కాశిపెంట్ల పక్కన దొనకొండ కు ట్రెక్
x

కాశిపెంట్ల పక్కన దొనకొండ కు ట్రెక్

చాల కష్టమైన ట్రెక్ మరింత ఇష్టంగా పూర్తి చేసినాము


తిరుపతి నుండి హౌవేలో 25 కి.మీ దూరాన ఉండే హెరిటేజ్ పార్లర్ కు తరచూ పోయే అలవాటు మాకు. పోయినపుడల్లా కాఫీనో, ఐస్ క్రీమ్ నో సేవిస్తూ ఉత్తరం వైపు కొండను చూస్తూ అక్కడికి ఎప్పుడయినా పోయిరావలెనని అనుకునే వాణ్ణి. మా హై వే చుట్టూ కొండలే. తాటికోన పై కొండ, కాలభైరవ గుట్టపై కొండ, చంద్రగిరి నానుకుని ఉప్పు సట్టి పప్పు సట్టి, ఐతేపల్లి ఎదురు కొండ చూస్తూ అవన్నీ పోయిరావడమేగాకుండా, నాకిష్టమయిన గంటా మంటపం కొస చూస్తూ గడుపుతున్న వాణ్ణి. ట్రెకింగ్ ఒక అలవాటుగా మారినాక ప్రతికొండానన్ను ఆకర్షిస్తూనే ఉంది. రారమ్మనిపిలుస్తున్నట్టుంటుంది. ఎన్నని పోగలను?




కానీ ఈ కాశీపెంట్ల కొండ ఎక్కి తీరవలెనే పట్టుదల చాలా కాలంగా ఉంది. మా ట్రెకర్స్ జాబితాలో లేదిది. కొత్త. టోల్ గేట్ నుంచి తిరిగి వస్తున్నప్పుడంతా ఆ కూచిరాయి, ఏపుగా ఉన్న పలకవైపు పోయి రావాలనే ఆకాంక్ష. అక్కడి నుంచి చంద్రగిరి చేరుకునే ముందుగా ఉప్పు సట్టి, పప్పు సట్టి కొండ కొసన ఉన్న చెట్టు నన్నెపుడూ మురిపిస్తూంటుంది. కొన్ని పదుల సార్లు ఆ వారగా ఉన్నచెట్టెక్కి ఎన్ని గంతులు వేసినానో!?




నా మిత్రుడు ఎమ్ ఆర్ ఎఫ్ నాగరాజ నాయుడు కాశిపెంట్ల గురించి చెప్పిఉన్నాడు. పోవాలనుకుంటూనే సంవత్సరాలు దొర్లిపోయాయి.కాశిపెంట్ల సొంతవూరయిన నా సన్నిహితు మిత్రుడు భూపాల్ నాయుడును సంప్రదిస్తే ఆ ఊరికే చెందిన మరొక మిత్రుడు చెంగమనాయుడి కాంటాక్ట్ ఇవ్వడంతో పని సులువైంది. అతను లోకేష్ ని తోడివ్వడంతో ఈ శనివారం శీను, మిత్ర శేఖర్, రవి,పవన్ లం కలసి పొద్దునే 9 గంటలకు కాశీపెంట్ల రైల్వే లైన్ క్రాస్ చేసి కొండదారి పట్టినాము.




లోకేష్ హవాయి చెప్పులతో రివటలాగా కత్తి పట్టుకునితెలికగా నడుస్తున్నాడు. పూర్తి ఎక్కుడు. చెట్లు పచ్చదనంతో మురిపెంగా ఉన్నాయి. దుప్పులు, కణుతులు, అడివి పందులు తిరిగే చోటు. ఈ మధ్య ఒక చిరుత అడుగుపెట్టినట్లు వార్తలొచ్చినాయి. అప్పు డెప్పుడో రెండు ఏనుగులు తప్పోయి వచ్చినాయట.



దారంతా నత్త గుల్లలు. ఎందుకనో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎలక చెట్లు, మోగిచెట్లు, తుమ్మచీకు కంపతో , మాకు తెలియని అనేక చెట్ల మధ్యన గస పోసుకుంటూ దాదాపు మూడు గంటలు ఎగబాకి అనుకున్న చోటుకి వచ్చినాము.




మిట్ట మధ్యాహ్నం. ఎండ తీవ్రత లేకపోవటం, గాలి బాగా వీస్తూండటంతో ఉపిరి పీల్చుకోగలిగినాము. మేము చేరుకున్న తావు దొన. దీన్నే దొనకొండ అంటారు.




వేంకటేశ్వరుడు పాదంమోపిన తావని లోకేష్ అంటున్నాడు. ప్రతియేటా తిరుమల శినివారాల నాడు చుట్టుపక్కల వాళ్లు అక్కడికొచ్చి అక్కడే దేవతలాగా మొక్కి ముక్కులు తీర్చుకంటారట. దొనల్లో నీళ్లు బాగా లోతుగా పొడవుగా ఉన్నాయి. తామరపువ్వొకటి చాల అందంగా ఉంది.





అక్కడి ఉండే రాతి ఆకారాలు గొప్ప ఆకర్షణీయంగా ఉన్నాయి.




అనేక రూపాలతో అలరారుతున్నాయి ఈ బండరాళ్లు.



ఆర్టిస్టుకు ఇది భలే తావుగదా అనిపించింది.




పిర్రల ఆకారంలో ఉండే రాతి గుండు భలే గా ఉంది. ఆ చోటు చాలా ఎత్తులో ఉంది.





ప్రతికొండరాయి ఒక విశేషంగా మారిందక్కడ.




గాలి తీవ్రత ఎక్కువ. ప్రకృతి మోసుకొస్తున్న కొత్త సొబగులన్నింటిని ఆస్వాదిస్తున్నాము.




ఎండను ఎండ బెడుతూ లేత ఆకుపచ్చ సంతకం చేసినట్లుంది అడవంతా.





ఆకులు గాలితో మాట్లాడటం, కొమ్మలు వొరుసుకుంటూ పాటలు పాడుతున్నట్లు మైమరుపుతో ఉన్నట్లు, గాలి తీవ్రత కు చెట్లు ఊగి ఊగి ఆగినాక తీసుకునే ఉఛ్వాస నిశ్వాసాల సవ్వడి భలే గొప్పగా ఉంది.


ఎప్పటిలాంటి ప్రకృతే గాని ఈ రోజు కొత్తగా ఉంది. అదే ప్రకృతి వింత. సీతాకోక చిలుకలు వందలు వందలుగా ముచ్చటగా తిరుగుతున్నాయి. ఆ కొండ అగ్రభాగా పుప్పొడి రేణువుల మబ్బుతునకలు కట్టి పడేస్తున్నాయి.


తిరిగినంతసేపు తిరిగి చుట్టూత సీనరీస్ నన్నింటిని కనులారా చూసి లోకేష్ మాకోసం తెచ్చిన చిత్రాన్నం, మేం తెచ్చుకున్న బ్రెడ్ ముక్కలు తిన్నాక, ‘ఇక్కడేముంది సార్, ఇంకా కొంచెం పైకి పోతే అద్భుతాలు చూస్తారు గాని’, అని ముందుకు నడిపించినాడు.




బాగా కష్టమయిన గుండ్లను ఎక్కించి పైకి పిలుచుకు పోయినాడు. నిజంగానే పైన కనిపించింది అద్భుతం. చాలా ఎత్తున ఉన్నాం కదా, ఉధృతమయిన గాలికి తట్టుకోలేకపోతున్నాము. తోసేస్తున్నది. గట్టిగా బిగబట్టి నడుచుకుంటూ ఆ తోవంతా చాలా సంతోషంగా గాలించినాము. అంతటితో ఊరుకున్నాడా లోకేషు.




‘సార్ ఇంకొంచెం పోతే, కూచిరాయి చూద్దురు గాని రండి,’ అని పిలుచుకుపోయినాడు. ఈ రాయినే నేను చూడాలని, తాకాలని అనుకున్నది. ఎంతో ఎత్తయిన రాయది. పెద్ద పడగాలాగా ఉంది. గాలి తీవ్రత వల్ల గభగభా ఫోటోలు తీసుకుని, చుట్టూ మైరచి చూసి దిగబడినాము. ఇది ఆ గాలి తీవ్రతకు ఊగుతున్నట్టుగా అందరం గుర్తించినాము. భ్రమేమో అనుకున్నాము కూడా.




సార్ మనం దిగే దారి వేరే. అన్నాడు. ఇక్కడి నుండే దిగుదాం అంటే సరే నన్నాము. కొండపైభాగానే ఆచుట్టూ నుండి ఈ చుట్టు వరకు రెండు మైళ్లు నడిచినట్లున్నాము. దిగుడంతా జారుడే.చిన్నసైజు రాళ్ల వల్ల జారుడు ఎక్కువయింది. పైగా చీకు కంప. దిగుతున్నాము, దిగుతున్నాము, అదిగో కాశిపెంట్ల అనుకుంటే నాలుగైదు గుట్టలు దిగితే గాని దిగదాలక చేరలేదు. దిగటానికి మూడు గంటలు పట్టింది.



అలజడి అలజడిగా ఉన్న ఆ అడవిని కష్టమైనా ఇష్టంగా కలియ తిరిగి ఆ కొండల ఆస్థిత్వాన్ని మైమరచి గమనిస్తూ సాయంకాలం 6 గంటలకు కాశిపెంట్ల చేరుకున్నాము.

మొత్తానికి నేను తిరిగిన తిరుగుళ్లలో కొంచెం కష్టమయిన ట్రెక్ ఇదే. అయితేనేం, ఆ కష్టాన్ని మరిపించే అనుభవాలను, ఆనంద పారవశ్యాలను మూటగట్టుకుని వచ్చినాము

‘‘చెట్టు మాట్లాడలేవు , కాని గుండెలోని భాషను గాలిద్వారా వ్యక్తం చేయగలవు.’’ ఒక పంజాబీ జానపద గేయం.


ఈ దొన ట్రెక్ లోపక్షుల గుంపు పాట పాడింది. ఆ పాటకు పచ్చదనం వంత పాడింది. మేమూ కష్టాన్ని పూర్తిగా ప్రకృతి పారవశ్యంతో మరచిపోయినాము.

పది కాలాల పాటు గుర్తుండిపోయే ట్రెక్ సార్ ఇది అని శీను అన్నమాట నిజం.



Read More
Next Story