అసలైన అమ్మ ఒడి తరిమెల నాగిరెడ్డి తెలుగు పాఠశాల
x

తరిమెల నాగిరెడ్డి పాఠశాల భవనం

అసలైన 'అమ్మ ఒడి' తరిమెల నాగిరెడ్డి తెలుగు పాఠశాల

కేరళలో కు చెందిన లారీ బేకర్ అనే ఇంజనీర్ పర్యావరణ అనుకూలమైన భవనాలకు రూపకల్పన చేశాడు. అందుకే ఈ భవనం పాఠశాల భవనాలలో ప్రత్యేకంగా కనపిస్తుంది.


-రాఘవ శర్మ


అదొక అరుదైన తెలుగు పాఠశాల. తెలుగు భాషంత తియ్యగా ఉంటుంది. అమ్మంత ముచ్చటగా ఉంటుంది. అక్కడి చదువు కూడా అమ్మ పెట్టే గోరుముద్దంతా కమ్మగా ఉంటుంది.

మండు వేసవిలో కూడా ఏసీలు అవసరం లేదు. ఎండలు మండిపోతున్నా కూలర్ల పనేలేదు. కిటికీల్లోంచి ఎప్పుడూ చల్లని గాలి వీస్తుంటుంది. మంచి గాలీ వెలుతురు ఉండగా, పగటి పూట ఇక లైట్లెందుకు!? మామూలు రోజుల్లో ఫ్యాను అవసరం కూడా పెద్దగా కనిపించదు. అది అసలైన అమ్మ ఒడిలాంటి తరిమెల నాగిరెడ్డి తెలుగు పాఠశాల. ఇది నెల్లూరు శివారు ప్రాంతం వేదాయపాలెంలోని జనశక్తినగర్ లో ఉంది.

ఆ స్కూలు భవనం అష్టభజితో ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి పాఠశాల భవనాలు తెలుగు నాట ఎక్కడా కనిపించవు. అష్టభుజి రూపంలో ఒక భవనం విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఉంది. కానీ, అది పర్యావరణ అనుకూల భవనం కాదు. తరిమెల నాగిరెడ్డి పాఠశాల మాత్రం అష్టభుజితో పాటు, పర్యావరణ అనుకూల భవనం. ఈ భవనాన్ని ఎవరు, ఎలా నిర్మించారు!?

నెల్లూరుకు దక్షిణ దిక్కున ఉన్న వేదాయపాలెంలో నీళ్ళు లేని చెరువు ఒకటుండేది. ఆ పరిసర ప్రాంతాల్లో నివసించే పేదలు అక్కడ గుడిసెలు వేసుకున్నారు. కొందరు రేకుల షెడ్లు కూడా వేసుకున్నారు. వీళ్ళంతా ఇళ్ళలో పాచిపనులు చేసుకునేవారు, చీపుర్లు అమ్ముకునే వారు, ఇంకా చిన్నచిన్న పనులు చేసుకునే వారు. ప్రభుత్వం ఒత్తిడి చేస్తే వీరంతా మార్కెట్ రేటు చెల్లించి ఇళ్ళ జాగాలను సొంతం చేసుకున్నారు.


ఎటు చూసినా కిటికీలతో గాలి వెలుతురు సమృద్ధిగా ఉండే తరగతి గది


ఇక్కడ నిసించే పేదల పిల్లలకు చదువులు లేవు. పెద్ద వాళ్ళు పనుల్లో కెళితే, పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉండడమో, పెద్ద వాళ్ళతో పాటు పనులకు వెళ్ళడమో జరిగేది. ఆ సమయంలో డాక్టర్ సుధీర్ అధ్యక్షులుగా, కొండమ్మ కార్యదర్శిగా ఏర్పడి, పూరిపాకలో తెలుగు పాఠశాల మొదలు పెట్టారు. తరిమెల నాగిరెడ్డి అభిమానులైన వీరు దానికి 'తరిమెల నాగిరెడ్డి పాఠశాల' అని నామకరణం చేశారు. ఇంకేముంది, నక్సలైట్లు వచ్చి చేరారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయి. పోలీసులు వచ్చి పడ్డారు. పాఠశాలను మూసేయమన్నారు. దానిపైన పెద్ద గొడవే జరిగింది.


అనేక పోరాటాల ఫలితంగా 'తరిమెల నాగిరెడ్డి విద్యాసొసైటీ' పేరుతో మాధ్యమిక పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు లభించింది. అందులోని వారంతా పెద్దగా ఫీజులు చెల్లించలేని పేద పిల్లలు. పిల్లలకు మధ్యాహ్నభోజనం పెట్టాలి. టీచర్లకు జీతాలు చెల్లించాలి. ఎలా చేస్తున్నారంటే, చందాలు వసూలు చేసి స్కూలును నడుపుతున్నారు.

ఇంతకూ పాఠశాల భవనం ఎలాఉంది!? ఏ ప్రభుత్వ పాఠశాలకు లేని విధంగా ఈ పాఠశాల భవనం ఎంతో అందంగా సౌకర్యవంతంగా ఉంది.
కేరళలోని 'లారీ బేకర్' అనే ఇంజనీర్ పర్యావరణ అనుకూలమైన భవనాలకు రూపకల్పన చేశాడు. ఆ నమూనాతో ఈ పాఠశాల భవనాన్ని నిర్మించారు.

'లారీ బేకర్ ' భవనాల నిర్మాణంలో ఇటుకలను కాల్చకుండా, అచ్చుల్లో కంప్రెస్ చేసి ఉపయోగిస్తారు. అక్కడి మట్టి అందుకు అనుకూలంగా ఉంటుంది. అలాంటి మట్టి తీసుకొచ్చి ఇటుకలను తయారుచేయడమంటే చాలా వ్యయప్రయాసలు.


పాఠశాల లోపలి భాగం


స్థానికంగా దొరికే మట్టితోనే ప్రత్యేకమైన ఇటుకలను తయారు చేయించారు. ఇటుకలను కంప్రెస్ చేసి, వాటిని కాల్చి తయారు చేయించారు. ఇటుకలను అడ్డంగా పడుకోబెట్టి కాకుండా, నిలువుగా నిలుచోబెట్టి సిమెంటు సాయంతో ఒక వరుసకడతారు. ఒక గుప్పెడు ఖాళీ పెట్టి మరొక వరుసకూడా అలాగే కడతారు.


అంటే రెండు ఇటుకల మధ్య ఖాళీ జాగా ఉంటుంది. దీంతో బైట ఉండే వేడి గదిలోకి రాకుండా ఆ ఖాళీ జాగా పనిచేస్తుంది. దానికి ప్లాస్టింగ్ ఉండదు. గోడులకు ఇటుకల రంగే పూశారు.

అలాగే కప్పు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. సెంట్రింగ్ చేయడానికి ముందు కుండపైన బోర్లించే మూకుళ్ళను చెక్కలపైన ఒక క్రమపద్ధతిలో బోర్లిస్తారు. వాటిపైన సిమెంటు ఇసుక కలిపి ఒక వరుస వేస్తారు. దానిపైన ఇనుప కమ్మీలను యధావిధిగా పరిచి కాంక్రీటు పోస్తారు. ఇలా చేయడం వల్ల తక్కువ కాంక్రీటు పట్టడమే కాకుండా పైనుంచి వేడి లోపలకు ప్రవేశించదు. లోపాల చల్లగా కూడా ఉంటుంది. దీనికి సిమెంటు స్టీలు తక్కువ పడుతుంది.


కుండ మీది మూకుళ్ళు బోర్లించి వేసిన శ్లాబ్


సిమెంటు పిల్లర్లు వేస్తారు కానీ, చాలా తక్కువగా వేస్తారు. పిల్లర్లు లేని చోట బరువంతా గోడలపైనే ఉంటుంది. దీన్ని 'లారీ బేకర్ ' డిజైనింగ్ అంటారు. భవనాన్ని అష్టభుజిగా నిర్మించడం వల్ల ప్రతి గదిలోకి గాలి వెలుతురు వస్తుంది. ఈ పాఠశాల భవనం నేల నుంచి కాస్త ఎత్తుగా ఒక అంతస్తు నిర్మించి, దాని పైన మరొక అంతస్తు నిర్మించారు.


ఒక అంతస్తులో ఆరు గదులు, పై అంతస్తులో మరో ఆరు గదులు. ఈ పాఠశాల భవనాన్ని తరిమెల నాగిరెడ్డి జయంతి సందర్భంగా 2015 ఫిబ్రవరి 11వ తేదీన ప్రారంభించారు. ఈ పాఠశాలకు ప్రాథమికోన్నత పాఠశాల (అప్పర్ ప్రైమరీ స్కూలు) వరకు అనుమతి ఉన్నా, అయిదు తరగతులు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇక్కడ అతి తక్కువ సెలవలు ఇస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు పనులకు వెళితే పిల్లలు ఇంట్లో బిక్కుబిక్కు మంటూ ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. వేసవి సెలవలు అస్సలుండవు. భవనంలో చల్లగా ఉంటుంది కనుక ఎండ సమస్యే ఉండదు.

తెలుగు సమాజం ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీషు మీడియం మోజులో కొట్టుకుపోతున్న ఈ రోజుల్లో ఒక తెలుగు పాఠశాలను నిర్వహించడం, అది కూడా ఎటువంటి ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా నిర్వహించడం నిజంగా ఆశ్చర్యమేస్తుంది. ప్రాథమిక విద్య వరకు మాతృభాషలోనే బోధన జరగాలని విద్యపై వేసిన అన్నికమిషన్లు స్పష్టం చేశాయి. నూతన జాతీయ విద్యావిధానం- 2020 కూడా మాతృభాషలోనే విద్యాబోదన జరగాలని కోరింది. రాజ్యాంగంలోని 350 (ఎ) అధికరణం కూడా ప్రాథమిక విద్య మాతృభాషలోనే అందించాలని నిర్దేశించింది. ఇవ్వేవీ ఏలిన వారి చెవులకు ఎక్కలేదు.


మెట్లపై ఉన్న అందమైన పైకప్పు


ఇంగ్లీషు భాష మోజులో మాతృభాష పాఠశాలలు, ఓరియంటల్ కళాశాలలు మూతపడిన ఈ సమయంలో తరిమెల నాగిరెడ్డి పాఠశాల ఇలా పేద పిల్లలకు తెలుగులో విద్యాబోధన చేయడం నిజంగా అభినందనీయం. ఎలాంటి ప్రభుత్వ సాయం లేకుండా చందాలు వసూలు చేసుకుని పాఠశాలను నిర్వహించడం, మధ్యాహ్న భోజనం పెట్టడం ఆశ్చర్యం వేస్తుంది. ఎల్ కేజీకి కూడా ఎంట్రెన్స్ లు, లక్షల రూపాయల డొనేషన్లు, నెలనెలా వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి పాఠశాల ఒకటి ఉండడం నిజంగా అపురూపమే!


Read More
Next Story