15ఏళ్ల ఎఫ్‌జీజీ ప్రస్థానం
x

15ఏళ్ల ఎఫ్‌జీజీ ప్రస్థానం

ప్రభుత్వ రంగంలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసి, ప్రజలకు సుపరిపాలన అందించడమే ఆశయంగా హైదరాబాద్ లో ఏర్పాటైన సుపరిపాలన వేదిక 15 వసంతాలు పూర్తి చేసుకుంది.


ప్రభుత్వ ఐఎఎస్, ఐపీఎస్,ఐఎఫ్ఎస్ అధికారులుగా, జడ్జీలుగా, వైద్యాధికారులుగా, ప్రొఫెసర్లుగా, సోషల్ యాక్టివిస్టులుగా మూడు దశాబ్దాలకు పైగా పనిచేసి పదవీ విరమణ చేశారు. సుదీర్ఘకాలం సేవలందించి రిటైర్ అయ్యాక పెన్షన్ డబ్బుతో జీవనం సాగిస్తున్న మాజీ అధికారులందరూ తమకున్న అనుభవంతో ప్రజలకు విశిష్ఠ సేవలందించేందుకు ముందుకు వచ్చారు.

- ప్రజలకు సుపరిపాలన అందించడమే ఉన్నతాశయంగా వీరంతా కలిసి హైదరాబాద్ నగరంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. ప్రజల చేతిలో పాశుపతాస్త్రం అయిన సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి, న్యాయ పోరాటాలతో ప్రభుత్వం ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా సుపరిపాలన మేధావుల వేదిక పనిచేస్తోంది.
- ఇలా సుపరిపాలన వేదిక 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దశాబ్దంన్నర కాలంగా ప్రజలకు విశిష్ఠ సేవలందిస్తున్న సుపరిపాలన వేదిక ఈ నెల 19వ తేదీన వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో సుపరిపాలన వేదిక 15 ఏళ్ల న్యాయ పోరాటాల గురించి తెలుసుకుందాం.

ప్రజాసేవే పరమావధిగా...
ప్రజాసేవే పరమావధిగా సుపరిపాలన వేదిక 15 సంవత్సరాల క్రితం ప్రముఖ మేధావులతో హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైంది. ప్రజలకు సుపరిపాలన అందించాలనే ఆశయంగా, ప్రభుత్వం ప్రజలందరికీ విద్య, వైద్యం అందించడంలో విఫలం కాకుండా చూడటం, మూలన పడిన ఎన్నికల సంస్కరణలు అమలు కోసం,రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగ బద్ధంగా పనిచేసే పోలీసు వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యాలతో ఈ వేదికను ఏర్పాటు చేశారు. రాజ్యాంగ, స్వంత్ర ప్రతిపత్తి గల సంస్థలు సక్రమంగా పనిచేసేలా చూడటం, ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పించడం, పాలకుల అవినీతి, అక్రమాలను అడ్డుకోవడం, అధికార వికేంద్రీకరణ, పరిపాలనలో సంస్కరణల అమలు కోసం, పారదర్శక పాలన అందించడం కోసం సుపరిపాలన వేదిక పోరాటాలు చేస్తోంది.



సుపరిపాలన వేదిక కార్యక్రమాలెన్నో...

- తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగాల పనితీరుపై నిఘా వేసి అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి సుపరిపాలన వేదిక పనిచేస్తోంది.
- ప్రజల చేతిలో పాశుపతాస్త్రం అయిన సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఈ చట్టం ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని సేకరించి ప్రభుత్వ లోపాలను ఈ వేదిక ఎత్తి చూపిస్తోంది.
- రాజకీయాలు, పరిపాలనలో సంస్కరణలు తీసుకురావానికి ఈ వేదిక మేధావులు సమాలోచనలు చేసి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
- రాజ్యాంగం ప్రకారం పంచాయితీ, మున్సిపాలిటీలను బలోపేతం చేసేలా ఈ వేదిక ప్రజా ప్రతినిధులను సమాయత్తం చేస్తోంది.
- పర్యావరణానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఈ వేదిక చొరవ చూపిస్తుంది. ప్రజా సమస్యలపై ప్రజలను కూడగట్టి ఉద్యమాలు చేస్తుంది.
- ఉన్నతాశయాలు ఉన్న స్వచ్ఛంద సంస్థలు, పౌర సేవా సంస్థలతో కలిసి ఈ వేదిక ప్రతినిధులు పనిచేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని ఇతర స్వచ్ఛంద సంస్థలతో ఈ వేదిక ప్రతినిధులు కలిసి పనిచేస్తున్నారు.
- ఎన్నికల్లో నేరస్థుల నేర చరిత్రను ఓటర్లకు తెలియచెప్పి వారిని చైతన్యవంతులను చేస్తోంది. దీంతోపాటు ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల కమిషన్ తో పోరాడుతోంది.

ఐఎఫ్ఎస్ రిటైర్డు అధికారి పద్మనాభరెడ్డి కార్యదర్శిగా సుపరిపాలన వేదిక ఆవిర్భావం
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసుకు చెందిన యం పద్మనాభరెడ్డి కార్యదర్శిగా, హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ డి రెడ్డపరెడ్డి అధ్యక్షుడిగా సుపరిపాలన వేదిక మొదటి కార్యవర్గం ఏర్పాటైంది. నాటి కార్యవర్గంలో సోషల్ యాక్టివిస్టు ఎం వీ కృష్ణారెడ్డి, ప్రొఫెసర్ డి రావు చెలికాని, అప్సా డైరెక్టర్ ఎస్ శ్రీనివాసరెడ్డి, రిటైర్డు మెడికల్ ఆఫీసరు డి కరుణాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారులు సి ఆంజనేయరెడ్డి,ఏవీ నారాయణ, ఐఎఫ్ఎస్ మాజీ అధికారులు జేవీ శర్మ,కృష్ణ భూపాల్ రావు, సోషల్ యాక్టివిస్టు లోహిత్ రెడ్డి కార్యవర్గంగా విశిష్ఠ సేవలందించింది.
ప్రస్థుత కార్యవర్గం : సుపరిపాలన వేదిక అధ్యక్షుడిగా యం పద్మనాభరెడ్డి, కార్యదర్శిగా సోమ శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షుడిగా రిటైర్డు ఐపీఎస్ అధికారి ఎస్ గోపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఎన్ శ్రీదేవిలు కార్యవర్గసభ్యులుగా పనిచేస్తోంది.

ఆర్టీఐ దరఖాస్తుల్లో సుపరిపాలన వేదిక ముందడుగు
తెలంగాణలోని జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, ఏసీబీ, రెవెన్యూ, జీఏడీ, ఫైనాన్స్,హోం, విద్య, న్యాయ, మున్సిపాలిటీ తదితర ప్రభుత్వ శాఖలకు సుపరిపాలన వేదిక ఆర్టీఐ ద్వారా 2,139 దరఖాస్తులు చేసింది. 2010 నుంచి 2024 వరకు గడచిన 14 ఏళ్లలో రికార్డు స్థాయిలో ఆర్టీఐ యాక్ట్ ద్వారా సుపరిపాలన వేదిక సమాచారాన్ని సేకరించి, దాన్ని విశ్లేషించి ప్రజాహితానికి చర్యలు తీసుకుంది. దీనివల్ల ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుకట్ట పడింది.

న్యాయపోరాటానికి పిల్స్ దాఖలు
తెలంగాణలో వివిధ ప్రభుత్వ శాఖలపై సుపరిపాలన వేదిక న్యాయపోరాటం చేస్తోంది. దీనిలో భాగంగా గత 14 ఏళ్లలో 40కి పైగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను సుపరిపాలన వేదిక హైకోర్టులో దాఖలు చేసింది. కీలకమైన ఆరు కేసుల్లో హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పలు పిటిషన్లు హైకోర్టులో విచారణ దశలో ఉన్నాయి.

సుపరిపాలన విజయాలెన్నో...
- హైకోర్టులో సుపరిపాలన వేదిక చేసిన న్యాయపోరాటం ద్వారానే తెలంగాణలో సమాచార హక్కు చట్టం కమిషన్ ఏర్పాటైంది. తెలంగాణలో ఫైనాన్స్ కమిషన్ కూడా సుపరిపాలన వేదిక పిల్ ద్వారానే హైకోర్టు ఆదేశాలతో ఏర్పాటైంది.
- తెలంగాణలో గతంలో గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుంటే సుపరిపాలన వేదిక హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని కోర్టులు సర్కారును ఆదేశించాయి.సుపరిపాలన పోరాటంతోనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆర్టికల్ 243 ఎస్ ప్రకారం వార్డు కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
- గండిపేట మండలం కోకాపేటలో సర్వే నంబరు 239,240 నంబర్లలోని 11 ఎకరాల విలువైన భూమిని బీఆర్ఎస్ పార్టీ కోసం కేటాయిస్తూ గత కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సుపరిపాలన వేదిక పిల్ దాఖలు చేయడం హైకోర్టు దీన్ని ఆపేసింది.
- భూగర్భజల మట్టాన్ని పెంచేందుకు వీలుగా ఇళ్లలో ఇంకుడు గుంతలను నిర్మించాలని సుపరిపాలన వేదిక చేసిన న్యాయ పోరాటంతోనే ప్రభుత్వం ఇల్లు నిర్మించే వారు తప్పనిసరిగా ఇంకుడు గుంతను తవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రజా శ్రేయస్సు కోసం సుపరిపాలన వేదిక పోరాటం : అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల శ్రేయస్సు కోసమే సుపరిపాలన వేదిక పోరాటం సాగిస్తుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు తాము ఆర్టీఐ సమాచారాన్ని సేకరించి, పోరాటాలు చేసి అడ్డుకట్ట వేశామని ఆయన పేర్కొన్నారు. మరో వైపు తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి న్యాయపోరాటం ద్వారా ప్రజలకు మేలు జరిగేలా పనులు చేస్తున్నామన్నారు. గడచిన 15 ఏళ్ల తమ సుపరిపాలన వేదిక పోరాటాల్లో ఎన్నెన్నో విజయాలు సాధించామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో నేరగాళ్లు, డబ్బు, మద్యం ప్రభావాన్ని తగ్గించేందుకు, ఎన్నికల సంస్కరణల కోసం తాము రాజీలేని పోరాటం సాగిస్తున్నామని ఆయన వివరించారు.

ప్రజా చైతన్యానికి సమావేశాలు : కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి
తెలంగాణలో ప్రజలకు ప్రభుత్వాల ద్వారా సుపరిపాలన అందించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆర్టీఐ యాక్టు ద్వారా అందిన సమాచారంతో తాము పోరాటాలు చేస్తున్నామన్నారు. మరో వైపు ప్రజా సమస్యలపై తాము హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసి ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చేలా న్యాయ పోరాటం సాగిస్తున్నామని శ్రీనివాసరెడ్డి వివరించారు. కళాశాల విద్యార్థులు, ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ వారిని చైతన్యవంతులను చేస్తున్నామని ఆయన చెప్పారు.

15 వసంతాల సుపరిపాలన వేదిక
ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా హైదరాబాద్ కేంద్రంగా రిటైర్డు అధికారులు, మేధావులతో ఏర్పాటైన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (సుపరిపాలన వేదిక) 15 వసంతాలు పూర్తి చేసుకుంది.సుపరిపాలన వేదిక 15వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ నెల 19వతేదీన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్యఅతిథిగా జరుపుకోనున్నారు.ఖైరతాబాద్ లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ విశ్వేశ్వరాయ భవన్ లో జరగనున్న సుపరిపాలన వ్యవస్థాపక దినోత్సవంలో అతిథులుగా మాజీ ఐఎఎస్ డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ్, మాజీ ఐపీఎస్ అధికారి సి ఆంజనేయరెడ్డి, తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీలు పాల్గొననున్నారు.


Read More
Next Story