తిరుమల శేషాచలం కొండల్లో... గరుడ తీర్థానికి సాహసయాత్ర
శేషాచలం కొండల్లోని గరుడతీర్థం అద్భుతమైన ప్రకృతి సౌందర్యమే కాదు, పెద్దగా వెలుతురు చొరబడని ఆ కొండ చీలికలో అదొక భయకంపిత సౌందర్యానందం.
లోతైన లోయలో ఒక ఎత్తైన రాతి కొండకు నిట్ట నిలువునా సన్నని చీలిక.. చీకటి కమ్మిన ఆ చీలికలో దొణదొణా శబ్దం చేసుకుంటూ వచ్చిపడుతున్న నీటి ప్రవాహం..ఆ ప్రవాహం కొండ చీలికలోని ఎన్ని బండరాళ్ళను ఎక్కిదిగుతోందో! ఎన్ని రాళ్ళ సందుల్లోంచి దూరిపోతోందో! శేషాచలం కొండల్లోని గరుడతీర్థం అద్భుతమైన ప్రకృతి సౌందర్యమే కాదు, పెద్దగా వెలుతురు చొరబడని ఆ కొండ చీలికలో అదొక భయకంపిత సౌందర్యానందం.
ఆ కొండ చీలికలోని నీటి ప్రవాహంలో, ఒకరొకరుగా ఈదుకుంటూ ముందుకు సాగుతూ, వెళ్ళి రావడం నిజంగా సాహసమే. ఏ తీర్థంలో కనపడని ఒక తెలియని భయం మన అనుభవంలోకి వస్తుంది. గరుడతీర్థం అంచులను 33 మందిమి చూసొచ్చినా, అంతా ఒక్కసారిగా వెళ్ళి రావడం సాధ్యం కాలేదు. ఆ కొండ చీలికలో అయిదారుగురు వెళ్ళిరాగలిగేంత వైశాల్యం మాత్రమే ఉంటుంది.
నేను హైదరాబాదులో ఉండగా "శని, ఆదివారం రెండు రోజుల ట్రెక్. గరుడ, గంధర్వ, పాల్గుణ, మార్కండేయ తీర్థాలతోపాటు డబ్బారేకుల కోన కూడా చూసిరావచ్చు.” అంటూ మధు మెసేజ్ పెట్టాడు. 'అయ్యో.. మంచి అవకాశం పోయిందే' నని బాధపడ్డాను. శనివారం తెల్లవారుజామునే పదిమంది ట్రెక్కర్లు మామండూరు వైపు నుంచి అడివిలోకి వెళ్ళారు. నేను శనివారం హైదరాబాదు నుంచి రాగానే మధు నుంచి ఫోన్ వచ్చింది. “ఆదివారం మరొక బ్యాచ్ వెళుతోంది వస్తారా!?" అన్నాడు. ప్రయాణ బడలికను పక్కన పెట్టి సిద్ధమయ్యాను.
ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు నవీన్ కు చెందిన మిలటరీ జీప్ లో అలిపిరి నుంచి ఎనిమిది మందిమి బయలుదేరాం. తిరుమల చేరే సరికి గోగర్భం డ్యాం వద్ద మోటారు బైకులపై మరో పదిహేను మంది సిద్ధంగా ఉన్నారు. చెన్నై నుంచి యమహా మోటార్ స్కూటర్లో మూడున్నర గంటలు ప్రయాణం చేసి కవిత అనే యువతి ఒంటరిగా వచ్చేసింది. అలాగే మగేష్ (మహేష్ తమిళ ఉచ్చారణలో మగేష్) అనే నడివయస్కుడైన ట్రెక్కర్ కూడా వచ్చాడు. అంతా 23 మందిమి అయ్యాం.
మా వాహనాలన్నీ తిరుమలలోని పార్వేటమండపం సమీపాన ఉన్న శ్రీగంధం తోటలోంచి అడవిలోకి సాగుతున్నాయి. మామండూరు వైపు నుంచి తిరుమలకు వెళ్ళేందుకు అన్నమయ్య నడిచిన మార్గం. ఇక్కడికి సమీపంలోనే ఈతకాయల మండపం నుంచే ఇప్పటికి కొందరు వెళుతుంటారు. శ్రీ గంధం చెట్ల మధ్య నుంచి మట్టి రోడ్డులో అడివిలో సాగుతుంటే, ఎనిమిది గంటలకల్లా పాత సత్రాల వద్దకు చేరాం. ఈ దారిలో వచ్చిపోయే యాత్రికుల కోసం విజయనగర చక్రవర్తుల నాటి పూర్తిగా శిథిలమైపోయిన సత్రాల మొండిగోడలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఆ పక్కనే రాళ్ళతో నిర్మించిన శిథిలమైన కోనేరు.
కోనేరు పక్కనుంచి, మనిషెత్తు పెరిగిన బోద లోంచి మా నడక సాగుతోంది. దారి సరిగా లేదు. దట్టంగా పెరిగిన ఈత చెట్లు, రకరకాల చెట్ల మధ్యలో దారి చేసుకుంటూ వెళుతున్నాం. కొంత దూరం వెళ్ళే సరికి నేలంతా చిన్న చిన్న బండ రాళ్ళు. వాటిపైన కాళ్ళేస్తుంటే జారుతోంది. అలా అడివిలో అరగంట నడిచేసరికి ఒక లోయ అంచుకు చేరాం. అక్కడి నుంచి లోయలోకి దిగాలి. లోయ తొలుత ఏటవాలుగా ఉన్నా, కాస్త ముందుకు పోయేసరికి నిటారుగా ఉంది. దారంతా పూడిపోయింది. దారి కోసం కొండ అంచునే నడుస్తున్నాం. ఎక్కడి నుంచి దిగాలి? ఎలా దిగాలి? అంతా అన్వేషణే. ముళ్ళ చెట్లను తొలగించుకుంటూ సాగుతున్నాం.
లోయలోకి దిగుతుంటే ఎక్కడా పట్టుదొరకడం లేదు. చెట్లు ఉన్నదగ్గర వాటి కొమ్మలను, కాండాన్ని పట్టుకుని దిగుతున్నాం. లేని దగ్గర దిగుతుంటే జారుతోంది. రాళ్ళు పట్టుకుని దిగుతుంటే కొన్ని చేతికి ఊడొస్తున్నాయి. కూర్చుని దేకుతూ నిదానంగా దిగుతున్నాం. అంతా మట్టి నేల. నేలంతా చెమ్మగా ఉంది. ఏటవాలుగా కాకుండా పక్కకు మెలికలు తిరుగుతూ దిగుతున్నాం. పైనుంచి వచ్చిన ప్రవాహానికి పక్కనే బండరాళ్ళు గుట్టలు గుట్టలుగా కింద వరకు వడి ఉన్నాయి. వాటిపై నుంచి దిగుదామనుకున్నాం. వాటి చివర దిగడం సాధ్యం కాదు. లోయలోకి దిగుతుంటే ఎక్కడా ఎండ కనిపించడం లేదు. గుంజన జలపాతమంత కష్టమైన దిగుడు. ఒక రకంగా చెప్పాలంటే గుంజన కంటే కూడా కష్టమేమో ఈ లోయలోకి దిగడం!
లోయలోకి దిగడానికి గంటపట్టింది. రెండు కొండల మధ్య లోయలో ఏరు ప్రవహిస్తోంది. రాళ్ళ మధ్యనుంచి, రాళ్ళ కింద నుంచి, కొండ అంచు నుంచి ఏరు ఒక్కో దగ్గర ఒక్కోర కంగా రొద చేస్తూ సాగుతోంది. లోయలో కుడివైపుకు సాగుతున్నాం. రాళ్ళ పైన కాళ్ళు వేస్తుంటే కొన్ని కదిలిపోతున్నాయి. అన్నీ సర్కస్ ఫీట్లే. నీళ్ళు లేని చోట కొండ అంచునే సాగుతున్నాం. లోయలో అరగంట నడిచేసరికి ఎడమ వైపునకు ఒక మలుపు వచ్చింది. ఆ మలుపులో కొండ అంచునే నీటి ప్రవాహం సాగుతోంది. ఆ మలుపులోనే కొండ అంచున గుహ. అది ఎలుగు బంట్ల నివాసమై ఉండవచ్చు.
ఎంత నడిచినా ఇంకా నడవాలి. సమయం పదవుతోంది. దూరంగా జలపాతపు హెూరు. దాని దరిచేరిన కొద్దీ ఆ హెూరు మరింత పెరిగింది. అదిగో కుడివైపున ఎత్తైన కొండ పైనుంచి మెలికెలు తిరుగుతూ జలపాతం జాలువారుతోంది. ఆ జలపాతం కింద నున్న గుండంలో పడి ఎడమ వైపున మలుపు తిరిగిన లోయలోకి సాగిపోతోంది. శనివారం తెల్లవారు జామున తిరుపతిలో బయలుదేరిన పదిమంది సభ్యుల బృందం అప్పటికే పాల్గుణ జలపాతం దగ్గరకు వచ్చేసింది. ఈ బృందం మామండూరు వైపు నుంచి తుంబురు వెళ్ళే దారిలో డబ్బారేకుల కోన చూసుకుని, రాత్రికి మార్కండేయ తీర్థంలో బస చేసి, తెల్లవారుజామున బయలు దేరి ఇక్కడికి వచ్చేశారు.
జలపాతం ముందున్న రాళ్ళ పైన కూర్చుని అల్పాహారాలు ముగించాం. ఒకరొకరుగా గుండంలోకి వెళుతున్నారు. జలపాతం ముందుకు వెళ్ళిన కొద్దీ లోతుగా ఉంది. చాలా సేపు నీళ్ళలో ఊదులాడారు. మా లో ఒకరిద్దరితో పాటు చెన్నై నుంచి వచ్చిన కవితకు ఈత రాదు. వస్తూ వస్తూ లైఫ్ జాకెట్ తెచ్చుకుంది. ఆ లైఫ్ జాకెట్ వేసుకుని అందరితో జలపాతం కిందకు వెళ్ళిపోయింది. లైఫ్ జాకెట్లు, ట్యూబులు వేసుకున్న ఒకరిద్దరే ఎక్కువ సేపు నీళ్ళలో ఈదగలిగారు.
గంటసేపు పాల్గుణ తీర్థంలో ఈదులాడాక ఒకరొకరు లేచి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. లోయలో వచ్చిన దారినే మళ్ళీ నడక. వచ్చేటప్పుడు చాలా ఉత్సాహంగా వచ్చేశాం. తిరిగి వెళ్ళేటప్పుడు ఇంత దూరం నడిచామా అనిపించింది. మళ్ళీ లోయ దిగిన ప్రాంతం వద్దకు వచ్చాం. అది దాటాక అదే లోయలో మరికాస్త దూరం నడిచాం. గరుడ తీర్థం ఇక్కడికి దగ్గరే. మా బ్యాగులు, బూట్లు అక్కడ వదిలేసి, ఆ లోయలో నడుచుకుంటూ సాగుతున్నాం. పైనుంచి ఏరు ప్రవహిస్తూ వస్తోంది.
లోయలో ఇరువైపులా ఉన్న కొండ దగ్గరికి వచ్చేస్తోంది. పదకొండైనా ఎండ లేదు. చలిచంపేస్తోంది. రెండు కొండల నడుమ నుంచి ఏరు మా వైపుకు వచ్చేస్తోంది. ఇక్కడి నుంచి ఈదుకుంటూ వెళ్ళాలి. ముందు ఒక అయిదారుగురం దిగాం. కొంత దూరం నడుం లోతు నీళ్ళు. లోపలకు వెళ్ళిన కొద్దీ లోతుగా ఉంది. వెలుతురూ తగ్గిపోతోంది. తలెత్తితే ఆకాశం కనిపించడం లేదు. రాతి కొండ చీలికలో సాగుతున్నాం. కొండ అంచులు ఎక్కడో ఉన్నాయి. ఆ ఏరు ఎన్ని మలుపులు తిరుగుతోందో! మేం కూడా అన్ని మలుపులు తిరుగుతూ ఈదుతున్నాం.
చీలికలో రెండు కొండల అంచులు దగ్గరకు వచ్చేశాయి. వాటి మధ్య దూరం నాలుగడుగులకు మించి లేదు. నీటి ప్రవాహానికి అడ్డంగా కాస్త ఎత్తైన ఒక పెద్ద బండ రాయి వచ్చింది. ఆ రాయి ఎక్కి అవలికి వెళ్ళాలి. ఒకరి సాయంతో మరొకరు ఆ రాయి ఎక్కి ఆవలికి దిగుతున్నాం. మళ్ళీ కొంత దూరం నీటిలో నడక. మళ్ళీ ఈదుతూ ముందుకు సాగడం. మళ్ళీ మరొక పెద్ద బండ రాయి అడ్డంగా వచ్చింది. రాతి కొండ రెండు అంచులకు రెండు చేతులు పెట్టి జాగ్రత్తగా ఒక్కో కాలు ఆ బండరాయిపైకి వేసి ఎక్కుతున్నాం. మళ్ళీ అదే తీరు. బండరాయి ఆవలికి వెళ్ళి మళ్ళీ ఈదుకుంటూ సాగుతున్నాం. ఒక పక్క చలి. మరొక పక్క విపరీతమైన అలసట. ఇంకొక పక్క గరుడ తీర్థం అంతు చూడాలన్న పట్టుదల. ముప్పేట సాగే ఈ భావనలతో ఉక్కిరి బిక్కిరవుతున్నాం. విశ్రాంతికి చోటు లేదు. తప్పదనుంకుటే కొండ అంచుల్లో పట్టు దొరికించుకుని కాసేపు అలసట తీర్చుకుంటున్నాం. కొండ అంచులు కూడా పాకుడు పట్టి ఉన్నాయి. పట్టుకుంటుంటే జారిపోతోంది.
వెలుతురు లేని సన్నని గొంది లాంటి రాతి చీలికలో, ఇలా ఆరు పెద్ద పెద్ద బండ రాళ్ళను దాటుకుంటూ, ఈదుకుంటూ సాగే సరికి ఆ కొండ చీలిక అంతమైపోయింది. చీలికి అంతమైన కొండ నుంచి పెద్ద శబ్దం చేస్తూ నీటిప్రవాహం వచ్చిపడుతోంది. ఆ ప్రవాహం కింద నిలుచోడానికి కాస్త చోటిచ్చేలా బండరాళ్ళున్నాయి. ఆ బండరాళ్ళ పైన నుంచుంటే తలపైన వచ్చిపడుతున్న నీటి ప్రవాహానికి ఉక్కిరిబిక్కిరైపోతున్నాం. అక్కడే పై నుంచి సూర్యకిరణాలు సన్నగా పడుతున్నాయి. పొద్దుటినుంచి సూర్యుడు కనపడిన పాపాన పోలేదు. ఆ కిరణాలు కూడా కాస్త వెలుతురుకే తప్ప వెచ్చదనానికి పనికిరావు. ఈ ప్రవాహానికి కాస్త ముందు కొండ అంచున ఎగురురుతున్న గరుడ పక్షి ఆకారంలో రాయి ముందుకు చొచ్చుకు వచ్చింది. అందుకే దీనికి గరుడ తీర్థం అన్న పేరు పెట్టారు.
తలెత్తినా ఆకాశం కనిపించని చోటు, వెలుతురు లేని రాతి చీలికలో ఈదుకుంటూ వెళ్ళడం, నిజంగా ఇది భయకంపిత సౌందర్యమే. ప్రకృతి ఎంత మనల్ని ఆకట్టుకున్నా, అది ఒక్కొక్కసారి మనల్ని భయపెడుతుంది కూడా. అందుకు గరుడ తీర్థం నిలువెత్తు సాక్ష్యం. శేషాచలం కొండల్లో ఎన్ని తీర్థాలు తిరిగినా, ఎన్ని సాహసాలు చేసినా, గరుడ తీర్థం మాత్రం భయపెట్టే సాహసమే!
వచ్చిన దారినే ఈదుకుంటూ తిరిగి వచ్చేస్తున్నాం. అడ్డంగా ఉన్న బండ రాళ్ళను ఎక్కుతూ దిగుతున్నాం. వెళ్ళేటప్పుడు బండరాళ్ళను ఎక్కడం కష్టం కాదు కానీ, ఒక్క దగ్గర తప్ప మిగతా అన్ని చోట్లా మరొకరి సాయం లేకుండానే దిగుతున్నాం. ఈ దుకుంటూ ఒడ్డుకు వచ్చేశాం. ఇలా ఒక్కొక్క బృందంగా వెళ్ళి వచ్చేస్తున్నారు. ఏ ఒక్కరూ వెనుకాడడం లేదు. మా సామాను పెట్టిన దగ్గరకు వచ్చేసి, భోజనాలు చేశాం. మధ్యాహ్నం రెండవుతోంది. మళ్ళీ లోయలోంచి కొండ ఎక్కడం మొదలు పెట్టాం. కొండ ఎక్కు తున్నంత త సేపు ఎక్కడా ఎండ కనిపించలేదు. అంతా దట్టమైన చెట్లు.
లోయలో కొండ దిగేకంటే, ఎక్కడం చాలా కష్టమనిపించింది. పట్టుదొరకడం లేదు. పాక్కుంటూ ఎక్కుతున్నాం. అయినా జారుతోంది. అలసిపోవడం తో అడుగులు భారంగా పడుతున్నాయి. శక్తినంతా కూడగట్టుకుంటేనే లోయలోంచి కొండ ఎక్కగలిగాం. పైకెక్కేసరికి ‘‘హమ్మయ్యా’’ అనుకున్నాం. ఎండ చంపేస్తోంది. అక్కడికి కిలో మీటరు దూరంలోనే గంధర్వ తీర్థం ఉంది. గంధర్వ తీర్థంలో నీళ్ళు లేకపోవడం వల్ల వెళ్ళలేకపోయాం. గరుడ, గంధర్వ తీర్థాల నుంచి వచ్చిన నీళ్ళే పాల్గుణ తీర్థంలోపడి, అక్కడి నుంచి మార్కండేయ తీర్థంలో పడి, డబ్బారేకుల కోన ద్వారా దేవ తీర్థం లో పడి, తుంబురు ప్రవహించే అన్నమయ్య జిల్లాలోకి వెళ్ళిపోతుంది.
మళ్ళీ భారంగా అడుగులు వేసుకుంటూ సత్రాల దగ్గరకు వచ్చేసరికి సాయంత్రం నాలుగైంది. మా వాహనాల్లో తిరుగు ప్రయాణమయ్యాం. తిరుపతి చేరేసరికి సాయంత్రం ఆరుగంటలైంది.
ఎనిమిది గంటల నడక, 48 కిలోమీటర్లు వాహనాల్లో..
గరుడ, పాల్గుణ తీర్థాలు వెళ్ళి రావడానికి తిరుపతి నుంచి పన్నెండు గంటలు పడుతుంది. తిరుపతి నుంచి తిరుమలకు 18 కిలోమీటర్లు ఘాట్ రోడ్డు ప్రయాణం. అక్కడినుంచి అన్నమయ్య మార్గంలో ఉండే పాడుపడిన సత్రాల వరకు ఆరు కిటోమీటర్ల వాహనాలు వెళతాయి. అక్కడి నుంచి నడకే. మొత్తం పన్నెండుగంటల ప్రయాణంలో రెండు గంటల విశ్రాంతిపోను, కనీసం ఎనిమిది గంటలు అతికష్టమైన కొండలు ఎక్కుతూ, తిగుతూ, వాగుల్లో ఈదుతూ సాగాలి. అడవిలోకి వెళ్ళాలంటే అటవీ శాఖ అనుమతి తప్పని సరి.
మధు కాలమానం
"లోయలోకి దిగడానికి ఎంత సేపు పడుతుంది!?” అడిగాను. “ఆఁ.. ఎంత సేపు ! దిగడం అయిదు నిమిషాలు.” అన్నాడు మధు. నా అనుభవంలో మధు కాలమానం ప్రకారం అయిదు నిమిషాలంటే అరగంట. మధు కాలమానంలో కూడా ఇప్పుడు మార్పు చోటుచేసుకుంది. అయిదు నిమిషాలంటే గంట పడుతోంది. తొందర చేస్తుంటాడు. హడావిడి చేస్తుంటాడు. ఫొటోలు తీస్తూ, ఎవరైనా అలస్యం చేస్తే అరుస్తుంటాడు. ఫొటో ఫ్రేమ్ అంతా పడితేనే శాంతిస్తాడు. క్లిక్ మనిపించేముందు నాలుక బైటపెడతాడు. నాలుక బైటపెట్టాడంటే ఫొటో కుదిరినట్టే లెక్క అంతా నవ్వుకుంటాం.