబడలేదు. ఆ పక్కనుండి మెట్లు కనిపిస్తాయట. ఆ మెట్ల నుండి వెళితే పానకాల స్వామి గుడి వస్తుందట. వేళతారా? అని అడిగారు. వెళ్ళను. కొండ దిగే మార్గం చూడాలి, నడుస్తాను అన్నాను. ఎక్కే మార్గం కన్నా దిగే మార్గం కొంచెం రాళ్లుగా ఉన్నది. ఎటు నుండి చూస్తున్న కొండల చుట్టూ మంగళగిరి ఊరు కనిపిస్తున్నది.

బహుశా ఈ కొండల వలనే మంగళగిరి అనే పేరు వచ్చిందేమో అనిపించింది. (మంగళ అంటే మంచి, గిరి అంటే కొండ.(fb లో ఊర్ల పేర్లు గురించి రాసేవారు. అడుగుదామని ఎఫ్బి సూచన కనిపించలేదు. (ముక్తి వరపు పార్థసారథి అనుకుంటా). మంగళగిరి లో ఎటు చూసినా దేవాలయాలే కనిపిస్తాయి. దిగిన తర్వాత మా టీం లీడర్ తోడిచ్చి నన్ను గుడి దగ్గర వదిలిపెట్టమన్నాడు.

మంగళగిరిలో శ్రీ గంగా సమేత మల్లికార్జున ఆలయం, అఖిలాండేశ్వరి, కనకదుర్గాంబ, పోలేరమ్మ, అంకమ్మ దేవాలయాలు, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీరామ మందిరం ఉన్నాయట. మంగళగిరి తిరణాల పెద్ద ఎత్తున జరుగుతుంది.. ఈ తీరుణాలకు, గోళ్ళకు ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తారట. వస్తూపోతూ బ్రిటిష్ కలెక్టర్లు కూడా పానకాల స్వామి వింతను చూసేవాళ్ళట.

గుళ్ళ దగ్గరకు వెళదాం

మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందినఆలయాలలో ఒకటి. విజయవాడ నుండి 12 కిలోమీటర్లు, గుంటూరు నుండి 19 కిలోమీటర్లు దూరంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కి దగ్గరగా ఉంటుంది. రవాణాకి బస్ సౌకర్యం, ఆటోలు ఉంటాయి.

అహోబిలంలో నారసింహుడు తొమ్మిది రూపాయల్లో ఉంటే ఇక్కడ మూడు రూపాల్లో ఉంటాడు. దిగువ నారసింహ, ఎగువ పానకాల స్వామి, కొండమీద గండాలయస్వామిగా . దిగువ ఆలయములో విగ్రహాన్ని పాండవులు ప్రతిష్టించారట. గుడిని శ్రీకృష్ణదేవరాయలు శతాబ్దంలో నిర్మించారంట. 36 స్తంభాల మీద మండపం, మండపం ఆనుకుని మూడు ద్వారాల ఆవల లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారు. పక్కన రాజేశ్వరి అమ్మవారి గుడి ఉంది. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే అన్ని నరసింహ గుడులన్నింటి దగ్గర ఉన్న గోపురాల కంటే ఎత్తయిన 175 అడుగుల ఎత్తులో 11 అంతస్తుల తో అబ్బురంగా కనిపించే గోపురం లేదా ద్వారo ఉoడటం. గుడికి తూర్పు వైపున ఈ గోపురాన్ని 1807... 1809 మధ్య ధరణికోట (అమరావతి)పాలకులైన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహదూర్ నిర్మించాడు. ఉత్తర దక్షిణ వైపుల ద్వారాలు ఐదు అంతస్తులతో ఉన్నాయి. వెనక వైపున ఒక్క అంతస్తు మాత్రమే ఉంటుంది. ఎందుకు అని అడిగితే ఎన్నిసార్లు నిర్మించిన పడిపోతుందట. అందుకని వదిలి వేశారట. నిత్య అన్నదానమును దాత శ్రీమతి కైవారం బాలాంబ చేస్తున్నారు. నిత్యాన్నదాత్రి, శ్రీమతి కైవారం బాలాంబ మంగళగిరి తిరునాళ్ల జరిగే రోజుల్లో వేలాదిమందికి అన్నదానం చేశారట. ఈమె చేసినట్లు మరెవ్వరూ చేయలేదన్నారు. 95 సంవత్సరాల వయసులో ఆగస్టు 12వ తేదీ 1944లో బాలంబ చనిపోయారట. ఇలాంటి దాతల గురించి నలుగురికి చెప్పాలి. యిక్కడ కోపంగా ఉన్న నారసింహాన్ని అమృతం ఇచ్చి లక్ష్మి దేవి చల్లబరిసినదట. ఎడమ వైపున రాజ్యలక్ష్మి గుడి ఉంది. లక్ష్మీనరసింహస్వామి గుడికి కొద్ది దూరంలోనే శివాలయం ఉన్నది. ఇక్కడ శివాలయం గంగా భవాని సమేత శివాలయం.



శివుడు లింగం ఆకారంలో ఉంటాడు. గుడి వెనుక నాగుపాముల విగ్రహములు చాలా దిక్కుమక్కు లేకుండా ఉన్నాయి. గుడి ఎదురుగా చిన్న వినాయక గుడి ఉంది. లక్ష్మీనరసింహ కు, శివాలయమునకు వేరువేరుగా ఎత్తయిన ఊరేగింపు రధాలు ఉన్నాయి. గుడికి వెళ్లే దారిలో అర ఎకరం లో ఓ పెద్ద, లోతైన కోనేరు ఉంది. అయితే ఈ కోనేరు ఇప్పుడు పాడు పడుతుంది. ఈ కోనేటిలో ఆంజనేయస్వామి గుడి కనిపిస్తుంది. ఈ గుడి ఆ కోనేటి నీళ్లు ను తోడుతున్న కొద్ది బయటపడిందట. ఈ కోనేటి నీటితోనే కొన్ని శతాబ్దాల పాటు నారసింహా స్వాములకు అభిషేకం చేసేవారట. ఇప్పటికైనా శ్రద్ధ పెట్టి బాగు చేస్తే కోనేరు ఆక్రమణలకు గురికాదు. ఓ సందర్శన స్థలంగా ఉంటుంది.


కొండపైన పానకాల స్వామి గుడి ఉన్నది. ఎగువ నృసింహ స్వామి ఆలయం అంటారు. కానీ పానకాల స్వామిగా ప్రసిద్ధి చెందారు. ఇక్కడ స్వామికి నైవేద్యంగా పానకాన్ని భక్తులు సమర్పిస్తారు. అందువలన పానకాల స్వామి గా పిలవబడుతున్నారు. స్వయంభుడుట. గుడిలో స్వామివారి నోరు మాత్రమే ఉంటుంది. పదిహేను సెంటీమీటర్ల వెడల్పుతో ముఖద్వారం రాతితో ఉంటుంది. కోపంతో కూడిన ఇత్తడి తొడుగు ఉంటుంది. దీపారాధన వెలుగు మాత్రమే ఉంటుంది. కొద్దిగా చీకటిగా కూడా ఉంటుంది. పానకము స్వామివారి నోటిలో పోసినప్పుడు మనము పోసిన దాంట్లో సగం మాత్రమే తీసుకుని, మిగిలినది భక్తులకు ఇచ్చేస్తారు. మిగిలినది ప్రసాదంగా బాటిల్స్ లో పోసుకొని తీసుకెళుతుంటారు. పానకం పోసినప్పుడు గుటక శబ్దంలాగా వినిపిస్తుందట. నా పక్కన ఉన్న ఆమె విన్నానని చెప్పింది. నేను పోయలేదు వినలేదు. రెండు లీటర్ల పానకం బింద 100 రూపాయలు. భక్తులకు ఉచితంగా ఇస్తారు. బాటిల్స్ లో కూడా పోసి ఇస్తారు. కాకపోతే మనకు తోసినంత కానుకగా ఇవ్వవచ్చు.


శతాబ్దాలుగా పోస్తున్నా ఈ పానకం ఎక్కడకు పోతుంది ఆ కొండల్లో అన్నది ఓ పెద్ద ప్రశ్న. భక్తులు స్వామి వారు తాగేస్తున్నారు అని నమ్ముతారు. నమ్మనివారు, సైంటిస్టులు పరిశోధించాలి అంటున్నారు. ఈ పానకానికి సంబంధించి ఓ రెండు అంశాలు ప్రచారంలో ఉన్నాయి. స్వామి వారు ఉన్న పర్వతం అగ్నిపర్వతం అట. బెల్లం, పట్టిక, మిరియాలు తో చేసిన పానకం పోయడం వల్ల అగ్నిపర్వతం ఎగిసి పడకుండా ఆపుతుందని ఓ నమ్మకం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా అగ్నిపర్వతం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. రెండోది ఈ కొండల్లో ఫాస్పేట్ ఉందని, ఈ పానకం పోయటం వలన కెమికల్ రియాక్షన్ జరుగుతుందని అంటారు. ఏది ఏమైనా తియ్యగా కారం కారంగా పానకం బాగుంది. స్వయంభు రాజ్యలక్ష్మి దేవి ఆలయం ఉంది. అక్కడున్న ఆంజనేయ స్వామి విగ్రహానికి డబ్బులు అంటించి తే కోరికలు తీరుతాయట. గుడి కుడివైపున అనంత పద్మనాభ స్వామి శయనా విగ్రహం ఉంది.


గండాల జ్యోతి దగ్గిర రచయిత్రి కాంతి నల్లూరి

గండాల జ్యోతి దగ్గిర రచయిత్రి కాంతి నల్లూరి


దిగువ గుడి నుండి ఎగువ గుడికి వెళ్లడానికి 480 మెట్లు ఉంటాయి. చెప్పులతో వెళ్ళకూడదు. మెట్ల మీద నుండి వెళుతుండగా మరికొన్ని గుడులు ఉన్నాయట. ట్రెక్కింగ్ లో బాగా అలసిపోవడం వల్ల నేను ఈ మెట్ల దారి గుండా వెళ్లలేదు. మెట్లు ఎక్కలేని వారికి 2002లో రోడ్డు మార్గాన్ని నిర్మించారు. సుమారు రెండు కిలోమీటర్ల దూరం. రాను పోను ఆటోవారు 50 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడున్న అనేకమందికి ఈ గుడి ప్రధాన ఆదాయ మార్గంగా ఉందని చెప్పవచ్చు. పానకాల స్వామి నుండి కొండపైన ఉన్న గండాలయ స్వామికి వెళ్లడానికి 700 మెట్ల వరకు ఉంటాయట. వీటిని 1890లో నిర్మించారు. ఇక్కడ గండాలయ్యా దగ్గర నిత్య జ్యోతి వెలుగుతుందట. మేము వెళ్ళినప్పుడు ఆరిపోయింది.


గుంటూర్ ట్రెక్కింగ్ కింగ్స్  సభ్యులు

గుంటూర్ ట్రెక్కింగ్ కింగ్స్ సభ్యులు


మా టీంలో ఉన్న రాజి, జ్యోతిని వెలిగించింది. నిత్యజ్యోతి ఎలగడం వల్ల గుడి చుట్టు నూనె నూనెగా నల్లగా, జిడ్డు జిడ్డుగా ఉంది. భక్తులు నమ్మకంతో గుడి చుట్టూ గొర్రెల్ని తిప్పడం వలన గొర్రె పెంటలు, చెత్త, చెదారం ఉంది. గుడి అంటే కప్పు గోడలు ఉండవు. చతురస్ర ఆకారంలో ఎత్తైన నలుచదరపు మెట్ల మీద మండుతున్న జ్వాలా పై పడగ ఆకారం ఉంటుంది. గుడులు కన్నా ఆదాయము వనరులే ముఖ్యం అనుకుంటున్నారు. భక్తులకు, పూజారులకు, ప్రభుత్వాలకు కూడా శ్రద్ధ లేదు. అంటే గుడులను ప్రోత్సహించాలని నా ఉద్దేశం కాదు. అవి చారిత్రక, సాంస్కృతిక, శిల్పకళా నిలయాలుగా చూడాలనే నా ఉద్దేశం. ఈ కొండను ముక్తి పర్వతం అంటారు.



Read More
Next Story