మరోమారు నువ్వు రావాలి
x

మరోమారు నువ్వు రావాలి

మహాకవి శ్రీశీ (ఏప్రిల్ 30,1910 - జూన్ 15,1983) కి 114వ జయంతి సందర్భంగా చిరు నివాళి...




మరోమారు నువ్వు రావాలి


షేక్ అస్మతున్నీసా


మరో ప్రపంచం పిలిచిందంటూ మరో మారు నువ్వు రావాలి
కార్మిక కర్షక లోకానికి మళ్లీ నువ్వు కావాలి
ఆర్తనారాలను ఆవేదనలను అభ్యుదయంగా చాటావు, విప్లవంగా నువ్వు మారావు
శోకం,శాపం ప్రశ్నిస్తూ, ప్రజలను ఎంతో చైతన్య పరుస్తూ
ప్రభంజనమై పెనుమార్పును తెచ్చావు
పదండి ముందుకంటూ...
పాకుతూనైనా పోరాడాలని
పీడితులను నడిపిస్తూ...
పిడికిలి బిగించాలని, ప్రపంచాన్ని ప్రశ్నించాలని
సాగిన నీ జీవితం, మళ్లీ మాకు కావాలి, మళ్లీ నువ్వు రావాలి
శ్లేషకు భాషవి, చమత్కార శిల్పివి
శ్రమజీవుల శక్తివి, వంచనను విరిచే వ్యక్తివి
కొంటుపడిన సంఘం, కుళ్ళుతున్న సమాజం
స్వార్థం స్వపక్షపాతం, ఎక్కడ చూడు ఇదే మార్గం
ఆర్తులకు ఆశగా, ఆదుకునే అండగా
ఋక్కుల నే ఋజుమార్గాన్ని చెప్పి
బాటసారి కి దారి చూపావ్
దౌర్జన్యపు ధరిత్రిపై ఎర్ర బావుటానెగరేశావ్
ఎందరో భూస్వాముల నెదిరించావ్
శ్రమ దోపిడీని ఖండిస్తూ ఖడ్గాన్ని సృష్టిం చావ్
జనమంతా వర్ధిల్లాలని,
జగన్నాథ రథచక్రాల ను నడిపించావ్
నువ్వు రేపిన గాలి, నువ్వు చూపిన దారి
నిజాన్ని నిప్పులా నిరూపించావ్
అక్షరాన్ని మండించావ్
అణగారిన వర్గాలకు ఆయుధమై నిలిచావ్
కన్నీరు కారిస్తే కాదు, చెమట చుక్కను చిందిస్తేనే చరిత్ర రాయగలమన్నావ్
రక్తంతో రాగాలాపన చేయించావ్,
కవితతో కదిలించావ్, మానవత్వంతో మనసు నింపావ్,
కష్టజీవులకిక నువ్వు లేవని,
కష్టాలు తీర్చే కర్త ఏడనీ,
ప్రపంచమొక పద్మ వ్యూహమని,
కవిత్వమొక తీరని దాహమని
నీ కీర్తి కెరటాలను మాకు మిగిల్చి
నువ్వు సైతం సమిధలా సమాధయ్యావు
సమాధానం లేని ప్రశ్నలనెన్నో మిగిల్చావు
అనంత లోకాలకెగశావు
ఆయుధం లేని యుద్ధాన్ని అరణ్య రోదనగా మాకొదిలేశావు
మా ప్రాణం, ప్రణవం నువ్వేనయ్యా..
మహాప్రస్థానం నుండి మరోమారు మాకోసం నువ్వు రావయ్యా.



(షేక్ అస్మతున్నీసా, తెలుగు టీచర్. తెనాలి మండలం, గుంటూరు జిల్లా)


Read More
Next Story