
మనభూమి, మనశ్వాస మనక్కాకుండా పోతున్నాయ్...
కాపాడుకునేందుకు ఎగబడండి అక్షరాయుధాలతో...తెలకపల్లి కవిత్వ పరామర్శ
-కెంగార మోహన్
మనిషి చైతన్యం నిరంతరం ఆర్థిక రాజకీయ-సాంస్కృతిక వాస్తవాల నుంచే వస్తుంది-పెరుగుతుంది. పైనఉండే నిర్మాణంలోని భాగం కాబట్టి పైకీ, ముందుకు కిందికి చూసి రావలసిన మార్పుల గురించి హెచ్చరిస్తుంది-అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఈ విషయంలో కవి అనేవాడు పాట, పద్యం, వచన కవిత ఏది రాసినా ఏ ప్రయోగం చేసినా స్వతహాగా ఉండే మనిషి ఆవేశాన్ని-ఆలోచనలను-కలలను వ్యక్తం చేయవలసిందే.
-నిఖిలేశ్వర్
‘ఈ దేశపు న్యాయ గుమ్మటం
దానికదే కూలిపోయింది
ఎవరూ కూల్చలేదు పాపం
ఈజాతి లౌకికత్వం
దానికదే పేలిపోయింది
ఎవరూ మందుగుండు పెట్టలేదు పాపం’
బాబ్రీమసీదు విధ్వంసాన్ని పై కవితావాక్యాల్లో చెప్పిన కవి తెలకపల్లి రవి. మస్తిష్కపొరల్ని దాటుకొని రవి కవిత్వం ఇప్పుడిప్పుడే వర్తమానసాహిత్య సమాజానికి చేరుతున్నది. ప్రగతిశీల జర్నలిస్ట్ పరిణామక్రమంలో కథకులుగా, రాజకీయ విశ్లేషకులుగా, విమర్శకులుగా, చరిత్రకారులుగా బహుముఖీయ ప్రజ్ఞకలిగిన ఆయన కవిత్వం కూడా రాస్త్తారన్న సంగతి ఈ పుస్తకం ద్వారానే తెలుస్తుంది. గతంలో అడపా దడపా రాసిన అనుభవం లేకపోలేదు. ఏ కవికైనా మార్క్సిస్ట్ అవగాహన వుంటే సమాజాన్ని వ్యవస్థల్ని సమగ్రంగా అర్థం చేసుకోడానికి అవకాశం వుంటుంది. ఈకవికున్న మార్క్సిస్ట్ అవగాహన మాత్రమే సాహిత్య రాజకీయరంగాల్లో ప్రముఖంగా నిలబెట్టగలిగింది. ఏదిరాసినా..ఏం మాట్లాడినా ప్రజల పక్షానే మాట్లాడతారు, ప్రజల పక్షానే నిలబడతారు. అందుకే మహాకవి శ్రీశ్రీ మార్క్సిజం అనే సిద్దాంతదర్శనం ఉన్న రచయిత కథ రాసినా, కవిత రాసినా, ఏది రాసినా నిబద్దత మాత్రమే అతన్ని ప్రభావితం చేస్తుందంటారు. ఫ్రెంచ్ కవి లూయీ ఆరగాన్ చెప్పినట్లు ‘ఎర్ర ట్రెయిన్ కదిలింది, ఇక దీన్నేవరూ ఆపలేరు’ అన్నట్లు ఆయన సాహిత్య రాజకీయపరంపర కొనసాగుతుంది.
ఇటీవల ఆయన 61 కవితలతో సజీవం అనే కవితా సంపుటి తీసుకొచ్చారు. తెలుగు సాహిత్యంలో కవిత, కథ, నవల, చరిత్ర, విమర్శ, నాటకం, పాట, అనువాదం ఇలా అన్నీ ప్రక్రియలు రాశారు. పద్యశతకాలు మాత్రం రాసిన దాఖలాలు లేవు. ఆయన రాసిన వందలపుస్తకాల్లో "సజీవం" అనే కవిత్వాన్ని కవితాసంపుటిగా తీసుకురావడం మాత్రం ఇది ప్రథమం. ఈ కవి రాసిన కవిత్వం ఎవరి పక్షాన నిలబడిందో చూద్దాం.."ద్వేషగీతం" పేరుతో రాసిన కవిత చూద్దాం..
కొన్ని మొహాలు సాదాసీదాగా వుంటాయి సత్యం చెబుతుంటాయి/
కొన్ని మొహాలు ఆత్మీయత గుమ్మరించి ఆప్యాయత వొలకబోస్తాయి ఆపైన కూలదోస్తాయి/
కొన్ని కత్తులు చర్మం చిట్లకుండా గుండెను తొలగిస్తాయి తలను అంటుకోకుండా మెదళ్లను అంటిస్తాయి/
కొన్ని శక్తులు మతం పేరుతో గతం తవ్వుతాయి/
కొన్ని కుయుక్తులు దేశం పేరుతో ద్వేషం పెంచుతాయి/
దేవుడి ముద్రతో దేశాలను చీల్చుతాయి/
ఈ దేశంలో పాలకులు పాడుతున్న ద్వేషగీతం ఇదే కదా! దశాబ్దకాలం పైగా పాడుతున్న రాక్షసరాజకీయ ద్వేషగీతం ఇదే కదా?దుర్మార్గపాలన ఆరంభమైన ఏడాదే ఈ కవిత రాశారు. ఇప్పటికీ వాళ్లు చేసేదిదే కదా. ఇంకా చెప్పాలంటే ఇదే ఏడాది ఇంకో కవిత ‘అదంతే’ శీర్షికతో రాశారు.
మొహాలు కనిపిస్తాయి, మోహాలు కనిపించవు, కళ్లు చూస్తుంటాయి కుళ్లు కనిపించదు./
గొప్పలు వినిపిస్తుంటాయి, తప్పులు అదృశ్యమై పోతాయి/
నీతులు మార్మోగుతుంటాయి, గోతులు లోతుకెళుతుంటాయి/
వేదాంతాలే ప్రతిధ్వనిస్తాయి, వేల కోట్లు గల్లంతవుతాయి, భక్తి ప్రపత్తులు పొంగిపొర్లుతాయ్ కుయుక్తి వేషాలు నక్కిదాగుతాయ్/ ఇప్పటికీ సాగుతున్నదిదే. మూడుసార్లు అధికారంలోకి వచ్చి చేస్తున్నదిదే కదా. ఈ కవితనూ పదకొండేళ్ల క్రితమే రాశారు. అయితే ఈ పదకొండేళ్లు దేశం అనుభవించిందేమిటి? ఈ దేశం ఎవరి కబంధ హస్తాల్లో చిక్కుకున్నది.? ఈ దేశానికి పట్టిన దారిద్య్రం ఏమిటి? అసలు ఈ దేశం ఈ పదకొండేళ్లు సాధించిందేమిటి? ఈ మధ్య రాసిన "మోడం" అనే కవితలో రవి ఏం చెప్తాడో చూద్దాం..
కమ్మిన మోడం కాషాయ పాదం
చాయ్ వాలా సే గాయ్ వాలా
స్వచ్చ భారత్ మే ఖూన్ కీ రాత్
స్వమతమే సమ్మతమని కట్టబెట్టాయ్
బాకాలన్నీ కేకలతో అభిషేకించాయి
కార్పొరేట్ ఖజానాలన్నీ ఏకమై నిలబెట్టాయ్
ఓట్లన్నో వరదలా ప్రవహించాయి.
మొదలైందింక మన్ కీ బాత్
థన్ కీ హాత్
ధ్యాన్ కే సాత్
సబ్‌కే హఠావో
హమ్ కో బిచావో
పాలనాపాదం వామనపాదమై మోపినప్పటి నుండి ఇప్పటివరకు సాగుతున్నది, సాగిస్తున్నది ఇదే. వీళ్ళ పాలనలో లౌకికత్వం నాశనమైందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మతోన్మాద పాలకుల గూర్చి ఇంకెంత రాస్తాం. ఈ సంపుటిలో రాజకీయవ్యతిరేక కవితలు ఇంకా ఉన్నాయి. అవన్నీ ఉటంకించడమిక్కడ సాధ్యం కాదు. కానీ తెలకపల్లి రవి ‘ఏమన్నారండీ!’ అనే కవితలో ‘ప్రతీది మాయామర్మం, ప్రపంచ మార్కెట్ మనుధర్మం’ ఇదిప్పుడున్న వర్తమాన భారతం. వాళ్లు నిర్మిస్తున్న మతోన్మాద భారతాన్ని వొక్కమాటలో వొక్క కవితావాక్యంలో చెప్పేశారు.
ఇక ఈ కవిత్వనిర్మాణంలోకి వెళ్లె ముందు ఈ కవిత్వాన్ని రెండు కోణాల్లో చూడాలి. వొకటి మార్క్సిస్ట్ దృక్పథమైతే, రెండోది మనస్తత్వ దృష్టి నుంచి పర్యాలోచన చేయాలి. ఇలా చూడటం కూడా సాహిత్య సిద్దాంతానికి లోబడి చేసే విమర్శే. ప్రధానంగా ఈ కవిత్వం యతిప్రాసలకు ప్రాధాన్యతగా సాగుతుంది. ఇదేం కొత్తకాదు. ఆధునిక కవిత్వ ఆరంభదశ నుంచి సాగుతున్న కవిత్వ నిర్మాణమే. మహాకవి శ్రీశ్రీ కూడా రాసిందిలాగే. ఈ యతిప్రాసల వల్ల కలిగే కవిత్వ ప్రయోజనం పాఠకుణ్ణి కవిత చదివిస్తుంది. వర్తమాన సమాజం పట్ల కవి ఎలా స్పందించాడు, వర్తమాన కవిత్వ సంగతులను ఎలా రికార్డు చేయగలిగడాన్నదే ప్రమాణం. "అగ్గినవుతా" కవితలో ఏం చెబుతాడో చూద్దాం..
పడిపోతే లేస్తాను, పరిహసించొద్దు
ఓడిపోతే మళ్లీ గెలుస్తాను, గేళి చేయొద్దు
తప్పు చేస్తే దిద్దుకుంటాను, దెప్పి పొడవొద్దు
వెనకబడితే వేగమవుతాను, వెక్కిరించొద్దు
తెలియకుంటే తెలుసుకుంటాను, తక్కువ చూడొద్దు
కొరతలుంటే కోలుకుంటాను, జాలి చూపొద్దు
ఈ కవితలో లయబద్దమైన సృష్టిఉంది. అందుకే అమెరికన్ కవి ఎడ్గర్ ఎలన్ పో " Poetry is the rhythmic creation of beauty" సౌందర్యం యొక్క లయబద్దమైన సృష్టి అన్నాడు. వాస్తవానికి కవిత వ్యక్తిత్వవికాసానికి సంబంధించినదిగా కనబడుతుంది. వ్యక్తిత్వ వికాసమన్నది కూడా చైతన్యంలో భాగమే కదా. ముందుగానే చెప్పినట్లు పై కవిత మనిషి మనస్తత్వానికి సంబంధించినది. ఈ సంపుటిలో ఇలాంటి కవితలూ కనబడతాయి. ఈ కవిత చైతన్యాన్ని కలిగిస్తున్నట్లే మనకు కనబడినా, కవికీ సమాజానికి మధ్యఉన్న, ఉండాల్సిన గతితార్కిక సంబంధాన్ని వెల్లడిస్తుంది. దీన్నే మార్క్సిస్ట్ సౌందర్యశాస్త్రం అంగీకరిస్తుంది.
నాగరిక సమాజమని మనం విర్రవీగుతున్నాం. ఆధునికత ముసుగులో చేస్తున్న వికృతాల మూలంగా సమాజం తిరోగమనదిశలో పయనిస్తుంది. అవును ఇది నిజం కూడా..మనుషులకూ మనుషులకూ మధ్య దూరం బాగా పెరిగింది. ప్రపంచం చిన్నదైంది, కుగ్రామమైంది, అరచేతిలో ప్రపంచముంది ఇవన్నీ పాత మాటలిప్పుడు. ఈ సమాజంలో మనిషున్నాడన్నది భ్రమలా మిగిలిపోతుందేమో. మనిషే యంత్రమయ్యాక చూపుడు వేలే మస్తిష్కమైంది. విధ్వంసాలను మోస్తున్న చరవాణిలో ఎన్నో విస్ఫోటనాల్ని స్వేచ్ఛగా నొక్కేస్తున్నాడు. అందుకే ఈ కవి అంటారు..
"ఎవరూ మెళకువలో లేరు
కలల్లో మునిగిపోయారు
ఎవరూ హాయిగా లేరు
టెన్షన్లతో పోట్లాడుతున్నారు
ఎవరూ పలికేలా లేరు
నో ఆన్సర్ కాల్స్ ట్రైచేస్తున్నారు."
కవి ఎంత సున్నితంగా చెప్పారు కదా. అంతటితో ఆగరు. ‘మనం మనలో మిగిలామా దాంట్లోనే తగలడ్డామా?’ అని వొదిలేస్తారు. మొబైల్ ఫోన్ల విపరీత పోకడల్ని, ప్రమాదాల్ని, పర్యావసనాల్ని ఈ కవిత్వంలో కొన్నిచోట్ల రికార్డు చేయగలిగారు. ఏ కవైనా అమ్మగూర్చి, కవిత్వం గూర్చి, కాలం గూర్చి రాస్తుంటారు. దాదాపు ప్రతీ కవి రాస్తారు. ఈ సంకలనంలో కవిత్వం గూర్చి మూడు కవితలుంటాయి. కవిత్వానికి నిర్వచనం ఇవ్వడం, తన కవిత్వం ఏ ప్రయోజనాల్ని కాంక్షిస్తుందో చెప్పడం చేస్తారు. సరిగ్గా ఈ కవి ఇదే చేశారు..
కవిత్వ నిర్వచనం..‘నా కవిత్వం’ శీర్షికలో..
నిర్మలం, నిరామయం, నిశితం నా కవిత్వం
నిశ్చితం, నిష్టూరం, నిరలంకారం నా కవిత్వం
విశ్వాసం, విభిన్నం,విరాగం నా కవిత్వం ఝంకారం ఫీుంకారం, ధిక్కారం, నా కవిత్వం
జనత,ఘనత,చరిత నా కవిత్వం
సెగ, పొగ, పగ నా కవిత్వం
కల, జల, జ్వాల నా కవిత్వం
భావం, రావం, ఏవం నా కవిత్వం
అంకురం, అంకుశం, ఆశయం నా కవిత్వం
తనం, నూతనం, స్వరం, భాస్వరం నా కవిత్వం
కవి ఏం రాయాలనుకుంటున్నాడన్న విషయం ‘అన్నీ రాయల్సిందే’ అనే శీర్షికలో చెప్తారు. అదేంటో చూద్దాం.
కవిత్వం రోజూ కవ్విస్తూ కదిలిస్తూ
అంతటా అన్నిటా తొంగిచూస్తూ
అడుగడుగు అక్షరమై పలకరిస్తూ
అక్షయమై పలవరిస్తూ
అన్నీ రాయాల్సిందేననీ
అభివ్యక్తం కావాల్సిందేనని
వెంటాడుతూ వేటాడుతూ
కాగితానంతర కంప్యూటర్లలోకి
వేలికొసల కీబోర్డుల్లోకి
పరుగులు నురగలు
గతంతో వర్తమానం పోల్చుకుంటూ
వర్తమానంలో గతం వెతుక్కుంటూ రాయాలంటారు.
తెలకపల్లి రవి ఈ కవిత్వాన్ని వొకచోట జీవధారతో పోల్చారు. నిజంగా గొప్ప అభివ్యక్తి. తన జీవితంలో ఎలా మిళితమై సమ్మిళితమై తనతో ఎలా కలసినడుస్తుందో చాలా ఆర్ధ్రతగా చెప్పారు. నిజంగా కవిత్వానికి చాలా బలముంది. కవి జీవితానికొకసారి పరిచితమైతే అది ఊపిరిపోయేవరకు కాదు, ఊపిరిపోయాక కూడా కవినిబతికిస్తుంది. అదే కవిత్వానికున్నశక్తి. అందుకేనా కవిత్వాన్ని జీవధార అన్నారనిపిస్తుంది.
చివరగా వొక విషయాన్ని ప్రస్తావించకపోతే ఈ మాటలకు అర్థం లేకుండా పోతుందనిపించింది. ముందుగా నే పేర్కొన్నట్లు కవి మార్కిస్ట్ దృక్పథమని అన్నాను. ఆ విషయాన్ని ఈ కవిత్వ సంపుటిలో బలపరచడానికి చాలా కవితలున్నాయి. అయితే వొకబలమైన కవిత్వవాక్యం చెప్పాలనిపిస్తుంది. అదేమంటే..‘మనషులవ్వాలంటే మాత్రం మనశ్వాస మనది కావాలి’..మనమెలాగున్నామో, ఎలా బతకుతున్నామో, ఏ కార్పోరేట్ కబంధహస్తాలకు బలవుతున్నామో మనకు తెలుసు. మనభూమి, మనశ్వాస మనక్కాకుండా చేసిన పాలకులపై, కార్పోరేట్లపై మన అక్షరయుద్దం ఆపకూడదు. అదే ఈ కవిత్వం రగిలించే జ్వాల.