భగ భగ మండే ఎండల్లో శేషాచలపు కొండల్ని చుట్టొద్దామా !
x

భగ భగ మండే ఎండల్లో శేషాచలపు కొండల్ని చుట్టొద్దామా !

శేషాచలం కొండల్లో ప్రకృతి కాలానికొక వయ్యారం వొలకబోస్తుంది. వర్షాకాలం తడిసి ముద్దైన అందం. శీతాకాలం పొగ మంచు సౌందర్యం. మండ వేసవిలో ఎలా ఉంటుంది?


(భూమన్)

శ్వేత (Sri Venkateswara Employees Training Academy (SVETA) సంచాలకుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విశ్రాంత జీవనానికి నేనిచ్చే స్ఫూర్తి కొంత కుంటు పడుతున్నదేమోనని ఇంత కాలం కొంచెం బెంగగా ఉండేది. శ్వేతలో ఉండటం వల్ల కొన్ని మంచిపనులు చేయొచ్చు , తరిగొండ వెంగమాంబ పుస్తకాలను , పాటలను విస్తృతంగా ప్రచారం చేయటమేగాకుండా , అజ్ఞాతంగా ఉన చాలా సమాచారాన్ని రాబట్టవచ్చునని ఒక పట్టుదల. రాగానే అజ్ఞాత సంకీర్తనాచార్యుడు సారంగపాణి ప్రాజెక్టుకూడ మొదలు పెట్టినాను. ఈ సంకీర్తలన్నింటినీ వెలుగులోకి తీసుకురావాలి. మా ఉద్యోగులకు మరింత మెరుగయిన శిక్షణ ఇవ్వాలని వొక ప్రణాళిక రచించుకోవటం వల్ల ఈ మధ్య కొంచెం నా అడుగులకు ఆటంకం వచ్చింది.

ఇప్పుడిప్పుడే కోలుకొని కొంచెం తీరిక చేసుకుని మొన్న కుమార ధార పోయొస్తే ఈ రోజు మా అటవీ ఉద్యోగుల పట్టుదల , 'కొత్త ట్రెక్ సార్' అని ఊరిస్తే , సరేనని మా ఆఫీసు స్టాఫ్ ని వెంటబెట్టుకుని గంగుడుపల్లెకు బయలుదేరినాము.


రాత్రి వరకు ఏమి పోతామబ్బా ఈ మండే ఎండలకని బాగా వెనకాడినాను. కొత్త ట్రెక్ ఊరిసున్నది కదా. మేమెవరం చూడలేదు సార్ మీరు తప్పనిసరిగా రావాల్సిందే ! పైగా మేకపోతుపట్టినాము , నిరాశపరచకండి అంటే కదిల్నాము. పైగా ఈ ట్రెక్ మేమే మొదట చేసిన వాళ్ళము అవుతాము.

ఇంతకు మునుపు ఈ పల్లెకు అనుకుని ఉన్న గుర్రప్పకొండకు నాలుగైదు మార్లు ట్రెక్ చేసివచ్చినాను. సరిగ్గా ఆ గుర్రప్పకొండకు ఎదురుగా చాలా ఎత్తయిన కొండ చూడ్డానికి భలే బాగుంది.దీనిపేరు జెర్రిపోతు కట్ట.


దారి దారంతా జారుడు , ఎక్కుడు , మట్టి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పడిపోతాము. జాగ్రత్తలు చెప్పుకుంటూ పోతున్నాము. మా వాళ్లకు కొత్తయినా చాలా ఉత్సాహంగా హాయిగా నడుస్తున్నారు. కొత్తకదా మరోప్రపంచం చూసినట్టుంది. కొండంతా బోడిగావుంది. ఎక్కడో మచ్చుకు అక్కడక్కడా పచ్చటి చెట్లు , కంప కంపగా ఉంది. ఐతేనేం ఆ రాతివరసలు , నీళ్లుకారిన వంకలు , జారుడు బండలు , వింత వింత రాతి ఆకారాలు , ఊడలు మమ్మల్ని మరింత ఊపెక్కిస్తున్నాయి.


మాతోపాటు గంగుడుపల్లె షణ్ముగం ఉన్నాడు. అతడు పశువుల కాపరి. దాదాపు 30 మంది తమ పశు వుల్ని అట్లా అడవులకు తోలేస్తారట. అక్కడే మేసి , చిన్నబావిలో నీరుతాగి సంవత్సరం పొడవూ ఆ కొండల్లోనే సేదతీరతాయట. ఊరికి పిల్చుకుపోరు , పాలు పితకరు , కోడెదూడలను మాత్రం అమ్ముకుంటారట.


ఎందుకయ్యానని అడిగితే జల్లికట్టులో వీటిని పోటీకి దింపటంకోసమనిచెబితే ఆశ్చర్యపోయినాను. ఈ పల్లెల్లో జల్లికట్టు ఎక్కువ సందడిగా ఉంటుంది. ప్రతిసంవత్సరం జోరుగా జరుగుతాయి. వారినికి రెండు రోజులు ఈ కొండలు తిరిగి చూసుకొని వస్తాడట. అవి ఇతన్ని గుర్తుపట్టి పిలవగానే దగ్గరకు రాగానే మేమంతా నోళ్లు వెళ్లబెట్టినాము. భలే గుర్తుపడతాయట యజమానిని. పరాయివాడికి దరిదాపుల్లో కూడా ఉండవట. అందువల్ల వాటిని ఎవరూ తోలుకుపోయే ప్రమాదమే లేదు. ఈ కథ మాకు కొత్త. చదివే మీకు కొత్తే.

ఈ కొండల్లో నాలుగైదు వరసలపైకి పోతున్నాము. మధ్య మధ్యలో ముళ్లపంది పెంటికలు , మేకలు , దుప్పులు , కణుతుల పెంటికలు కనిపిస్తే వీటి కథేమిటని అడిగితే , జింకలు , కణుతులను బాగా వేటాడటం వల్ల సంఖ్య బాగా తరిగిపోతున్నదని బాధగా చెప్పినాడు. చుట్టుపక్కలవారు అడవి జీవాలను బాగా మరిగినట్టు చెప్పినాడు. ఎలుగుబంట్లువున్నా పెద్దగా ఊర్లమీదికి రావట.

పశువుల మంద సేదతీరేస్థలము , కరోనా కాలంలో పశువులకు వైద్యంచేసిన ఆనవాలు చూపించినాడు. ఆ సమయంలో తమ పల్లెల్లో ఎవరూ పాలు తాగేవారు కాదు.


మాటల్లో పైకి వచ్చేసినాము. పెద్ద గండ్రటి ఆకారం. దాన్నే జెర్రిపోతు గుండు అంటారు. దాని దాకాపోయినాము కానీ. తాడుపట్టుకుని పైకి ఎక్కాలి ఆ తాడు గట్టిగాలేదు. ఎక్కడ తెగిపోతుందోనని వారిస్తే ఎక్కడానికి సాహసించలేదు. ఆ పని అటవీ కార్మికుడు రమణ చేసినాడు. పైన దీపపు గూడుందని , ప్రతిసంవత్సరం కార్తీక పౌర్ణమినాడు గ్రాముస్తులు దీపం వెలిగిస్తారని తెలిసింది. ఏమలవాట్లు , ఎటువంటి నమ్మకాలు పల్లెజనానికి అంతరిస్కు తీసుకుని , ఇట్టాంటిపనీ నగరి ముక్కు , యోగులు పర్వతంలోనూ చేస్తున్నారు.


మనిషి ఎంతటి సాహసి , పట్టుదల గలిగినవాడు , మనకే తెలియదు ఈ కొండలు , గుట్టలు , అడవులు , జలపాతాలు , సెలయేర్లు తిరిగితే అనేకానేక పాఠాలు నేర్చుకుని రావొచ్చు. వానలు , చల్లటి కాలం అడవులు , కొండలు తిరగటం , జలపాతాల్లో ఈదులాడటం మహారంజుగావుండే , ఈ సీజన్లో , చుక్కనీరుకూడా దొరకని చోట , మండే ఎండల్లో ఈ సౌందర్యాన్ని చూసి రావటం ఒక గొప్ప అనుభవం. చెట్లన్నీ ఎండిపోయి , మరికొన్ని విరిగిపోయి , కాళ్లకు కంపచుట్టుకుంటూ అట్లా నడుస్తూ ఈ కాలపు సౌందర్యాన్ని తనివితీరా చూడటం ఒక మహదానందం ! మనోహరం !


మా ట్రెక్శీను భగవాన్ మా ఆఫీసు సిబ్బంది , రమేష్ , లక్ష్మీనారాయణ , కుమార్ , లక్ష్మీనారాయణ రెడ్డి , ప్రభాకర రెడ్డి , మా గ్రంథాలయసిబ్బంది రాజు , పవన్ , మా బ్రాడ్ కాస్టింగ్ ఈశ్వర్ రెడ్డి , మా డ్రైవరు వెంకటేష్ ఈ మండే ఎండల్లో రావటం , తొలిసారిగా ఇట్టాంటి అనుభవానికి పరవశించి గొప్ప అనుభూతి పొందటం ఒక సీనియర్ ట్రెక్కర్గా చాలా సంతోషమనిపించింది.


మా వెంకటరెడ్డి , అప్పిరెడ్డి కిందినుండి రెండు మార్లు తిరిగి మంచి అల్పాహారం , మాంసాహారంతో విందుచేయటం గొప్ప కొసమెరుపు.


ఇట్టాంటి ట్రెక్కింగుల వల్ల మధుమేహానికి దూరమవుతారని , ప్రకృతి గొప్ప ఆరోగ్యశక్తినిస్తుందని చెబితే మళ్లీ మళ్లీ వస్తామనీ సంకల్పం చెప్పుకున్నారు. వానాకాలంలో అడవుల్లోకి పోయిరావటంకాదు. వొక్కమారు భగ భగ మండే ఎండల్లో కొండలు , కోనలు , అడవులు తిరిగి రండి. గొప్ప జీవనసత్యం బోధపడుతుంది.

(భూమన్ శ్వేత (Sri Venkateswara Employees Training Academy (SVETA) సంచాలకులు)

Read More
Next Story